ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావించే డ్రాగన్ దేశం చైనాలో మరో ప్రాణాంతక వైరస్ భయందోళన సృష్టిస్తోంది. హ్యూమన్ మెటాపిన్యూమో వైరస్(HMPV) పంజా విసురుతోంది. వందలాది మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారియి. గత ఏడాది ఏప్రిల్ నుంచే హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి.
హెచ్‌ఎంపీవీని చైనా ప్రభుత్వం ఇంకా మహమ్మారిగా గుర్తించలేదు.ఇటీవల చలికాలం ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోందని, ఎక్కువగా పిల్లలు, వృద్ధులు దీని బారినపడుతున్నారని, నిత్యం వందలాది కేసులు బయటపడుతున్నాయని స్థానిక మీడియా చెబుతోంది. బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయని, పెద్ద సంఖ్యలో మరణాలు సైతం సంభవిస్తున్నాయని చైనా ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో కరోనా లాంటి వైరస్ వ్యాప్తి చెందుతోందని, ఇండియాలో కూడా ఇవి వ్యాపించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్‌ఎస్ స్పందించింది.
ఇండియాలో ఆందోళన అవసరం లేదు
హ్యూమన్ మెటానిమోవైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్‌ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మన దేశంలో ఈ వైరస్ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించాయి. చలికాలంలో తలెత్తే శ్వాస సంబంధిత అనారోగ్యానికి తగిన చికిత్స, సదుపాయాలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయని గోయల్ చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి: చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ : లక్షణాలు, నివారణ చర్యలు
మహారాణిలా పీవీ సింధు : బ్యాడ్మింటన్-ప్రేరేపిత డిజైనర్ లెహంగా విశేషాలు
Comments
Please login to add a commentAdd a comment