సాక్షి,విజయవాడ:అసలు తమకు రిజర్వేషన్లు అనేవే వద్దని,మొత్తం ప్రైవేట్ స్కూళ్లనును రద్దు చేసి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం(ఫిబ్రవరి2) వర్గీకరణపై రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మేము సైతం కార్యక్రమంలో ప్రొ.కంచ ఐలయ్య ,ఐపీఎస్ అధికారి పివి.సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కంచ ఐలయ్య మాట్లాడుతూ ‘35 ఏళ్ల తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్ల గురించి అడిగేవారు ఒక్కరు కూడా ఉండరు. గ్రామాల్లోని బీసీ,ఎస్సీ,ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పట్టణాల్లోని వారికి ధీటుగా ఉద్యోగాలు సాధిస్తారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని అప్పటి ఏపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం అమలు చేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి,ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేశారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఈ దేశాన్ని సమూలంగా మార్చే నిర్ణయాలు. తెలుగు మహాసభల్లో తెలుగును కాపాడాలని కొందరు మాట్లాడుతున్నారు.
మా పిల్లలు తెలుగును కాపాడాలి. మీ పిల్లలేమో అంబానీ స్కూల్స్ లో చదవాలా. చంద్రబాబు మనవడికి ఇంగ్లీష్ ఎందుకు. తెలుగును కాపాడాలని చెబుతున్న వాళ్లు చంద్రబాబు మనవడిని ఎక్కడ చదివిస్తున్నాడో అడగమనండి. ఇంగ్లీష్ మీడియంలో పెట్టి, ఇంగ్లీష్ లోనే చెస్ ఛాంపియన్ సాధించే ట్యూటర్లను పెట్టారు.
మీ ముఖ్యమంత్రి మనవడికి ఇంగ్లీష్ మీడియం కావాలి. మీ ఉపముఖ్యమంత్రి కొడుక్కి ఇంగ్లీష్ మీడియం కావాలి. ఇంగ్లీష్ ఏముంది..యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. ఆయన పిల్లలను ఎందుకు యూట్యూబ్ స్కూల్లో పెట్టలేదు.
రిజర్వేషన్స్ విభజనను కేంద్రం అమలు చేస్తూ రాష్ట్రాలకు కచ్చితమైన గైడ్ లైన్స్ ఇవ్వాలి’అని ఐలయ్య డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలను ఎలా సాధించాలని చర్చించేందుకు మేము సైతం కార్యక్రమం నిర్వహించామని,మాలలు,మాదిగలు ఒకరికొకరు శత్రువులు కాదని ఐపీఎస్ అధికారి పివి.సునీల్‌కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment