హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తనను తన అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టి.. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. అందులో ఏముందంటే..
ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారాయన. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు.
.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్(KTR) ఆ స్టేట్‌మెంట్ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్ కోరారు.
ఏసీబీ.. నెక్ట్స్ ఏంటి?
విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలకు ఏసీబీ ఉపక్రమించబోతోంది. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు. అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్‌ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment