హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులన్నీ ఈ నెల 30 వరకు పూర్తి చేసి డిసెంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. ఆరాంఘర్, శాస్త్రీపురం, కాలాపత్తర్, దారుల్ ఉల్ ఉలూం, శివరాంపల్లి, హసన్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. బెంగళూర్ జాతీయ రహదారితో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వారికి సౌకర్యంగా మారనుంది. ఇప్పటి వరకు బాటిల్ నెక్ రోడ్డుతో ఇబ్బందులకు గురైన స్థానిక బస్తీల ప్రజలతో పాటు దూర ప్రాంతాల వారికి ఈ ఫ్లై ఓవర్ ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ఎస్‌ఆర్‌డీపీ కింద..
నగరంలో ఇప్పటి వరకు 2– 7 కిలో మీటర్ల పొడవుతో షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. 4.04 కిలో మీటర్ల అతి పెద్ద ఫ్లైఓవర్ పాతబస్తీలో నిర్మాణమైంది. వచ్చే నెల మొదటి వారంలో వాహనదారులకు దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ కమిషనర్ కె.ఇలంబర్తితో పాటు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఈ నెల 26న ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు.
చదవండి: కాలిపోయిన కలల సౌధం.. రెండు రోజుల క్రితమే గృహప్రవేశం.. అంతలోనే ఇలా
సర్వీస్ రోడ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంకా 17 కట్టడాలను తొలగించాల్సి ఉందని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్ విభాగం చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్‌ఈ దత్తు పంతు తదితరులు కమిషనర్‌కు వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నను కమిషనర్ ఆదేశించారు.
2023 మార్చి నాటికే పూర్తి కావాల్సింది..
జూ పార్కు నుంచి ఆరాంఘర్ వరకు రూ.736 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) కింద దాదాపు 4.04 కిలో మీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. 2021లో పనులు చేపట్టారు. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉండగా.. నత్తనడకన సాగడంతో ఈ ఏడాది నవంబర్ వరకూ కొనసాగాయి. ఇంకా 2 డౌన్ ర్యాంపులతో పాటు 2 అప్ ర్యాంపులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో మొత్తం 163 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకోవడానికి రూ.336 కోట్లు ఖర్చు చేయగా.. మిగిలిన నిధులతో ఆరు లేన్ల మేర ఫ్లైఓవర్‌ను నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment