సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) కింద గత అయిదేళ్లుగా నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యతలు చూసిన కాంట్రాక్టు ఏజెన్సీల గడువు ముగిసిపోతోంది. కానీ.. ఈ బాధ్యతలను తిరిగి ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చే యోచనలో జీహెచ్‌ఎంసీకి లేదు. కనీసం ఆరుల నెలల నుంచి ఏడాది వరకు జీహెచ్‌ఎంసీయే నిర్వహించాక తిరిగి ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఏజెన్సీల ఒప్పంద గడువు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ముగిసిపోయి మిగతా ప్రాంతాల్లోనూ జనవరిలో ముగిసిపోనున్నప్పటికీ, ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణ కోసం కొత్తగా టెండర్లు ఆహ్వానించలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏజెన్సీలకు పొడిగింపూ ఇవ్వలేదు.
రీ కార్పెటింగ్ అవసరం లేదు
⇒ అయిదేళ్ల క్రితం ప్రధాన రహదారుల మార్గాల్లోని 811 కిలో మీటర్ల మేర నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఒప్పందం మేరకు తొలి ఏడాది 50 శాతం, రెండో సంవత్సరం 30 శాతం, మూడో సంవత్సరం మిగతా 20 శాతం రోడ్లను రీ కార్పెటింగ్ చేయడంతో పాటు మరో రెండేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు చూడాలి. అంటే వర్షాలొచ్చి గుంతలు పడ్డా, ఎక్కడైనా దెబ్బతిన్నా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. వాటితో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, స్వీపింగ్ మెషీన్లతో రోడ్లు ఊడ్చటం తదితర పనులు చేయాలి.
⇒ ఒప్పంద గడువు ముగిసినా, ఇప్పటికిప్పుడు రోడ్లను రీకార్పెటింగ్ చేయాల్సిన అవసరం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. అందుకే ఒప్పంద గడువు ముగుస్తున్న ప్రాంతాల్లో పనుల కోసం స్వీపింగ్ మెషిన్లు అద్దెకు తీసుకునేందుకు టెండర్లు పిలుస్తున్నారు. రోడ్ల నిర్వహణను జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లే పర్యవేక్షించనున్నారు. స్వీపింగ్ మెషిన్లతో పనుల కోసం కనీసం ఆరు నెలల సమయమైనా లేనిదే కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆరు నెలల కాలానికి అద్దె స్వీపింగ్ మెషీన్లకు టెండర్లు పిలుస్తున్నారు. ఈలోగా రోడ్ల నిర్వహణ మొత్తం పనులకు టెండర్లు పిలిచేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చున్నది అధికారుల ఆలోచన కావచ్చు.
⇒ ఇప్పటికే సీఆర్‌ఎంపీ కింద ఉన్న రోడ్లతోపాటు కొత్తవి కూడా అందులో చేర్చి అన్నింటి నిర్వహణ పనులకు అవసరమైన నిధుల్ని ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించి, టెండర్లు పిలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అది ఆరు నెలల తర్వాతా.. లేక ఏడాదికా? అన్నది వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోగా పాత ఏజెన్సీలు చేయకుండా మిగిలిపోయిన పనులుంటే వాటిని పూర్తిచేయించనున్నారు. లేదా కేవలం చేసిన పనుల వరకే బిల్లులు చెల్లించనున్నారు.
తక్షణ మరమ్మతులకు టెండర్లు
మరోవైపు వర్షాలొచి్చనప్పుడు పాట్‌హోల్స్ పడ్డా, ఇతరత్రా కారణాల వల్ల రోడ్లు దెబ్బతిన్నా వెంటనే వాటిని పూడ్చివేయడం, ప్యాచ్‌వర్క్స్ వంటి పనుల్ని కూడా ప్రైవేటు ఏజెన్సీల కిచ్చే ఆలోచనలో జీహెచ్‌ఎంసీ అధికారులున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment