యువకుడి మాయమాటలతో బెంగళూరుకు పయనమైన బాలిక
ఆ బాలికకు తోడుగా మరో ఇద్దరు బాలికలు
గంటల వ్యవధిలోనే ఆచూకీ తెలుసుకున్న సింగ్‌నగర్ పోలీసులు
పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఇంస్టాగ్రామ్‌లో మూడు నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ బాలిక ఇల్లు వదిలి బెంగళూరుకు పయనం కాగా.. ఆమెకు తోడుగా మరో ఇద్దరు బాలికలు వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నార్త్‌జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ తన కార్యాలయంలో ఈ కేసు వివరాలను మీడియాకు వెల్ల్లడించారు.
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు..
న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఓ బాలిక సమీపంలోని ఓ మదర్సాలో చదువుకొని ఇంటి వద్దే ఉంటోంది. ఆమెకు ఇంస్టాగ్రామ్‌లో బెంగళూరుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్యలో ఆ యువకుడి స్నేహితుడైన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన వేణు(23) అనే యువకుడు రావడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వారు దూరంగా ఉంటుండగా.. మూడు నెలల క్రితం నుంచి వేణు ప్రేమ పేరుతో ఆ బాలికకు మాయమాటలు చెబుతూ వచ్చాడు.
తనతో వస్తే బెంగళూరు తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో అతగాడి మాటలు విన్న ఆ బాలిక విషయాన్ని తన ఇద్దరి స్నేహితులకు చెప్పింది. దీంతో ఆ ఇరువురు బాలికలు తాము కూడా బెంగళూరు వస్తామని చెప్పడంతో వేణు వారిని తెనాలికి రమ్మని చెప్పాడు. ప్రణాళిక ప్రకారం బాలికలను గురువారం రాత్రి తెనాలికి రప్పించిన వేణు అక్కడ తన స్నేహితులైన కేతవత్ యువరాజ్‌నాయక్(21), పెద్ద వెంకటేశ్వర్లు(30)ను బాలికలకు పరిచయం చేశాడు. ఉదయాన్నే బెంగళూరుకు రైలులో వెళ్దామని, టికెట్లు కూడా తీసుకున్నామని బాలికలకు చూపించాడు. ఈ రాత్రికి మనం అందరం గుంటూరు జిల్లా చేబ్రోలులోని పెద్ద వెంకటేశ్వర్లు ఇంట్లో ఉందామనుకొని పయనమయ్యారు.
గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ..
ముగ్గురు బాలికలు కనిపించడం లేదంటూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి.. ఎస్‌ఐ సేనాపతి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల ఇంస్టాగ్రామ్ ఐడీ నంబర్లు, బండి నంబర్ల ఆధారంగా పోలీసులు తెనాలి చేరుకొని బాలికలు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న బాలిక పాత స్నేహితుడు నిందితులను పట్టించడంలో పోలీసులకు సహాయం చేసినట్లు తెలిసింది. బాలికలను వీరు వేరే రాష్ట్రంలోకి తీసుకువెళ్లి వారి జీవితాలను నాశనం చేసేందుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది.
మరో కేసు కూడా..
అదేరోజు అదే ప్రాంతానికి చెందిన మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక కూడా అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా ఆ బాలిక ఆచూకీని కూడా గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. ఒకే రోజు రెండు కేసులలో నలుగురు బాలికల ఆచూ కీని తెలుసుకొని, కేసులను ఛేదించిన బృందాలను సీపీ రాజశేఖర్‌బాబు, డీసీపీ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లు స్రవంతిరాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment