చైనాలో వైరస్‌ విజృంభణ.. కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన | Union Health Ministry On HMPV Virus Outbreak, Says India Well-prepared To Handle Respiratory Infections | Sakshi
Sakshi News home page

చైనాలో వైరస్‌ విజృంభణ.. కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన

Published Sun, Jan 5 2025 7:25 AM | Last Updated on Sun, Jan 5 2025 12:36 PM

Union Health Ministry ays India well-prepared To Handle Respiratory Infections

ఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం ఇంకా ఎవరూ మర్చిపోనేలేదు. నాటి మరణాలు, పరిస్థితులు ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి. ఇంతోనే చైనాలో మరో వైరస్‌ వ్యాప్తి ఆందోళన రేపుతోంది. చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్‌ (HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది.

ఈ క్రమంలోనే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (DGHS) అధ్యక్షతన శనివారం జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ (JMG) సమావేశం నిర్వహించారు. చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్‌ కలకలం సృష్టిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి భారత్‌లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో నిపుణులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా వైరస్‌ కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది.

ఇదే సమయంలో చైనా పరిస్థితులను డబ్ల్యూహెచ్‌వో(WHO) కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు స్పష్టం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది.

ఇక, చైనాలో వైరస్‌ కారణంగా భారత్‌లో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధుల అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే, మన దేశంలో ఈ వైరస్‌ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. 

మరోవైపు.. చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్‌ ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని తెలిపింది. 

కాగా, చైనాలో వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరిగింది. ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, ఆసుపత్రులన్నీ పేషంట్స్‌తో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement