న్యూఢిల్లీ: హెచ్‌ఎంపీవీ(HMPV)కేసులతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నప్పటికీ ఈ కేసుల సంఖ్య భారత్‌లో క్రమేపీ పెరగడం మాత్రం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. నిన్న(సోమవారం) ఒక్కరోజే నాలుగు కేసులు నమోదు కాగా, నేటి(మంగళవారం) ఉదయానికి ఆ సంఖ్య డబుల్ అయ్యింది. తాజాగా మరో నాలుగు కేసులు చేరడంతో అమ్మో హెచ్‌ఎంపీవీ ఏం చేస్తుందనే భయం మాత్రం జనాల గుండెల్లో భయం పుట్టిస్తోంది.
తాజాగా మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో మరో రెండు కేసులు నమోదు కావడంతో ఈ కేసుల సంఖ్య భారత్‌లో ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు కాగా, అది ఇప్పుడు మహారాష్ట్రకు పాకడంతో కాస్త కలవరం ఎక్కువైంది.
హెచ్‌ఎంపీవీపై కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు
జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలి.
వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి
బహిరంగ స్థలాల్లో ఉమ్మివేయరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.
పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి.
వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
హెచ్‌ఎంపీవీ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. గత యాభై, ఆరవై ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా(Corona Virus) తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని వారు చెబుతున్నారు.
.మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని అంటున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
కేసుల నమోదుతో ఆందోళన
చైనా(China)లో హెచ్‌ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.
మహమ్మారిగా మారే ప్రమాదం లేదు
ఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్‌తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు.
– ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment