విశాల్‌కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే? | Doctor Shares Health Update about Vishal | Sakshi
Sakshi News home page

బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో.. విశాల్‌ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?

Published Mon, Jan 6 2025 6:30 PM | Last Updated on Mon, Jan 6 2025 7:17 PM

Doctor Shares Health Update about Vishal

హీరో విశాల్‌ (Vishal) వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాల్సిన అవసరం ఉందని, తనకు చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం విశాల్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కాగా విశాల్‌ హీరోగా నటించిన మదగజరాజ సినిమా 12 ఏళ్ల తర్వాత విడుదలవుతోంది. 

బక్కచిక్కిపోయిన విశాల్‌
చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (Madha Gaja Raja Pre-Release Event)లో విశాల్‌ సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తన మాటలతో పాటు చేతులు కూడా వణికాయి. అతడు సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు విశాల్‌కు ఏమైందని ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

(చదవండి: త్రివిక్రమ్‌ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్‌ ఇచ్చిన పూనమ్‌ కౌర్‌)

సినిమా
కాగా విశాల్‌.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండకోడి (పందెంకోడి) మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్‌ ఇవన్‌, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్‌, ఎనిమీ, సండకోడి 2, మార్క్‌ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు. పాండియ నాడు మూవీతో నిర్మాతగానూ అవతారమెత్తాడు. మార్క్‌ ఆంటోని మూవీలో అదరదా పాట విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమా మై డియర్‌ లవరూ సాంగ్‌ కూడా అతడే పాడటం విశేషం.

హీరోగా, దర్శకుడిగా..
ప్రస్తుతం విశాల్‌.. బ్లాక్‌బస్టర్‌ మూవీ తుప్పరివాలన్‌ చిత్రానికి సీక్వెల్‌ చేస్తున్నాడు. 2019లోనే ఈ చిత్రం ప్రకటించారు. ఈ మూవీతో విశాల్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో విశాల్‌ ఎయిట్‌ ప్యాక్స్‌లో కనిపిస్తాడట! ఈ విషయాన్ని డైరెక్టర్‌ సుందర్‌ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో వెల్లడించాడు. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలని విశాల్‌తో అన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్‌ షూట్‌ ఆలస్యమైంది. అయినా సరే విశాల్‌ తన ఎయిట్‌ ప్యాక్‌ బాడీని ఏడాదిపాటు మెయింటెన్‌ చేశాడు అని సుందర్‌ పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో అంజలి హీరోయిన్‌గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది.

(చదవండి: బాలకృష్ణ హీరోయిన్‌కు వేధింపులు.. మద్దతుగా నిలిచిన అమ్మ!)

ఆ రెండూ సస్పెన్స్‌లో..
సూపర్‌ హిట్‌ మూవీ అభిమన్యుడికి సీక్వెల్‌ ఉంటుందని హీరో విశాల్‌ 2021లో ప్రకటించాడు. అది కూడా తనే డైరెక్ట్‌ చేస్తానన్నాడు. ఏమైందో ఏమో కానీ మళ్లీ దాని ఊసే ఎత్తలేదు. అలాగే గతేడాది ఓ సంచలన ప్రకటన కూడా చేశాడు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం ఉంటుందని ప్రకటించాడు. 2026లో తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానన్నాడు. తన పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తారని వెల్లడించాడు. మరి తను పెట్టబోయే పార్టీ గురించి, అటు అభిమన్యుడు సీక్వెల్‌ గురించి ఈ ఏడాదేమైనా అప్‌డేట్‌ ఇస్తాడేమో చూడాలి!

 

 

చదవండి: హీరో విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement