పోస్ట్‌మార్టమ్ నివేదికతో బట్టబయలు
హైదరాబాద్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిన విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కక్షగట్టి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌ను చంపేసిన ఉదంతంలో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. పోస్ట్‌మార్టమ్ నివేదికలో విస్మయకర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముకేశ్‌ను చిత్రవధ చేసి అంతంచేశారని, చంపేశాక మృతదేహంపైనా తమ పట్టరాని ఆవేశాన్ని చూపించారని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొంది.
ముకేశ్ మృతదేహాన్ని బీజాపూర్ జిల్లా కేంద్రంలోని చఠాన్‌పారా బస్తీ ప్రాంతంలోని ప్రధాన నిందితుడికి చెందిన ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో కనుగొన్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం హంతకులు మృతదేహం నుంచి గుండెను వేరేచేసి, కాలేయాన్ని నాలుగు ముక్కలుచేశారు. తలలో 15 చోట్ల విరిగిన గుర్తులున్నాయి. మెడ విరిగిపోయింది. ఐదు పక్కటెముకలు, మెడ ఎముకలు విరిగిపోయాయి. చేయి విరిచేశారు. తల, ఛాతి, వీపు, పొట్టపై తీవ్రమైన గాయాలున్నాయి.
ఇనుప రాడ్డు వంటి బలమైన ఆయుధంతో కొట్టిన గుర్తులున్నాయి. చేతిపై ఉన్న ఒకే ఒక్క పచ్చబొట్టు సాయంతో మృతదేహం ముకేశ్‌దే అని గుర్తించగలిగారు. తమ 12 ఏళ్ల పోస్ట్‌మార్టమ్ కెరీర్‌లో ఇంతటి దారుణమైన హత్యను చూడలేదని వైద్యులు తెలిపారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కలిసి హత్య చేసి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసులో నిందితులు రితేశ్ చంద్రకర్, దినేశ్ చంద్రకర్, మహేంద్రలను అరెస్ట్‌చేశారు. ప్రధాన నిందితుడు సురేశ్ సైతం మృతుడికి దూరపు బంధువుకావడం గమనార్హం. బీజాపూర్ రోడ్డు పనులపై నోరు మెదపకుండా ఉండేందుకు మాట్లాడాలంటూ సురేశ్ సోదరుడు రితేశ్ ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యాక ముకేశ్ కనిపించకుండా పోయాడని, అతని మొబైల్ స్విచ్చాఫ్ వస్తోందని ముకేశ్ అన్న యుకేశ్ డిసెంబర్ 25న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేయగా హత్య విషయం బయటికొచ్చింది.
ప్రధాన నిందితుడు హైదరాబాద్‌లో అరెస్ట్
వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన సురేశ్ చంద్రకర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్‌చేసింది. హత్య జరిగిన జనవరి ఒకటో తేదీ నుంచి తప్పించుకు తిరుగుతున్న సురేశ్‌ను అతని డ్రైవర్‌కు చెందిన ఇంట్లో ఎట్టకేలకు అరెస్ట్‌చేశామని సిట్ ఇన్‌చార్జ్ పోలీసు అధికారి మయాంక్ గుర్జార్ సోమవారం వెల్లడించారు.
సురేశ్‌ను బీజాపూర్‌కు తీసుకొచ్చామని, విచారణ కొనసాగుతోందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్‌రాజ్ చెప్పారు. నిందితులు రితేశ్, దినేశ్‌లు హతుడు ముకేశ్‌కు వరసకు సోదరులుకాగా మహేంద్ర రామ్‌టెకె సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. రాత్రి భోజనం చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా గొడవపడి ఈ ముగ్గురూ చంపేశారని తెలుస్తోంది. తర్వాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి సిమెంట్‌తో కప్పేశారు.
సొంత యూట్యూబ్ చానల్
బీజాపూర్‌లో దాదాపు రూ.120 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవకతవకలు జరిగాయని ఎన్‌డీటీవీ టీవీఛానెల్ తరఫున ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా చేసే 33 ఏళ్ల ముకేశ్ సొంతంగా ‘బస్తర్ జంక్షన్’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను విజయవంతంగా నడుపుతున్నాడు. 2021లో బీజాపూర్‌లో తకల్‌గూడలో భద్రతాబలగాలపైకి మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. సీఆర్‌పీఎఫ్ జవాను, కోబ్రా కమాండర్ అయిన రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను బంధించి మావోలు తీసుకెళ్లగా చర్చలు జరిపే ఏప్రిల్‌లో విడిపించడంలో ముకేశ్ కీలకపాత్ర పోషించారు.
ముకేశ్ మరణవార్త తెల్సి మహర్ వర్గీయులు సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నివాళులర్పించారు. నిందితులకు కఠిన శిక్ష అమలుచేయాలని డిమాండ్‌చేశారు. రాయ్‌పూర్ ప్రెస్‌క్లబ్‌లో వందలాది పాత్రికేయులు ధర్నాచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. కేసు వివరాలను నివేదిక ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని పీసీఐ ఛైర్‌పర్సన్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ ఆదేశించారు. ది ప్రెస్ అసోసియేషన్ అండ్ ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సైతం పారదర్శక దర్యాప్తునకు డిమాండ్‌చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment