ఒక హీరో కోసం జనాలు ఎగబడితే.. అది కొండంత అభిమానం అంటారు. అదే అభిమానం హద్దు మీరితే.. ఇదెక్కడి అభిమానం? అని తిట్టిపోస్తారు. ప్రాణంపోయేంత అభిమానానికి కూడా అది వర్తిస్తుందని మొన్నటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చూశాం. అయితే ఈ ఘటనపై స్పందిస్తూ.. ఫ్యాన్స్ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలంటూ సినిమావాళ్లకు నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాఠం చెప్పడం చూశాం. అయితే అది చెప్పడం వరకేనని.. ఆచరణలో లేదనేది తాజాగా రుజువైంది.
గేమ్ ఛేంజర్ మెగాఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనపై ఇవాళ(జనవరి 6) ఎక్స్ వేదికగా ఏపీ డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఘటన తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెబుతూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాదు జనసేన తరఫున ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇది మంచి విషయమే. అయితే ఇది ఇక్కడితో ఆగి ఉంటే.. మెగా అభిమానులు సంతృప్తి చెందేవాళ్లు కావొచ్చు. కానీ..
ఈ ఘటనను కూడా రాజకీయం చేయాలని పవన్ అనుకున్నారు. అభిమానులు చనిపోయిన నెపాన్ని.. గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని.. గత ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని.. రోడ్డు బాగు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని.. మెసేజ్ చేశారు. అంతేకాదు పైగా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పామంటూ.. వేగంగా వెళ్లి ప్రమాదానికి గురైన ఆ అభిమానులదే తప్పనేలా దుర్మార్గమైన వ్యాఖ్య ఒకటి చేశారు.
‘‘సినిమా అంటే టీమ్.. అందరి భాగస్వామ్యం.అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగి పోయిందని విచారం వ్యక్తం చేయాల్సింది. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంది’’
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు, ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని.. అంతా అల్లు అర్జున్, చిత్ర యూనిట్‌దే అని పవన్ మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్ట్ సరైన పరిణామమే అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అలాంటప్పుడు ఇప్పుడు రాం చరణ్‌ను అరెస్ట్ చేయిస్తారా?. ఒకవేళ నిజంగా ఆ డిమాండ్ ఒకటి తెర మీదకు(ఆఖరికి సోషల్ మీడియాలో అయినా సరే) వస్తే ప్రభుత్వంలో ఉన్న పవన్ ఏం చేస్తారు?. రోడ్డు ప్రమాదం, అందునా తాను స్వయంగా హాజరైన ఈవెంట్‌కు హాజరై వెళ్తున్న క్రమంలో మరణించిన వాళ్ల పట్ల ఇంత లూస్ టంగ్‌తో మాట్లాడొచ్చా? అనే అభిప్రాయం ఆయన చేసిన ట్వీట్ కామెంట్ సెక్షన్‌లోనే వ్యక్తం అవుతోంది.(కావాలంటే మీరే పరిశీలించుకోండి.. )
నిజానికి.. అభిమానులతో పవన్ వ్యవహరించే తీరు చాలాసార్లు చర్చనీయాంశమైంది. గతంలో ఓపెన్‌గానే ఎన్నోసార్లు వాళ్ల మీద ఆయన చిరాకు ప్రదర్శించారు. ఆఖరికి.. వాళ్లు ఆయన్ని ఆకాశానికెత్తిన సందర్భంలోనూ అసహనం ప్రదర్శించారు. ఇప్పుడు.. చనిపోయింది మెగా అభిమానులు. రాం చరణ్(Ram Charan)ను, ప్రత్యేకించి తనను చూసేందుకు అంత దూరం నుంచి ఆత్రుతగా వచ్చారు. ఆ ఈవెంట్ పవన్ ఎలా మాట్లాడిందో చూశాం.. అభిమానుల్ని, అందునా యువతను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడింది నిజం కాదా?. సినిమా ఫంక్షన్ లో చొక్కాలు చించుకోకపోతే ఎలా?. బైకు సైలెన్సర్లు తీయకుండా, ఎక్సలేటర్లు రేజ్ చేయకపోతే కిక్కు ఏం ఉంటుంది?
ఆ వ్యాఖ్యలతో అభిమానులను ఎంతగా కేరింతలు కొట్టిందో చూశాం కదా!. అసలు ఆ ఈవెంట్ జరిగితే రెండు నిండు ప్రాణాలు పోయేవి కాదుగా!. చనిపోయాక.. చిత్ర నిర్మాత దిల్ రాజు, ఆ వెంటనే గేమ్ చేంజర్‌కు ఏమాత్రం సంబంధం లేదని పవన్ ఆర్థిక సాయం ప్రకటించడం దేనికి?. గత ప్రభుత్వం.. అంటూ ఇంకా ఎంత కాలం నిందలేసి తప్పించుకుంటారు?. ఇక్కడ ఎవరి తప్పు లేకపోవచ్చు. కానీ, అల్లు అర్జున్(Allu Arjun) విషయంలో పవన్ చెప్పినదానిబట్టి.. రాం చరణో, లేదంటే చిత్ర యూనిటో, అంతెందుకు అసలు పవన్ కల్యాణో బాధిత కుటుంబాలను పరామర్శిస్తే సరిపోయేది కదా!. ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్లు పవన్‌కు అనిపించలేదా?. అసలు ఇక్కడ రాజకీయ ప్రస్తావన దేనికి?. అంటే.. పవన్ నీతిపాఠాలు చెప్తారు కాని పాటించరన్నమాట!. హీరోల అభిమానులు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. అట్టర్ ప్లాపు!
Comments
Please login to add a commentAdd a comment