బుద్ధిమంతుడి ముసుగుతో అమ్మాయిలకు టోకరా | Delhi Man Cheat 700 Women Posed As US Model, More Details Inside | Sakshi
Sakshi News home page

బుద్ధిమంతుడి ముసుగుతో వల.. ఏకంగా 700 మంది అమ్మాయిలకు టోకరా

Published Sat, Jan 4 2025 4:04 PM | Last Updated on Sat, Jan 4 2025 5:19 PM

Posed As US Model This Delhi Man Cheat 700 Women

బుద్ధిమంతుడిలా నటించి.. డేటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో మోడల్‌నంటూ నమ్మించి వందల మంది యువతులను మోసగించిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు.  తుషార్‌ సింగ్ బిష్ట్‌ను దిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 23 ఏళ్ల తుషార్  సింగ్ బిష్ట్‌ను ఢిల్లీ పోలీసులు తాజాగా తమ అదుపులోకి తీసుకున్నారు. 

తుషార్‌ బీబీఏ పూర్తి చేశాడు. గత మూడేళ్లుగా నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో టెక్నికల్‌ రిక్రూటర్‌గా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ డబ్బుపై దురాశతో సైబర్‌ నేరాలకు అలవాటుపడ్డాడు. ఓ యాప్‌ నుంచి వర్చువల్‌ ఇంటర్నేషనల్‌ మొబైల్‌ నంబరు కొనుగోలు చేసి డేటింగ్‌ యాప్ బంబుల్, సోషల్‌ మీడియా వేదిక స్నాప్‌చాట్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌ ఫొటోలు, స్టోరీలను తీసుకుని తన ప్రొఫైల్‌లో పోస్ట్‌ చేసేవాడు. 

అమెరికాలో తాను ఫ్రీలాన్స్‌ మోడల్‌గా పనిచేస్తున్నానని, త్వరలోనే భారత్‌ వస్తున్నానని నమ్మించి అనేకమంది యువతులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వారితో స్నేహం చేసి ఫోన్‌ నంబర్లు, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించాడు. కొంతకాలానికి ఆ వీడియోలతోనే వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు.

గతేడాది డిసెంబరులో ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న ఓ యువతి తుషార్‌పై ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తులో అతగాడి మోసాల చిట్టా బయటకు వస్తోంది. 2024 జనవరిలో బంబుల్‌లో అతడితో పరిచయం అయినట్లు బాధిత యువతి తెలిపింది. ప్రేమ పేరుతో ప్రైవేటు వీడియోలు తీసుకొని, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది. వాటిని డార్క్‌వెబ్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరించడంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మరిన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి.

ఇప్పటిదాకా దాదాపు 700 మందికి పైగా అమ్మాయిలను అతడు వలలో వేసుకున్నట్లు గుర్తించారు. బంబుల్‌లో 500 మంది, స్నాప్‌చాట్‌లో 200 మంది యువతులతో స్నేహం చేసి వారి నుంచి డబ్బులు గుంజినట్లు తెలిపారు. అతడిని అరెస్టు చేసి ఓ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement