
గుణదల(విజయవాడ తూర్పు): యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్రీస్తురాజపురం ఫిల్మ్ కాలనీకి చెందిన మచ్చా సరస్వతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. భర్త చైతన్య ఆయుర్వేద వైద్యుడు వీరికి ఒక పాప, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇంటిని, చిన్న పిల్లలను చూసుకునే నిమిత్తం సరస్వతి తన అక్క కుమార్తె బల్లం శరణ్య(19)ను ఇంట్లో ఉండాల్సిందిగా కోరి తీసుకువచ్చింది.
కడప జిల్లా బద్వేలుకు చెందిన శరణ్య గత మూడు నెలలుగా విజయవాడలో పిన్ని ఇంట్లో ఉంటోంది. సరస్వతి ప్రతి రోజు విధులకు మధ్యాహ్నం రెండు గంటలకు ఆసుపత్రికి వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగి వస్తుంది. శుక్రవారం యథావిధిగా ఆసుపత్రికి వెళ్లిన సరస్వతి సాయంత్రం 5 గంటల సమయంలో శరణ్యకు ఫోన్ చేసి పిల్లల గురించి అడిగే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శరణ్య ఫోన్‌కు స్పందించలేదు.
దీంతో అనుమానం వచ్చి త్వరగా ఇంటి వద్దకు చేరుకుంది. ఎంత ప్రయత్నించినా తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్ల సహాయం కోరింది. స్థానికులు వెనుక గుమ్మం తలుపులు తీసి లోనికి ప్రవేశించగా శరణ్య ఉరికి వేలాడుతూ కని్పంచింది. సరస్వతి 108 సహాయంతో శరణ్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాచవరం పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఇది ముమ్మాటికీ హత్యే...
శరణ్య ఉరివేసుకుని చనిపోలేదని, ఆమెను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శరణ్య కుటుంబానికి, సరస్వతి కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. ఉరికి వేలాడుతున్న శరణ్య పాదాలు మంచానికి తాకుతున్నాయని, అలా చనిపోయే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. సన్నని వైర్లను గొంతుకు బిగించి ఆమెను హత్య చేశారని సరస్వతి, చైతన్యలే శరణ్య మృతికి కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.