హైదరాబాద్ : నగరంలో రోజురోజుకు మెడికో టూరిజం అభివద్ధి చెందుతున్నదని ఇది నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచి పరిణామమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాన్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తుంటే బాధగా ఉందని స్మార్ట్ ఫోన్లు వినియోగం వల్లనే వారి కళ్లు దెబ్బతింటున్నాయని ఆమె అన్నారు.
తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పుడే వారు కళ్ళద్దాలకు దూరమవుతారని అన్నారు. మన దేశంలోని వివిధ నగరాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులను ప్రతియేటా నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకొని వెళ్తున్నారని ఈ సంఖ్య ప్రతి యేటా పెరుగుతున్నదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో పాటు అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం నగరంలోని పలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటమే ఇందుకు గల కారణమని అన్నారు.
అనంతరం ప్రాన్ కేర్ ఐకేర్ వైద్యురాలు అంజనీ ప్రతాప్ మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న పిల్లల కంటి సమస్యలు దూరపు చూపు కనిపించకపోవడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయని ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్ళల్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పిల్లల కళ్లు దెబ్బతింటున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవొద్దని సూచించారు. తమ ఆస్పత్రిలో 20 రోజుల పాటు 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా స్రీనింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, డాక్టర్ జి. సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ రాజలింగం, ప్రణవ్, సీఎం రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment