kanche ilaiah
-
తక్కువ కాలంలో ఎక్కువ మేలు
మీరు ఎంతకాలం పాలించారు అనేది ప్రజలకు ముఖ్యం కాదు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా పాలించారన్నది ముఖ్యం. ఆ పదవీ కాలంలో చేసిన కృషి వల్ల తర్వాతి తరాల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందన్నదాన్ని బట్టి వారి స్థానాన్ని చరిత్ర నిర్ధారిస్తుంది. అతి తక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్నప్పటికీ, అనితరసాధ్యమైన మండల్ రిజర్వేషన్ల అమలుకు పూనుకొని దేశంలోని శూద్ర వర్గాలకు ఎనలేని సేవ చేశారు క్షత్రియుడైన వీపీ సింగ్. ఆయన అలా చేసి ఉండకపోతే, భారతదేశ చరిత్రలో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగేది కాదు. అందుకే స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా ఆయన పాత్రను తిరిగి అంచనా వేయవలసి ఉంది. జూన్ 25న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో దివంగత ప్రధాని వీపీ సింగ్ (విశ్వనాథ్ ప్రతాప్ సింగ్: 25 జూన్ 1931 – 27 నవంబర్ 2008) 92వ జయంతి వేడుకల సమావేశాన్ని నిర్వహించేందుకు అనేక సామాజిక న్యాయ అనుకూల సంస్థలు ప్లాన్ చేశాయి. దాదాపుగా మర్చిపోయిన మండల్ మహాపురుషుడు అయిన వీపీ సింగ్ గురించి ఇటువంటి వేడుకలు జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఉత్తరప్రదేశ్‌లోని క్షత్రియ రాజ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకోవడానికి పలువురు రాజకీయ నాయ కులు, కార్యకర్తలు, రచయితలు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. తనను తాను ఓబీసీ అని చెప్పుకొన్న నరేంద్ర మోదీ నుంచి అనేక ఇతర ప్రధానమంత్రులను దేశం చూసి ఉన్నందున, స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా వీపీ సింగ్ పాత్రను తిరిగి అంచనా వేయవలసి ఉంది. అదే రాష్ట్రంలోని భూస్వామ్య పాలక నేపథ్యం ఉన్న యోగీ ఆదిత్యనాథ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి క్షత్రియ పాలకులతో పోలిస్తే ప్రధానమంత్రిగా వీపీ సింగ్ పాత్రను కూడా మనం పునరావలోకనం చేయాల్సి ఉంది. మండల్ సిఫారసుల అమలు ఓబీసీలకు జాతీయ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేసిన మండల్ కమిషన్ అమలును సమర్థించడం కోసం ఆనాడు వీపీ సింగ్ చేసిన పోరాటాన్ని చూసిన వ్యక్తిగా... ఆ సమయంలో మోదీ ప్రధానిగా ఉండి ఉంటే వీపీ సింగ్లాగా మండల్ కమిషన్ సిఫార్సు లను అమలు చేసి ఉంటారా అని అడగాలనుకుంటున్నాను. అలాగే మండల్ రిజర్వేషన్లతో లబ్ధిదారుడై ప్రధాని అయిన శూద్రుడు దేవే గౌడ అయినా అలా చేసి ఉంటారా అని నేను అడుగుతున్నాను. నల్లజాతీయుల హక్కుల కోసం నిలబడి, హత్యకు గురవడానికి కూడా అబ్రహాం లింకన్ సిద్ధపడిన విధంగా... సామాజిక న్యాయ పరిరక్షణం కోసం ఆనాడు వీపీ సింగ్ తీసుకున్న సైద్ధాంతిక, నైతిక వైఖరిని మరెవరూ తీసుకుని ఉండరు. అబ్రహాం లింకన్ అమెరికాలో తన జీవితాన్ని త్యాగం చేయగా, వీపీ సింగ్ మండల్ వ్యతిరేక పాలక శక్తులలో తన స్థానంతోపాటు, ప్రతిష్ఠను కూడా త్యాగం చేశారు. ఆ సమయంలో ఆయనకు బద్ధశత్రువుగా ఉన్న కాంగ్రెస్, అన్ని విధాలా ఆయన పని ముగించడానికి సిద్ధపడింది. వీపీ సింగ్ అధికారాన్ని బీజేపీ కూలదోసిన వెంటనే కాంగ్రెస్ అదే ఉత్తరప్రదేశ్ నుంచి మరో క్షత్రియుడైన చంద్రశేఖర్‌ను ప్రధానిగా తీసుకొచ్చింది. ఆయన తన జీవితమంతా సోషలిస్టుగా నటించారు కానీ బలమైన సామాజిక న్యాయ వ్యతిరేక శక్తిగా మిగిలిపోయారు. 1991లో మరొక కాంగ్రెస్ వ్యక్తి పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. వీపీ సింగ్ తన పదవిని పణంగా పెట్టి ఆ రిస్క్ తీసుకోకపోయి ఉంటే, మండల్ రిజర్వేషన్లను పీవీ అమలు చేసి ఉండేవారని ఎవరూ అనుకోలేరు. ఆ సమయంలో అనేక ఇతర రాజకీయ శక్తులు మండల్ రిజర్వేషన్ల అమలు కోసం డిమాండ్ చేసిన మాట నిజం. అయితే వీపీ సింగ్ అలా చేసి ఉండకపోతే, భారతదేశ చరిత్రలో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగేది కాదు. ఎందుకంటే ఆనాటి శూద్ర ఓబీసీలు ఆ సమయంలో సామాజిక న్యాయానికి సంబంధించిన సైద్ధాంతిక, తాత్విక సమస్యను నిర్వహించడంలో పూర్తిగా అసమర్థులుగా ఉండేవారు. మండల్ రిజర్వేషన్ అమలు కోసం డిమాండ్ చేసి దాన్ని అమలు చేయడానికి ఉత్తర భారతదేశంలో కొంతమంది రాజకీయ నాయకులు ఉండి ఉన్నప్పటికీ, శత్రుత్వంతో కూడిన అధికార నిర్మాణాలు, మీడియా నుంచి పూర్తిగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మండల్ రిజర్వేషన్ని రక్షించడానికి తగిన మేధో శక్తులు ఆనాటి శూద్ర ఓబీసీలలో లేవు. మీడియాలోని అరుణ్ శౌరీ తరహా సామాజిక న్యాయ వ్యతిరేక శక్తులు, అన్ని పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా (దూరదర్శన్‌తో సహా) మండల్ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీరంతా ఓబీసీ నాయకులను చాలా తేలికగా కట్టిపడేసేవారు. వారు ద్విజ యువ కులను ఆత్మాహుతి చేసుకునేలా పురికొల్పడమే కాకుండా, మండల్ అనుకూల శక్తులను దూషించడం, దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. కమ్యూనిస్ట్ ద్విజులు కూడా మండల్ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉండేవారు. దొరకని జాగా నేను, నాతోపాటు గెయిల్ ఓంవెద్ వంటి చాలా కొద్దిమంది మండల్ అనుకూల రచయితలు వీపీ సింగ్ విధానానికి మద్దతుగా ఆంగ్లంలో ఒక చిన్న కథనాన్ని కూడా ప్రచురించడానికి స్థలం కోసం కష్టపడాల్సి వచ్చేది. ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ వంటి పత్రికలు మాత్రమే కనీసంగా చోటిచ్చాయి. అప్పట్లో సోషల్ మీడియా అంటూ ఏమీ లేదు. మేము నిస్సహాయంగా ఒంటరిగా ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయాం. కానీ ఏకైక బలం ఏమిటంటే, ఆగస్ట్ 15న ఎర్రకోట నుండి చేసిన అత్యంత ధైర్యంతో కూడుకున్న ప్రసంగంతో సహా సాధ్యమైన ప్రతి ప్రజా వేదిక నుండి మండల్ రిజర్వేషన్ అమలును వీపీ సింగ్ పట్టువిడవకుండా సమర్థించడమే. ఆయన రాజీనామా లేఖ, తాను రాజీనామా చేయడానికి ముందు దేశాన్ని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం... ఆయనకు ముందు, ఆ తర్వాత ఉండిన ఇతర ప్రధాన మంత్రులందరినీ అవమానం, అపరాధంతో కూడిన చీకటి మేఘాలలో ఉంచింది. స్వయం ప్రకటిత ఓబీసీగా చెప్పుకొని, ఆ విధంగా మరిన్ని ఓట్లు తెచ్చుకున్న ప్రధాని మోదీ, క్షత్రియ నేపథ్యం ఉన్న వీపీ సింగ్ ఆనాడు సామాజిక న్యాయంపై చేసిన ఆ తాత్విక పరిరక్షణ ఉపన్యాసాలను చదివితే, నిజంగానే తల వంచుకోవాల్సి వస్తుంది. ధైర్యంగా, దృఢనిశ్చయంతో మండల్ రిజర్వేశషన్ని అమలు చేసిన భారతదేశ అసాధారణమైన ప్రధాన మంత్రిగా ఆ వ్యక్తి పేరును మోదీ ఎన్నడూ తలవరు. ఆయన పుట్టిన రోజున ఎప్పుడూ ప్రకటన ఇవ్వరు. నిశ్శబ్ద విప్లవం వీపీ సింగ్ ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఆ కొంతకాలం (2 డిసెంబర్ 1989 – 10 నవంబర్ 1990), గ్రామాల్లో చెప్పుకొనే ఒక సామెతను గుర్తు చేస్తుంది. ‘మీరు ఎంతకాలం పాలించారు అనేది ప్రజలకు ముఖ్యం కాదు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా పాలించారన్నది ముఖ్యం’. వీపీ సింగ్ ఏడాది కంటే తక్కువ పాలనతో పోలిస్తే... నెహ్రూ పదిహేడేళ్ల పాలన, ఇందిరాగాంధీ పద్నాలుగేళ్ల కష్టతరమైన పాలన, ఇఫ్పుడు మోదీ పదేళ్ల పాలన మసకబారి పోతుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలోనే, ఐదు వేల సంవత్సరాల దేశ చరిత్రను ఆయన మార్చేశారు. తీన్ మూర్తి హౌస్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైమ్ మినిస్టర్ల సంగ్రహాలయంలో వీపీ సింగ్‌కు ఎంత స్థలం కేటాయించారో నాకు తెలియదు. కానీ నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీతో సహా మిగతా ప్రధానులందరికీ లభించినంత స్థలానికి ఆయన పూర్తిగా అర్హులు. ప్రస్తుత, గత పాలక పార్టీలు ఆయనను మరచిపోవాలని కోరు కున్నప్పుడు ప్రజలు ఆయనను వారి జ్ఞాపకాలలోకి తప్పక తీసుకు రావాలి. అంతేకాకుండా ఆయన పుట్టిన రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ముఖ్యం. సామాజిక న్యాయ రాష్ట్రంగా ఉంటున్న తమిళనాడు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వీపీ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రయత్నాలు తప్పక జరగాలి. -కంచె ఐలయ్య, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...
ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశస్థులూ తమ పార్లమెంట్ భవనానికి ఒక వ్యక్తి పేరు పెట్టుకున్న దాఖలాలు లేవు. కానీ భారత నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ బయలుదేరింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణమిది. కొంతమంది ఇది సమంజసమైనది కాదంటున్నారు. కానీ ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సంక్షేమం, లౌకికత్వం వంటి ప్రజాస్వామ్య లక్షణాలు పాదుకొల్పడానికీ, అవి సజావుగా మనగలగడానికీ రాజ్యాంగంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినవారు అంబేడ్కర్. అటువంటి వ్యక్తి పేరు ప్రజాస్వామ్యానికి వాహికైన పార్లమెంట్ భవనానికి పెట్టడం ముమ్మాటికీ సబబే అని మరికొందరు అంటున్నారు. పేరు అంటూ పెట్టాల్సి వస్తే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించిన అంబేడ్కర్ పేరు పెట్టడమే సముచితం. ప్రపంచానికి పరివర్తన సంకేతం ప్రస్తుతం ఒక సరికొత్త డిమాండ్ పుట్టుకొచ్చింది. న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టాలో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనానికి తప్పకుండా అంబేడ్కర్ పేరు పెట్టాలన్నదే ఆ డిమాండ్. హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మి స్తున్న సచివాలయ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 15న ప్రకటించింది. కొత్త పార్లమెంట్ భవనానికి ‘అంబేడ్కర్ పార్లమెంట్’ అని పెట్టాల్సిందిగా తాను ప్రధానికి ఉత్తరం రాస్తానని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దీని చుట్టూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియా చర్చలు మొదలైపోయాయి. దీనిపై రెండు ముఖ్య మైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వ్యక్తికి ఎంత స్థాయి, ఆమోదనీ యత ఉన్నా సరే... దేశం కోసం దీర్ఘకాలంగా చట్టాలను రూపొందిస్తున్న పార్లమెంట్‌కు ఆ వ్యక్తి పేరు పెట్టవచ్చా? భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా నిలిచిన మరికొందరిని పక్కనబెట్టి ఈ కొత్త భావనకు అంబేడ్కర్ అర్హుడేనా? తొలి ప్రశ్నకు సమాధానం పూర్తిగా నైతిక పరమైనది. సాధారణంగా పార్లమెంట్ భవంతికి ఒక వ్యక్తి పేరు పెట్టరు. ఆ వ్యక్తి ఎంత గొప్ప వారైనా సరే. కానీ భారతదేశంలో ప్రతి విషయానికీ వ్యక్తుల పేర్లను తగిలించే పద్ధతి, సంస్కృతి ఉన్నాయి కదా. అలాంటప్పుడు దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడంలో గొప్పగా దోహదం చేసిన ఏ వ్యక్తి పేరయినా పార్లమెంట్ భవనానికి ఎందుకు పెట్టకూడదు? ఇక రెండో ప్రశ్నకు సమాధానంగా భారత దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీక రించడంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు వ్యక్తులను తులనాత్మకంగా మదింపు చేయవలసి ఉంది. వారెవరో కాదు. అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్. వీరిలో నెహ్రూ పట్ల ద్వేషపూరిత దృక్పథం రాజ్యమేలుతోంది. ప్రధాని మోదీ ఇప్పుడు నెహ్రూతో, ఆయన కుటుం బంతో ప్రత్యక్షంగా ఘర్ష ణాత్మక వైఖరితో వ్యవహ రిస్తున్నారు. మోదీ ప్రభుత్వం సానుకూలత ప్రద ర్శించడానికి అవకాశం గల పేర్లు రెండే. అవి అంబేడ్కర్, పటేల్. పటేల్ నేపథ్యం, పరిణామక్రమం చూస్తే ఆయన గొప్ప పోరాటయోధుడిగా, కార్యకర్తగా, నేతగా, పాలనా దురంధరుడిగా నిరూపించుకున్నారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఐక్యం చేసిన వానిగా నిలిచిపోయారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. కానీ పటేల్ ఎన్నడూ న్యాయ తత్వ వేత్త, చరిత్రకారుడు, ఆర్థికవేత్త, ప్రాపంచిక వ్యవహారాలలో నిపుణుడు కాలేదు. మరోవైపు దయనీయంగా అస్పృశ్యతను అను భవించి వచ్చిన అంబేడ్కర్, అనేకమందిలో ఒకే ఒక్కడుగా పరిణమించారు. ఆయన కూడా పోరాట యోధుడు, యాక్టివిస్టు, లీడర్, తనదైన కోణంలో పాలనా దురంధరుడు కూడా. న్యాయ, నైతిక పరమైన తత్వవేత్త. చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజకీయ అర్థ శాస్త్రం వంటి అంశాలలో శిక్షణ పొందారు. భారతీయ చరిత్రపై, బౌద్ధ, వైదిక, జైన, ఇస్లాం, క్రైస్తవ వగైరా బహుళ ప్రాపంచిక ఆలోచనా విధానాలపై అపారమైన పట్టు ఉండేది. రాజ్యాంగ రచన చేస్తూ, దాంట్లోని అన్ని ఆర్టికల్స్నీ రాజ్యాంగ సభలో ఆమోదింపజేసుకుంటున్నప్పుడు ఆయన దీక్ష గానీ, ఆయన జోక్యం చేసు కున్న తీరు గానీ మరే వ్యక్తిలో కంటే ఎక్కువగా ప్రదర్శితమయ్యేవి. ఢిల్లీ అధికార వ్యవస్థలు కాంగ్రెస్ పూర్తి నియం త్రణలో ఉన్నంతకాలం ఆయన్ను నిర్లక్ష్యం చేశారు. మండల్ కమిషన్ అనంతర కాలంలో భారత్ అంబేడ్కర్‌ను అధికాధికంగా కనుగొంది. రాజ్యాంగ సభలో ఆయన రాసిన రచనలు, చేసిన ప్రసంగాలు భారత్ సంక్షోభంలోకి ప్రవేశించిన ప్రతి సందర్భంలోనూ ప్రజాస్వామ్య రక్షణకు ఆయుధాలుగా మారాయి. అందుకే భారతీయ ప్రజాస్వామ్యం, అంబేడ్కర్ పర్యాయ పదాలైపోయాయి. ‘మండల్’ అనంతర కాలాలు భారత్‌ను ఒక జాతిగా మల్చడంలో ఆయన నిబద్ధతా శక్తిని పునరుత్థానం చెందించాయి. భారతీయ ప్రజాస్వామిక సంప్రదాయ జ్ఞానాన్ని ఆయన సంశ్లేషించారు. ప్రత్యేకించి బౌద్ధులు, గిరిజన జనాభాకు చెందిన సంప్రదాయిక జ్ఞానాన్ని ఆయన రాజ్యాంగంలోకి తీసుకురావడమే కాదు.. రాజ్యాం గంలోని ప్రతి ఒక్క నిబంధనకు న్యాయం చేయడా నికి, రాజ్యాంగ సభ ఉపన్యాసాలలో వాటిని పొందుపర్చారు. ప్రత్యేకించి ఇంగ్లండ్, అమెరికా ల్లోనూ; ఇంకా అనేక దేశాల్లోనూ ఉద్భవించిన పాశ్చాత్య రాజ్యాంగ మూల సూత్రాలు ఆయనకు తెలిసినప్పటికీ, భారతీయ చరిత్ర నుంచి సాధికారి కమైన సందర్భోచితమైన ఎన్నో మూలసూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. అందుచేత మన జాతీయవాదాన్ని ఆయన ఏ ఒక్కదాని కంటే మిన్నగా ఉన్నత స్థానంలో నిలిపారు. బుద్ధుడి ఉపమానాలను, అశోకుడి పాలనా సూత్రాలు, చిహ్నాలను ఆధునిక కాలంలో కూడా పునశ్చరణ కావడానికి అంబేడ్కరే కారణం. ఫ్రెంచ్ ఆలోచనా విధానం నుంచి కాకుండా, మన ప్రాచీన భారత చరిత్ర నుండి ప్రజా స్వామ్యం, స్వేచ్చ, సమానత్వం–సౌభ్రాతృత్వం అనే మూడు కీలక సూత్రాలను పదే పదే వల్లించేవారు. ఆయన జాతీయవాదానికి మూలాలు... పురాణాల్లో కాకుండా భారతీయ ప్రజారాశుల సజీవ ఉత్పాదకతా జీవితం నుంచి పుట్టు కొచ్చాయి. చారిత్రకంగా పీడితులైన దళితులు, ఆదివాసులు, శూద్ర ప్రజానీకం ఈరోజు తమ జీవితాల్లో నెమ్మదిగా అయినా సరే కచ్చితంగా మార్పులు వస్తున్నందుకు అంబేడ్కర్‌కు రుణపడి ఉంటున్నారు. ఈ అన్ని కారణాల వల్ల భారత నూతన పార్లమెంట్ భవంతికి అంబేడ్కర్ పేరు పెట్టినట్ల యితే, భారతదేశంలో ఒక నిజమైన నాగరికతా పరివర్తన చోటు చేసుకుంటోందని ప్రపంచం గుర్తిస్తుంది. అప్పుడు మాత్రమే భారతీయ సంపూర్ణ నిర్వలసీకరణ ప్రక్రియ కొత్త ఉదాహర ణను ప్రతిష్ఠించుకుంటుంది. (క్లిక్: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు) - కంచె ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
September 17th: విమోచన కాదు, సమైక్యత!
ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 17కు ముందు మొదలయ్యే చర్చ ఈసారి మరింత తీవ్రమైంది. హైదరాబాద్ విమోచనా దినంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుతామని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఐక్యతా విగ్రహం’ పేరిట భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాన్ని విముక్తి విగ్రహం అని ఎందుకు అనలేదు? సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరితో ముస్లిం జనాభాను రెచ్చగొట్టవచ్చు. కానీ పాత గాయాలను మర్చిపోవడంలో, రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. అందుకే విలీనమా, విమోచనా అనే ప్రశ్నలను దాటి సమైక్యత అనే సమాధానం దగ్గర స్థిరపడటమే ఇప్పుడు మనకు కావలసింది! తెలంగాణలో సెప్టెంబర్ 17... ఆరెస్సెస్/ బీజేపీ చుట్టూ సమీకృతమవుతున్న హిందుత్వ శక్తులకూ, విస్తృతార్థంలో ఉదార ప్రజాస్వామ్య వాదులైన ఇతరులకూ మధ్య రాజకీయ వివాదం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజును హైదరాబాద్ విమోచనా దినంగా నిర్ణయించడంతో పాటు, 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాది పొడువునా సంబరాలు జరుపుతామనడంతో ఈసారి ఆరోజు మరింత స్పర్థాత్మకంగా మారింది. బహుశా ఆ పార్టీ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన దినంగా భావిస్తూం డవచ్చు. అదే సమయంలో ఆరెస్సెస్/బీజేపీ జాతీయ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ సమైక్యతా దినాన్ని సెప్టెంబర్ 16 నుంచి ఏడాదిపాటు జరుపుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరెస్సెస్/బీజేపీ తొలినుంచీ నిజాం పాలనను రాచరిక పాలనగా కాకుండా హిందువులపై ముస్లింల పాలనగా చూస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ దూకుడుతో కూడిన ముస్లిం వ్యతిరేక వైఖరి నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యతా దినంగా అధి కారికంగా జరపాలని నిర్ణయించింది. మోదీకి వ్యతిరేకంగా తనను తాను జాతీయ నేతగా కేసీఆర్ ప్రదర్శించుకుంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పిలుస్తున్న కమ్యూనిస్టులను పట్టించుకునే వారే లేరు. జునాగఢ్ సంస్థానాన్ని అక్కడి ముస్లిం పాలకుడు మూడవ ముహమ్మద్ మహబత్ ఖాన్జీ పాకిస్తాన్లో కలిపేస్తున్నట్లు ప్రకటించి, చివరకు పాకిస్తాన్‌కు పారిపోయాడు. దీంతో భారతదేశంలో విలీన మైన చిట్టచివరి రాష్ట్రంగా జునాగఢ్ నిలిచింది. కానీ ఆరెస్సెస్/బీజేపీ కూటమి దీని గురించి ఎంతమాత్రమూ మాట్లాడటం లేదు. నాడు దేశ ఉప ప్రధానిగానూ, హోంమంత్రిగానూ ఉన్న సర్దార్ పటేల్ నిర్ణయా త్మకమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనం కావడంపై పూర్తి స్థాయి చర్చ జరగాల్సి ఉంది. కశ్మీర్ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన నేపథ్యంలో జాతీయ సమైక్యత అంశంపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవ సరం ఉంది. దేశం నడిబొడ్డున భంగకరమైన సంస్థానాన్ని వదిలేయ కుండా భారతదేశం ప్రస్తుత రూపంలోని రాజ్యాంగబద్ధమైన యూని యన్‌గా 1948 సెప్టెంబర్ 17 నుంచి ఉనికిలోకి వచ్చింది. భారత యూనియన్‌లో కశ్మీర్ 1947 అక్టోబర్ 27న చేరిందని అందరికీ తెలిసిన సత్యమే. వాస్తవానికి కశ్మీర్, హైదరాబాద్ సంస్థా నాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలని అనుకోగా, జునాగఢ్ రాజు పాకిస్తాన్‌తో కలిసిపోవాలని నిశ్చయంగా కోరుకున్నాడు. సర్దార్ పటేల్, ఆనాడు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వీపీ మీనన్ నిర్వహిం చిన దౌత్య చర్చల ఫలితంగా మిగిలిన సంస్థానాలు భారత్‌లో విలీన మయ్యాయి. సంప్రదింపులు జరిపే సామర్థ్యంలో మీనన్ ప్రసిద్ధుడు. కశ్మీర్ అనేది హిందూ రాజు ఏలుబడిలోని ముస్లింలు మెజా రిటీగా ఉన్న రాజ్యం. అదే హైదరాబాద్‌లో హిందువులు మెజారిటీగా ఉండగా, ముస్లిం రాజు పాలనలో ఉండేది. దేశ విభజన సందర్భంగా భారత్ నుంచి పశ్చిమ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కశ్మీర్, హైదరాబాద్‌లను భారత యూనియన్‌లో కలుపుకోవడంపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండేది. దేశం లోపల గానీ, సరిహద్దుల మీద గానీ ఇతర దేశాలు లేకుండా భారత్ ఒక సార్వభౌ మాధికార, స్వతంత్ర దేశంగా ఇలాంటి సమైక్యత ద్వారానే ఉనికిలో ఉండగలుగుతుంది. కశ్మీర్ భారత సరిహద్దులోని సమస్యాత్మక ప్రాంతంగా కనిపించగా, హైదరాబాద్ సంస్థానం కేంద్రానికి మరింత పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్య పట్ల నెహ్రూ, పటేల్ చాలా తీవ్ర దృష్టితో ఉండేవారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కాకపోయి నట్లయితే, భారతదేశానికి అర్థమే మారిపోయి ఉండేది. ఆరెస్సెస్ కూడా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి అలాంటి విలీనమే జరగాలని కోరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ సంస్థానాన్ని తన సాయుధ పోరాటానికి ప్రయోగాత్మక స్థావరంగా చేసుకుంది. హైదరాబాద్ ముస్లిం సంస్థానం కాబట్టి ఆరెస్సెస్ దాని మనుగడకే వ్యతిరేకంగా ఉండేది. కానీ ఆరోజుల్లో ఆరెస్సెస్ గుర్తించదగిన శక్తిగా ఉండేది కాదు. ప్రారంభం నుంచీ వారి జాతీయవాదం ముస్లిం వ్యతిరేక ఎజెండా చుట్టూనే తిరుగుతుండేది. భౌగోళికంగా ఐక్యమైన, పాలనకు అనువైన దేశాన్ని పాలక పార్టీగా కాంగ్రెస్ కోరుకుంది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యాకే అలాంటి దేశం ఏర్పడింది. కశ్మీర్, జునా గఢ్, హైదరాబాద్ సంస్థానాల్లో అనేక మరణాలు, హింసకు దారి తీసేటటువంటి బలప్రయోగం జరపడం కేంద్ర ప్రభుత్వానికి అవసర మైంది. అది పూర్తిగా మరొక గాథ! ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఆరెస్సెస్/బీజేపీ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో, చాలాకాలం ఊగిసలాట తర్వాత టీఆర్ఎస్ ఈసారి ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య పెరిగిన విభేదాలతో 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపును ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిపోయింది. సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరిని చేపడితే తెలంగాణలోని 15 శాతం ముస్లిం జనాభాను రెచ్చగొట్టి, వారిని లక్ష్యంగా చేసుకుని వేధించవచ్చు. అయినా 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగిందని? భారత యూనియన్‌లోకి మరో సంస్థానం విలీన మైంది. అంతే కదా! ‘ఐక్యతా విగ్రహం’ పేరిట గుజరాత్లో భారీ సర్దార్ పటేల్ విగ్ర హాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రతిష్టించారు. జునాగఢ్, హైదరా బాద్, కశ్మీర్‌లను విశాల భారత్‌లో ఐక్యం చేయడానికి బాధ్యుడు పటేల్. మరి ఆయన విగ్రహానికి విముక్తి విగ్రహం అని ఎందుకు పేరు పెట్టలేదు? మరే హోంమంత్రి అయినా ఇతర సంస్థానాలను సుల భంగా విలీనం చేసేవారు. కానీ ఈ మూడు సమస్యాత్మక సంస్థానా లను విలీనం చేయడంలోనే పటేల్ గొప్పతనం ఉంది. ఈ ఒక్క కారణం వల్లే కాంగ్రెస్ శిబిరం నుంచి సర్దార్ పటేల్‌ను లాగి, ఆయనను ఆరెస్సెస్/బీజేపీ తమ ఘన చిహ్నంగా రూపొందించు కున్నాయి. నెహ్రూ లాగా వంశపారంపర్య సమస్యలు ఏమీ లేని అతి పెద్ద శూద్ర వ్యవసాయ నేపథ్యం కలిగిన వాడు కాబట్టే పటేల్ చుట్టూ రాజకీయ, ఆర్థిక పెట్టుబడిని ఆరెస్సెస్/బీజేపీ ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీలు ఒక సామూహిక సంక ల్పంతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపు కోవడమే సరైనది. అప్పుడు మాత్రమే ఈ సమస్య చుట్టూ ఉన్న మత పరమైన ఎజెండాను సామూహికంగా పాతరేయవచ్చు. హైదరాబాద్ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశాక సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న చక్కటి ఫొటోగ్రాఫ్ కనబడుతుంది. పైగా జునాగఢ్ పాలకుడిలా కాకుండా, ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్‌కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్ హౌజ్ కూడా భారత ప్రభుత్వానికి నిజాం ఇచ్చిందే. అమృతోత్సవాలుగా పిలుస్తున్న ఈ కాలంలోనూ నిజాంనూ, ముస్లిం సమాజాన్నీ దూషించడం ఎందుకు? పాత గాయాలను మర్చిపోవడంలో రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. జాతీయవాదం అంటే స్వాతంత్య్ర పూర్వ కాలపు గాయాలను మళ్లీ కెలికి, వాటిపై కారం పూయడం కాదు. జాతీయవాదం అంటే ప్రజలు నిత్యం కొట్టుకునేలా చేయడం కాదు. ఈ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపుకొందాం. సర్దార్ పటేల్‌కూ, ఆనాటి సమరంలో అన్ని వైపులా మరణించిన అమరులకు నివాళులు అర్పిద్దాం. - ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త) -
ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు
ఒకే దేశం, ఒకే భాష పేరుతో గతంలో హిందీని ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి ఇప్పుడు ప్రాంతీయ భాషా రాగం అందుకున్నారు. భారతీయుల ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అంటున్నారు. ఇది పూర్తిగా గ్రామీణ ప్రజానీకాన్ని వెనుకబాటుతనంలో ఉంచే సిద్ధాంతం. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం అర్థం చేసుకుంది. ఈ అవగాహనతోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాయి. ఇంగ్లిష్ వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ఏపీ ప్రజానీకం చూస్తోంది. అదే రానున్న ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓట్లు తేనుంది. దీన్నొక శక్తిమంతమైన ఆయుధంగా టీఆర్ఎస్ ఇంకా మల్చుకోవాల్సి ఉంది. ఒకే దేశం, ఒకే భాష సూత్రానికి నిరంతర సమర్థకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహరించి ఎక్కువ కాలం కాలేదు. ఆ ఒకే భాషగా హిందీని షా పదేపదే ప్రచారం చేశారు. కానీ అలాంటి ప్రతిపాదన పట్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ప్రతిఘటించడం; ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ కూడా అన్ని భారతీయ భాషలూ సమాన ప్రాధాన్యత కలిగినట్టివే అని ప్రకటించడంతో అమిత్ షా కాస్తా గేర్లు మార్చారు. మోదీ తర్వాత ఆరెస్సెస్, బీజేపీలకు ప్రధాని అభ్యర్థి అమిత్ షాయేనని అన్ని సంకేతాలూ వెలువడుతున్నాయి. భారతీయ ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అనే అభిప్రా యాన్ని ఆయన కలిగివున్నారు. జాతీయ విద్యావిధానం 2020 (ఎన్ఈపీ) రెండో వార్షికోత్సవం సందర్భంగా అమిత్ షా ఆగస్టు 19న ఢిల్లీలో మాట్లాడారు. న్యాయ శాస్త్రం, వైద్యశాస్త్రం, ఇంజినీరింగ్ వంటివాటిని భారతీయ భాషల్లోనే బోధించాలని ఆయన నొక్కి చెప్పారు. ఎవరైనా తమ సొంత భాషలో ఆలోచించినప్పుడే పరిశోధన, అభివృద్ధి సాధ్యపడతాయన్నారు. సొంత భాషలో ఆలోచించకపోవడమే పరిశోధనా రంగంలో భారత్ వెనుకబడి ఉండటానికి ఒక కారణంగా చూపారు.ప్రత్యేకించి కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలమని ఆరెస్సెస్, బీజేపీ కూటమి పెద్ద ఆశలు పెట్టుకుని ఉంది. ఈ కొత్త సిద్ధాంతంతో అమిత్ షా దక్షిణాదిలో కూడా ఆమోద నీయమైన నాయకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యకు సంబంధించిన చైతన్యం గతంలో కంటే ఇప్పుడు దక్షిణాదిలో మరింత ఎక్కువగా విస్తరించింది. అంత ర్జాతీయ ఉపాధి మార్కెట్లలో స్థానం సంపాదించాలని దక్షిణాదిలోని ప్రతి గ్రామమూ ఆకలిగొని ఉంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం కూడా అర్థం చేసుకున్నారు. కానీ ప్రాంతీయభాషా ప్రాతిపదికన ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థ వీరిని తమ భాషా రాష్ట్రాన్ని దాటి ముందుకు పోనీయడం లేదు. అదే సమయంలో ఎగువ, మధ్యతరగతి వర్గాలు ఇప్పటికే ప్రాంతీయ భాషా విద్యను దాటి ముందుకెళ్లిపోయాయి. వారిలోని ఈ కొత్త శక్తికీ, అధికార సంపదలకూ ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం విద్యే ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు వీరు ప్రాంతీయ భాషా విద్య వైపు వెనక్కు మళ్లరు. ఈ అవగాహనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రభుత్వరంగంలో ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యవైపు మరలేట్టు చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే, అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మీడియం తిరిగి తెలుగుకు మారుతుందా? అమిత్ షా ఆంతర్యం సరిగ్గా ఇదే మరి. కానీ అదే జరిగితే తెలంగాణలోని అత్యంత వెనుకబడిన గ్రామీణ వర్గాలు దెబ్బతిని పోతాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెలుగుకు మళ్లితే– రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు ఆగిపోవడం కంటే కూడా ఎక్కువ ప్రతికూలతను అది ప్రజల మీద కలిగిస్తుంది. తన కుమారుడైన జయ్ షాను ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివించిన అమిత్ షాకు... తన కార్పొరేట్ స్నేహితు లందరూ సంపన్నుల కోసం ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలను ప్రారంభిస్తున్నారని చక్కగా తెలుసు. అమిత్ షా ప్రాంతీయ భాషా విద్యా అజెండా ఈ సంపన్నుల కోసం ఉద్దేశించింది కాదు. ప్రాంతీయ భాషల్లోనే తమ పిల్లలను చదివిం చాలని గ్రామీణ ప్రజానీకాన్ని కోరడం ద్వారా, భాషా ప్రయోజనాలు ఏవీ పొందలేని చారిత్రక వెనుకబాటుతనంలో వీరిని ఉంచాలని ఆయన కోరుకుంటున్నారు. నాణ్యమైన వసతులు, బోధనా సిబ్బందితో కూడిన ఇంగ్లిష్ మీడియం చదువు అంతర్జాతీయంగా అనుసంధానం కలిగి ఉండి, నాణ్యమైన జాతి నిర్మాణానికి పెట్టుబడిగా ఉంటుంది. అయితే ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య ద్వారా విద్యాపరమైన సమానత్వం సాధించడానికి ఆరెస్సెస్, బీజేపీ కూటమి వ్యతిరేకం. ఇంగ్లిష్‌ను రహస్యంగా ఉపయోగిస్తూ, సంస్కృతం, హిందీని వీరు సైద్ధాంతి కంగా సమర్థిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనం చూస్తున్నట్లుగా ప్రజానీకం అంతర్జాతీయ అనుసంధానం కలిగిన నాణ్యమైన విద్యకు మద్దతు తెలుపుతున్నారు. పరిశోధన, వైద్యం, ఇంజనీరింగ్, తదితర అంశాలను ప్రాంతీయ భాషల్లోనే సాగించాలని అమిత్ షా చెబుతున్న సిద్ధాంతం ఆ వ్యవస్థలో భాగమైన వారికి విధ్వంసకరంగా పరిణమిస్తుంది. తెలంగాణలోని పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగపర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయవలసింది చాలానే ఉన్నప్పటికీ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం సైద్ధాంతికంగా చదువులో సమానత్వం వైపు వేసిన తొలి అడుగు. కానీ తాము ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా బీజేపీ విద్యా విధానం ఉందని టీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపున ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తమ పాఠశాల విద్యా వ్యవస్థ గురించిన ప్రచారం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలను ఆత్మరక్షణలో పడవేసిందనే చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీని విశ్వసనీయతను అంతర్జాతీయ స్థాయి ప్రచారంగా మలిచారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ, ప్రత్యేకించి ఇంగ్లిష్ వ్యతిరేకి అయిన అమిత్ షాతో, సాధార ణంగా ఆరెస్సెస్, బీజేపీ శక్తులతో పోరాటానికి తగిన శక్తిమంతమైన సైద్ధాంతిక సంక్షేమ పథకంగా దీన్ని టీఆర్ఎస్ పరిగణించడం లేదు. ఇంగ్లిష్ మీడియం విద్యపై ఉన్న అరకొర అవగాహన కారణంగా అతి పెద్ద సంఖ్యలో ఓట్లు రాబట్టే శక్తిగా దాన్ని గుర్తించడం లేదు. దక్షిణాదిలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే... ప్రత్యేకించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య ప్రాధాన్యాన్ని అర్థం చేసు కున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కొంత శాతం మేరకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలు ఉంటుండగా, జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్చడానికి తీవ్ర ప్రయత్నం జరిగింది. ఏపీలోని అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లోనూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని కూడా వైఎస్ జగన్ సంవత్సరం క్రితం ప్రకటించారు. అమ్మ ఒడి పథకంతో కూడిన ఇంగ్లిష్ విద్య కారణంగా ఏపీలో టీడీపీ సంకటస్థితిలో పడిపోయింది. పిల్లలందరికీ మెరుగైన ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య అనేది ‘ఉచితాల’లో భాగమేనని ఆరోపించడానికి ఎవరూ సాహసించలేరు. పాఠశాల విద్యపై పెట్టే వ్యయాన్ని ‘ఉచితాలు’ అని చెప్పి ఏ కోర్టూ, ఏ శాసన సభ కూడా ఖండించలేవు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య 2024లో భారీ స్థాయిలో ఓట్లను సమీకరించబోతోంది. ప్రధానంగా స్కూల్ విద్యపై వైఎస్ జగన్ రోజువారీ ప్రాతిపదికన చేసిన పోరాటం కారణంగా టీడీపీ, బీజేపీ రెండింటికీ పరాజయాలు ఇప్పటికే నమోదయ్యాయి. ఇంగ్లిష్ విద్య వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ప్రజానీకం చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పోరాటమే... తెలంగాణలో ఎలాంటి వ్యతిరేకతా లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడాన్ని సులభతరం చేసింది. కానీ దీన్ని ఇంకా ఓట్లుగా మల్చుకోవడం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా తన పాఠ శాల విద్యకు సంబంధించి సరైన ప్రచారం చేసుకోగలిగితే, ప్రతి తల్లీ తన పిల్లల శత్రువును ఓడించడానికి పోలింగ్ బూతుకు వెళ్తుంది. ప్రతి గ్రామీణ మహిళా కూడా అమిత్ షా కంటే ఉత్తమమైన జాతీయవాది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇంగ్లిష్ మీడియంతోనే దేశాభివృద్ధి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రపంచ దేశాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన చేపట్టాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. సోమవారం తెల్లాపూర్‌లోని అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి రూ.పదివేల కోట్లను ఖర్చు చేస్తుందని దానిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం సైతం విద్యాభివృద్ధికి రూ.పదివేల కోట్లను ఖర్చు చేయాలని సూచించారు. ధనవంతులు మాత్రమే ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడితే చైనా లాంటి దేశాలతో పోటీ పడగలుగుతామని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం వల్ల కొత్తగా ఎనిమిది లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చేరారని తెలిపారు. అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా కుల, మతాలకతీతంగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పెద్దపెద్ద విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాజకీయ నాయకులకు సైతం పలు సబ్జెక్టులో శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఇంగ్లిష్‌లో మాట్లాడేలా శిక్షణ ఇస్తామన్నారు. (క్లిక్: వారు నమ్మనివే... నేడు జీవనాడులు) -
వారు నమ్మనివే... నేడు జీవనాడులు
స్వాతంత్య్రం వచ్చాక అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలి రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. నిజానికి, మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన జెండాను ఆర్ఎస్ఎస్ చాలాకాలం వ్యతిరేకించింది. సర్సంఘ్చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌కు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. కానీ ఆ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. అశోక చక్రంతో కూడిన మువ్వన్నెల జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► 75ఏళ్ళ స్వాతంత్య్ర మహోత్సవాలు జరుపుకొంటున్న ఈ తరుణంలో భారత జాతీయ పతాకం ప్రాముఖ్యంపై దేశవ్యాప్తంగా కీలకమైన చర్చ ఒకటి నడుస్తోంది. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో జాతీయ పతాకాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఏమో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రంతో కూడిన పతాకాన్ని ట్విట్టర్లో పంచుకుంది. కమ్యూనిస్టులు అసలు జాతీయ పతాకం తాలూకు చర్చ పట్టనట్టుగా వ్యవహరించారు. బహుశా వారికి త్రివర్ణ పతాకం కంటే తమ ఎర్రజెండానే ముద్దేమో మరి! ► బీజేపీ, కాంగ్రెస్‌లు తమ వాళ్ల చిత్రాలతో ప్రదర్శించుకునేందుకు వారికే సొంతమైన పార్టీ జెండాలు ఉండనే ఉన్నాయి. అవసరమైతే వారు వీటిని తమ ఇళ్లపై ఎగరేయడం ద్వారా తమ రాజకీయ ఉనికిని చాటుకోవచ్చు. అయితే ఈ దేశంలో ఉత్పాదక వర్గం దృష్టిలో జాతీయ పతాకం ప్రాముఖ్యం ఏమిటన్నది చూడాలి. కులాల ప్రాతిపదికన చూస్తే ఈ ఉత్పాదక వర్గం శూద్ర/ దళిత/ ఆదివాసీ వర్గాలతో కూడినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్వాతంత్య్రం తరువాత ఈ దేశంలో నమోదైన అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలే విజయవంతమైన రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. రైతు నాయకులు తమ సంఘర్షణకు ప్రతీకగా జాతీయ పతాకం మినహా మరేదీ లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఈ ఉద్యమం జాతీయ పతాకం అసలు వారసులు ఎవరో నిర్ణయించిన ఉద్యమం. జాతీయ పతాకం మాదే అన్న రైతుల ధీమా అసలైనది. సాధికారికమైనది కూడా! ► మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన మన జెండాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చాలాకాలం పాటు వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్చాలక్ అయిన ఎంఎస్ గోల్వాల్కర్ తన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంలో ‘‘మన నేతలు ఈ దేశానికి ఓ కొత్త జాతీయ జెండాను సిద్ధం చేశారు. ఎందుకిలా? కేవలం పక్కదోవ పట్టించేందుకు, ఇంకొకరిని అనుకరించేందుకు మాత్రమే! అసలీ జెండా ఉనికిలోకి ఎలా వచ్చింది? ఫ్రెంచ్ విప్లవ సమయంలో ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ’’ భావనలకు ప్రతీకలుగా ఫ్రెంచి వారు మూడు రంగుల జెండాను సిద్ధం చేసుకున్నారు. దాదాపు ఇవే సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన అమెరికన్ విప్లవకారులూ కొన్ని మార్పులతో ఫ్రెంచి వారి మూడు వర్ణాల జెండాను తయారు చేసుకున్నారు. మన ఉద్యమకారులకూ ఈ మూడు వర్ణాలపై ఓ వ్యామోహం ఉందన్నమాట. దీన్నే కాంగ్రెస్ పార్టీ భుజానికెత్తుకుంది’’ అని రాసుకున్నారు. ► ఆర్ఎస్ఎస్ గురూజీకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. వీటితో కులం, వర్ణం, ధర్మ వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నది ఆయన ఆలోచన. ఇస్లామిక్ జెండాలోని పచ్చదనం మాదిరిగానే కమ్యూనిస్టుల ఎర్రజెండాలోని ముదురు ఎరుపు రంగు ఉందని ఆర్ఎస్ఎస్ అనుకునేది. కమ్యూనిస్టులకు మొదటి నుంచి కూడా శ్రామిక విప్లవానికి ప్రతీకగా నిలిచే ఎర్రజెండా మినహా మరే జెండా పట్ల గౌరవం ఉండేది కాదు. ఎరుపు, తెలుపు, పచ్చదనాల మేళవింపుతో కూడిన జాతీయ పతాకాన్ని ఆమోదించిన తరువాత రాజ్యాంగ విధానసభ చర్చల్లో అంబేడ్కర్ ఆ పతాకం మధ్యలో గాంధీ ప్రతిపాదించిన చరఖాకు బదులు అశోకుడి చక్రం ఉండాలని కోరారు. అంబేడ్కర్ అప్పటికే బౌద్ధ మతం వైపు ఆకర్షితుడై ఉన్నారు. ► 1947 జూలై 22న జాతీయ పతాకం ప్రస్తుత రూపంలో ఆమోదం పొందగా, ఆగస్టు 15 అర్ధరాత్రి తొలిసారి దాన్ని ఎగురవేశారు. ఆర్ఎస్ఎస్/బీజేపీలు అప్పట్లో అధికారంలో ఉండివుంటే జెండా ఈ రూపంలో ఉండేది కాదు. కాషాయ ధ్వజం మన జెండా అయ్యుండేది. బహుశా దాని మధ్యలో ఓ స్వస్తిక్ చిహ్నం చేరి ఉండేదేమో! దేశవ్యాప్తంగా ముస్లిమ్‌లు ఉన్న విషయాన్ని గుర్తుంచుకుంటే విభజన సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదో తెలిసేది కాదు. ద్విజుల ఆధిపత్యంలో హిందూ/హిందూత్వ వాతావరణం నిండుకున్న సమయంలో శూద్ర/దళిత/ఆదివాసీ సమూహాల పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది కాదు. అయితే అంబేడ్కర్ తన సంస్థ జెండా కోసమూ నీలి వర్ణాన్నే ఎన్నుకున్నాడు. ఇప్పుడు బహుజన సమాజ్‌పార్టీ జెండాలోనూ కనిపిస్తుంది. నాకైతే 2021–22లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక రైతు ఉద్యమంతోనే జాతీయ పతాకానికి కొత్త అర్థం లభించిందని అనిపిస్తుంది. ► 1947 ఆగస్టు 15న మువ్వన్నెల జెండాను ఎగురవేసింది మొదలు వర్ణధర్మం వల్ల ఇబ్బందులు పడ్డ శూద్రులు, దళితులు, ఆదివాసీల జీవితాల్లో ఒక కొత్త దశ మొదలైందని నా నమ్మకం. అందుకే ఈ వర్గాల వారు త్రివర్ణ పతాకంపై మరింత నమ్మకం పెంచుకోవాలని భావిస్తున్నా. అదృష్టవశాత్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా మువ్వన్నెల్లోని మూడు రంగులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలుగా రాజ్యాంగ రచన సమయంలో పలు సందర్భాల్లో రూఢి చేయడం గమనార్హం. గోల్వాల్కర్ చేసిన ప్రకటనను పరిశీలిస్తే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై అతడికి ఎంత ద్వేషం ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. కానీ ఈ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. ► జాతీయ పతాకం పైభాగంలోని ఎరుపు లాంటి రంగు సూచించే విప్లవమే దేశంలోని ఉత్పాదక వర్గం కోరిక కూడా! తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కులాధిపత్యం, శోషణ, అస్పృశ్యత, హింస వంటివాటికి ఫుల్స్టాప్ పెట్టి శాంతి నెలకొనాలని శూద్ర, దళిత, ఆదివాసీలూ కాంక్షించారు. ఆకుపచ్చదనం గురించి ఆర్ఎస్ఎస్ మేధావులు ఊహించినట్లు ఇస్లామ్‌ను సూచించలేదీ రంగు. పైరుపచ్చలు, పర్యావరణ హిత జీవనవిధానం, పాడి పశువుల వంటి వాటిని మాత్రమే సూచించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కోరుకుంటున్న హరిత పర్యావరణ ఉద్యమాలే మన జాతీయ జెండాలోని పచ్చ రంగు అన్నమాట. ఈ పచ్చదనాన్ని సూచించేదెవరు? ఈ దేశపు రైతన్నలు! ► ఆధునిక చరిత్రలో రైతులకు అసలు సిసలైన ప్రతినిధి మహాత్మా జ్యోతీరావు ఫూలే. శూద్రులు, అతిశూద్రులుగా జ్యోతిరావు ఫూలే అభివర్ణించే రైతుల సమస్యల కేంద్రంగానే ఆయన రచనలన్నీ సాగాయి. దేశ చరిత్రలో మొదటిసారి ఇలాంటి రచనలు చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే. 1873లో ‘గులామ్‌గిరి’ పేరుతో ఆయన రాసిన తొలి పుస్తకం దేశంలోని ఉత్పాదక సమూహాలు ఆకాంక్షిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రతిబింబించింది. అశోక చక్రంతో కూడిన జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► మన రాజ్యాంగం, జాతీయ జెండా, ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ కాపాడుకోవాల్సిన... కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. భిన్నాభిప్రాయాలు, ఆకాంక్షలు కలిగి ఉన్నా స్వాతంత్య్ర ఉద్యమకారులు కలసికట్టుగా ఆధునిక భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఆలోచనలు, రాజ్యాంగాలతో రూపొందించారు. పల్లెలు, పట్టణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని, స్వాతంత్య్ర ఉద్యమకారుల త్యాగ గుణాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంచె ఐలయ్య షెపర్డ్ – వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఆంగ్ల సహన పాఠం నేర్చుకుందామా?
బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. కానీ ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటన్ ప్రధానమంత్రి పదవి బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. క్రైస్తవులకు ప్రాధాన్యత ఉన్న బ్రిటన్‌లో రిషీ సునాక్ తనది హిందూమతం అని చెబుతూ, ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. అక్కడి ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నించడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. కానీ అదే భారత్‌లో ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్ని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించి, సమానత్వం గురించి ఇండియాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. భారత సంతతికి చెందిన బ్రిటిష్ రాజకీయ నేత రిషీ సునాక్ కన్సర్వేటివ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. కొన్ని సంవత్స రాల క్రితం అమెరికన్ అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత రాజకీయ ఉన్నత పదవిని అందుకోవడానికి పశ్చిమ దేశాల్లోని భారత సంతతి వలస ప్రజల్లో ఇటీవల వేగంగా దూసుకొచ్చిన వ్యక్తి రిషీ సునాక్. బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. భారతీయ కోణం నుంచి చూస్తే బ్రిటిష్ ప్రధానమంత్రి అంటే దోపిడీ సామ్రాజ్యానికి చారిత్రాత్మకమైన రాజకీయ ప్రతినిధిగా మాత్రమే కనిపిస్తారు. అదే సమయంలో అది సంస్కరణల సామ్రాజ్యం కూడా అని గుర్తుంచుకుందాం. మరి బ్రిటిష్ వలస పాలనా కోణం నుంచి చూస్తే, దానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం హక్కుల ప్రాతి పదికన పోరాటం చేసి ఉండకపోతే, భారతదేశం 1947లో ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ రిపబ్లిక్ అయి ఉండేదికాదు. హిందూ లేదా బౌద్ధం... అది ఏదైనా కావచ్చు, మన ప్రాచీన నిర్మాణాలలోనే మన ప్రజాస్వామ్యానికి మూలాలు ఉన్నాయని మనం ఎంత గట్టిగా చెప్పుకున్నప్పటికీ. చర్చలో మతం లేదు మన స్వాతంత్య్ర పోరాటం, వలస జీవితానికి సంబంధించిన అన్ని కీలక అంశాలూ బ్రిటిష్ రాజకీయ వ్యవస్థతో అనుసంధానమై ఉండేవి. ప్రత్యేకించి 20వ శతాబ్ది ప్రారంభం నుంచి బ్రిటిష్ ప్రధాని అంటే వలసపాలనా చిహ్నంగానే భారతీయ ఆందోళనాకారులు భావించేవారు. దూషించడానికైనా, అభ్యర్థించడానికైనా బ్రిటిష్ ప్రధానే మన తలపుల్లో ఉండేవారు. ఈ చారిత్రక నేపథ్యంలో, ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటిష్ ప్రధానమంత్రి పదవి కోసం బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. హిందూ– జాతీయవాదం ప్రేరేపిస్తున్న వివక్షను భారత్ ఎదుర్కొంటున్న ఈ తరుణంలో క్రైస్తవులకు ప్రాధా న్యత ఉన్న బ్రిటన్‌లో ఒక వ్యక్తి తనది హిందూ మతం అని చెబుతూ, ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. బ్రిటన్ పార్ల మెంటు సభ్యుడిగా, తర్వాత ఆర్థిక మంత్రిగా ఆయన గతంలో భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అదే హిందూ సునాక్... బ్రిటన్ ప్రధాని అధికారిక నివాస భవనమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లాలని కోరుకుంటున్నారు. సునాక్ భార్య అక్షత హిందూ భారతీయ కోటీశ్వరుల కుమార్తె. సునాక్ సంపద ఇప్పుడు ప్రజల్లో చర్చించుకునే అంశమైంది. ఎందుకంటే ఆర్థిక, సామాజిక వర్గాలు చాలాకాలంగా బ్రిటిష్ రాజకీయాల్లో భాగంగా ఉంటున్నాయి. అయితే సునాక్ మతం మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా కనిపించడం లేదు. బ్రిటన్ ఓటర్లు, రాజకీయ వర్గంలో గణనీయంగా గుర్తించదగిన బహుళ సాంస్కృతిక సహన స్థాయిని ఇది సూచిస్తోంది. ఈ కోణంలో, అమెరికా కంటే మరింత లౌకికమైన, బహుళ సాంస్కృతిక దేశం బ్రిటనే అని నేను అనుకుంటున్నాను. కమలా హారిస్ గనక తనను తాను హిందువు అని బహిరంగంగా చెప్పుకునివుంటే, డెమొక్రాటిక్ పార్టీ టికెట్‌ని గెల్చుకునేవారు కాదని నా అనుమానం. ఆంగ్లికన్ క్రిస్టియానిటీ బ్రిటన్ అధికార మతం. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ హెడ్ ఎలిజబెత్ రాణి. అయినా సరే బ్రిటన్ ప్రధానమంత్రి కావాలన్న రిషీ సునాక్ కోరికను మత ప్రాతిపదికన అసంగతమైన అంశంగా అక్కడ ఎవరూ చూడటం లేదు. ఇదేనా సహనం? అదే భారతదేశం విషయానికి వస్తే, బ్రిటన్‌కు కాబోయే ప్రధానిగా అవకాశమున్న, దానికి అక్కడి సమాజ ఆమోదం పొందిన భారత సంతతి హిందువు గురించి ఆరెస్సెస్, బీజేపీ ఏమని ఆలోచిస్తాయో ఊహించగలరా? ఎందుకంటే వీళ్లు భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను మతపరమైన మెజారిటీవాద అజెండాతో అట్టడుగున పడేశారు. పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ తరపున ఒక్క ముస్లిం కూడా లేరు. అలాగే భారత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు. (అదే బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ఆయన మంత్రి వర్గంలో భారత్ కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నారు.) హిందూయిజం ప్రపంచానికే విశ్వగురువుగా ఉందంటూ ఆరెస్సెస్, బీజేపీ శక్తులు పదేపదే ఎత్తిపడుతున్నాయి. ఇక ఆరెస్సెస్ సాహిత్యమంతా బ్రిటిష్ వారిపై, క్రిస్టియన్ నాగరికతా చరిత్రపై మతయుద్ధ వీరులు, వలసవాద విస్తరణవాదులు అంటూ దాడులతో నిండిపోయింది. దేశంలో ఇప్ప టికీ కొనసాగుతున్న కుల అంతరాలు, దళితులపై దౌర్జన్యాలు వంటి సామాజిక దుర్మార్గాలను ఏమాత్రం పట్టించుకోని ఈ కూటమి, ప్రపంచం లోనే అత్యంత సహనభావం కలిగినది హిందూ మతమేనని మాత్రమే గొప్పగా చెప్పుకుంటుంది. మరోవైపున వీరి తాజా చరిత్ర వర్ణనలో స్థానిక భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను కూడా శత్రువులుగా పరిగణిస్తున్నారు. నేడు బ్రిటన్‌లో హిందువులు చిన్న మైనారిటీగా ఉంటున్నారు. జనాభాలో వీరి వాటా 1.6 శాతం మాత్రమే. వీరు బ్రిటన్‌కి ఇటీవలే వలస వచ్చినవారు, వారి వారసులతో కూడి ఉన్నారు. అయినప్పటికీ మైనారిటీవాదం బ్రిటన్ ప్రజా స్వామిక పోటీలో ప్రధాన పాత్ర వహిస్తున్నట్లు కనిపించడం లేదు. అదే ఆరెస్సెస్, బీజేపీ భారత్‌లో గానీ, చివరకు గతకాలపు కాంగ్రెస్ హయాంలో గానీ ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్ని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. ఇలా హిందూయిజం సహనభావం గురించి చెప్పుకోవ లసింది చాలానే ఉంది మరి. ప్రజాస్వామ్యంలో అసలైన ప్రశ్నలు ఇవే... క్రిస్టియన్ వలసవాద సామ్రాజ్యాన్ని బ్రిటన్ సర్వవ్యాప్తం చేసింది. కానీ ఇప్పుడు అదే బ్రిటన్ అత్యున్నత పదవికి సునాక్ పోటీ చేయడాన్ని అనుమతిస్తోంది. బ్రిటన్‌లోని ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నిం చడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. అతడి భార్య పన్ను ఎగవేత గురించి ప్రశ్నిస్తు న్నారు. ప్రజాస్వామ్యంలో సంధించవలసిన అసలు సిసలైన ప్రశ్నలు ఇవే. కానీ ఇలాంటి ప్రశ్నలు భారత్‌లో అరుదుగానే అడుగుతుంటారు. బ్రిటన్ ప్రధాని పదవికి రిషి సునాక్ వేసిన అభ్యర్థిత్వ ఫలితం పట్ల నేను అజ్ఞేయవాదిగానే ఉంటాను. బ్రిటన్ భావి ప్రధాని ఎంపికలో ఫలితాలు ఎలా అయినా ఉండనివ్వండి... కానీ పార్ల మెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించీ, సమానత్వం గురించీ భారతదేశానికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పు తోందని నాకు తెలుసు. కానీ భారతదేశం మాత్రం ఆ పాఠాన్ని నేర్చుకునే దేశంగా మాత్రం ఉండటం లేదని నా భావన. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
వారికో న్యాయం.. ఊరికో న్యాయం
రాజకీయ, న్యాయపరమైన అవరోధాలను అధిగమించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పాలసీని ఆంధ్రప్రదేశ్ ముందుకు తెచ్చింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏది బోధనాభాషగా ఉండాలి అనే అంశాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవడానికి తాను వ్యతిరేకిని కానంటూ కాంగ్రెస్ పార్టీకి చోదక శక్తిలాంటి రాహుల్ గాంధీ కూడా ఎలాంటి ఊగిసలాట లేకుండా స్పష్టత ఇవ్వడం గమనార్హం. కానీ బోధనా మాధ్యమానికి సంబంధించి తమ సొంత పిల్లల, కార్మిక వర్గ పిల్లల భవిష్యత్తు విషయంలో పూర్తిగా వ్యతిరేక వైఖరులను తీసుకుంటున్న మన ప్రజామేధావులతోనే అసలు సమస్య! ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా మేధావుల పాత్ర కీలకం. ప్రజాప్రయోజనాలకు ఏది వ్యతిరేకమని భావిస్తారో వాటిని వారు సవాలు చేస్తారు. భారత చరిత్రలో విద్యారంగం అత్యంత శక్తిమంతమైన వివక్షాపూరిత పాత్రను పోషిస్తూ వచ్చింది. రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యం అనేక వివక్షా వ్యతిరేక విధానాలకు మార్గం తెరిచింది. ఈ ప్రక్రియలో మన పాఠశాల, యూనివర్సిటీ విద్యావ్యవస్థ నిరంతరం మార్పులకూ, మలుపులకూ లోనవుతోంది. 2022 మే 7న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో కొంతమంది ప్రజా మేధావులను, కార్యకర్తలను కలవాలని కోరుకున్నారు. ఆయనను కలవాల్సిందని నాకూ ఆహ్వానం వచ్చింది. ఎలాంటి ప్రత్యేక ఎజెండా లేదనుకోండి! ప్రధానంగా రెండు అంశాలపై ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్లాను. ఒకటి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యపై, దాంతోపాటు ప్రైవేట్ పాఠశాలలతో సరితూగే లాగా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను అభివృద్ధి చేసే సమస్యపై రాహుల్ అభిప్రాయం ఏమిటి? రెండు: ఆర్థికంగా వెనుకబడిన (ఓబీసీ) వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏమిటి? ఈ రెండింటికీ తెలంగాణలో తక్షణ ప్రాసంగికత ఉంది. రాహుల్ వరంగల్‌లో మే 6న భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అందులో తెలంగాణ కాంగ్రెస్ రైతులపై ఒక తీర్మానం చేసింది తప్ప ఇతర సమస్యలపై మౌనం వహించింది. ఆ తర్వాత మే 7న హైదరాబాద్‌లో భేటీ సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పట్ల ఆయన వైఖరి ఏమిటని రాహుల్ గాంధీని అడిగాను. తాను వ్యతిరేకం కానని రాహుల్ సమాధాన మిచ్చారు. తన పక్కనే ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈ అంశంపై వారి వైఖరి ఏమిటని రాహుల్ అడిగారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే 2022–23 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తీసుకొస్తున్నట్లు ప్రకటిం చింది. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధన ఉంటుందని తెలిపింది. రాహుల్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ పాఠ శాలల్లో ఇంగ్లిష్ మీడియంకు టీ–కాంగ్రెస్ అనుకూలమని రేవంత్ రెడ్డి జవాబిచ్చారు. రాహుల్ ఆహ్వానించిన ప్రజా మేధావుల్లో ఒకరు జోక్యం చేసు కుని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. తెలుగు మీడియంలోనే తాను చదువుకున్నందున ఇంగ్లిష్ మీడియంలో చదవటం కంటే తెలుగు మీడియంలో చదవడం మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఒక వామ పక్ష మేధావి నుంచి ఇలాంటి దృక్పథం నాకు ఆశ్చర్యమేసింది. ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మీడియం పట్ల వ్యతిరేకత కలిగి ఉంటున్న వారితో సమస్య ఏమిటంటే, వీరు తమ పిల్లలను మాత్రం తాము భరించ గలిగిన ఉత్తమ ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివిస్తుంటారు. ఆశ్చర్యకరంగా రాహుల్‌తో భేటీ అయిన ఒక ముస్లిం మేధావి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే ముస్లిం యువతకు ఉద్యోగాలు కల్పించగల నైపుణ్యాలు అవసరమనీ, ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఆ నైపు ణ్యాలు బోధించే పరిస్థితి లేదనీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను తాను వ్యతిరే కించడం లేదని రాహుల్ గాంధీ ప్రైవేట్ సంభాషణల్లో అయినా సరే, అంగీకరించడం ముఖ్యమైన విషయం. ఎందుకంటే 2015లో నాటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను ఆయన అధికారిక నివా సంలో నేను ముఖాముఖిగా కలిసినప్పుడు, కర్ణాటక ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం గురించి ఆలోచించమని సూచించాను. ఆయన స్పందనలో రెండు కోణాలున్నాయి. ఒకటి, అలాంటి విద్యా విధానాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోదు. రెండోది, యూఆర్ అనంత మూర్తి, గిరీష్ కర్నాడ్ వంటి కన్నడ మేధావులు చాలా కాలం నుంచీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రతి పాదనను వ్యతిరేకిస్తున్నారు. అందుకని సిద్ధరామయ్య సమాజంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మేధావులు, మీడియా తన ప్రభుత్వా నికి ఈ విషయంలో సమస్యలను సృష్టించవచ్చని చెప్పారు. కాబట్టి, ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి సమస్యలను కొనితెచ్చుకోవడం కంటే, టిప్పు సుల్తాన్ అంశాన్ని ఎత్తుకోవడానికే ఎంచుకున్నారు. అది బీజేపీని బలోపేతం చేసింది. రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఒక చోదకశక్తిగా ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇంగ్లిష్ వ్యతిరేక వైఖరిని కలిగి ఉంటున్న నేపథ్యంలో ఈ అంశంపై రాహుల్ వైఖరి కీలకమైనది. మరోవైపున భారత హోంమంత్రి అమిత్ షా మరో ముందడుగు వేసి, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలూ ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలోనే మాట్లాడాలని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏది బోధనాభాషగా ఉండాలి అనే అంశాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవడానికి తాను వ్యతిరేకిని కానంటూ రాహుల్ గాంధీ ఎలాంటి ఊగిసలాట లేకుండా స్పష్టత ఇవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది. భారతదేశం రాష్ట్రాల యూనియన్ మాత్రమే తప్ప ఏకీకృత రాష్ట్రం కాదని రాహుల్ నమ్ముతున్నందున, ఆయన పార్టీ రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ జాతీయ స్థాయిలో భాషా విధానాన్ని సూత్రీకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. అసలు సమస్య ఎక్కడుందంటే– విద్యకు, ప్రత్యేకించి బోధనా మాధ్యమానికి సంబంధించినంత వరకూ తమ సొంత పిల్లల భవిష్యత్తు విషయంలో, కార్మిక వర్గ పిల్లల భవిష్యత్తు విషయంలో పూర్తిగా వ్యతిరేక వైఖరులను తీసుకుంటున్న మన ప్రజామేధావుల కపట పాత్రేనని చెప్పాల్సి ఉంది. యూరోపియన్–అమెరికన్ దేశాల్లో ప్రజా మేధాతత్వం అనేది వామపక్ష ఉదారవాద తత్వంగా ఆవిర్భవించింది. ‘నిజాయితీ భావన’ను, ప్రతి రంగంలోనూ మానవ సమానత్వం కోసం పోరా టాన్ని వ్యాప్తి చెందించడానికి ఆ దేశాల్లో వామపక్ష ఉదారవాదం వృత్తిగతంగా ఏర్పడుతూ వచ్చింది. ఆఫీసులో ఒకటి, వ్యక్తిగత జీవితంలో ఒకటి మాట్లాడటానికి ప్రజా మేధావులనేవారు అటు రాజకీయవాదులూ కారు, ఇటు సంస్థాగతంగా శిక్షణ పొందిన బ్యూరోక్రాట్లు అసలే కారు. ప్రత్యేకించి ప్రజా సమస్యలకు సంబంధిం చినంత వరకు వీరు సమాజాన్నీ, ప్రభుత్వాన్నీ వ్యతిరేక దిశల్లో నడిపించే విధంగా కాకుండా నిజాయితీ, చిత్తశుద్ధితో కూడిన వైఖరిని కలిగి ఉండాలి. ప్రజామేధావి తమకు ఏది మంచిదో ఇతరులకూ అదే మంచిదని చూడాలి. ఇతరుల ప్రయోజనం కోసం వీరు పోరాడాలి. ఏ సమాజంలో అయినా ప్రజామేధావులు అలాంటి స్థిరమైన వైఖరిని కలిగి ఉంటే, విస్తృత ప్రజానీకానికి సంబంధించిన అంశాలపై రాజ కీయ నేతలు తమ వైఖరిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రాహ్మణుల నియంత్రణలో సంస్కృతం ఆధిపత్యం చలాయిం చిన కాలంలో మన దేశ ఉత్పాదక ప్రజారాసులు చారిత్రకంగా నష్టపోయారు, వెనుకబాటుతనంలో కూరుకుపోయారు. ఇప్పుడు పేద ప్రజలకు ఇంగ్లిష్ భాషా విద్యకు సంబంధించి ఇలాంటి బౌద్ధిక నిజాయితీ రాహిత్యం కారణంగా ఇంగ్లిష్ విద్యకే గ్రామీణ, పట్టణ శ్రామిక ప్రజారాశులు దూరమైపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే, మొన్నటి ఆంతరంగిక సమావేశంలో రాహుల్ గాంధీ వ్యక్తపరిచిన వైఖరిని ‘గ్రాండ్ ఓల్డ్’ జాతీయ పార్టీ పాటించినట్లయితే, అప్పుడు దేశం ఒక సరికొత్త విద్యావిధాన దశలోకి ప్రవేశిస్తుంది. అదే జరిగి నప్పుడు బీజేపీ కూడా అదే మార్గాన్ని అనుసరించక తప్పదు. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
జాతీయవాదానికి ఊతమిచ్చింది ఇంగ్లిషే
భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత్ అని పేర్కొన్న పదంలో అధిక భాగం శూద్రులకే వర్తిస్తుంది. వీరు జాతి రక్తమాంసాలుగా నిలిచారు. విద్యాహక్కుకు దూరమైనప్పటికీ బ్రిటిష్ వారితో పోరాటంలో ఆనాడు కీలక పాత్రను పోషించారు. శతాబ్దాలుగా విద్యకు దూరమైపోయిన శూద్ర, దళితులకు తక్కువ స్థాయిలో అయినా సరే ఇంగ్లిష్ విద్య అందిన నేపథ్యంలోనే జాతీయవాద భావన దేశంలో మోసులెత్తింది. కానీ నెహ్రూవియన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్వంద్వ విద్య (ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్‌కు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలకు పట్టం కట్టడం) వల్లే శూద్రుల విముక్తి మార్గం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఇందువల్లే మన దేశంలోని ఉత్పాదక శక్తులు ఇప్పుడు జీవితంలోని అన్ని రంగాల్లోనూ అసమాన అస్తిత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత భారత జాతి భావన ప్రత్యేకించి 19వ శతాబ్దం మధ్యనుంచి మాత్రమే చైతన్య పూరితంగా నిర్మితమవుతూ వచ్చింది. కచ్చితంగానే అంతకు ముందు మనకు జాతిభావన లేదు. మనం నివసిస్తూ వచ్చిన ప్రస్తుత భూభాగం కోసమే ఆధునిక భారత జాతి అనే స్పష్టమైన రేఖకు సంబంధించిన బెంచ్ మార్క్ వ్యవస్థాపితమైంది. బ్రిటిష్ వలస పాల కులకు వ్యతిరేకంగా భారతీయుల ప్రప్రథమ తిరుగుబాటు 1857లోనే జరిగింది. మరి ఆనాడు ఆ తిరుగుబాటును ప్రేరేపించి, అమలు పర్చడానికి తమ భౌతిక, మానసిక శక్తిని వెచ్చించిన శక్తులు ఏవి? బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తి నియంత్రణ నుంచి భూభాగాన్ని కాపాడటానికి తమ భౌతిక శక్తి ద్వారా దోహదం చేసిన శక్తులు ప్రధా నంగా శూద్రులు, దళితులు, ఆదివాసీల్లోనే రూపుదిద్దుకున్నాయి. బ్రిటిష్ సైన్యంలోని వివిధ రెజిమెంట్లలో శూద్రులు, దళిత రైతాంగం, వారి పిల్లలు లేకుండా ఉంటే, 1857 తిరుగుబాటు సాధ్యమయ్యేదే కాదు. వేదాలు, రామాయణం, మహాభారతం వంటి బ్రాహ్మణ పుస్త కాలను పోలిన చరిత్ర రాసిన ఆర్ఎస్ఎస్, హిందుత్వ లేదా వామపక్ష ఉదార ద్విజ రచయితలు కానీ.. ఆవు, పంది కొవ్వు వంటి సెంటి మెంట్లు కానీ ఆనాటి తిరుగుబాటుకు బాధ్యులు కారు. బ్రిటిష్ పన్నుల వ్యవస్థ పీడన, బ్రిటిష్ వలసవాద ప్రభుత్వానికి జీతం రాళ్లకోసం పనిచేస్తూ వచ్చిన అనేక మంది ద్విజ అధికారులతోపాటు, బ్రిటిష్ అధికారులు కలిసి సాగించిన దోపిడీనే... రైతు కమ్యూనిటీలు గ్రామస్థాయి నుంచి తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాయి. బ్రిటిష్ ప్రభుత్వం కోసం ఆ రోజుల్లో ఏ శూద్ర, దళిత, ఆదివాసీ అధికారులూ పనిచేసిన చరిత్ర లేదు. బ్రిటిష్ వారు ఇక్కడికి రాక ముందే మొఘల్ పాలనలోకూడా ముస్లిం అధికారులతోపాటు, ద్విజులు (ప్రధానంగా బ్రాహ్మణులు, కాయస్థులు, ఖాత్రిలు) మాత్రమే అధికారులుగా పనిచేశారు. ముస్లిం రాజరిక పాలన పొడ వునా బనియాలు గ్రామ, పట్టణ స్థాయిలో వ్యాపార కార్యకలాపాల్లో కొనసాగుతూ వచ్చారు. బ్రిటిష్ పాలనలో కూడా వీరు తమ వృత్తికే పరిమితమయ్యారు. వర్ణధర్మ నియమాలను ధిక్కరించి శూద్రులను, దళితులను, ఆదివాసులను విద్యావంతులుగా చేయలేకపోయారు కాబట్టే ఈ మూడు విభాగాలకు చెందినవారు ఆనాడు ప్రభుత్వ ఉద్యో గాల్లోకి అసలు ప్రవేశించలేకపోయారు. భారతదేశంలో అతిపెద్ద మానవ జనాభా శూద్రులదే. భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత్ అని పేర్కొన్న పదంలో అధిక భాగం శూద్రులకే వర్తిస్తుంది. వీరు జాతి రక్తమాంసాలుగా నిలిచారు. జాతి మొత్తం శారీరకంగా, మేధోపరంగా ఒక్కటై మానవతావాద తాత్విక పునాదిపై నిలిచి పోరాట రూపాలను, పద్ధతులను రూపొందిం చుకున్నప్పుడే దురాక్రమణ శక్తి నుంచి మన భూభాగాన్ని చేజిక్కిం చుకోవడం సాధ్యపడుతుంది. అప్పుడు మాత్రమే విదేశీ బంధనాల నుంచి మన భూభాగం విముక్తి చెంది జాతిగా మనగలుగుతుంది. విద్యాహక్కుకు దూరమైనప్పటికీ శూద్ర, దళిత, ఆదివాసీలు అలాంటి కీలక పాత్రనే ఆనాడు పోషించారు. కానీ, బ్రిటిష్ పాలనాయంత్రాంగం తన పాలన చివరి దశాబ్దాల్లో స్కూల్ విద్యను శూద్ర, దళిత, ఆదివాసీలకు తెరిచి ఉంచింది. దీనివల్లే మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బీఆర్ అంబేడ్కర్ మొట్టమొదటి శూద్ర, దళిత మేధావులుగా ఆవిర్భవించి, వెయ్యేళ్లకు పైబడిన పురాతన వర్ణధర్మ దోపిడీని, కుల అణచివేతను సవాలు చేయగలిగారు. ఈ కమ్యూనిటీల సజీవ చరిత్రలో తొలిసారిగా విద్యా వంతులైన మేధావులు ఇంగ్లిష్‌ని చదవడం, రాయడం, అర్థం చేసు కోవడం సాధించగలిగారు. ఇక్కడే వారి తొలి విముక్తి మార్గం ఆరంభ మైంది. కానీ నెహ్రూవియన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ద్వంద్వ విద్య (ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యకు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలకు పట్టం కట్టడం) వల్లే శూద్రుల, దళితుల విముక్తి మార్గం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఇందువల్లే మన దేశంలోని ఉత్పాదక శక్తులు ఇప్పుడు జీవితంలోని అన్ని రంగాల్లోనూ అసమాన అస్తిత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్రిటిష్ ఇండియన్ ఇంగ్లిష్ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల పాలక భాషగా 1835లో రూపుదిద్దుకున్న సమయానికి, శూద్ర, దళిత, ఆదివాసీలు విద్యావ్యవస్థకు పూర్తిగా అవతలే ఉండిపోయారు. 1817లో కలకత్తాలో తొలి ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రారంభించిన తర్వాత, ఆ వలస భాషకూడా అప్పటివరకు సంస్కృతంపై అదుపు సాధించిన ద్విజుల ఇళ్లలోకే ప్రవేశించింది. బెంగాలీ బ్రాహ్మణ జమీం దారీ కుటుంబానికి చెందిన రాజా రాంమోహన్ రాయ్ (1772– 1833) బ్రిటిష్ అధికారులతో తన కుటుంబ సంబంధాల ద్వారా ఇంగ్లిష్‌ని 18వ శతాబ్ది చివరలోనే నేర్చుకోగలిగాడు. భారత్‌లో సంస్కృత బ్రాహ్మణులకు, గొడ్డు మాంసం ఆరగించే బ్రిటిష్ ఇంగ్లిష్ మాట్లాడే అధికారులకు మధ్య భాషా బాంధవ్యం అలా ఏర్పడింది. రామ్మోహన్ రాయ్ తండ్రి రమాకాంత్ రాయ్ వైష్ణవ బ్రాహ్మణుడు. అయినా రామ్మోహన్ రాయ్‌ని సంస్కృతంతోపాటు పర్షియన్, ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అనుమతించాడు. రామ్మోహన్ రాయ్‌తో ప్రారం భమైన ఇంగ్లిష్ విద్య తర్వాత బెంగాల్లో మిషనరీగా జీవించిన విలియం కారే, రాయ్ అధ్వర్యంలో పాఠశాల విద్యా వ్యవస్థగా మారింది. ఆధునిక భారతదేశంలో రెండో అతి విశిష్ట వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ (1825–1917). ఇతను పార్సీ జొరాస్ట్రియన్ గుజరాతీ కుటుం బంలో పుట్టాడు. ఎల్ఫిన్‌స్టోన్ ఇనిస్టిట్యూట్ స్కూల్లో చదువు కున్నాడు. ఇది బహుశా బాంబే ప్రావిన్స్‌లోనే మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం స్కూల్ అయివుంటుంది. బరోడా రాజు షాయాజీరావు గైక్వాడ్–3 సంరక్షణలో పెరిగిన నౌరోజీ తర్వాత బరోడా రాష్ట్రానికి దివాన్ అయ్యాడు. పార్సీ కమ్యూనిటీలో చాలాతక్కువ జనాభా ఉన్న ప్పటికీ విద్యలో చాలాముందుండేది. నౌరోజి తర్వాత బ్రిటిష్ పార్ల మెంటు సభ్యుడయ్యారు. తర్వాత 1885లో స్కాటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి ఏఓ హ్యూమ్‌తో కలిసి భారత జాతీయ కాంగ్రెస్‌ని స్థాపించారు. విద్యావంతులైన భారతీయులతో కలిసి భారత ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని హ్యూమ్ కోరుకున్నారు. నౌరోజీ కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలేకి (1827–1890) దాదాపు సమకాలికుడే కావచ్చు. కానీ నౌరోజీ తన కమ్యూనిటీ విద్యా నేపథ్యం వల్ల బరోడా మహారాజు నుంచే కాకుండా బ్రిటిష్ అధికారులనుంచి కూడా సహాయం పొందగలిగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బరోడా మహారాజుది శూద్ర కుటుంబం. కానీ ఆయన రాజరిక స్థానం బట్టి క్షత్రియ ప్రతి పత్తిని కట్టబెట్టారు. ఇలాంటి శూద్ర రాజరికాలన్నీ బ్రాహ్మణ మంత్రులు, పూజారుల ద్వారానే కొనసాగేవి. ఇలాంటి దయామయు డైన రాజు కూడా తన సొంత వర్గానికి చెందిన పిల్లలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు పంపేవారు కాదు. ఉన్నత విద్యకోసం వారిని ఇంగ్లండుకు పంపేవాడు కూడా కాదు. అయితే ఈ బరోడా రాజ కుటుంబమే తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు అమెరికాలోని కొలం బియా యూనివర్సిటీలో చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందిం చింది. అయితే వారి ఆర్థిక ప్రతిపత్తి ఏదైనా సరే శూద్రులను విద్య మాటెత్తితేనే భయపెట్టేవారు. విద్య శూద్రేతరమైనదనీ, శూద్రులు చదివినా, రాసినా దేవతలే ఆగ్రహిస్తారనీ పుకార్లు రేపేవారు. ఈ విధమైన భ్రమలూ, మూఢనమ్మకాలూ హిందూ చారిత్రక వార సత్వంలో భాగమైపోయాయి. విద్య అంటేనే శూద్రులు వణికిపోయే పరిస్థితిని కుల నియంత్రణపై పట్టున్న బ్రాహ్మణ భావజాలం వెయ్యి సంవత్సరాలుగా చొప్పిస్తూ వచ్చింది. విద్యపట్ల భయాన్ని శూద్రులు, దళితులలో మానసికంగానే రూపొందించేశారు. అందుకే బ్రిటిష్ వలసపాలనా కాలంలో కూడా శూద్రులు, దళితులు చదవడానికి, రాయడానికి నోచుకోలేక తమ తమ స్థానిక భాషల్లో మాట్లాడటం వరకే పరిమతమైపోయారు. ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం
భారత ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రమాదకరమే. అణచివేతకు గురైన, పీడిత వర్గాల ప్రజలు ఇంతకాలం పొందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ దీంతో కోల్పోతారు. కులవ్యవస్థ, అంటరానితనం, ఆదిమతత్వం కారణంగానే భారతదేశంలో 1950కి ముందు సార్వత్రిక విద్య అనే భావనే ఉనికిలో లేదు. ప్రస్తుత రాజ్యాంగాన్ని అమలుపరచడం వల్లే పీడిత ప్రజలు అంతవరకు తమకు తెలీని ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కాబట్టి ఏ రాజకీయ, సైద్ధాంతిక భావజాలం ఉన్న నాయకులైనా సరే... ఈ రాజ్యాంగాన్ని వెనక్కు నెట్టడాన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదు. భారత రాజ్యాంగం నిరవధికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు వ్యతిరేక రంగాల్లో పోరాటాన్ని ప్రారంభించారు. ఒకటి: బీజేపీ గద్దె దిగేంత వరకూ వారితో పోరా డుతూ ఉంటానన్నారు. రెండు: ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకించిన 1950 నాటి రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని ఆయన కోరు కున్నారు. పూర్తిగా విరుద్ధమైన రెండు యుద్ధరంగాలను అయన ఏక కాలంలో ఎందుకు ప్రారంభించినట్లు అనేది అసలు ప్రశ్న. ఆర్ఎస్ఎస్ మూలాలు సనాతన బ్రాహ్మణవాద ఆధ్యాత్మిక వ్యవస్థలో పాతుకుని ఉన్నాయి కాబట్టి దాన్నుంచి భారత రాజ్యాం గానికి ప్రమాదం ఉండేదనీ, ఇప్పటికీ ఉంటోందనీ మనకు తెలుసు. డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ముసాయిదా రచనా ప్రక్రియను రూపొందించడం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు, దాని సంస్థాపక నాయకులు... రాజ్యాంగ సభ భావనను అంగీకరించేవారు కాదు. భారతీయతపై వారి భావన కానీ, వారు సమ్మతిస్తున్న తరహా రాజ్యాంగం కానీ... వర్ణ కుల వ్యవస్థను బలపరుస్తాయి. భారతీయ కమ్యూనిస్టులు కూడా రాజ్యాంగసభ ఏర్పాటును తోసిపుచ్చి ప్రజాస్వామిక రాజ్యాంగ ముసాయిదాను వ్యతిరేకించడానికి ప్రయత్నించారు. అది ఒక బూర్జువా రాజ్యాంగ రచనకు ప్రయత్నమని వారి భావం. అదృష్ట వశాత్తూ వీరు కూడా తమ ప్రయత్నంలో విఫలమయ్యారు. చివరకు 1950 జనవరి 26న ప్రస్తుత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది. రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లను మాత్రమే కాకుండా మొత్తం రాజ్యాంగాన్నే సమీక్షించడానికి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వం లోని నాటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఒక సమీక్షా కమిటీని ఏర్పర్చింది. కేవలం రాజ్యాంగాన్ని సవరించడం కాకుండా మారుతున్న సమాజ అవసరాలకు అను గుణంగా దాన్ని మార్చాలన్నదే నాటి ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆ ప్రయ త్నాన్ని దేశంలోని పలు వర్గాల ప్రజలు తిరస్కరించారు. దీంతో రాజ్యాంగ సమీక్షా కమిటీ సహజంగానే మరుగున పడిపోయింది. (చదవండి: కాంగ్రెస్‌కు చన్నీ చూపిన బాట) తగని వైఖరి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర రావు కేంద్ర బడ్జెట్ గురించి ఫిబ్రవరి 1న మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మాత్రమే కాకుండా ప్రస్తుత రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కొందరు మీడియా వ్యక్తులు దీన్ని పెద్దగా పట్టించుకోనప్పుడు, ఈ అంశంపై తాను చాలా సీరియస్‌గా ఉన్నట్లు నొక్కి చెప్పారు. ‘మొత్తం రాజ్యాంగాన్ని మార్చడంపై చర్చిద్దాం. మనకు ఇప్పుడు కొత్త రాజ్యాంగం కావాలి’ అన్నారు. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ నేతకు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అనే ప్లాన్ ఉంటే దాన్ని ఎవరైనా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడటమే కలవరపెడుతోంది. వాస్తవానికి కేసీఆర్‌లో అనేక రకాలుగా హిందుత్వ ఆలోచనా విధానం గూడుకట్టుకుని ఉంది. స్వతహాగా ఆయన మతావేశపరుడు. యాగాలు, యజ్ఞాలు, క్రతువులు, ఆలయాలపై మెండుగా ఖర్చు పెడ తారు. వైష్ణవ పీఠాధిపతి చిన జీయర్‌ని సకల వేళల్లో అనుసరిస్తారు. యాదగిరి ఆలయ పునరుద్ధరణకు రూ. 130 కోట్లు ఖర్చు పెట్టారు. పూర్తిగా మతపరమైన విశ్వాసాలతో కూడిన వ్యక్తిత్వం కాబట్టే ఇలా రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలకు కేసీఆర్ పాల్పడు తున్నారు. బీజేపీపై కేసీఆర్ చేస్తున్న పెనుదాడి తెలంగాణ మనోభావాలను తిరిగి ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది ఆయనకు లబ్ధి చేకూర్చవచ్చు. కానీ ఆయన ప్రదర్శిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి అటు తెలంగాణ ప్రజలకు గానీ, ఇటు తన సొంత ప్రయోజనానికి గానీ ఏమాత్రం సమ్మతమైనది కాదు. ఎందుకంటే రాజ్యాంగం పట్ల వ్యతిరేకత అనేది నేరుగా ఆరెస్సెస్, బీజేపీతో ముడిపడి ఉన్న విషయం. ఇలాంటి పాలకులను, వ్యక్తులను సంస్కరించడమే భారత రాజ్యాంగ విధి. ఒక వ్యక్తిగా ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు కేసీఆర్‌కు లేదని చెప్పలేం. కానీ రాజ్యాంగం ముందు ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అదే రాజ్యాంగాన్ని మార్చడానికి ఉద్యమాన్ని ప్రారంభించకూడదు. భారత స్వాతంత్య్రం కోసం మన దేశ నిర్మాతలు సంవత్సరాల కొద్దీ జైళ్లలో గడిపారు. వారు రాజ్యాంగ ముసాయిదాను రచించిన రాజ్యంగ సభలో భాగమయ్యారు. దేశం చారిత్రకంగా ఎదుర్కొన్న ప్రతి కీలక సమస్యపై సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాతే వీరు రాజ్యాంగ ముసాయిదాను రచించారు. ఇన్నేళ్ల తర్వాత ప్రతి ముఖ్యమంత్రీ లేక మంత్రీ, దేశానికి సర్వశక్తులూ కల్పించిన భారత రాజ్యాంగాన్నే రద్దు చేయాలని మాట్లాడితే దేశం కల్లోలంలో కూరుకుపోక తప్పదు. రేపు ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా ప్రజాస్వామిక వ్యవస్థను సంస్థాగతం చేసిన రాజ్యాంగాన్ని త్యజించడం లేదా రద్దు చేయడం గురించి మాట్లాడటం మొదలెడితే, భారతదేశం ధ్వంసమై పోతుంది. ప్రస్తుత పాలకులను నాటి స్వాతంత్య్ర వీరులు, వారి త్యాగాలతో ఏమాత్రం సరిపోల్చలేమనే చెప్పాలి. (చదవండి: మూడో ఫ్రంట్ మనగలిగేనా?) గణరాజ్య వ్యవస్థ ఆచరణీయమేనా? మరో సందర్భంలో ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ప్రాచీన గణరాజ్య వ్యవస్థలో ఉత్తమమైన ప్రజాస్వామ్యం ఉండేదని సూచించారు. ఇది జాతీయవాద ప్రచారంలో బాగా వ్యాప్తిలో ఉన్న కొత్త భ్రమ మాత్రమే. పైగా మనది వలసవాద రాజ్యాంగ నమూనా అంటూ చాలాసార్లు పరోక్షంగా వ్యాఖ్యానాలు చేశారు. ప్రాచీన గణ రాజ్యాలు చిన్న చిన్న గిరిజన విభాగాలు. స్థానిక విభాగాల స్థాయిలో గిరిజన సమానత్వ పంపిణీ పద్ధతిలో నడిచేవి. దీనికి చక్కటి ఉదా హరణ వజ్జియన్ గిరిజన గణరాజ్య ప్రజాస్వామ్యం. బుద్ధుడి జీవిత కాలంలోనే ఇది ఉనికిలో ఉండేది. మగధ రాజ్య ఆక్రమణ నుంచి బుద్ధుడు దీన్ని కాపాడాడు. ఇలాంటి గణరాజ్య ప్రజాస్వామ్యాన్ని ఆధునిక భారత రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగానూ పోల్చి చూడలేం (నా పుస్తకం ‘గాడ్ యాజ్ పొలిటికల్ ఫిలాసపర్ – బుద్ధాస్ ఛాలెంజ్ టు బ్రాహ్మిణిజం’లో నేను గతంలోనే దీన్ని చర్చించాను). మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రయోగమని చెప్పాలి. పైగా జనాభా అధికంగా ఉన్న ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంతటి బృహత్తర రాజ్యాంగం ఉనికిలో లేదు. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రమాదకరమే. అణచివేతకు గురైన, పీడిత వర్గాల ప్రజలు ఇంత కాలం పొందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ దీంతో కోల్పోతారు. కుల వ్యవస్థ, అంటరానితనం, ఆదిమతత్వం కారణంగానే భారత దేశంలో 1950కి ముందు సార్వత్రిక విద్య అనే భావనే ఉనికిలో లేదు. ప్రస్తుత రాజ్యాంగాన్ని అమలుపరచడం వల్లే పీడిత ప్రజలు అంతవరకు తమకు తెలీని ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగ ముసాయిదా పూర్తి కావడం, దాన్ని మన దేశ నిర్మాతలు ఆమోదించినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. కేసీఆర్ వంటి అధికార తృష్ణ కలిగిన నేతలు, హిందుత్వ భావజాలం ప్రభావంతో వ్యవహరిస్తున్నవారు లేక మరే ఇతర సైద్ధాంతిక దృక్పథం కలిగినవారైనా సరే ఈ రాజ్యాంగాన్ని వెనక్కు నెట్టడాన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదు. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర) ఒక దశలో నేను కూడా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య రద్దు కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల శక్తుల్లో భాగంగా ఉండేవాడిని. అయితే చాలా త్వరగానే నేను వాస్తవం గుర్తించి, ‘నేను హిందువు నెట్లయిత’ పుస్తకాన్ని రచించిన 1980లలోనే, అలాంటి వామపక్ష శక్తులనుంచి బయటపడ్డాను. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఆ విధంగా రాజకీయ స్వీయ విధ్వంసక సైద్ధాంతిక క్రమం నుంచి నేను బయటపడ్డాను. అమెరికన్ రాజ్యాంగం వందల సంవత్సరా లుగా పనిచేస్తున్న విధంగా భారత రాజ్యాంగం కూడా నిరవధికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంపై కేసీఆర్ అభిప్రాయాలను తెలంగాణ ప్రజలు మొత్తంగా తిరస్కరించినం దుకూ, ప్రతిపక్ష పార్టీలు, సామాజిక సంస్థలు అలాంటి ఆలోచననే ఖండించినందుకూ నేనెంతో సంతోషపడుతున్నాను. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కాంగ్రెస్‌కు చన్నీ చూపిన బాట
కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కోల్పో యిన తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కరంటే ఒక్క రాష్ట్ర స్థాయి యువనేత కూడా బీజేపీతో పోరాడగలిగే స్థితిలో లేకపోవడం దీనికి ఒక కారణం. రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ నేతలు గెలుపు సాధిస్తుండగా అక్కడ కూడా కాంగ్రెస్ తరఫున గెలిచే నాయకులు కరువయ్యారు. ప్రత్యర్థులను సవాలు చేస్తూ ఎదిగిన ఏ నాయకుడినీ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం నిలుపుకొన్న పాపాన పోలేదు. ప్రజాకర్షక నేతలుగా ఎదిగివచ్చిన యువనేతలను ఆ పార్టీ దూరం చేసుకుంది. వీరిలో కొందరు సొంత ప్రాంతీయ పార్టీలను ఏర్పర్చుకున్నారు. దీనికి మమతా బెనర్జీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కటి ఉదాహరణ. ఇప్పుడు వీరు పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పాలిస్తూ శక్తిమంతమైన ప్రాంతీయ నాయకులుగా విలసిల్లుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఓట్లను రాబట్ట లేనివారి మార్గదర్శకత్వంలోనే పనిచేస్తోంది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పార్టీ అధిష్ఠానంగా మారిన తర్వాత, క్షేత్రస్థాయిలో అనుభవం కలిగిన ఒక్క నేతను కూడా నెహ్రూ కుటుంబం అంతర్గతంగా తయారు చేసుకోలేకపోయింది. రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ... ఇలా వీరందరికీ కుటుంబపరంగా మంచి పేరు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అనుభవం లేకుండా పోయింది. పైగా ఆరెస్సెస్, బీజేపీ తరహా శక్తులతో పోరాడటానికి అవసరమైన రాజ కీయ, సామాజిక, భావజాలపరమైన అనుభవం వీరికి కరువైంది. ఇందిరాగాంధీ అనంతరం నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన నాయకులందరూ అద్దాలమేడలో పెరుగుతూ వచ్చారు. కాగా, విదే శాల్లో చదువుకుని వచ్చిన ద్విజ (బ్రాహ్మణ, వైశ్య, కాయస్థ, ఖాత్రి, క్షత్రియ) మేధావులు మెల్లగా కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. వీరు రాజ్యసభ ద్వారానే అధికార స్థానాల్లోకి ప్రవేశించి, ఓట్లు, సీట్లు గెలవ డానికి నెహ్రూ కుటుంబ సభ్యులపైనే ఆధారపడుతూ వచ్చారు. తర్వాత వీరు మంత్రులుగా మారి పాలించారు. దీంతో అనేక రాష్ట్రాల్లో ఓట్లను భారీగా రాబట్టే నేతలు కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నేతలు చాలావరకు శూద్రులు, దళితులు, ఆదివాసీ నేపథ్యంలోంచే వచ్చారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి, విలాసరావు దేశ్‌ముఖ్ వంటివారికి శూద్ర వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉంది. అయితే ఇలాంటి బలమైన రాష్ట్ర స్థాయి నేతలను ఢిల్లీ స్థాయిలో కీలక పాత్ర పోషించడానికి కాంగ్రెస్ ఎన్నడూ అనుమతించలేదు. ఆదివాసీ నేపథ్యం నుంచి పీఏ సంగ్మా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు కానీ, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న చన్నీ వంటి శక్తిసామర్థ్యాలు, దళిత నేపథ్యం కలిగిన నేతలు ఏ రాష్ట్రం లోనూ ఆ పార్టీలో ఆవిర్భవించలేదు. యూపీలో అఖిలేష్ యాదవ్, బిహార్‌లో తేజస్వీ యాదవ్ బీజేపీని బలంగా ఢీకొంటున్నారు. ఇలాంటి నేతలను ఎదగనిచ్చి ఉంటే కాంగ్రెస్‌లో కుటుంబ కేంద్రక రాజకీయాలు తగ్గుముఖం పట్టేవి. అయితే అధిష్ఠానం చుట్టూ తిష్ఠ వేసిన కోటరీకి ఢిల్లీ వెలుపల క్షేత్ర స్థాయిలో ప్రజలను కూడగట్టడం, సంఘటితం చేయడం వంటి పార్టీ నిర్మాణ కౌశలాలు ఏ కోశానా లేవు. ఈ కారణం వల్లే బీజేపీ అతిశక్తి మంతమైన పార్టీగా ఆవిర్భవించడమే గాకుండా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసింది. ఈ నేపథ్యం లోనే చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి యువ దళిత నాయకుడు కష్ట కాలంలో కాంగ్రెస్‌కి దారి చూపుతూ పంజాబ్ ముఖ్యమంత్రిగా రంగం మీదికి వచ్చారు. భూస్వామ్య ప్రభువు లాంటి అమరీందర్ సింగ్‌ను తోసిరాజనడమే కాకుండా, సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధూ వంటి దూకుడైన క్రికెట్ ప్లేయర్‌ను ఎదుర్కొని అగ్ర పదవిని చేపట్టారు. రాహుల్ గాంధీ నష్టం జరుగుతుందేమోనని అనుమానిస్తూనే, చన్నీని సీఎం స్థానంలో కూర్చుండబెట్టారు. అయితే చన్నీ అనతికాలంలోనే తానొక సమర్థనేతనని నిరూపించుకోవడమే కాదు... పంజాబ్ వంటి రాష్ట్రంలో ప్రధాని మోదీ అవలంబించే ముందస్తు ఎన్నికల జిత్తులను ఎదుర్కొనే సమయస్ఫూర్తి గల రాజకీయ నేతగా ముందుకొచ్చారు. చన్నీ విద్యాధికుడు. ఆయన లా, ఎంబీయే చదివారు. ప్రస్తుతం పీహెచ్డీ కూడా చేస్తున్నారు. జనవరి 5న ప్రధాని నరేంద్రమోదీ తన భద్రత విషయంపై గరిష్ఠ స్థాయిలో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తూ చన్నీపై నేరుగా దాడి చేశారు. ‘‘భటిండా విమానాశ్రయానికి నేను సజీవంగా తిరిగి వచ్చినందుకు మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపండి’’ అని మోదీ వ్యంగ్యంగా విమర్శించారు. కానీ చన్నీ ఎంత చురుగ్గా స్పందించా రంటే, ‘‘ఈరోజు ఫిరోజ్‌పూర్ జిల్లా నుంచి ప్రధాని మోదీ వెనక్కు వెళ్లవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. మా ప్రధానిని మేము గౌర విస్తాం’’ అంటూ తిప్పికొట్టారు. పైగా తన సహచరుడికి కోవిడ్ పాజిటివ్ రావడంతో తనతో సన్నిహితంగా ఉన్నందున, ప్రధానిని కలవలేకపోయానన్నారు. తన ప్రత్యర్థులను ఎలా తుదముట్టించాలో మోదీకి బాగా తెలుసు. కానీ గతంలో ఎవరూ చేయలేనట్లుగా దళితుడిగా ఉంటూనే ఈ వ్యవహారాన్ని దారిలోకి తెచ్చుకోగలనని చన్నీ బ్రహ్మాండంగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత కూడా పంజాబ్ ప్రభుత్వాన్ని రద్దు చేసే వైపుగా మోదీ, ఆయన బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది కానీ చన్నీ దృఢంగా నిలబడగలిగారు. ఆయన పంజాబీల ఆత్మగౌరవ సమస్యను లేవనెత్తారు. ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘకాలికంగా పంజాబ్ రైతులు చేసిన శాంతియుత నిరసన ప్రదర్శనలను, మోదీ పర్యటన సందర్భంగా రైతుల నిరసనను కూడా చన్నీ సమర్థించారు. ప్రధానికి ప్రాణాపాయం అంటూ బీజేపీ నేతలు చేసిన అతిశయ ప్రకటనలపై చన్నీ నిజంగానే నీళ్లు చల్లారు. దీనికోసం ఆయన సర్దార్ పటేల్ సూక్తిని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ‘‘కర్తవ్య నిర్వహణ కంటే తన జీవితం గురించి ఎక్కువ శ్రద్ధ వహించే వారు భారత్ వంటి దేశంలో పెద్ద పెద్ద బాధ్యతలు స్వీకరించకూడదు.’’ ఈ ఒక్క ట్వీట్ చన్నీని హీరోను చేసింది. ప్రధాని ఆరోజు బహిరంగ సభకు వెళ్లలేకపోవడం వాస్తవమే కానీ ఆయనపై ఏ హింసా త్మక దాడీ జరగలేదు. ‘నిజానికి ఆరోజు ప్రధానికి వ్యతిరేకంగా ఎవరూ నినాదాలు చేయలేదు, రాళ్లు విసరలేదు, కాల్పులు జరప లేదు, ఏమీ జరగలేదు. అయినా ఇలాంటి ముతక నాటకాలు ఎందుకు ఆడుతున్నా’రంటూ చన్నీ నిలదీశారు. ఒక యువ నేత ఇంత పెద్ద సమస్యను, దుష్ప్రచారాన్ని ఎదుర్కొని నిలబడాలంటే ఎంతో ధైర్య సాహసాలు కావాలి. ప్రధాని భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంపై ఎలాంటి ప్రకటనలూ చేయవద్దని ఢిల్లీ నాయకత్వం చన్నీని కోరిన నేపథ్యంలోనూ ఇంత పెద్ద పరిణామం జరిగింది. పంజాబ్‌లోనే కాకుండా దేశంలో కూడా చన్నీకి గుర్తింపు వచ్చేసింది. శూద్ర, దళిత, ఆదివాసీ మూలాలు కలిగిన ఇలాంటి తెగువ, చేవ ఉన్న విద్యాధిక నేతలను ప్రతి రాష్ట్రంలోనూ ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ఇప్పటికైనా గ్రహించాలి. అప్పుడు మాత్రమే ఈ వర్గాలనుంచి భవిష్యత్తులోనైనా ప్రధాని కాగలరు. చక్కటి ఆధునిక విద్య, పాలనానుభవంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ పని చేయగలిగిన వ్యక్తులను ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశ మివ్వాలి. వారి విద్య, కమ్యూనిటీ నేపథ్యం ఏదైనా, ఢిల్లీనుంచి రుద్దబడిన నాయకులు ఎవరూ ఎన్నికల్లో గెలుపొందలేరు. ప్రస్తుత కుల పరిస్థితులు, సంక్షేమం, ఓటర్ల చైతన్యం వంటివి ఢిల్లీలో అధిష్టాన వ్యవహార తీరుకు భిన్నంగా నడుస్తున్నాయి. పంజాబ్‌లో ముఖ్య మంత్రి పదవికి చన్నీని ఎంపిక చేయడమనేది కచ్చితంగా కొత్త మార్గాన్ని సూచిస్తోంది. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రజాకర్షణ, క్షేత్రస్థాయి పునాది కలిగిన ప్రాంతీయ నేతలను వరుసగా దూరం చేసుకున్నందుకే కాంగ్రెస్ ఇవాళ పతనావస్థను చవిచూస్తోంది. మమతా బెనర్జీ, వైఎస్ జగన్మోహన్రెడ్డితో మొదలైన ఈ పరిణామం ఇప్పుడు బలమైన ప్రాంతీయ నేతలు లేని దుఃస్థితికి కాంగ్రెస్‌ని నెట్టింది. ఈ నేపథ్యంలో దళిత నేపథ్యం కలిగిన చన్నీని పంజాబ్ ముఖ్యమంత్రిని చేయడం, ప్రధాని భద్రతా వివాదంలో చన్నీ హీరో కావడం– కాంగ్రెస్ కొత్త మార్గంలో పయ నించాలని సూచిస్తున్నాయి. శూద్ర, దళిత, ఆదివాసీ మూలాలు కలిగిన ఇలాంటి తెగువ, చేవ ఉన్న విద్యాధిక నేతలను ప్రతి రాష్ట్రంలోనూ ప్రోత్సహించా ల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ఇప్పటికైనా గ్రహించాలి. అధిష్ఠానం ఆశీస్సులు మాత్రమే ఉన్న నాయకులు ఓట్లను రాబట్టలేరని అర్థం చేసుకోవాలి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
అన్నదాత హక్కు గెలిచినట్లే...!
కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతులు సాధించిన అద్భుత విజయానికి మూలాలు గురునానక్ బోధనల్లో ఉన్నాయి. రైతుల హక్కుల కోసం సిక్కులు సాగిస్తున్న పోరాట సంప్రదాయాన్ని ఆరెస్సెస్, బీజేపీ చాలా తక్కువగా అంచనా వేశాయి. వ్యవసాయ రంగాన్ని మొత్తంగా భారత గుత్తపెట్టుబడిదారుల పరం చేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సిక్కులు గ్రహించలేరని వీరు భావించారు. కానీ, చరిత్రలో ఏ దశలో కంటే ఇప్పుడే పంజాబ్ రైతులు దేశాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ కాపాడారు. కేంద్ర ప్రభుత్వ అమేయ శక్తిని ఢీకొని వ్యవసాయ రంగాన్ని కాపాడిన సిక్కు రైతులకు జాతి మొత్తంగా సెల్యూట్ చేస్తోంది. పోరాడి గెలిచిన రైతులు మన స్కూళ్లు, కాలేజీ పుస్తకాల్లో శాశ్వతంగా ఉండిపోయే గొప్ప చరిత్రను లిఖింపజేసుకున్నారు. నవంబర్ 19న గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. తన ప్రభుత్వం ఏడాదిక్రితం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ సిక్కు రైతులు యుద్ధం ప్రకటించారు. లక్షలాది రైతులు ఢిల్లీ సరిహద్దులకు తరలివెళ్లారు. సంవత్సరం పైగా సాగిన ఈ ఆందోళనల క్రమంలో 750 మంది రైతులు ప్రాణత్యాగాలు చేశారు. ప్రభుత్వం వందలాదిమంది రైతులపై నానా రకాల కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టింది. సిక్కురైతుల్లోని మిలిటెంట్ విభాగం, నిరంకారీలు ఈ జనవరి 26న సాక్షాత్తూ ఎర్రకోటపైకి ఎక్కి విజయధ్వానం చేశారు. ఈ క్రమంలో పలువురు జర్నలిస్టులపై, రచయితలపై పలు కేసులు పెట్టారు, పోలీసులు ఉద్యమకారులను, ఇతరులను దారుణంగా హింసించారు. అయినా సరే ఆరెస్సెస్, దాని రాజకీయ పక్షమైన పాలక బీజేపీ ఏమాత్రం చలించలేదు. ఈ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు విస్తరించాయి. అదే సమయంలో రాకేష్ తికాయత్ నేతృత్వంలో సిక్కుయేతర భారీ రైతు ఉద్యమం మొదలైంది. యూపీలోని గ్రామాలు సైతం రైతుల ఉనికికోసం సాగిస్తున్న పోరాటంలో భారీఎత్తున పాల్గొన్నాయి. ఎట్టకేలకు విజయం సిద్ధించింది. ప్రధాని నరేంద్రమోదీ అన్నదాతల ముందు తలవంచి క్షమాపణ చెబుతూ సాగు చట్టాలను ఉపసంహరిం చుకుంటున్నట్లు చెప్పాల్సివచ్చింది. ఏదేమైనా, గురునానక్ నుంచీ, సిక్కు సమాజం నుంచీ హిందుత్వ శక్తులు నైతిక పాఠం నేర్వాల్సిన అవసరం ఉంది. ఆరెస్సెస్ తీసుకొచ్చిన మరో గురువు హెగ్డేవార్ బోధనలతో పోలిస్తే గురునానక్ బోధనలు పూర్తి భిన్నంగా ఉంటాయి. హిందూ వర్ణ ధర్మ సంస్కృతి, ముస్లిం పీడక పాలనతో కూడిన సంక్లిష్ట కాలంలో గురునానక్ తన ఆధ్యాత్మిక భావాలను వెలువరించారు. ఈయన 1469లో ఖాత్రిలో పట్వారీ కటుంబంలో పుట్టినప్పటికీ, మానవ మనుగడకు వ్యవసాయ ఉత్పత్తే ప్రాణాధారమని గుర్తిం చారు. ఈ ఉత్పాదక శ్రామికుల రూపకర్త దేవుడని గ్రహించారు. ఆయన దృష్టిలో దేవుడు యుద్ధ వీరుడు కాదు. జాతి అంటే మానవ సంకుచితత్వంలో ఇరుక్కుపోయిన నేల కాదని ఆయన భావన. ఈ భావనతోటే నానక్ అనుయాయులు శ్రమించే హస్తాలతోనే ప్రపంచం నలుమూలలకు విస్తరించారు. అక్కడి ఉత్పాదక క్షేత్రాల్లో పనిచేసి మనుగడ సాగించారు. వీరు భారతీయ వ్యవసాయాన్ని సానుకూల ఉత్పాదితంగా చేయడమే కాదు... కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇదే స్ఫూర్తితో వారు పనిచేశారు. తమ జాతీయవాదాన్ని ఇతరులకు వ్యతిరేకంగా సిక్కులు ఎన్నడూ ప్రోత్సహించలేదు ఆహారధాన్యాలను ఉత్పత్తిచేసే రైతులకోసం సిక్కులు సాగించే పోరాట సంప్రదాయాన్ని ఆరెస్సెస్, బీజేపీ చాలా తక్కువగా అంచనా వేశాయి. వ్యవసాయ ఉత్పత్తిని మొత్తంగా భారత గుత్త పెట్టుబడిదారుల పరం చేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సిక్కులు గ్రహించలేరని ఆరెస్సెస్, బీజేపీ పాలక శక్తులు భావించాయి. ప్రతిరంగంలోనూ అనైతిక ధనాన్ని కొల్లగొడుతూ ఆ రంగాల వెనుకబాటుతనాన్ని, బాధలను ఏమాత్రం పట్టించుకోకపోవడమే భారతీయ గుత్తపెట్టుబడి వర్గం లక్షణం. కేంద్రప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని కల్లోలంలో ముంచెత్తినప్పుడు పంజాబ్ రైతులు తమ హక్కుల కోసం పోరాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్రలో ఏ దశలో కంటే ఇప్పుడే పంజాబ్ రైతులు దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. భారతీయ వ్యవసాయాన్ని అణగదొక్కడానికి పార్లమెంటులో మంద మెజారిటీని దుర్వినియోగపర్చదలిచిన పాలకవర్గాన్ని పంజాబ్ రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పార్లమెంటరీ పంథానుంచే దేశం పక్కకు వెళ్లే ప్రమాదం ఉందని పంజాబ్ రైతులు చాలా త్వరగా గ్రహించారు. ఢిల్లీ స్థాయిలో అనేక సందర్భాల్లో రిజర్వేషన్ వ్యతిరేక ధోరణులు ప్రబలుతూ వచ్చిన విషయం తెలిసిందే. వీటిని నిరోధించే క్రమంలో, తమిళనాడు బీసీ వర్గాలు ఓబీసీల హక్కులకోసం నిత్యం పోరాడుతూ వచ్చాయి. అదేవిధంగా, పంజాబ్ రైతులు తమ వ్యావసాయిక హక్కులకోసం తుదికంటా పోరాడారు. ఇక దళిత హక్కుల విషయానికి వస్తే మహారాష్ట్ర దళిత శక్తులు దేశానికే దారి చూపాయి. గురునానక్, పెరి యార్ రామస్వామి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, బహుళ సంస్కృతిని పరిరక్షించే శక్తులను దేశంలో నిర్మిస్తూ వచ్చారు. కానీ ఈ ముగ్గురి భావాలను ఆమోదిస్తున్నట్లు పైకి నటిస్తూ ఆచరణలో సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో నడిచేటటువంటి సంస్థను ఆరెస్సెస్, హెగ్డేవార్ ఏర్పర్చారు. దేన్నయినా సరే వ్యతిరేకించే ఆధ్యాత్మిక, సామాజిక భావజాలాన్ని గురునానక్ సృష్టించలేదు. ఆరెస్సెస్‌కి చెందిన హెగ్డేవార్ మాత్రం ముస్లిం వ్యతిరేక, గొడ్డు మాంసం వ్యతిరేక భావజాలాన్ని, హిందూ ధర్మ పరంపర పేరుతో స్త్రీపురుష సమానత్వానికి వ్యతిరేకంగా నిలిచే సంస్థాగత నిర్మాణాలను ఏర్పర్చారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతులను, వ్యవసాయ ఉత్పత్తిని కైవసం చేసుకోవాలన్నదే హిందుత్వ శక్తుల ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పుడది ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వ అమేయ శక్తిని ఢీకొని భారతీయ వ్యవసాయ రంగాన్ని కాపాడిన సిక్కు రైతులకు జాతి మొత్తంగా సెల్యూట్ చేస్తోంది. భారతీయ సిక్కులకు మతం కేంద్రంగా ఉండే రాజకీయపార్టీ అకాలీదళ్ ఉంది. కానీ మనకు తెలిసినంత వరకు అది పంజాబ్‌లో నివసిస్తున్న ఏ ఇతర మతాల ప్రజలకూ వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అక్కడి ఏ ఇతర సామాజిక వర్గాల ఆహార హక్కుల్లోనూ అకాలీదళ్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. కేరళలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకున్న ఆరెస్సెస్, బీజేపీ లాగా, 12 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్న మహిళలను గురుద్వారాల్లోకి ప్రవేశించకుండా అకాలీదళ్ ఎన్నడూ అడ్డుకోలేదు. సమాజాన్ని విభజించడం కాకుండా, సమానత్వ ప్రాతిపదికన సమాజాన్ని స్థాపించడానికి ఆధ్యాత్మిక నైతికత అనేది రాజకీయాల ద్వారానే కదలాల్సి ఉంటుంది. అత్యంత నిరాశాపూరిత పరిస్థితులగుండా సాగిన రైతుల ఉద్యమం, వారి ఈ అద్భుత విజయం జాతికి నూతన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. రైతుల నిరవధిక పోరాటం చివరకు ఏమౌతుందని గత సంవత్సర కాలంగా మొత్తం ప్రపంచం వేచి చూస్తుండి పోయింది. రైతు ఉద్యమం తుది విజయం వరకు కొనసాగుతుందని ఎట్టకేలకు ఆరెస్సెస్ బీజేపీ కూటమికి అర్థమైపోయింది. ఢిల్లీలో సాగిన సిక్కు రైతుల ఉద్యమం వారు ఎంత శాంతికాముకులో ప్రపంచానికి చూపించింది. తమ గురుద్వారాల్లో ఆకలిగొన్న ప్రతి స్త్రీకీ, పురుషుడికీ వారు ఎలా తిండి పెడతారో, చివరకు తమను రోడ్లపై దారుణంగా కొట్టిన పోలీసులకు కూడా వారు ఎలా తిండి పెట్టారో ఈ ఉద్యమం ప్రపంచానికి విడమర్చి చూపింది. ఇది తమ గురువు గురునానక్ నుంచి వారు పొందిన కారుణ్య దృష్టి. ఏ మతమైనా సరే ఇతర మతాలను, ఇతర జీవన పద్ధతులనూ తప్పక గౌరవించాలని, భారతదేశంలో సిక్కు రైతులు ప్రదర్శించి చూపారు. మతం అంటే పొలాల్లో శ్రమ ద్వారా ఉత్పత్తిని పెంచడమే తప్ప మరే అర్థమూ దానికి లేదని సిక్కులు యావత్ ప్రపంచానికి ప్రదర్శించి చూపారు. హిందుత్వ శక్తులతోపాటు, భారతదేశంలోని ఇతర మతాలు అన్నీ సిక్కులు, వారి గురువుల నుంచి దీన్నే తప్పక నేర్చుకోవాలి. ఉత్పత్తి చేయని వారు ఆహార ఉత్పత్తిదారులపై తీర్పు చెప్పకూడదు. ఈ ఉద్యమంలో పోరాడి గెలిచిన రైతులు... మన స్కూళ్లు, కాలేజీ పుస్తకాల్లో శాశ్వతంగా ఉండిపోయే గొప్ప చరిత్రను తమ పేరిట లిఖింపజేసుకున్నారు. వ్యాసకర్త: కంచె ఐలయ్య షెపర్డ్, ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కుల జనగణనపై ఇంత వ్యతిరేకతా?
మెజారిటీ శూద్రులు కులాలవారీ జనగణనను కోరుకుంటుండగా, ద్విజులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఐఐటీ, ఐఐఎమ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి అత్యున్నత సంస్థలతోపాటు కేంద్రప్రభుత్వ పాలనావ్యవస్థ దాదాపుగా ద్విజుల అదుపులో ఉంటోంది. ఒకసారి కులాలవారీగా అధికారిక డేటా విడుదల చేశాక, దేశంలోని కీలకమైన పాలనా వ్యవస్థల్లో ఏ ఒక్కదానిలో కూడా తమకు ప్రాతినిధ్యం లేదని జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ఇతర కమ్యూనిటీలు కూడా గుర్తించే ప్రమాదముంది. జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో తమ ప్రాతినిధ్యం కోసం శూద్రకులాలు డిమాండ్ చేసే ప్రమాదం ఉంది కాబట్టే కులాలవారీగా జనగణనను అగ్రవర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. కులాలవారీ జనాభా గణన కోసం డిమాండ్ పుంజుకుంటోంది. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలూ దీనికి అంగీకరించాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే అంతర్గత వినియోగం కోసం కులాల వారీ డేటాను సేకరించి ఉన్నాయి. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కులపరమైన డేటాను సేకరించింది. ‘సమగ్ర కుటుంబ సర్వే’ అని పేరుపెట్టినప్పటికీ కులాలవారీగా ప్రజల సమగ్ర వివరాలను సేకరించింది. తెలంగాణలో పుట్టి, ఆ తర్వాత దేశవిదేశాల్లోని వలస ప్రాంతాల్లో పెరిగిన అనేకమంది పిల్లలను తెలంగాణ గ్రామాలకు తిరిగివచ్చి తమతమ పేర్లను నమోదు చేసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరి మరీ వెనక్కు పిలిపించారు. ‘తెలంగాణ ఆల్ ఫ్యామిలీ సెన్సెస్ 2014’ నాకు జీసస్ తల్లిదండ్రులైన జోసెఫ్, మేరీలు నజరత్ నుంచి బెతెల్హామ్ చేరుకుని స్వస్థలంలో తమ పేర్లు నమోదు చేయించుకున్న వైనాన్ని గుర్తు చేసింది. వ్యక్తులందరూ తమతమ పూర్వీకుల పట్టణాలకు రావాలన్న నాటి రాజాదేశాన్ని పాటించడానికి జోసెఫ్, మేరీలు బెతెల్హామ్కు ప్రయాణించి వచ్చారు. ఈ ఆదేశం జారీ చేసిన సమయంలో మేరీ... జీసస్‌కి జన్మ నివ్వడానికి గర్భధారణతో ఉండింది. కాబట్టి, బెతెల్హామ్లో ఒక గొర్రెల పాకలో జీసస్ జన్మించడానికి ఆనాడు నిర్వహించిన జనాభా గణనే కారణమైంది. మోజెస్ కాలం నుంచి వ్యక్తులను లెక్కించే చరిత్ర ఇజ్రాయెల్‌కి ఉండేది. హరప్పా వంటి మహత్తర నాగరికతను కలిగి ఉన్నప్పటికీ ప్రాచీన భారతదేశం వ్యక్తుల వారీగా జనాభాను లెక్కించే ఎలాంటి పద్ధతినీ కలిగి ఉండేది కాదు. మన చరిత్రలో తొలిసారిగా బ్రిటిష్ వలస ప్రభుత్వం తన సొంత పన్నుల వసూలు కోసం జనాభా లెక్కలను నిర్వహించింది. తొలి జనగణనను 1865 నుంచి 1872 మధ్య కాలంలో నిర్వహించారు. మొట్టమొదటి సమగ్ర జనగణన 1881లో జరిగింది. చాలావరకు బ్రాహ్మణులు జనగణనను, ప్రత్యేకించి కులాలవారీ జనగణన అనే భావనను తొలినుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. అతి చిన్న మైనారిటీగా ఉండే ద్విజులు (బ్రాహ్మణులు, బనియాలు, క్షత్రియులు, కాయస్థులు, ఖాత్రీలు) సంస్కృతం, పర్షియన్, ఇంగ్లిష్ భాషలు నేర్చుకున్న విద్యావంతులుగా ఉండేవారు. దేశంలో తాము అతి చిన్న మైనారిటీ అనే వాస్తవం ప్రపంచానికి తెలీకూడదనే వారు కోరుకున్నారు. ఈ మేధావి వర్గమే మండల్ రిజర్వేషన్ల అమలును, కుల గణనను వ్యతిరేకించింది. భాను ప్రతాప్ మెహతా వంటి పలువురు ఉదారవాద మేధావులు కులాలవారీ జనగణనకు వ్యతిరేకంగా బలంగా వాదించారు. మండల్ ఉద్యమ కాలంలో కూడా వీరిలో చాలామంది కులం అనేది బ్రిటిష్ వారి సృష్టి అని వాదించేంతవరకు వెళ్లారు. వామపక్షం, ఉదారవాదులు, ఛాందసవాదులు... ఇలా భావజాలాలతో పనిలేకుండా, ఈ మేధావులందరూ కులవ్యవస్థను బ్రిటిష్ వలసవాదులు సృష్టించారని వాదించారు. వేదాలను సృష్టించిన క్రమంలో, కౌటిల్యుడి అర్థశాస్త్రం, మనుధర్మశాస్త్రం రచించిన క్రమంలో వర్ణ కుల విభజన ఉనికిలోకి వచ్చిన వైనాన్ని వీరు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అనేక జాతీయ వాద పండితులు మనుస్మృతిని గొప్ప ప్రాచీన న్యాయ స్మృతిగా ప్రశంసించేవరకు వెళ్లారు. భారతీయ కమ్యూనిస్టు చింతనాపరులు సైతం ఈ వాదంలో కొట్టుకుపోయారు. అంబేడ్కర్ అనేక రంగాల్లో ద్విజ మేధావులను సవాలు చేసేంతవరకు... కులంపై, భారతీయ నాగరికతపై వ్యతిరేక దృక్పథాన్ని ప్రతిపాదించేవారు శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజలకు లేకుండా పోయారు. 1931 తర్వాత కులవారీ గణనను జనాభా లెక్కలనుంచి ఉపసంహరించారు. ప్రపంచ యుద్ధం, 1951 వరకు భారతదేశంలో దుర్భిక్ష పరిస్థితులే దీనికి కారణం. నెహ్రూ, ఆయన ఏర్పర్చుకున్న మేధావుల బృందం సైతం కులాలవారీ జన గణన చేపట్టాలని కోరుకోలేదు. కులసంబంధిత గాయాలను కులాలవారీ గణన కొత్తగా రేపుతుందనే అర్థరహితమైన సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వచ్చాయి. కులాల వారీ జనగణన, ఓబీసీ రిజర్వేషన్ పై నెహ్రూ కూడా వీటి ప్రభావానికి లోనయ్యారని పిస్తుంది. నెహ్రూ స్వయంగా కులవారీ జనగణనను వ్యతిరేకించినప్పుడు, 1951లో నెహ్రూ మంత్రివర్గంలోని అంబేడ్కర్ సైతం ఏమీ చేయలేకపోయారు. పీసీ జోషి, శ్రీపాద్ డాంగే, బీటీ రణదివే వంటి కమ్యూనిస్టు ద్విజ మేధావులతోపాటు వామపక్షానికి చెందిన బెంగాలీ భద్రలోక్ నెహ్రూవియన్ల అభిప్రాయాలతో ఏకీభవించినట్లే కనిపించింది. ఏదేమైనా ఈ దృక్పథం హెగ్డేవార్, గోల్వాల్కర్ వంటి హిందుత్వ మేధావులకు ఆమోదనీయమైందని గ్రహించాలి. బ్రిటిష్ వారు దేశాన్ని వీడి వెళ్లిపోగానే, దేశంలోని మొత్తం మేధో, పాలనా, రాజకీయ నిర్మాణాలు ద్విజ మేధావుల చేతుల్లోకి వచ్చేశాయి. అత్యున్నత పాలనా వ్యవస్థలో శూద్ర, దళిత, ఆదివాసీ మేధావులు కానీ, చైతన్యవంతమైన రాజకీయ శక్తులు కానీ లేకుండా పోయారు. అదే సమయంలో తమను ప్రత్యేక వర్గాల కింద గణించే హక్కును దళితులు, ముస్లింలు పొందడంతో అంబేడ్కర్ పెద్దగా ఈ అంశంపై పోరాడలేకపోయారు. సూత్రరీత్యా దళిత రిజర్వేషన్లు 1947లోనే ఉనికిలోకి వచ్చాయి. దేశ విభజన సమస్యల కారణంగా నెహ్రూ పాలనా యంత్రాంగం ముస్లింలను మైనారిటీలుగా గణించడాన్ని కొనసాగించడం ద్వారా వారిని సంతృప్తి పరిచింది. దాంతోపాటు అగ్రశ్రేణి విద్యావంత ముస్లిం మేధావులను పాలనా యంత్రాంగంలో చేర్చుకున్నారు. కానీ శూద్ర ఓబీసీలకు కులవారీ జనగణన కోసం లేదా రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు ఒక లాబీ అంటూ లేకుండా పోయింది. మెజారిటీ శూద్రులు కులవారీ జనగణనను కోరుకుంటుండగా, ద్విజులు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి అత్యున్నత సంస్థలలోని పాలనా యంత్రాంగ నిర్మాణాలు మొత్తంగా తమ నియంత్రణలోనే ఉన్నాయని ద్విజులకు తెలుసు. మన రాయబార కార్యాలయాలతో సహా ఢిల్లీ పాలనాయంత్రాంగం కూడా వాస్తవంగా ద్విజుల అదుపులో ఉంటోంది. ఒకసారి కులాలవారీగా అధికారిక డేటా విడుదల చేశాక, ఢిల్లీ నుంచి దేశాన్ని పాలిస్తున్న కీలకమైన పాలనా వ్యవస్థల్లో ఏ ఒక్కదానిలో కూడా తమకూ ప్రాతినిధ్యం లేదని జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మహిస్యాలు (పశ్చిమ బెంగాల్), ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ఇతర కమ్యూనిటీలు కూడా గుర్తించే ప్రమాదముంది. కులాలవారీగా జనాభా గణన భారతదేశంలో ప్రజాస్వామ్య భావనను మౌలికంగానే మార్చివేస్తుంది. పార్టీ భేదాలకు అతీతంగా బిహార్ ప్రాంతీయ నేతలు ప్రధాని నరేంద్రమోదీని ఇటీవలే కలిసి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే తలపెట్టిన కులప్రాతిపదిక డేటా సేకరణను నమూనాగా తీసుకుని కులాలవారీ జనగణన చేపట్టాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్, కర్ణాటకలో సిద్ధరామయ్య కులాల ప్రాతిపదికన తమవైన సంక్షేమ పథకాల ఎజెండా కోసం ఆ డేటాను ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు తెలంగాణలోనే ఒకటో, రెండవ అతిపెద్ద కమ్యూనిటీలైన గొల్ల–కురుమలు, ముదిరాజుల అసలు సంఖ్యను కేసీఆర్ గుర్తించి, సాంప్రదాయికంగా గొర్రెలకాపరులైన గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ, చేపల వేటను వృత్తిగా కలగిన ముదిరాజుల కోసం మత్స్య పరిశ్రమాభివద్ధి పథకాన్ని ప్రారంభించారు. ప్రతిఫలంగా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వీరి ఓట్లను కొల్లగొట్టారు. ప్రాంతీయ పార్టీలకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇక ప్రజానీకం కులాలవారీగా జనాభా గణన వల్ల తమదైన ప్రయోజనాలను పొందుతోంది. మరోవైపున బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల వంటి జాతీయ పార్టీలు... తమను కులాలుగా గణించడాన్ని వ్యతిరేకిస్తున్న తమవైన ద్విజుల నెట్వర్క్పట్ల ఎంతో జాగరూకతతో ఉంటున్నాయి. ఇదే భవిష్యత్తులో అతిపెద్ద వైరుధ్యంగా మారబోతోంది. -ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కేబినెట్ పొందికపై ఇంత చర్చా?
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయడం తెలిసిందే. కొత్తగా 27 మంది ఓబీసీలు, 12 మంది దళితులు, 8 మంది ఆదివాసీలకు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మొత్తం మీద తాజాగా కేంద్ర మంత్రిమండలిలో 47 మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు చోటు లభించింది. ఈ 47 మందిలో ప్రధాని కూడా ఉన్నారో లేదో నాకు తెలీదు. కానీ, కేబినెట్లో కొత్తగా చేరిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల గురించి జాతీయ మీడియా పదేపదే ప్రస్తావించింది. మరోవైపున రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, హర్షవర్ధన్‌ల రాజీనామాలపై ఇదే మీడియా తెగ బాధపడిపోయింది. ఈ ముగ్గురినీ కేబినెట్ లోంచి తొలగించడాన్ని మన మీడియా ఏమాత్రం జీర్ణం చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు వీరి కులం తప్పనిసరిగా పరిగణించాల్సిన చిహ్నంగా మారిపోయింది. అయితే మోదీ మంత్రివర్గంలోంచి వైదొలిగిన ముగ్గురు ప్రతిభావంతులైన మంత్రుల కుల నేపథ్యం గురించి ఒక్కసారైనా మన మీడియా పేర్కొనలేదు. ఎన్నటికీ పేర్కొనదు కూడా. రవిశంకర్ ప్రసాద్ కాయస్థుడు, ప్రకాష్ జవదేకర్ బ్రాహ్మణుడు, హర్షవర్ధన్ వైశ్యుడు. రవిశంకర్, జవదేకర్ రాజ్యసభ సభ్యత్వం ద్వారానే మంత్రివర్గంలో ప్రవేశించారు. సాధారణంగా జాతీయ మీడియా జాట్, గుజ్జర్, పటేల్, మరాఠా, రెడ్డి (తెలంగాణ నుంచి జి. కిషన్‌రెడ్డి కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించిన ఏకైక రెడ్డి అని గుర్తుంచుకోవాలి), కమ్మ, కాపు, లింగాయత్, వొక్కలిగ, నాయర్, నాయికర్లు, మహిస్యా (బెంగాల్ నుంచి) తదితర పలు కులాలకు చెందినవారిని ఓబీసీ కేటగిరీలో చేరుస్తుంటుంది. అయితే శూద్ర ఓబీసీలు (రిజర్వుడ్, రిజర్వుడ్ కాని వారు కూడా), ఎస్సీలు, ఎస్టీలు కలిసి భారత జనాభాలో 77 శాతంగా ఉన్నారని మనం మర్చిపోకూడదు. వీరిలో 52.2 శాతం మంది ఓబీసీలు (1980 నాటి మండల్ కమిషన్ నివేదిక ప్రకారం) కాగా, 16.2 శాతం మంది ఎస్సీలు, 8.2 శాతం మంది ఎస్టీలు (2001 జనాభా లెక్కల ప్రకారం) ఉంటున్నారు. వీరినుంచి కేంద్ర మంత్రిమండలిలో సగం కంటే ఎక్కువమందికి మంత్రిపదవులు లభిస్తే.. ఇది కూడా ఎందుకింత ప్రతికూల వార్తగా మారిపోతోంది? రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీలోనూ... విదేశాల్లో చదువుకుని వచ్చి (ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వాలాలు) చేరినవారు ఎవరూ ఒక ఎన్నికలోనూ నేరుగా గెలవలేదు. రాజ్యసభ ద్వారానే వీరు ప్రభుత్వంలో భాగమవుతూ వచ్చారు. కానీ మన జాతీయ మీడియా మాత్రం ఇలాంటివారిని మాత్రమే నిజమైన ప్రజాస్వామ్య ప్రతినిధులుగా పేర్కొంటూ వచ్చింది. కానీ ప్రజాస్వామ్యం పునాది ఏదంటే క్షేత్ర స్థాయి ఎన్నికలే. వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను 1990లో అమలు చేసినప్పుడు మోదీతోసహా ఓబీసీలు బీజేపీలో భాగంగా ఉండేవారు. వీరు మండల్ కమిషన్ జాతి వ్యతిరేక ఎజెండాను కలిగి ఉన్నదని ఆలోచించారు. కానీ ఇది గ్రామీణ వ్యవసాయ, హస్తకళల కమ్యూనిటీల్లో భారీ స్థాయిలో అధికారిక చైతన్యాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ తన ఓబీసీ కార్డును చక్కగా ఉపయోగించుకుని దేశ ప్రధాని కాగలిగారు. కానీ ఓబీసీ, దళిత, ఆదివాసీలకు చోటు లేనిచోట, రాజ్యసభ ద్వారా అధికారాన్ని సాధించుకోవడం కుతంత్రపు రాజకీయాలకు ఒక మార్గంలా మారిపోయింది. మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా, ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ 20 ఏళ్లపాటు పార్లమెంటులో కొనసాగారు. మేధోవర్గానికి చెందినవారిగా పేరొందిన పి. చిదంబరం (కొన్నిసార్లు ఎన్నికల్లో గెల్చినప్పటికీ), జైరాం రమేష్, తదితరుల చరిత్ర కూడా ఇలాంటిదే. రవి శంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో హీరోలుగా వెలిగిపోయారు. కాగా వీరికోవకే చెందిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇంగ్లిష్ ప్రెస్‌కి మిత్రులైన బీజేపీ క్యాంప్‌కి చెందిన అరుణ్ జైట్లీ, ప్రమోద్ మహాజన్, అరుణ్ శౌరీలు కూడా ఎన్నడూ ఎన్నికల్లో గెలవలేదు. కానీ రాజ్యసభ ద్వారానే వీరు అగ్రశ్రేణి మంత్రులై ప్రముఖ నేతలుగా మారిపోయారు. అదే సమయంలో శూద్ర, దళిత, ఆదివాసీ నేతలకు ఇలాంటి భాగ్యం ఎన్నడూ సిద్ధించలేదు. అయితే, కేంద్ర మంత్రివర్గంలో చేరిన ఈ 47 మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు చాలావరకు క్షేత్రస్థాయి ఎన్నికల్లోనే గెలుపొందుతూ వచ్చారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏ పార్టీ పాలనలో అయినా సరే ప్రచ్ఛన్న మేధోతత్వంతో రాజ్యసభ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో భాగం కావడం ప్రజాస్వామిక పద్ధతి కానేకాదు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్లను నిర్దాక్షిణ్యంగా మంత్రివర్గం నుంచి తొలగించడం ద్వారానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మంత్రులకు అవకాశం దొరికిందని మీడియా తెగ బాధపడిపోతోంది. ఇది ప్రతిభకు అన్యాయం చేయడమేనని మన జాతీయ మీడియా భావిస్తోంది. మన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇంగ్లిష్ మాట్లాడే మేధావితనం అనే కదా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని వచ్చిన శూద్రులకు, ఎస్సీ, ఎస్టీలకు అలాంటి అవకాశాన్ని తోసిపుచ్చడం కూడా ప్రజాస్వామ్యమే. వీరిలో చాలామంది పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదువుతుంటారు. అలాంటప్పుడు ఎన్నికల వ్యవస్థనే రద్దు చేస్తే సరిపోతుంది కదా. మనం ఇప్పుడు అస్తిత్వాల యుగంలో నివసిస్తున్నాం. వివిధ ప్రజా బృందాలు తమదైన దార్శనికత, సమర్థతతో ప్రజాస్వామ్య పాలనలో భాగం కావాలనే తమ హక్కును ఇప్పుడు నొక్కి చెబుతూ వస్తున్నాయి. విభిన్న సెక్షన్ల ప్రజానీకం ఇప్పుడు ‘సమర్థత’ను విభిన్న అర్థాలతో చూస్తోంది. కమ్యూనిటీ అస్తిత్వాలు అధికారం కోసం మన పాలనకు సంబంధించిన చర్చల బల్లపైకి నిరంతరం తోసుకువస్తూనే ఉంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు చాలా కాలంగా కుల, కమ్యూనిటీ అస్తిత్వాలను తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తూ వచ్చాయి. కానీ భవిష్యత్తులో ఈ వ్యూహం పనిచేయదు. కులాన్ని ఒక అస్తిత్వ చిహ్నంగా గుర్తించని కారణంగానే కమ్యూనిస్టు పార్టీలు మన దేశంలో రానురానూ అడుగంటిపోతున్నాయి. భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఏకైక మార్గం ఏదంటే, ఇన్ని సంవత్సరాలుగా ఢిల్లీ అధికార కేంద్రాల్లో పక్కకు నెట్టివేయబడిన పై కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం కల్పించడమే. కులం కీలకమైన సామాజిక ఆర్గనైజర్‌గా ఉంటున్న దేశంలో, సెక్యులర్ ఉదారవాదం అనేది ద్విజ, ఇంగ్లిష్ విద్యావంతులైన కులీనుల చేతిలో అధికారం దుర్వినియోగం కావడంగానే మిగిలిపోయింది. పీడిత కులాలు తమ ఓట్లకున్న అధికార బలం పట్ల చైతన్యవంతంగా ఉంటున్నారని ఆరెస్సెస్, బీజేపీలు ఇప్పుడు గుర్తిస్తున్నాయి. అధికార చట్రంలో తమ ప్రతినిధులకు చోటు లేకపోతే వీరు మరో దారి చూసుకుంటారు కూడా. కాంగ్రెస్‌లో మాత్రం అధికారమనేది ఎప్పుడూ దిగుమతైన మేథావుల చేతుల్లోనే ఉంటూ వచ్చింది కాబట్టి కుల విశ్లేషణను ఎన్నడూ తీవ్రంగా తీసుకోలేదు. వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులను కుల అస్తిత్వం ప్రాతిపదికన మాత్రమే పాలనా వ్యవస్థల్లోకి తీసుకురావాలని నేను సూచించడం లేదు. దళిత బానిసలను పాలనలో, ప్రభుత్వంలో లాంఛనప్రాయంగా చొప్పించడాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ మండల్ అనంతర కాలం... విద్యావంతులైన దళిత, ఆదివాసీ, ఓబీసీ నేతలను, మేధావులను రూపొందిస్తూ వచ్చింది. గతకాలం మహానేతల ఘనతను మాత్రమే భవిష్యత్తు ఇకపై కీర్తించదు. ఇప్పుడు యువ గళాలు మార్పును నిజంగానే తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాయని అందరూ గుర్తించాల్సి ఉంది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య, షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఉత్తరాది శూద్రులలో వినూత్న మార్పు
ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన జాట్లు హరిత విప్లవ ప్రధాన ఏజెంట్లుగా అవతరించారు కానీ పారిశ్రామికవేత్తలు కాలేకపోయారు. ఉత్తరాది శూద్రకులాలు చాలావరకు భారీగా వృద్ధిచెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనుంచి ప్రయోజనాలు పొందలేకపోయాయి. సంఘటితమైన, ఆధునిక విద్యా కృషి లోపించిన కారణంగానే ఢిల్లీలోని అత్యున్నత స్థానాల్లో తమకు ఎలాంటి వాటా లేదని, ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ ఆధికార వ్యవస్థలను నిర్వహిస్తున్న జాట్లు, గుజ్జర్లు అర్థం చేసుకున్నారు. భారీస్థాయి ప్రయివేటీకరణ ఎజెండా ముఖ్య ఉద్దేశం ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు కేటాయిస్తూ వస్తున్న ఉద్యోగాలను తీసివేయడమేనని రైతునేత టికాయత్ స్పష్టంగా గుర్తించినట్లుంది. ఇది ఉత్తరాది శూద్రుల్లో వినూత్న మార్పునకు చిహ్నం. ‘ది శూద్రాస్–విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకాన్ని ఉత్తర భారతీయ రైతునేత రాకేష్ టికాయిత్ తన రెండుచేతులతో గుండెకు హత్తుకుని కనిపించిన దృశ్యం భారతీయ, ప్రత్యేకించి ఉత్తర భారత వ్యవసాయ కుల సామాజిక, రాజకీయ చైతన్యంలో ఒక కొత్త మార్పును సూచిస్తోంది. మండల్ రాజ కీయ మేధోమథనం అనంతరం ఉత్తర భారతీయ శూద్రులు.. ప్రత్యేకించి జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు మితవాద మానవ శక్తికి, ఓటు శక్తికి వెన్నెముకగా మారారు. జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మరాఠాలు తదితర శూద్రులందరినీ ఇతర వెనుకబడిన వర్గాలుగా మండల్ కమిషన్ నివేదిక నిర్వచించింది. తద్వారా శూద్ర అనే చారిత్రక వర్గీకరణను రాజ్యాంగ వర్గీకరణగా మార్చివేసింది. ఆధునిక విద్యకు దూరమవడం ఓ శాపం కానీ ఇతర ఆధిపత్య వ్యవసాయ కులాలు ప్రత్యేకించి ఢిల్లీ చుట్టుపట్ల ఉంటున్న జాట్లు, గుజ్జర్లు ఓబీసీ కేటగిరీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కారణం ఓబీసీలు సామాజిక ఉన్నతి వైపు కాకుండా అధోగతి వైపు పయనిస్తున్నట్లు వీరు భావించారు. 1990ల ప్రారంభంలో వ్యవసాయ కమ్యూనిటీలకు చెందిన గ్రామీణ మేధావులు తమకు క్షత్రియ ప్రతిపత్తిని కోరుకున్నారు.. ఎందుకంటే క్షత్రియులు చారిత్రకంగా పాలకులుగా ఉండేవారు. అయితే ఒక్కో శూద్ర కులం నుంచి మేధో వర్గాన్ని ఉత్పత్తి చేస్తున్న రిజర్వేషన్ల పాత్రను వీరు అర్థం చేసుకోలేకపోయారు. యూనివర్సిటీ, కాలేజీ విద్య అందులోనూ ఇంగ్లిష్ మాధ్యమంలో కొనసాగే విద్య, ఉన్నతాధికార బలం కలిసిన ఫలితం గణనీయమైన సంఖ్యలో గుజ్జర్లు, జాట్ల హస్తగతం అవుతూ వచ్చింది. ఒక్కో కులంలోని నూతన ఇంగ్లిష్ విద్యాధిక వర్గం ఢిల్లీ అధికార వ్యవస్థను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను పోషించడమే కాకుండా, దళితులు, ఇతర మైనారిటీల పట్ల వారి వైఖరిని కూడా మార్చేసింది. తమకున్న బలమైన వ్యవసాయ పునాది అధికారాన్ని, జ్ఞానాన్ని తమకు కట్టబెడుతుందని, ఆవిధంగా క్షత్రియ ప్రతిపత్తిని తాము సాధించవచ్చని జాట్లు భావించారు. ఆవిధంగా తమ పునాది తనంతటతానుగా జాతీయ స్థాయిలో రాజకీయాధికారాన్ని తమకు కట్టబెడుతుందని వారు తలిచారు. కానీ వారి అంచనా పూర్తిగా తప్పని రుజువైపోయింది. ఉన్నత విద్యాలయాల్లోనూ స్థానం కరువే జాట్లు, గుజ్జర్లు వంటి రిజర్వేషన్ పరిధిలో లేని శూద్రకులాలు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో కీలక పాత్ర పోషించగలిగే స్థాయి మేధావులను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ కులాలు జాతీయ, అంతర్జాతీయ దార్శనికతతో కూడిన రాజకీయ నేతలను ఉత్పత్తి చేయలేకపోయాయి. దీనికి ముఖ్యమైన కారణం ఉంది. ద్విజులలాగా జాట్లు, గుజ్జర్లు ఇంగ్లిష్ విద్యాధిక మేధావులను రూపొందించలేకపోయారు. ఇప్పుడు, అధికార చట్రాల్లో జాట్, గుజ్జర్ లేక ఇతర శూద్ర వ్యవసాయ కులాల పాత్ర పెద్దగా లేకుండానే ఢిల్లీ పాలనా యంత్రాంగాలను మితవాద శక్తులు నిర్వహిస్తూండటంతో ఒక సరికొత్త జాగరూకత ఏర్పడింది. విషాదకరమైన విషయం ఏమిటంటే ఆలిగర్, జామియా మిలియా ఇస్లామియా వంటి ముస్లిం మైనారిటీలు నిర్వహిస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సైతం శూద్ర ఫ్యాకల్టీ సభ్యులు చాలా పరిమితంగా ఉండటమే. శూద్రుల్లో పారిశ్రామికవేత్తలు శూన్యం మైనారిటీ వ్యతిరేక ఎజెండా కోసం శూద్రులను ఉపయోగించుకుంటూ వచ్చారు తప్పితే జాతీయ స్థాయి వ్యవస్థల్లో అధికారాన్ని పంచుకోవడానికి కొద్దిపాటి శూద్ర మేధావులను కూడా అనుమతించకుండా వచ్చారు. ద్విజులు అధికారంలోకి వచ్చాక శూద్రులను మరింతగా వెనక్కి నెట్టేస్తూ వచ్చారు. ఈ రచయిత సంపాదకత్వంలో వచ్చిన ‘ది శూద్రాస్ –విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ పుస్తకం.. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రిలు, క్షత్రియులను ద్విజులుగా నిర్వచించింది. ఈ కులాల్లో ఎవరికీ ఆహారధాన్యాలు లేక ఇతర వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో ఎలాంటి పాత్రా లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన జాట్లు హరిత విప్లవ ప్రధాన ఏజెం ట్లుగా అవతరించారు. కానీ వీరు పారిశ్రామికవేత్తలు కాలేకపోయారు. ఈ పుస్తకంలోని క్యాస్ట్ అండ్ పొలిటికల్ ఎకానమీ అనే అధ్యాయంలో, శూద్ర టీమ్ అధ్యయనం అత్యంత స్పష్టంగా చిత్రించినట్లుగా, దేశంలోని శూద్రకులాలు చాలావరకు భారీగా వృద్ధిచెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనుంచి ప్రయోజనాలు పొందలేకపోయారు. సంఘటితమైన, ఆధునిక విద్యా కృషి లోపించిన కారణంగానే ఢిల్లీలోని అత్యున్నత స్థానాల్లో తమకు ఎలాంటి వాటా లేదని, ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ ఆధికార వ్యవస్థలను నిర్వహిస్తున్న జాట్లు, గుజ్జర్లు అర్థం చేసుకున్నారు. చివరకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా జాట్లకు తగినంత ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ద్విజుల ఆధిపత్యంపై పోరాడేందుకు వీరికి శూద్ర అస్తిత్వం ఒక కొత్త మార్గాన్ని అందిస్తుంది. ఇక్కడే ఈ పుస్తకం ప్రాధాన్యతను రైతు నేత రాకేష్ టికాయత్ గుర్తించినట్లు కనబడుతోంది. రిజర్వేషన్ అనుకూల వైఖరి సరికొత్త మార్పు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం చివరలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో జాట్లు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. భారీస్థాయి ప్రయివేటీకరణ ఎజెండా ముఖ్య ఉద్దేశం ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు కేటాయిస్తూ వస్తున్న ఉద్యోగాలను తీసివేయడమే (డీ–రిజర్వ్)నని రైతునేత టికాయత్ స్పష్టంగా గుర్తించినట్లుంది. అందుకే జాట్ ప్రజలు తమ కులాన్ని కూడా రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని ఇప్పుడు బలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఆధిపత్యస్థానంలో ఉన్న మితవాద శక్తులు రిజర్వేషన్ వ్యవస్థనే తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. గుండెకు హత్తుకున్న శూద్ర చైతన్యం ఈ పుస్తకం దేశంలోని శూద్రులందరిలో తీవ్రమైన చర్చను ప్రేరేపిస్తోంది. వీరందరూ తమ శూద్రమూలాలను ఇకనుంచీ హుందాతో, గౌరవంతో స్వీకరించక తప్పదు. ‘ది శూద్రాస్–విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకాన్ని రైతు నేత రాకేష్ టికాయిత్ తన రెండుచేతులతో గుండెకు హత్తుకుని కనిపిస్తున్న దృశ్యం ఉత్తర భారతీయ శూద్రులలో ఒక నూతన మానసికస్థితిని సూచిస్తోంది. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఆందోళనజీవులంటే ఇంత కంపరమా?
తాను స్వయంగా ఓబీసీల నుంచే వచ్చానని చెప్పుకుంటున్న ప్రధాని ఇప్పుడు దేశంలోని రైతులను ఆందోళనజీవులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. వీరి నుంచి దేశాన్ని కాపాడాలంటున్నారు. ఆహార ఉత్పత్తిదారులు లేని దేశం గతేంటి? ప్రధానే స్వయంగా రైతుల్ని జాతివ్యతిరేకులని ముద్రిస్తున్నప్పుడు జైకిసాన్కు అర్థమేంటి? దేశంలో ప్రధాన ఆహార ఉత్పత్తిదారులుగా ఉన్న శూద్ర ఓబీసీలు, కరోనా కాలంలోనూ దేశానికి తిండిపెట్టిన ఓబీసీలు ఈ విషయాన్ని తప్పక గుర్తించాలి. అలాగే తాము మద్దతిస్తున్న రాజకీయ పార్టీల స్వభావం ఏంటో తాము మద్దతిస్తున్న పార్టీలు తమకు ఎలాంటి స్థాయిని ఇస్తున్నాయో తప్పకుండా ఆలోచించుకోవాలి. దేశ చరిత్రలో తొలి ఓబీసీ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ ఆందోళనజీవులను గుర్తించి జాతిని కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భారతీయులకు ఆహార ధాన్యాలను పండించి ఇచ్చే ఏకైక సామాజిక శక్తి అయిన రైతులను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. ఇంతకూ రైతులు చేసిందల్లా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడమే. ఆందోళన అనే భావనకు రెండు అర్థాలున్నాయి. ఒకటి చింత మరొకటి నిరసన లేక ఆందోళన. తెలుగులో ఈ పదాన్ని గ్రామస్తులందరూ చింతలను వర్ణించే సందర్భంలో ఉపయోగిస్తుంటారు. అదొక పెద్ద ఆందోళన అని వారు అన్నారంటే చాలా కలవరం కలిగించే అంశమని అర్థం. తరచుగా మాత్రమే దీన్ని నిరసన లేక ఆందోళన అనే అర్థంలో వాడుతుంటారు. విషాదకరమైన అంశం ఏమిటంటే, భారతీయ వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తిలో పాల్గొనే శ్రామిక ప్రజారాసులు తమ రోజువారీ జీవితంలో నిత్యం ఆందోళనకు గురవుతూనే ఉంటారు. ప్రత్యేకించి రైతులు.. అనేక కారణాలతో ప్రతిరోజూ కలవరపడుతూనే ఉంటారు. మొట్టమొదటిగా కుల వ్యవస్థ రైతుల జీవితాల గురించి కలతపడేలా చేస్తుంటుంది. బ్రాహ్మణవాద భావజాలంలో వ్యవసాయ ఉత్పత్తికి పవిత్రమైన లేక ఉన్నత స్థాయిని ఇవ్వలేదు. రెండోది, భారతీయ తత్వశాస్త్రం అని వారు చెబుతున్న దానిలో వ్యవసాయానికి చారిత్రకంగానే అత్యంత నిమ్న దృష్టితో చూస్తూవచ్చారు. చారిత్రకంగానే కాదు.. ఇప్పుడు సైతం భారతీయ ఆహార ఉత్పత్తిదారులు ప్రధానంగా శూద్రులు, దళితులు, ఆదివాసులే. అయితే పశువులు, ఇతర వ్యవసాయ వనరులు వంటి ఆర్థిక సంపదలను ఉన్నత శూద్ర కులాల వారి యాజమాన్యంలో ఉంటున్నాయి కాబట్టి వీరే ఉత్పత్తిలో కీలక సామాజిక శక్తిగా గుర్తింపు పొందుతున్నారు. మన దేశంలో ఆహార ఉత్పత్తి దారులు శూద్రులు, దళితులు, ఆది వాసీలేనని ప్రధాని మోదీకి తెలుసు. ఆధిపత్య కులాలలో దాదాపుగా ఎవరూ భూమిని దున్నడం, పశువులను మేపడం వంటి పనుల్లో కనిపించరు. వీరు రైతులలాగా ఆందోళన జీవులు కారు. ఎందుకంటే వీరి ప్రాధమ్యాలు వేరు. వీరు చాలావరకు నగరీకరణ చెందిన మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గానికి చెంది ఉన్నారు. వీరితో పోలిస్తే రైతులు నిత్యం కలవరపడుతూనే ఉంటారు. ఉత్పత్తి చేయని వ్యతిరేక వర్గంలో ఉంటూ, తమ పౌర, ఆధ్యాత్మిక, ఆర్థిక జీవనాన్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండేవారి వల్లే రైతులు నిత్య ఆందోళనతో గడుపుతుంటారు. ఒక ఓబీసీ తరగతికి చెందినవాడిగా మోదీ శూద్ర ఆహార ఉత్పత్తి దారుల ఈ ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకోవాల్సి ఉండింది. రైతుల్లో నిత్యం ఏర్పడుతున్న చింతలు, కలవరపాటే వారిని ఆందోళనా కార్యకలాపాలకు కొన్ని సార్లు ఆత్మహత్యలకు పాల్పడటానికి దారి తీస్తుం టాయి. ప్రధాని ఈ తరహా ఆందోళనను పట్టుకునే ఆందోళనజీవులు అని పదప్రయోగం చేశారు. ప్రాథమికమైన ఆహార ఉత్పత్తిలో ఎన్నడూ పాల్గొనకున్నప్పటికీ శూద్రులు, దళితులు, ఆదివాసీలు, ఆందోళన జీవులను దోపిడీ చేస్తున్న వారిని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడూ విమర్శించలేదు. అదే సమయంలో నా జీవిత కాలంలోనే అనేక సందర్భాల్లో హిందుత్వ శక్తులు ఆందోళనల్లో పాల్గొన్నాయి. నరేంద్రమోదీ సైతం ఆరెస్సెస్, బీజేపీల్లో భాగమై అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉంటూవచ్చారు. ఆయన పాల్గొన్న అతిపెద్ద ఆందోళనల్లో రామజన్మభూమి ఆందోళన ఒకటి. ఆ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నది రైతులు కాదు.. అసంఖ్యాకంగా సాధువులు, సన్యాసులు ఇందులో పాల్గొన్నారు. విద్య, ఉపాధి కోసం కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించడానికి శూద్ర ఓబీసీ కమ్యూనిటీలకు ఈ దేశంలో రిజర్వేషన్ హక్కు కల్పించినప్పుడే రామజన్మభూమి ఆందోళన చెలరేగిందని గుర్తించాలి. ఆరెస్సెస్, బీజేపీ శ్రేణులలో ఓబీసీ నేతగా ఉంటూవచ్చినప్పటికీ మోదీ ఎన్నడూ రిజర్వేషన్‌కు అనుకూలంగా మాట్లాడలేదని కూడా గుర్తిం చాలి. అదే సమయంలో మండల్ ఉద్యమాన్ని తోసిపుచ్చడానికి చాలామంది ఓబీసీలు ప్రారంభించిన కమండల ఉద్యమంలో మాత్రం మోదీ చాలా చురుకుగా పాల్గొన్నారు. వాస్తవానికి మండల్ ఉద్యమం ద్వారా లాభపడిందెవరు? ఈ దేశ ఆహార ఉత్పత్తిదారులకు ఎక్కువగా లబ్ధి కలిగించిన ఉద్యమం ఇది. కానీ హిందూ ఇండియన్లకు రిజర్వేషన్లను ఆరెస్సెస్, బీజేపీలు ఎందుకు వ్యతిరేకిస్తూ వచ్చాయి? చివరకు ఓబీసీలకు చెందిన మోదీ సైతం మండల్ ఉద్యమాన్ని ఎందుకు వ్యతిరేకించారు. ఈ ఓబీసీలే తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఆందోళనజీవులుగా ఉంటూ వచ్చారు. హిందుత్వ శక్తులు పాల్గొన్న ఇతర ఆందోళనలు కూడా చాలానే ఉన్నాయి. 1966 నవంబర్ 6న ఇందిరాగాంధీ సాపేక్షంగానే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో గోవధను దేశవ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ నాగా సాధువుల బృందం పార్లమెంటులోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక పోలీసును నిరసకారులు చంపేశారు. పోలీసులు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు గోరక్షకులు చనిపోయారు. వలసపాలన తర్వాత భారత పార్లమెంటుపై జరిగిన తొలి పెనుదాడిగా ఈ ఘటన నిలిచిపోయింది. భారతీయ జనతాపార్టీ పూర్వ రూపమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జన సంఘ్‌లు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. పార్లమెంటుపై దాడికి అనుకూలంగా పలు సభలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్పహించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేశారు. పైగా ఆహారం పండే బురద నేలలో ఈ తరహా ఆందోళన జీవులు ఏరోజూ చేయి పెట్టి ఎరగరు. అలాగని ఆవు వేసే పేడను కూడా వీరు ఎత్తడం చేయరు. ఆరెస్సెస్ తీసుకొచ్చిన చరిత్ర గ్రంథాల్లో శూద్రుల గురించి ఒక్కటంటే ఒక్క సానుకూలమైన ప్రతిపాదన కూడా చేసినట్లు కనపడదు. కానీ ఇదే శూద్ర రైతుల పిల్లలు విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో తమకు కాసింత రిజర్వేషన్లు కల్పించాలని కోరినప్పుడు ఆరెస్సెస్ అధికార వాణి ఆర్గనైజర్ ఏం రాసిందో చూడండి. ‘‘శూద్ర విప్లవం కలి గించే ఫలితాలను ఎదుర్కోవడానికి నైతిక, ఆధ్యాత్మిక శక్తులను తక్షణం నంఘటితం చేయవలసిన అవసరం వచ్చిపడింది.’’ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2021 ఫిబ్రపరి 10). ఆరెస్సెస్, బీజేపీలు తమ ఆందోళనను హిందూజాతీయవాద అందోళనగా నిర్వచించినప్పుడు శూద్ర ఆహార ఉత్పత్తిదారులు, ప్రాంతీయ పార్టీ నేతలు, కార్యకర్తలు వారి గుప్పిట్లోకి వెళ్లిపోయారు. హిందుత్వ శక్తులు వర్ణిస్తున్న దేశంలో తమను కూడా ద్విజులకు మల్లే సమానస్థాయిని ఇస్తారని వీరు భ్రమించారు. కాంగ్రెస్ మైనారిటీలను బుజ్జగిస్తోందన్న ప్రచారాన్ని వీరు నమ్మేశారు. మండల రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం ద్వారా శ్రామికులను దొరలుగా మార్చేస్తుందని జాట్లు, పటేళ్లు, మరాఠాలు, కుర్మీలు, కమ్మ, రెడ్డి తదితర కులాల వారు భావించారు. కరోనా మహమ్మారి కాలంలో ప్రధాని మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించినప్పుడు నిజమైన శూద్ర విప్లవం మొదలైంది. స్థానిక మార్కెట్లలో తమ పంటలను తామే అమ్ముకునే హక్కును రైతులనుంచి హరించి అగ్రి–మార్కెట్లకు, గుత్తాధిపత్య సంస్థలకు కట్టబెట్టే చట్టాలివి. తాను స్వయంగా ఓబీసీల నుంచే వచ్చాననీ చెప్పుకుంటున్న ఇప్పుడు దేశంలోని ఆహార ఉత్పత్తిదారులను ఆందోళన జీవులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. వీరి నుంచి దేశాన్ని కాపాడాలంటున్నారు. ఆహార ఉత్పత్తిదారులు లేని దేశం గతేంటి? జైకిసాన్కు అర్థమేంటి? ఇప్పుడు ఉత్తరాదిలో రైతుల ఆందోళనను నడుపుతున్న జాట్లు 2019 ఎన్నికల్లో బీజేపీ సరసన నిలిచారు. దేశంలోని ప్రధాన ఆహార ఉత్పత్తిదారులుగా ఉన్న శూద్ర ఓబీసీలు ఈ విషయాన్ని తప్పక గుర్తించాలి. అలాగే తాము మద్దతిస్తున్న రాజకీయ పార్టీల స్వభావం ఏంటో తాము ఉంటున్న పార్టీలు తమకు ఏ స్థాయినిస్తున్నాయో తప్పకుండా ఆలోచించుకోవాలి. ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్న పుస్తకం ‘శూద్రాస్’
ఏదైనా ఒక సమాజం అసమానతల ప్రాతిపదికన ఏర్పడినప్పుడు, దాని పునర్నిర్మాణం కోసం అడుగులు వేయడమొక అనివార్యమైన, అవసరమైన క్రియ. తరతరాలుగా అణచివేతకు గురైనవారు శూద్రులు. వారిని విముక్తి చేసే ప్రక్రియలో భాగంగా, జ్యోతిబా ఫూలే చాతుర్వర్ణ వ్యవస్థను సవాలు చేశాడు. దీన్నే గొప్ప కాంక్షతో అంబేడ్కర్ కూడా చేశాడు. హిందుత్వ బ్రాహ్మణీయ అధికార సంబంధాలను బహిర్గతం చేసి, సామాజిక పునర్నిర్మాణం కోసం తన వంతు పాత్రని నెరవేర్చడంలో భాగంగా వచ్చిన పుస్తకం ‘ద శూద్రాస్: విజన్ ఫర్ ఎ న్యూ పాథ్’. పెంగ్విన్, సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘రీథింకింగ్ ఇండియా’ సిరీస్‌లో భాగంగా వచ్చిన 14వ సంపుటం ఇది. ఈ నెల 22న విడుదలైంది. సామాజిక, రాజకీయ తత్వవేత్త కంచ ఐలయ్య షెపర్డ్, జేఎన్‌యూ పొలిటికల్ సైన్స్ పరిశోధక విద్యార్థి కార్తీక్ రాజా కరుప్పుసామి సంపాదకత్వంలో వెలువడింది. సంపాదకుల పరిచయ వ్యాసంతో కలిపి మొత్తం 12 అధ్యాయాలున్న ఈ పుస్తకం, శూద్రుల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులను విశ్లేషించింది. రచయితలు శూద్ర సామాజిక వర్గం నుంచి రావడం, వివిధ రంగాలలో గుర్తింపు పొందినవాళ్లు కావడం పుస్తకానికి బలాన్ని చేకూర్చింది. పార్లమెంటు సభ్యుడు శరద్ యాదవ్, సామాజిక కార్యకర్త సునీల్ సర్దార్, జర్నలిస్ట్ ఉర్మిలేష్, సోషల్ జస్టిస్ లాయర్ బిందు దొడ్డ హట్టి, వైద్యుడు పుంజాల వినయ్ కుమార్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ అరవింద్ కుమార్, రామ్ భీనవేని షెపర్డ్, ప్రాచీ పాటిల్, పరిశోధక విద్యార్థి ఓం ప్రకాష్ మహతో వంటి వారి వ్యాసాలున్నాయి. అనేక ప్రశ్నలను దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుంచారు వ్యాసకర్తలు. శూద్ర విప్లవ దశను, శూద్ర విముక్తిని ఈ పుస్తకం అత్యవసరంగా సూచిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వర్ణ ధర్మ పాలననూ, గుప్త యుగాన్నీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని హెచ్చరిస్తున్నది. ప్రాంతీయ పార్టీల ద్వారా తమ ఉనికిని ఆయా రాష్ట్రాలలో కాపాడుకుంటున్న శూద్రుల రాజకీయ పార్టీలను అంతం చేసే పనిలో హిందుత్వ రాజకీయం ఉందని చెబుతున్నది. ఈ వ్యవస్థ ఎవరి కోసం ధనాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తుంది? ఎందుకు తరచుగా ‘ఉగ్రవాది’ అనే వాడుకభాషను అలవాటు చేస్తుంది? ‘రాజ్య/ రాజద్రోహి’ తనాన్ని ఎందుకు ‘దేశద్రోహి’ తనంగా చిత్రీకరిస్తుంది? స్త్రీలను కేవలం పునరుత్పత్తి యంత్రాలుగా ఎందుకు చూస్తుంది అనే ప్రశ్నలను వేసుకుంటే విముక్తి పథంలో తొలి అడుగు వేసినట్టే. శూద్రులకు ఆధ్యాత్మిక సమానత్వం లేదనే మాట ఎంత నిజమో, అసలు సమానత్వం అనే భావనను ఈ వ్యవస్థ వాళ్లకు పరిచయం లేకుండా చేసిందనే మాట కూడా అంతే నిజం. శూద్రత్వం అంటే పనితత్వం అని గొప్పగా చెబుతారు ద్విజులు. కానీ, పనితత్వానికి, అంటే లేబర్ వర్క్‌కు గౌరవం ఇవ్వటం బ్రాహ్మణిజానికి అలవాటు లేదు. ఇక్కడ పనితత్వం అంటే పై వర్ణాలకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు సేవ చేయటమే. గాంధీ తెలివిగా శూద్రుల సేవా గుణాన్ని పొగుడుతూ దాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేశాడు. 1933లో వర్ణధర్మ వ్యవస్థను సరిచేయడం ఎలా అనే అంశంపై రాస్తూ, ‘తన విధిని విస్మరించే బ్రాహ్మణుడి కంటే తనకు తగిన కర్తవ్యాన్ని చేసే శూద్రుడే ఉత్తమం’ అన్నాడు. ఈ పుస్తకం చదివినవాళ్లు ఈ విషయాన్ని ఇంకోవిధంగా అర్థం చేసుకోవచ్చు. తనకు కేటాయించిన విధిని చేసే బ్రాహ్మణుడి కంటే, తనకు తగని కర్తవ్యాన్ని విడిచిపెట్టిన శూద్రుడే ఉత్తమం! శూద్రులు తమ మేధో సామర్థ్యాన్ని, స్పృహను, ఆధ్యాత్మిక సమానత్వం, ప్రజాస్యామ్యం కోసం ఉపయోగిస్తూ, మనువాద హిందుత్వ రాజకీయాలకు బానిస అవ్వకుండా తమ జీవన విధానాన్ని, లక్ష్యాలను గొప్పగా ఉంచుకుంటూ వాటి కోసం ప్రయత్నించినప్పుడే ఈ రాజకీయ ప్రజాస్వామ్యంలో శూద్రులకు సామాజిక ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో అధికారంలో ఉన్న రెడ్డి, కమ్మ, వెలమ, యాదవ్, కూర్మి, వొక్కలిగ, లింగాయత్, నాయర్, పటేల్, జాట్, గుజ్జర్ శూద్ర కులాలు ఈ ప్రశ్నలు వేసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఒక్క నోబెల్ బహుమతి ఎందుకు శూద్రులకు రాలేదు? ఇంకా ఎన్నో ఉత్పత్తి కులాలు, భూమిని నమ్ముకొని బతుకుతున్న కులాలు అధికారం వైపు కాదు కదా, సంపూర్ణ విద్య, ఉద్యోగం వైపు కూడా ఎందుకు అడుగులు వేయలేదు? దీనికి గల కారణాలను ఈ పుస్తకం లోతుగా విశ్లేషించింది. రాజకీయ ఎదుగుదల ఉన్నంత మాత్రాన శూద్రులు సామాజిక సమానత్వ ఫలాలను అనుభవించే దశలో లేరు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమానత్వం చాలా అవసరం. అలా లేని పరిస్థితుల్లో సామాజిక బానిస త్వాన్ని శాశ్వతం చేసినవాళ్లం అవుతాము. అలాంటి చారిత్రక తప్పిదం జరగకూడదనే హెచ్చరికను ముందుకు తెచ్చిన పుస్తకమే ‘ద శూద్రాస్’. - పల్లికొండ మణికంఠ సమీక్షకుడు పరిశోధక విద్యార్ధి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ -
మార్పును ప్రతిబింబిస్తున్న పుస్తకాలు
భాషాభివృద్ధిలో ప్రధాన సమస్య ఏదంటే, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని సులువుగా వ్యక్తీకరించే కొత్త పదజాలాన్ని స్వీకరించడమే. భాషలోని అక్షరాలను సరళతరం చేయకపోతే, ఉత్పాదక క్షేత్రాల్లో విరివిగా ఉపయోగించే పదాలను స్వీకరించకపోతే, పుస్తక భాషలో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన పదాలను చొప్పించకపోతే, తెలుగు సుసంపన్నం కాలేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న మిర్రర్ ఇమేజ్ తరహా పుస్తకాల ద్వారా ఎదిగే తరాలు తెలుగుని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయగలవు. రెండు భాషల్లో ఒకే చోట పాఠాన్ని ప్రచురించడం ద్వారా ఒక భాషగా తెలుగు కంటే ఇంగ్లిష్ ఎంత సులభమో అటు విద్యార్థులు,ఇటు ఉపాధ్యాయులూ అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ బోధనకు సంబంధించి భవిష్యత్తులో అత్యంత సృజనాత్మక మదుపుదారుగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త విప్లవాత్మకమైన విద్యా పథకంతో ముందుకొచ్చింది. రెండుభాషల్లోనూ మిర్రర్ ఇమేజ్ అని చెబుతున్న స్కూల్ పుస్తకాలను ప్రచురించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలో స్కూలు పుస్తకాలని ఇంగ్లిష్, తెలుగు పాఠాలు పక్కపక్కనే ఉండేలా ప్రచురించనున్నారు. రెండు భాషల్లో ఒకే చోట పాఠాన్ని ప్రచురించడం ద్వారా ఒక భాషగా తెలుగు కంటే ఇంగ్లిష్ ఎంత సులభమో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులూ అర్థం చేసుకోగలరు. భారతీయ భాషల్లో కంటే అక్షరాలు, వాక్య నిర్మాణం రీత్యా ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం చాలా సులభమని వీరు గ్రహిస్తారు. దేశభాషలందు తెలుగు లెస్స అంటూ వీరాలాపన చేసే ఘనాపాఠీలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు సులువుగా పలికడానికి తగినట్లుగా తెలుగు రాత లిపిని మెరుగుపర్చడంపై ఎన్నడూ దృష్టిపెట్టలేదు. తెలుగు పుస్తకాల్లో రాతరూపంలోని పాఠం ఉత్పత్తి క్షేత్రాల్లో పరస్పరం మాట్లాడుకునే తెలుగు భాషకు సంబంధించినదిగా ఉండదు. పొలం దున్నేటప్పుడు, పంట కోసేటప్పుడు, ఇంట్లోనూ, బయట ఆహార ధాన్యాలను నిల్వచేసేటప్పుడు, ప్రజలు తమకు తెలి సిన ప్రజాభాషలోనే మాట్లాడతారు. కానీ పుస్తకాల్లో రాత పండిత భాషలో ఉంటుంది. చివరకు బ్రాహ్మణ (పురుషులు మాత్రమే పండితులుగా పేరొందుతారు) ఇళ్లలో కూడా సంస్కృతాన్ని మహిళల గృహ, వంటింటి భాషగా అనుమతించలేదు. ఒక్కసారి ఇలాంటి కృతక భాషను తెలుగు అక్షరాల్లోకి దూర్చి ఉత్పాదక వర్గాలపై బలవంతంగా రుద్దినప్పుడు అసలు తప్పు వాస్తవ రూపం దాలుస్తుంది. ఉత్పత్తి క్షేత్రాల్లోనే వికసించిన ఇంగ్లిష్ సరిగ్గా ఇంగ్లిష్ దీనికి వ్యతిరేక దిశలో పరిణమించింది. 14వ శతాబ్ది చివరివరకు ఇంగ్లిష్ అనేది ఇంగ్లండ్‌లోని రైతుల భాషగా ఉండి చర్చీల్లో ఉపయోగించడానికి అనుమతించేవారు కాదు. చివరకు ఆంగ్లికన్ చర్చీలలో కూడా గ్రీకు, లాటిన్ భాషలనే దైవ భాషలుగా ఆమోదించారు. ఇంగ్లిష్ ఉత్పత్తి క్షేత్రాల్లో పరిణమించి, అభివృద్ధి చెంది తర్వాత పుస్తక భాషగా మారింది. రైతులు మాట్లాడే భాష దేవుని ప్రార్థించే భాషగా మారినప్పుడే, ఇంగ్లిష్ అటు ప్రింట్, ఇటు మాట్లాడే రూపాల్లో సుసంపన్నంగా మారిపోయింది. ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచ్ వంటి యూరోపియన్ భాషలను ప్రార్థనా భాషలుగా ఆమోదించినప్పుడు మాత్రమే యూరప్ రైతులు, శ్రామికులు ఈ భాషలను చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఇది యూరప్ రైతాంగ జీవితంలోనే అతిపెద్ద విప్లవాత్మక పరిణామం అయి కూర్చుంది. ఒక భాషను పవిత్రమైనదిగా ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ భాష అభివృద్ధి చెందే క్రమం పూర్తిగా మారిపోతుంది. అదే హిందూ మతంకేసి చూస్తే తెలుగు కానీ మరే ఇతర భాషలు కానీ నేటికీ అతిపెద్ద ఆలయాల్లో కూడా దైవాన్ని ప్రార్థించే భాషగా ఉండవనేది స్పష్టాతిస్పష్టం. ఇది తెలుగును మొదటినుంచీ అభివృద్ధి చెందకుండా నిరోధించిన మరొక ప్రతికూల అంశంగా ఉండిపోయింది. భాషాభివృద్ధిలో మరొక ప్రధాన సమస్య ఏదంటే, వికసిస్తున్న ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని సులువుగా వ్యక్తీకరించగల కొత్త పదజాలాన్ని స్వీకరించడమే. భాషలోని అక్షరాలను సరళతరం చేయకపోతే, ఉత్పాదక క్షేత్రాల్లో విరివిగా ఉపయోగించే పదాలను స్వీకరించకపోతే, పుస్తక భాషలో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన పదాలను చొప్పించకపోతే, తెలుగు çసుసంపన్నం కాదు, కాలేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న మిర్రర్ ఇమేజ్ తరహా పుస్తకాల ద్వారా ఎదిగే తరాలు తెలుగుని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయగలవు. సెమిస్టర్ ఒక కొత్త అనుభవం ఆలస్యంగా మొదలవుతున్న ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమినార్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. పాఠశాల విద్యా స్థాయిలోనే సెమిస్టర్ మోడల్‌ను ప్రవేశపెట్టడం అనేది భారతీయ పాఠశాల విద్యా చరిత్రలోనే మొట్టమొదటిది. ఒక సంవత్సరంలో పిల్లల పురోగతిని రెండు అసెస్మెంట్ల ద్వారా లెక్కించడం వల్ల పిల్లలు తమపై అంచనా ప్రక్రియను చాలా సులభంగా నిర్వహించగలరు. అందుకే ఇది దీర్ఘకాలంలో చాలా సానుకూల ఫలితాలను అందిస్తుంది. నిజానికి దీన్ని పాఠశాల విద్యలో యూరో– అమెరికనేతర మోడల్‌గా చెప్పవచ్చు. పైగా ఇదొక విలువైన ప్రయత్నం కూడా. యూరో అమెరికన్ నమూనా తరహాలో భారత్‌లో ఏ స్థాయిలో కూడా పిల్లలు ఐపాడ్ వంటి రూపంలో సాఫ్ట్ బుక్స్ (ప్రింట్ పుస్తకాలు కాకుండా డిజిటల్ రూపంలో చదవగలగడం) చదివే అలవాటును మన పాఠశాల విద్య ఇంతవరకు అభివృద్ది చెందించలేదు. పుస్తకాల బరువును తగ్గించడం నేటి విద్యావిధాన లక్ష్యం. ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మిర్రర్ ఇమేజ్ పుస్తకాల బరువు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒక సెమిస్టర్ పూర్తి చేసే కాలంలో పిల్లలు కేవలం నాలుగు నెలలకు సంబంధించిన పుస్తకాలను మాత్రమే క్లాసుకు తీసుకురావచ్చు. తద్వారా వారు బరువు మోసే పని తగ్గుతుంది. పిల్లల్లో సృజనాత్మక ఆలోచనా సామర్థ్యాలను, నేర్చుకునే సమర్థతలను మెరుగుపర్చడంలో భారతీయ పాఠశాలల ఉపాధ్యాయులు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటోంది. ఇంతవరకు భారతీయ విద్యా వ్యవస్థ పాఠాలు గుర్తు పెట్టుకునే లేక వల్లెవేయించే ప్రక్రియలోనే నడుస్తోంది తప్ప పిల్లల్లో సృజనాత్మక ఆలోచనకు అనుమతిం చడం లేదు. కాబట్టి ఇకనైనా పిల్లల్లో సృజనాత్మక చింతన ప్రారంభం కావాలి. 6వ తరగతిని పూర్తి చేసే లోపే వారు కాలంతోపాటు తప్పక ఎదగాలి. స్వయంగా ఇంగ్లిష్‌లో మాట్లాడే అభ్యాసాన్ని ఇస్తున్న మిర్రర్ ఇమేజ్ పుస్తకాలు టీచర్ వయసు ఏదైనా సరే వారి ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌ను కూడా మెరుగుపరుస్తాయి. ఇది పిల్లలు మాట్లాడే ప్రక్రియకు సాయపడుతుంది. పైగా టీచర్ కంటే ఎక్కువగా నేర్చుకోవడంపై పిల్ల లకు ఆసక్తి ఉంటుంది కనుక ప్రతి విద్యార్థి కూడా ఒక టీచరేనని ఉపాధ్యాయులందరూ గుర్తించాల్సి ఉంటుంది. శ్రమను గౌరవించడం నేర్పే బోధన యూరో–అమెరికన్ వ్యవస్థల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత పిల్లలు తమ కుటుంబం నుంచి బయటపడి కుటుంబ ఆర్థిక ప్రతిపత్తితో ప్రమేయం లేకుండా తమ సొంత జీవితం గడపాల్సి ఉంటుంది. భారత దేశంలో ఇది సాధ్యం కాదు. ఇక్కడ మనం చైనానుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. చైనాలోనూ మనకు లాగే భారీస్థాయిలో పిల్లలు పాఠశాలలకు వెళుతుంటారు. పైగా ఒకేరకమైన ఆర్థిక వ్యవస్థ మన రెండు దేశాల్లోనూ ఉంది. కానీ ఆ దేశంలో శ్రమను గౌరవించే బోధన విస్తృత స్థాయిలో కనిపిస్తుంది. భారతదేశంలోనూ శ్రమను గౌరవించడాన్ని బోధించడం అనేది పిల్లలు వంటపని చేయడంతో మొదలు కావాలి. దీన్నే కిచెన్ ఫ్రెండ్లీ అంటున్నారు. 6వ తరగతినుంచి పాఠాలు వంటకు సంబంధించిన పాఠ్యాంశాలతో, శ్రమ ప్రాధాన్యతను గుర్తింప జేసే అంశాలతో ఉండాలి. పిల్లల జెండర్‌తో నిమిత్తం లేకుండా కుటుంబంలోని పిల్ల లందరికీ తల్లి వంటపనిని, ఇంటి పనిని నిత్యం బోధిస్తూ రావాలి. ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా తల్లికి నగదు ఇస్తోంది. ఇది తల్లి సానుకూల విద్యను పిల్లలకు బోధించడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. అయితే తల్లిదండ్రులు స్కూల్లో భేటీ అయే సమయంలో వారు తమ పిల్లలకు ఇంటిపనిలో ఉన్న శ్రమను గౌరవించడం ఒక పెద్ద సాంస్కృతిక సంపద అనే విషయాన్ని అర్థం చేయించాలని పాఠశాలలు తప్పకుండా కోరాలి. పిల్లలకు తల్లిదండ్రులు వంటపని, ఇంటిపని నేర్పిస్తున్నారా లేదా అని ఉపాధ్యాయులు నిర్ధారించాలి కూడా. నేర్చుకునే ప్రక్రియలో టీచర్లు తమలోని పురుషాధిక్య ధోరణులను వదిలిపెట్టేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రతి క్లాసులోనూ మట్టి పిసకడం, వ్యవసాయ పనులు చేయడంపై కొన్ని పాఠాలు తప్పక పొందుపర్చాలి. చైనా ఈ పనిని 4వ తరగతినుంచే మొదలుపెడుతోంది. భారతదేశంలో శ్రమను గౌరవించే బోధనను సూత్ర రీత్యా, ఆచరణ రీత్యా ప్రవేశపెట్టడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ సొంత పద్ధతులను చేపట్టవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ బోధనకు సంబంధించి భవిష్యత్తులో అత్యంత సృజనాత్మక మదుపుదారుగా మారనుంది. రేపు తన పౌరులకు దేశం గర్వించగిన స్థాయిలో శాస్త్రీయ విద్యను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందించనుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య òషెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
చిన్న నగరాలే శ్రేయస్కరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసినప్పటినుంచి, రాజధానుల వికేంద్రీకరణపై చర్చ సాగు తూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సచివాలయ భవంతుల కూల్చివేత కార్యక్రమం మొదలెట్టినందున తెలంగాణలోనూ శాసన రాజధానిని వరంగల్‌కి మార్చడం భేషైన పని. కేసీఆర్ ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తే దేశవ్యాప్తంగా ఇది చర్చకు తావిస్తుంది. భారతీయ నగరాల్లో జనాభా సాంద్రీకరణ విపరీతంగా చోటు చేసుకోవడానికి ఒకే రాజధాని భావనతో సాగిన అభివృద్ధే కారణం. చిన్ననగరాలే ఇకముందు ప్రపంచానికి శ్రేయస్కరం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వరంగల్ని శాసన రాజధానిగా నెలకొల్పడం తక్షణ అవసరంగా ముందుకొచ్చింది. వరంగల్‌లో అసెంబ్లీని ఏర్పాటు చేయడం గురించి కేసీఆర్ గతంలోనే ప్రతిపాదించారు కాబట్టి ప్రభుత్వం పూనుకంటే ఇదేమంత అసాధ్యమైన పని కాదు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖ పట్నంని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాల్లో రాజధాని గురించి ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర రాజధానులు, చివరకు దేశ రాజధాని కూడా ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పర్చాలా వద్దా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరుతోసహా దేశంలోని మహానగరాలలో కోట్లాది ప్రజలు కోవిడ్–19 క్రమంలో భయంకరమైన హింసలకు, కడగండ్లకు గురికావడాన్ని చూశాక, మన రాజధానులను ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నెలకొల్పడమే మంచిదని నేను భావించాను. దాదాపుగా మన ప్రధాన నగరాలన్నీ భారీ స్థాయిలో జనం కేంద్రీకృతమై నివసించాల్సిన రీతిలో అభివృద్ధి చెందాయి. ఇలా జనాభా భారీగా కేంద్రీకరించిన జోన్లలోనే పారిశ్రామిక, సంస్థాగతమైన క్లస్టర్ల అభివృద్ధి కూడా జరుగుతూ వచ్చింది. అందుకే ఈ ఒకే రాజధాని భావనవల్లే మన నగరాల్లో జనాభా సాంద్రీకరణ విపరీతమైంది. కోవిడ్ అనంతర భారతదేశం కానీ, తక్కిన ప్రపంచం కానీ తమ నగరాభివృద్ధి నమూనాలపై పునరాలోచించక తప్పదు. అవాంఛితమైన జనారణ్యాలు, అధిక జనసాంద్రతతో కిక్కిరిసిపోయే మురికివాడలు లేకుండా, మన పిల్లలు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం పొందాలంటే మన అభివృద్ధి నమూనాను మళ్లీ పరిశీలించుకోవడం తప్పనిసరి. ఇప్పటికే కరోనా వైరస్ ప్రబల వ్యాప్తి కారణంగా చిన్న పట్ణణాలు, గ్రామాల్లో కొత్త జీవితం గడపడానికి లక్షలాదిమంది ప్రజలు మహానగరాల నుంచి తరలిపోవడం ప్రారంభించారు. పాలనా యంత్రాంగాలను, ఇతర ప్రభుత్వ కార్యకలాపాలను వికేంద్రీకరించడం వల్ల భవిష్యత్తులో సాంక్రమిక వ్యాధుల నిరోధానికి చక్కగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ వంటి అధిక జనసాంద్రత కలిగిన నగరాలపై సాంక్రమిక వ్యాధి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనందరికీ తెలుసు. ఒక ప్రాణాంతక వైరస్ దాడి చేయగానే ప్రసిద్ధిగాంచిన మన మెట్రో రైల్ వ్యవస్థలు, ప్రజా రవాణా వ్యవస్థలు తామెందుకూ పనికిరామని ఇప్పటికే నిరూపించేసుకున్నాయి. వికేంద్రీకరణ జరిగిన వరంగల్ వంటి చిన్న పట్టణాల్లో సైకిళ్లు, మోటార్ సైకిళ్లు కూడా వ్యక్తిగత రవాణాకు ఉపయోగపడటం చూస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చిరకాలం మనగలిగిన సచివాలయ భవంతులను కూల్చి వేసే కార్యక్రమం మొదలుపెట్టింది. సచివాలయ భవంతి నిర్మాణం కోసం కొత్త నమూనాను ప్రజ లకు అందుబాటులో ఉంచింది. నిజానికి ఈ కొత్త నమూనా చూడ్డానికి బాగానే ఉంది. పైగా బహుళ సంస్కృతి నిర్మాణ శైలులను కలిగి ఉంది. అయితే రూపురేఖలు ఎలా ఉన్నా కొత్త సచివాలయాన్ని నిర్మించడం మాత్రం ఖాయం. అదే సమయంలో చరిత్రాత్మకమైన అసెంబ్లీ భవన నిర్మాణం సాంస్కృతిక కళాఖండంగా ఉన్నందున దీన్ని నిర్మూలించకూడదు. పబ్లిక్ గార్డెన్‌ని కూడా కలిగిన ఈ మొత్తం ప్రాంతాన్ని చెక్కుచెదరకుండా అలానే ఉంచాలి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో చక్కగా వృద్ధి చెందిన పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నూతన అసెంబ్లీ భవనాన్ని తప్పకుండా వరంగల్‌లోనే నిర్మించడం చాలా ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలి. ఇప్పుడు వరంగల్ని శాసన రాజధానిగా ఎందుకు చేయాలి? ఎందుకంటే హైదరాబాద్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించడం అనేది ఇప్పుడొక నిర్ధారిత అంశం. తెలంగాణకే సాంస్కృతిక భవంతిగా ఉన్న హైకోర్టు భవనం నిజాం గత చరిత్రకు, నూతనంగా రూపుదిద్దుకున్న రాష్ట్రానికి మధ్య అనుసంధానంగా ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి న్యాయ రాజధానిని తరలించడం సాధ్యపడదు. కాబట్టి ఉన్న ఏకైక అవకాశం ఏదంటే శాసనసభ నిర్మాణాన్ని వరంగల్‌కి తరలించడమే. ఇది తెలంగాణ సమ్మక్కను, కాకతీయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సంవత్సరానికి మూడు నాలుగుసార్లు శాసనసభా వ్యవహా రాలు నడుస్తాయి కాబట్టి, ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడే విడిది చేస్తారు కాబట్టి వరంగల్‌ను తెలంగాణ శాసన రాజధానిగా చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. కొత్తగా నిర్మించే చక్కటి శాసనసభా భవంతి, సీఎం కార్యాలయం, కేబినెట్ మంత్రుల కార్యాలయాలు వరంగల్ నుంచే పనిచేయాల్సి ఉంటుంది. పైగా సంవత్సరంలో కొంత కాలమైనా మొత్తం పాలనా యంత్రాంగం వరంగల్ వంటి ఒక చిన్న నగరంలో ఉండగలిగితే, అక్కడ భారీ పెట్టుబడులకు, అభివృద్ధికి వనరుగా, ప్రోత్సాహకంగా ఉంటుంది. కార్యనిర్వాహక వర్గం, రాజకీయనేతలు ఆ నగరంలో విడిది చేయగలిగితే వారితో భేటీ కావడానికి భారతీయ, విదేశీ పెట్టుబడిదారులు, రాజకీయ, సాంస్కృతిక ప్రతినిధులు అక్కడికి వస్తారు. దీనివల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతుంది. వరంగల్ ఇప్పటికే విమానయానంతో ముడిపడి ఉంది. దాని విమానాశ్రయ అనుసంధానాలను మెరుగుపరిస్తే చాలు. అలాగే శరవేగంతో నడిచే రైళ్లు, బస్సుల కనెక్టివిటీ కూడా మెరుగుపర్చాలి. ఇక ఈ నగరం చుట్టూ ఉండే రామప్ప, లక్డవరం, పాకాల్, వరంగల్ కోట, సమ్మక్క అటవీ ప్రాంతం గొప్ప పర్యాటక ప్రాంతాలుగా మారతాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం తన రాజధానిని కూడా వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకుంటే, ఈ అంశంపై ఇప్పటికే జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. మెట్రోపాలిటిన్ నగరాలను వికేంద్రీకరించి జనాభా ఒకే చోట గుమికూడకుండా చర్యలు తీసుకోవడం అనేది కోవిడ్ అనంతర ప్రపంచంలో ఒక అనివార్య ధోరణిగా మారక తప్పదు. కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కోటి జనాభా ఉన్న చైనాలోని వూహాన్ నగరం నుంచి శరవేగంగా విమాన ప్రయాణాల ద్వారా ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రపంచంలో ఎన్నో వైరస్లు పుట్టుకొచ్చాయి కానీ అవేవీ కోవిడ్–19 అంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించలేకపోయాయి. ప్రపంచ నగరాల మెట్రోపాలిటిన్ స్వభావమే ఈ శరవేగ వ్యాప్తికి కారణం. తెలంగాణలో ఒక సామెత ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? మన నగరాలు మృత్యు బేహారిలుగా మారుతున్న విపత్కర పరిణామానికి ఏకైక పరిష్కారం ఆ నగరాల జనాభాను తగ్గించేయడమే. అదే సమయంలో ఆ నగరాల పారిశ్రామిక వృద్ధి, పురోగతి విషయంలో రాజీ పడకూడదు. ఒక మహానగరం చుట్టూ మొత్తం పాలనా, శాసన, న్యాయ, పారిశ్రామిక, విద్యాసంస్థల అభివృద్ధి మండలాలను పేర్చుకుంటూ పోవడం అంటే భారీ ఎత్తున వలస కార్మికులను తీసుకురావాల్సి ఉంటుంది. ఆస్కార్ అవార్డు గెల్చుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా మన నగరాల్లోని మురికివాడల భయానకమైన కఠిన వాస్తవాన్ని అద్దం పట్టి చూపించింది. ఇప్పుడు కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ ప్రకటించిన సమయంలో మనుగడ కోసం భారతీయ నగరాలకు తరలివచ్చి కిక్కిరిసి ఉంటున్న వలస కార్మికులకు మెట్రోపాలిటిన్ చేదు వాస్తవం స్పష్టంగా కనిపించింది. నెలలతరబడి భయంకర కష్టాలను భరిస్తూ కోట్లాదిమంది వలస కార్మికులు నగరాలనుంచి తమతమ గ్రామాలకు కాలినడకన తరలిపోయారు. సంస్థలను, పాలనాయంత్రాంగ నిర్మాణాలను, పరిశ్రమలను వికేంద్రీకరించడం అనే భవిష్యత్తు దార్శనికత మాత్రమే ఇలాంటి దుర్భర పరిస్థితిని మార్చివేయగలదు. వరంగల్ని శాసన రాజధానిగా నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంటే, ప్రస్తుతం ఏపీ రాజధాని విషయంలో జరుగుతున్నతీరులో తెలంగాణలో దానికి పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చు. బీజేపీతో సహా ప్రతిపక్షాలు అలాంటి నిర్ణయానికి మద్దతు తెలుపవచ్చు. నిజానికి గడచిన కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజధానుల్లో ఎలాంటి నగరాలు ఏర్పడాలి అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ పెద్దగా దృష్టి పెట్టలేదు. సచివాలయ నిర్మాణం కొనసాగనున్నందున, వరంగల్‌లో శాసన రాజధానికి చెందిన మౌలిక వ్యవస్థలను కూడా వృద్ధి చేయడాన్ని ఇప్పటినుంచే ప్రారంభించాలి. ఒకసారి సిద్ధమయ్యాక శాసన కార్యకలాపాలు వరంగల్ నుంచే మొదలవుతాయి. అప్పటివరకు శాననాల రూపకల్పన వంటి పనులు హైదరాబాద్ నుంచే చేయవచ్చు. కేవలం తెలంగాణ ప్రయోజనాల రీత్యా మాత్రమే కాకుండా మొత్తం జాతి ప్రయోజనాల రీత్యా కూడా ఈ కోణంలో కేసీఆర్ ఒక కొత్త ట్రెండ్‌ను ఏర్పర్చడానికి ఇప్పుడు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
కరోనా నేర్పుతున్న కొత్త పాఠం
పెట్టుబడిదారీ విధానంలో డబ్బే డబ్బును సృష్టిస్తుంది. లాభాలనిస్తూ ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి దోహదపడుతుంది. జీవితాలను కాపాడాల్సిన ఆసుపత్రులు డబ్బు సృష్టించే యంత్రాలుగా మారాక, కరోనా వచ్చి కొత్త పాఠాలు చెబుతోంది. ఇది ప్రస్తుతం ఒక ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం కూడా దీనికి సాటిరాదు. కరోనా అనంతరం ఈ భూగ్రహంపై జీవితం గురించి చాలామంది ఆలోచనల్లో మార్పు వస్తుంది. కారల్ మార్క్స్ చెప్పిన సోషలిస్ట్ విధానాలను అనుసరిస్తూ పేద, ధనిక భేదం లేకుండా కలిసిమెలిసి జీవించాలి. భవిష్యత్‌లో మానవ జీవితం గురించి ప్రతి దేశం ఆలోచించాలి. అవసరమైనప్పుడు ప్రతి మనిషికీ ప్రాణవాయువును అందించగలిగే ఆరోగ్య సంరక్షణ కల్పించాలి. ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా ‘జార్జిరెడ్డి’లో హీరో తల్లి పాడినపాట ఇది. ‘‘నిన్నయితే కన్నాను నేను/ నీ రాతలు కనుగొనలేను/ఏ తీరం నీ కథ చేరేను/గర్వంగా ఉన్నా గానీ/ కన్నా నా భయం నాది /ఎంతైనా కన్న కడుపు ఇది’’.శత్రువుల చేతిలో జార్జిరెడ్డి హత్యకు గురవడానికి కాస్త ముందుగా ఆయన తల్లి పడిన వేదన లాంటి బాధనే అమెరికాలో, యూరప్‌లో ఉంటున్న ఎందరో కుమారులు, కుమార్తెల తల్లులు ప్రస్తుతం అనుభవిస్తున్నారు. ఆ దేశాల్లో నివసిస్తున్న తమ బిడ్డల పాలిట శత్రువుగా ప్రాణాంతక కరోనా ఈ తల్లులందరికీ ఇప్పుడు కనిపిస్తోంది. బిడ్డల్ని కన్న కడుపు కాబట్టి వారి భద్రత ప్రతి తల్లినీ ఇప్పుడు వెంటాడుతోంది. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక తల్లి కూతురు తన భర్త, ఇద్దరు పిల్లలతో అమెరికాలో నివసిస్తోంది. అలాగే ఆమె కుమారులిద్దరూ, వారి కుటుంబాలు ఇంగ్లండులో నివసిస్తున్నారు. ఆమె కూడా ఇప్పుడు ఇదే భయాలతో గడుపుతోంది. ఆమెకు ఇప్పుడు 60 ఏళ్లు. 70 ఏళ్ల వయసున్న ఆమె భర్త దీర్ఘకాలిక గుండెరోగిగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. అమెరికా, ఇంగ్లండ్ గురించిన వార్తలు వచ్చినప్పుడల్లా ఆమె తెలుగు టీవీ చానల్స్‌ను అంటిపెట్టుకుని కూర్చుంటోంది. ఇంగ్లండ్ కంటే అమెరికాలో పరిస్థితి ఆమెను మరింతగా హడలెత్తిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీవీల్లో కనిపించినప్పుడల్లా ఆమె పెద్దగా అరుస్తూ, ‘ఇతగాడికి డబ్బునుంచి డబ్బు సృష్టించడం మాత్రమే తెలుసుకానీ తన ప్రజలను మాత్రం కాపాడలేడు. ఒబామా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ప్రజలు క్షేమంగా ఉండేవారు’’ అని వ్యాఖ్యానిస్తుంది. డబ్బునుంచి డబ్బును సంపాదించేవారు కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడలేరు అని ఆమె చేసిన ప్రకటన.. ట్రంప్ వంటి పెట్టుబడిదారులు, వ్యాపారులు, కరోనా వైరస్‌పై పోరాటంలో వారి ఉద్దేశంపై, వారి సామర్థ్యాన్ని శంకిస్తూ చేసిన ప్రకటనగానే చూడాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రంప్ అమెరికా మాత్రమే కాదు.. పెట్టుబడిదారీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మొత్తంగా తన జీవితకాలంలో ఎన్నడూ ఎరుగనంతటి పెను సంక్షోభాన్ని ఇప్పుడు కరోనా వైరస్ రూపంలో ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ అర్ధ–సోషలిస్టు చైనాలోని పెట్టుబడిదారీ జంతు మాంసపు మార్కెట్ లోంచి పుట్టుకొచ్చింది. కానీ అతితక్కువ కాలంలో ఆ వైరస్ పెట్టుబడిదారీ విమానాల ద్వారా ప్రయాణించి నేడు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ విస్తరించింది. సోషలిస్టు దేశాలయితే ఒక సంఘటిత రాజ్య వ్యవస్థతో, సామాజీకరించిన ఆరోగ్య సంరక్షణతో, ఆసుపత్రుల దన్నుతో వైరస్‌పై పోరాడుతుండగా, ప్రపంచంలోనే అత్యంత గరిష్ట స్థాయిలో ప్రైవేట్ పరమైన పెట్టుబడిదారీ దేశాలు ఈ కనిపించని శత్రువు చేసిన దాడిని తట్టుకోలేక కుప్పకూలి పోయాయి. అమెరికా, స్పెయిన్, ఇటలీలు యావత్ప్రపంచంలోనే అత్యంత గరిష్టంగా ప్రయివేట్‌పరం చేయబడిన ఆరోగ్య వ్యవస్థలకు నెలవుగా ఉన్నాయి. ఇవి మాత్రమే నేడు ఘోరంగా దెబ్బతింటున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కేర్ని ఛిన్నాభిన్నం చేసిన ట్రంప్ అమెరికాలోని మొత్తం ఇన్సూరెన్స్ మార్కెట్‌ని ప్రైవేట్ కంపెనీల పరం చేసేశాడు. ఇవి కరోనా తరహా వ్యాధులను స్వీకరించవు. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆవరించిన తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు వ్యక్తిగతంగా ఒక్కొక్క రోగి డిమాండ్లను గాలికొదిలేశాయి. ఒక్క బ్రిటన్ మాత్రమే మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన వారిలో 80 శాతం మంది వేతనాలను చెల్లిస్తానని బ్రిటన్ హామీ ఇచ్చింది. ఇది మినహా ఏ పెట్టుబడిదారీ దేశమూ బ్రిటన్‌లాగా సాహసం చేయలేదు. మెల్లమెల్లగా మనుషుల ప్రాణాలు హరించే వ్యాధులతో బాధపడేవారికి చికిత్స చేస్తూ రోగుల నుంచి వ్యక్తిగతంగా రోగుల నుండి డబ్బు గుంజుతూ ఆ లాభాల మీదే పెట్టుబడిదారీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు మనుగడ సాగిస్తుంటాయి. వీటి నైపుణ్యం, సాంకేతిక సామర్థ్యం శంకించడానికి వీల్లేనివి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను కరోనా వైరస్ కంపింపజేస్తున్న నేపథ్యంలో ఈ ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపారానికి ఇప్పుడు గండిపడింది. పెట్టుబడిదారీ, సోషలిస్టు దేశాలు, నిరంకుశ ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ బాధితులను పరీక్షించి, చికిత్స చేసే బాధ్యతను చేపట్టాయి. అయితే కొన్ని దేశాల్లో మినహాయిస్తే ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా పేలవంగా ఉంటోంది లేక అసలు ఉనికిలో కూడా ఉండటం లేదు. అమెరికా వంటి దేశంలో అత్యున్నతమైన వైద్య సామగ్రి, మంచి డాక్టర్లు ప్రైవేట్ రంగంలోనే అందుబాటులో ఉంటున్నారు. ఒబామా కేర్ కూడా ప్రభుత్వ వ్యయంతో ప్రైవేట్ రంగంలోని పేదలకు అందుబాటులో ఉండేలా ఆధునిక ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ బీమా రంగాన్ని ట్రంప్ కుప్పగూల్చేశాడు. ఇకపోతే 130 కోట్ల పైబడి జనాభా కలిగిన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అగాధంలో ఉందనే చెప్పాలి. భారత్‌లో మొదటి దశలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ తర్వాత్తర్వాత ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లడానికి ప్రభుత్వం తలుపులు తెరిచేసింది. 1990లో ప్రతిరంగంలోనూ పెట్టుబడుల ఉపసంహరణ మొదలైన తర్వాత భారత్‌లో యూరప్–అమెరికా తరహా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పర్చాలనే ఆకాంక్షతో ప్రైవేట్ ఆసుపత్రులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ వచ్చారు. దీంతో జనాభాలోని 55 శాతం మంది పేదలు, అసంఘటితరంగ కార్మికులకు ఇప్పడు ఊపిరి ఆడటం లేదు. కరోనా నేపథ్యంలో పేద, ధనిక తేడాలేకుండా భారతీయులందరికీ ఇప్పుడు స్వచ్ఛమైన ప్రాణవాయువు తప్పనిసరి అవసరం. అఖిల భారత వైద్య శాస్త్ర సంస్థలతో కూడి నిర్వహణ పేలవంగా ఉంటున్న ప్రభుత్వ వ్యవస్థ ఒక్కటే ప్రస్తుత సంక్షోభంపై తలపడుతోంది. మరోవైపున లాక్ డౌన్ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు మూతబడి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. కేరళలో ప్రజాస్వామిక సోషలిస్టు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మినహా మరే ప్రాంతంలోనూ గ్రామాలను పట్టణాలకు అనుసంధించిన తరహా గొలుసుకట్టు వ్యవస్థ కనిపించడం లేదు.కరోనాలాంటి మహమ్మారి వ్యాపించిన కాలంలో డాక్టర్లంతా యుద్ధకాలంలో సైనికుల్లాంటి వారు. కానీ, మామూలు సమయాల్లో సొమ్ము చేసుకున్న ప్రైవేట్ సెక్టార్ లోని డాక్టర్లు, నర్సులు ప్రస్తుతం సాధారణ పౌరుల్లా ఇంటి దగ్గర కూర్చుంటున్నారు. అందుకే వెంటనే డాక్టర్ల సేవలను జాతీయ అత్యవసర సర్వీసుగా ప్రకటించి, అందరినీ వెంటనే విధుల్లోకి హాజరుకావాల్సిందిగా ఆదేశించాల్సిన అవసరం ఉంది. తక్కువ వేతనం పొందుతున్న ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు ఇబ్బందులు పడుతుంటే ప్రైవేట్ డాక్టర్లు ఇంటిపట్టున కూర్చుంటున్నారు. దేశంలోని ప్రజలంతా డాక్టర్ల కోసం చప్పట్లు కొట్టారంటే, ఆ చప్పట్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లకేగానీ, ఇంట్లో కూర్చున్నవారి కోసం కాదు. భారత సైన్యం, పోలీసుల్లాగే డాక్టర్లు కూడా జాతీయ విధుల్లో పాలుపంచుకోమని చెప్పడానికి మనదేశంలో వీల్లేదు. పెట్టుబడిదారీ వైద్య విధానం క్యూబాలోవలే సోషలిస్టు వైద్య విధానంగా మారకపోయినా, కనీసం ఇటువంటి సమయాల్లో దేశీయ వైద్య విధానంగా మారాలి. పెట్టుబడిదారీ విధానం లాభాలనిస్తూ ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి దోహదపడుతుంది. పెట్టుబడిదారీ విధానంలో డబ్బే డబ్బును సృష్టిస్తుంది. జీవితాలను కాపాడాల్సిన ఆసుపత్రులు డబ్బు సృష్టించే యంత్రాలుగా మారాక, కరోనా వచ్చి కొత్త పాఠాలు చెబుతోంది. చదువుల కోసం, ఉద్యోగాల కోసం, స్థిరపడటం కోసం తమ పిల్లలను అమెరికా పంపాలనుకునే తల్లిదండ్రులకు కరోనా పీడకలగా మారింది. ఇది ప్రస్తుతం ఒక ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం కూడా దీనికి సాటిరాదు. కరోనా అనంతరం ఈ భూగ్రహంపై జీవితం గురించి చాలామంది ఆలోచనల్లో మార్పు వస్తుంది. కారల్ మార్క్స్ చెప్పిన సోషలిస్ట్ విధానాలను అనుసరిస్తూ పేద, ధనిక భేదం లేకుండా కలిసిమెలిసి జీవించాలి. భవిష్యత్‌లో మానవ జీవితం గురించి ప్రతి దేశం ఆలోచించాలి. అవసరమైనప్పుడు ప్రతి మనిషికీ ప్రాణవాయువును అందించగలిగే ఆరోగ్య సంరక్షణ కల్పించాలి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
సైన్స్‌ను విశ్వసిస్తేనే విజయం
భారతీయ వైద్య చరిత్రలో ప్లేగు వ్యాధిపై పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన తొలి వైద్యుడు డాక్టర్ యశ్వంత్‌రావు పూలే. 1896–97లో బ్యూబోనిక్ ప్లేగు విరుచుకుపడినప్పుడు బొంబాయిలో ప్రత్యేక క్లినిక్ ప్రారంభించి, కులమతాలకు అతీతంగా ప్లేగు రోగులకు సేవ చేస్తూన్న క్రమంలోనే తన తల్లి సావిత్రీబాయి పూలేతో పాటు డాక్టర్ యశ్వంతరావు కన్నుమూశారు. ఇప్పుడు ఎయిర్ కండిషన్ ఉన్న విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణాలు సాగిస్తున్న కాలంలో ఖండాంతరాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఇంకా ఎక్కువ ప్రమాదకారిగా మారనుంది. డాక్టర్ యశ్వంతరావు, సావిత్రీబాయి పూలే వంటి సాహసోపేతులైన వైద్యులు, నర్సులతో కూడిన ఆసుపత్రులు చేసే త్యాగాలు మాత్రమే ప్రపంచాన్ని, భారత్‌ని కాపాడగలవు. కోవిడ్–19 అటు సంపన్నుల్లో, ఇటు పేదల్లో ప్రపంచవ్యాప్త సంక్షోభాన్ని సృష్టించిందనడంలో సందేహమే లేదు. ప్రతి మనిషిలోనూ ఇప్పుడు నెలకొన్న మృత్యు భయం ప్రపంచవ్యాప్తంగా మానవుల్లోని మంచి, చెడు ప్రవర్తనకు పరీక్షకు గురిచేస్తోంది. విశ్వాసం ప్రాతిపదికగా ఏర్పడిన అన్ని సంస్థలూ, చివరకు మతాలు, మఠాలు, పీఠాలు, సన్యాసులు, సాధువులు, బిషప్‌లు, ముల్లాలు తది తరులందరూ కరోనా విషయమై పరీక్షకు నిలబడాల్సి వస్తోంది. ఈ ప్రాణాంతక సంక్రమణ వ్యాధికి వీరివద్ద ఏ మందూ లేదు మరి. ప్రపంచంలోని మానవులందరూ ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులే తమ ప్రాణరక్షకులని, ఆసుపత్రులు మాత్రమే తమని ప్రాణాలతో నిలిపే దేవాలయాలు అని నమ్మడం మొదలుపెట్టేశారు. ప్రతి క్షణం, ప్రతి గంటా కరోనాకు సంబంధించిన ప్రమాదాన్ని, ఆందోళనను ఎదుర్కొంటూనే కోవిడ్–19 రోగులకు సేవ చేయడంలో మునిగిపోయిన డాక్టర్లు, నర్సులందరికీ మనం తప్పక సెల్యూట్ చేయాలి. వాటికన్, మక్కా, తిరుపతి, షిర్డీ వంటి అన్ని ఆలయాలూ, చర్చిలూ, మసీదులూ, ప్రపంచంలోని అతి పెద్ద బౌద్ధ విహారాలు కూడా ప్రస్తుతం మూతపడిపోయాయి. భూమ్మీద నిజమైన దేవుడు లేక దేవత అయిన డాక్టర్, నర్సు కోసమే మనం ఇప్పుడు చూస్తున్నాం. నిస్సందేహంగానే, కోవిడ్–19 ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అదేమిటంటే సైన్స్, మందులతో కూడిన సరికొత్త ప్రపంచం. ఈ సందర్భంగా భారతీయ వైద్య చరిత్రలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మొట్టమొదటి డాక్టరు గురించి మనం తెలుసుకోవలసి ఉంది. 1897లో భారతదేశంలో బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి విజృం భించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మహాత్మా జ్యోతీరావ్ పూలే, సావిత్రీబాయి పూలేల దత్తపుత్రుడు డాక్టర్ యశ్వంతరావు పూలే నిజంగానే చరిత్రకెక్కారు. 1896–97 కాలంలో బొంబాయిలో ప్రత్యేక క్లినిక్ ప్రారంభించి ప్లేగు రోగులకు సేవ చేస్తూన్న క్రమంలోనే తనను దత్తత తీసుకున్న తల్లి సావిత్రీబాయి పూలేతో పాటు డాక్టర్ యశ్వంతరావు కన్నుమూశారు. సమకాలీన వైద్యులు కూడా అనుసరిం చాల్సిన గొప్ప ఉదాహరణగా ఆయన నిలిచిపోయారు. తన తల్లిదండ్రుల సామాజిక సంస్కరణోద్యమంలో భాగంగా అన్ని కులాలు, కమ్యూనిటీలకు చెందిన ప్లేగ్ రోగులకు సేవచేసిన మొట్టమొదటి వైద్యుడిగా డాక్టర్ యశ్వంతరావు పూలే చరిత్రలో నిలిచిపోయారు. బ్రిటిష్ పాలకులు కులాలకు అతీతంగా వైద్యసేవలందించడాన్ని తప్పనిసరి చేయడంతో బ్రాహ్మణులు వైద్య వృత్తిని చేపట్టడం నిలిపివేశారు. వర్ణధర్మానుసారం.. బ్రాహ్మణులు చికిత్స సమయంలో కూడా దళితులను, శూద్రులను తాకడానికి ఇష్టపడేవారు కాదు. అప్పుడే పూలే సత్యశోధక్ ఉద్యమం మానవ అస్పృశ్యత, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా భారీ ప్రచారాన్ని చేపట్టింది. పూలే దంపతులకు సంతానం లేకపోవడంతో బ్రాహ్మణ వితంతువు అయిన కాశీబాయి పుత్రుడిని దత్తత తీసుకున్నారు. భర్త మరణానంతరం ఆమె గర్భం దాల్చడంతో పూనాలోని ఛాందస బ్రాహ్మణులు ఆ వితంతువును చంపాలనుకున్నారు. బాలగంగాధర్ తిలక్ సైతం వారి ఈ ప్రయత్నాన్ని బలపర్చడం గమనార్హం. పూలే ఆమెను కాపాడి తమ ఇంట్లోనే ఆశ్రయమిచ్చి తల్లి, బిడ్డలను క్షేమంగా చూసుకున్నారు. 1874లో ఆ వితంతువు కుమారుడు యశ్వంతరావును పూలే దంపతులు దత్తత తీసుకున్నారు. అతడిని విద్యావంతుడిని చేసి వైద్యుడిని చేశారు. తాము ప్రారంభించిన సంఘ సంస్కరణోద్యమంలో పనిచేస్తున్న వ్యక్తి కుమార్తె రాధతో యశ్వంతరావుకు పెళ్లి చేశారు. అది కులాంతర వివాహం. బ్రాహ్మణ పండితులు జరిపే పెళ్లి పద్ధతికి భిన్నంగా దండలు మార్చుకునే సాధారణ పద్ధతిలో ఈ ఇద్దరి పెళ్లి చేశారు. దీంతో పూజారులు ఈ పెళ్లిని కోర్టుకు లాగారు కూడా. జ్యోతిబా పూలే 1890లో చనిపోయారు. తర్వాత సావిత్రి, ఆమె కుమారుడు తమ సామాజిక, వైద్య సేవలను కొనసాగించారు. సావిత్రీబాయి జీవిత చరిత్రకారుడొకరు ఇలా రాశారు: ‘ప్రపంచ మంతటా వ్యాపించిన మూడవ బ్యూబోనిక్ ప్లేగు సంక్రమణ వ్యాధి 1897లో మహారాష్ట్రలోని నల్లస్పోరా ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు సావిత్రీబాయి, యశ్వంతరావు సాహసోపేతంగా పూనా శివార్లలో ఒక క్లినిక్ ప్రారంభించి ప్లేగ్ వ్యాధికి గురైన రోగులకు సేవ చేశారు. రోగులను సావిత్రీబాయి క్లినిక్వద్దకు తీసుకువస్తే యశ్వంతరావు వారికి చికిత్స చేసేవారు. రోగులకు సేవ చేస్తున్న క్రమంలోనే సావిత్రీబాయికి కూడా ప్లేగు సంక్రమించి 1897 మార్చి 10న కన్నుమూశారు’. ఈ విషాదం అంతటితో ముగియలేదు. అదే సంవత్సరం ప్లేగు వ్యాధికి గురైన డాక్టర్ యశ్వంతరావు కూడా మరణించారు. బ్యూబోనిక్ ప్లేగు అనే ఈ సాంక్రమిక వ్యాధి మానవులు నివాసమున్న అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. ఈ వ్యాధి బారినపడి భారత్, చైనాల్లో కోటి 20 లక్షలమంది చనిపోయారు. ఒక్క భారత్‌లోనే కోటిమంది రోగులు చనిపోయారు. ఆ సమయంలో డాక్టర్ యశ్వంత రావు త్యాగం నుంచే భారతదేశంలో వైద్య చికిత్సలు రూపుదిద్దుకున్నాయి. ఆయనలాగే మరొక భారతీయ వైద్యులు డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ 1930లలో చైనాలో రోగులకు సేవలు చేసి చరిత్రలో మిగిలిపోయారు. 1938లో రెండో సీనో–జపనీస్ యుద్ధ కాలంలో వైద్యసేవలందించడానికి భారత్‌నుంచి వెళ్లిన అయిదుగురు వైద్య బృందంలో కోట్నీస్ ఒకరు. చైనాలో వైద్యసేవలందిస్తూనే కోట్నీస్ అమరుడయ్యారు. ఇప్పుడు ఎయిర్ కండిషన్ ఉన్న విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణాలు సాగిస్తున్న కాలంలో ఖండాంతరాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఇంకా ఎక్కువ ప్రమాదకారిగా మారనుంది. డాక్టర్ యశ్వంతరావు పూలే, సావిత్రీబాయి పూలే వంటి సాహసోపేతులైన సుశిక్షితులైన వైద్యులు, నర్సులతో కూడిన ఆసుపత్రులు చేసే త్యాగాలతో మాత్రమే ప్రపంచాన్ని, భారత్‌ని కాపాడగలవు. కొన్ని పాలకవర్గ శక్తులు కరోనా వైరస్ గురించి అనేక మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్న పరిస్థితుల్లో, మన సాహసోపైతమైన, త్యాగపూరితమైన వైద్య చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవాలి. మన వైద్య చరిత్రలో త్యాగానికి, బాధను భరించడానికి సంబంధించి డాక్టర్ యశ్వంత్‌రావు ఉత్తమ ఉదాహరణగా నిలబడతారు. మానవాళిపై కొత్తగా విరుచుకుపడుతున్న కరోనా సాంక్రమిక వ్యాధికి గోమూత్రం, గోవు పేడ టీకా మందుగా ఉపయోగపడతాయని కొన్ని శక్తులు ప్రచారం చేస్తున్నాయి. వీరు అలా నమ్ముతున్నట్లయితే నిక్షేపంగా వాటిని సేవించి నిజమైన క్షేత్రరంగంలో కోవిడ్–19 వైరస్ బారినపడిన వారికి సేవ చేసేందుకు ముందుకు ఉరకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రజలు మాత్రం పరీక్షకు నిలబడి.. నిరూపితమైన సైన్సు, మందులు, ప్రయోగశాలలు, డాక్టర్లు, నర్సులపై మాత్రమే ఆధారపడాలి. భారత్ ఇప్పుడు 130 కోట్లమంది ప్రజలున్న దేశం. భారత ప్రజారాశుల్లో చాలామంది తరతరాలుగా తమను వెంటాడుతున్న నిరక్షరాస్యత, అలక్ష్యంతో కూడిన వారసత్వానికి లోబడిపోయి మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, ముక్కును కవర్ చేసుకోవడం, నోటిని తాకకుండా ఉండటం వంటి సంరక్షణ పద్ధతుల గురించి మీడియా, మొబైల్ నెట్వర్క్ ప్రజలకు సమాచారం అందిస్తున్నాయి. అయినప్పటికీ కులతత్వం, అనాగరికత్వం మన నైతిక జీవనానికి మరింత నష్టం కలిగిస్తున్నాయి. సైన్స్, మందులపై విశ్వాసం ఉంచుతున్న కేరళ ప్రభుత్వం కోవిడ్–19 సాంక్రమిక వ్యాధితో ఉత్తమంగా పోరాడుతోందని ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆమోదించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు తమతమ ప్రాంతాల్లో వైరస్ అంత విస్తృతంగా వ్యాప్తిలో లేనప్పటికీ తగిన సన్నాహక చర్యలను తప్పకుండా చేపట్టాలి. కరోనా వైరస్ నిరోధక పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెడుతున్న నర్సులకు, డాక్టర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు, మెరుగైన పనిపరిస్థితులను అందచేయాలి. గ్రామస్థాయిలో వైద్యపరమైన వసతిసౌకర్యాలను నెలకొల్పడానికి భారతదేశం మరింత డబ్బును ఖర్చు చేయాలి, మరింతగా వైద్య, పారా మెడికల్ సిబ్బందికి ఉద్యోగాలు కల్పించాలి. ఈ అంశంలో మనం చైనానుంచి తప్పక నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటగా చైనాలోనే కరోనా వైరస్ పుట్టినప్పటికీ సైన్స్, మెడిసిన్‌పై అపార విశ్వాసం ఉంచినందుకే ఆ దేశం తక్కువ నష్టాలతో బయటపడటమే కాకుండా వైరస్‌ను పూర్తిగా అరికట్టింది కూడా. వ్యాసకర్త : ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
రాజధానిపై స్పందించిన కంచ ఐలయ్య
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు. రాజధానిని విభజించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు నష్టం లేకుండా చూడాలని కోరారు. రాజధాని కోసం సేకరించిన వేల ఎకరాలు ఇప్పటికీ ముట్టుకోకుండా ఉన్నాయని, మరో 20 ఏళ్లు అయిన చంద్రబాబు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేడని విమర్శించారు. భూములు కావాలన్న వారికి భూములు ఇవ్వాలని, రైతులకు ఇస్తానన్న పరిహారం 15 ఏళ్ల పాటు రూ. 50 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు. అదే విధంగా మత ప్రతిపాదికన పౌరసత్వాన్ని ఇవ్వడం సరైన పద్దతి కాదని.. నిరసనలు తెలుపుతున్న ముస్లింల వేషధారణ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రధానమంత్రి వేసుకున్న డ్రెస్ ముస్లిం వేషధారణ కాదా అని కంచ ఐలయ్య ప్రశ్నించారు. -
రాజ్యాంగ పఠనమే ప్రాణవాయువు
మహాత్మాగాంధీని, ఆయన్ని హత్యచేసిన నాథూరాం గాడ్సేని సరిసమాన దేశభక్తిపరులుగా పరిగణించినట్లయితే మన జాతి కానీ భారత ప్రజాస్వామ్యం కానీ మనలేవు. హంతకుడు, హత్యకు గురైనవాడు ఎన్నటికీ సమానులు కారని మన పిల్లలు నేర్చుకోవాలి. అహింసా ప్రబోధకుడిని, క్రూర హింస సమర్థకుడిని ఒకే స్థాయిలో గౌరవించకూడదని వారు నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మన జాతి గాంధీని, గాడ్సేని సమానం చేసి చూస్తున్న ఒకరకమైన మానసిక జాడ్యంలో కూరుకుపోతోంది. మనుషులు జన్మరీత్యా సమానులు కారని చెబుతున్న ప్రాచీన పరంపర స్థానంలో భారతీయులందరూ సమానులే అని ప్రకటించిన కొత్త పరంపరను భారత రాజ్యాంగం ప్రవేశపెట్టింది. పిల్లలు ప్రతిరోజూ రాజ్యాంగ పీఠికను పఠించడం, ప్రతి యువతీయువకుడూ రాజ్యాంగాన్ని పఠించడం మాత్రమే భారతదేశాన్ని అనేక ప్రమాదాల నుంచి కాపాడగలదు. ప్రతిరోజూ పాఠశాల ప్రార్థనా సమావేశంలో భారత రాజ్యాంగ పీఠికను తప్పకుండా చదివి వినిపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులందరూ తాము రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని విద్యార్థులు తప్పక గుర్తుంచుకోవాలి. ఇది గొప్ప జాతీయవాద ముందడుగు. దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ ప్రస్తుత మన జాతీయ సంక్షోభ సంధిదశలో దీన్ని తప్పక పాటించాల్సిన అవసరముంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని ప్రదర్శనలూ రాజ్యాంగ పీఠికను, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్తరువును తమ ఉద్యమ చిహ్నాలుగా మార్చుకున్నాయి. మహిళలూ, ఇంటిబయటకు సాధారణంగా రాని ముస్లిం మహిళలతోపాటు విశ్వవిద్యాలయాల విద్యార్థులూ వీధుల్లోకి వచ్చి అరాచకంలోకి జారిపోతున్న జాతిని కాపాడారు. ప్రజాస్వామ్యం కోసం, సమానత్వం కోసం పోరాటంలో రాజ్యాంగ పీఠికను, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను సమర సంకేతాలుగా ఎత్తిపట్టిన వీరు.. భారతీయ ప్రజాస్వామ్యం, దాని పనివిధానం గురించి అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ప్రతి కూల భావం నుంచి కూడా భారతదేశాన్ని కాపాడారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక రూపంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఒక భయంకరమైన భారత వ్యతిరేక జాడ్యం నేపథ్యంలో రాజ్యాంగ పీఠిక అనేది ప్రజలందరికీ ఒక ఆక్సిజన్ మాస్క్లాంటింది. ప్రజాస్వామిక ప్రభుత్వం, సమాజానికి సంబంధించిన జాతీయ స్ఫూర్తి, జీవ ధాతువుగా మన జాతి నిర్మాతలు మనకు ప్రసాదించిన రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ నీతిని విశ్వసించే ప్రస్తుత తరం పిల్లలపైనే మన రాజ్యాంగం భవిష్యత్ మనుగడ ఆధారపడి ఉంది. మహాత్మాగాంధీని, ఆయన్ని హత్యచేసిన నాథూరాం గాడ్సేని సరిసమాన దేశభక్తిపరులుగా పరిగణించినట్లయితే మన జాతి కానీ భారత ప్రజాస్వామ్యం కానీ మనలేవు. జీవితం తొలి దశలోనే మన పిల్లలు మంచికీ చెడుకీ మధ్య తేడాని గుర్తించగలగాలి. హంతకుడు, హత్యకు గురైనవాడు ఎన్నటికీ సమానులు కారని వారు నేర్చుకోవాలి. అహింసా ప్రబోధకుడిని, క్రూర హింస సమర్థకుడిని ఒకే స్థాయిలో గౌరవించకూడదని వారు నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మన జాతి గాంధీని, గాడ్సేని సమానం చేసి చూస్తున్న ఒకరకమైన మానసిక జాడ్యంలో కూరుకుపోతోంది. ‘భారతప్రజలమైన మేము, మా మతం, కులం, జాతి, లింగం వంటివి చూసుకోకుండానే ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న మాకు మేముగా ఇచ్చుకుంటున్నాము’ అని రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. ఆరోజు నుంచి అన్నిరకాల కులపరమైన, మతపరమైన, వలసవాద, లింగపరమైన అసమానతలన్నింటి ప్రాతిపదికన నడుస్తున్న ప్రాచీన భారతదేశ వారసత్వ పరంపర స్థానంలో అంబేడ్కర్ పేర్కొన్నటువంటి ప్రతి వ్యక్తికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రం వచ్చి చేరింది. ఈ హక్కులు దేశంలోని ప్రతి కులం, మతం, జాతి, లింగ భేదంతో పనిలేకుండా అందరికీ వేరుపర్చలేని హక్కులుగా ఉంటాయి. ఈ హక్కుల్ని జాతీయ పౌరసత్వ పట్టిక తొలగించలేదు. ఏదైనా కారణాల వల్ల ఇతర దేశాలనుంచి వలస వచ్చినవారికి కూడా మనం రక్షణ, జీవనాన్ని కల్పించాలని భావిస్తే, మతంతో పనిలేకుండా అలాంటి వారందరికీ మన దేశ పౌరసత్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలా వలస వచ్చిన వారిలో మానవత్వాన్నే తప్ప వారి మతాన్ని మనం చూడకూడదు. భారతదేశం లౌకికదేశం అని రాజ్యాంగ పీఠిక ప్రకటిస్తోంది. మతం అనేది వ్యక్తిగతమైన ఎంపిక అని ఒక ప్రైవేట్ వ్యవహారమని ప్రాథమిక పాఠశాల దశనుంచి మన పిల్లలు తెలుసుకోవాలి. పౌరసత్వం ఇవ్వడానికి మతం పునాదిగా మారినట్లయితే అది రాజ్యాంగం హామీపడిన లౌకికవాదాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. జాతిమొత్తం మీద తమ వ్యక్తిగత మతాన్ని రుద్దాలని చూస్తున్నవారు మన రాజ్యాంగ నీతినే వ్యతిరేకిస్తున్నట్లు లెక్క. రాజ్యాంగ పీఠికలో పొందుపర్చిన సోషలిజం భావన వాస్తవానికి కమ్యూనిస్టు సామ్యవాదం గురించి చెప్పడం లేదు కానీ, అది ఆధునిక ప్రజాస్వామిక సంక్షేమ వ్యవస్థకు గట్టి పునాదిని కల్పిం చింది. విద్యా హక్కు, ఉపాధి హక్కు, శ్రమను గౌరవించే హక్కు, గృహవసతి హక్కు, వృద్ధాప్య íపింఛన్లు వంటి ప్రభుత్వాలు ఇవ్వాళ అందిస్తున్న హక్కులన్నింటికీ మన రాజ్యాంగ పీఠికే హామీ ఇస్తోంది. కాబట్టి భవిష్యత్ తరాల పౌరులు ప్రజాస్వామ్యాన్ని, గణతంత్ర ప్రభుత్వ వ్యవస్థ రూపాన్ని కాపాడే విషయంలో పోరాడకపోతే మన మొత్తం వ్యవస్థ ఏ మార్గంలోనైనా పయనించవచ్చు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యం రద్దయి నియంతృత్వం ముందుకురావచ్చు కూడా. మన పాలకుల ఆలోచనలు మన అంచనాలకు అందకుండా పోతున్నప్పుడు, ప్రస్తుత ప్రజాస్వామిక, గణతంత్ర వ్యవస్థను నిలబెట్టుకోవాలంటే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే మన ఏకైక ఆశాదీపంగా ఉంటున్నాయి. ఇక్కడే మన యువతీయువకులు మన స్వాతంత్య్ర యోధుల పోరాటాలు, వలస పాలకులకు వ్యతిరేకంగా వారు చేసిన త్యాగాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఒక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని స్థాపించుకోవడం కోసం వేలాదిమంది ప్రాణత్యాగాలు చేశారని మన పిల్లలు తెలుసుకోవాలి. మన రాజ్యాంగాన్ని న్యాయస్థానాలు కాపాడతాయని, ప్రజలు దీనిగురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించడం సరైంది కాదు. న్యాయవ్యవస్థ కూడా తమ సొంత అభిప్రాయాలు, భావజాలాలు కలిగి ఉన్న మనుషుల నాయకత్వంలోనే ఉంటున్నాయి. ప్రజల అప్రమత్తత న్యాయవ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మలిచి రాజ్యాంగ సంరక్షణ ప్రక్రియను కాపాడగలుగుతుంది. చారిత్రకంగా చూస్తే భారతీయులు క్రమంతప్పకుండా పుస్తకాలు చదివే అలవాటు కానీ, ఇళ్లలో పుస్తకాలు భద్రపరచుకునే అలవాటు కానీ కలిగి లేరు. ప్రతి భారతీయుడూ రాజ్యాంగాన్ని చదవడం తమ విధిగా భావిం చాల్సి ఉంటుందని మన పిల్లలకు తెలియజెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సాధారణంగా రాజ్యాంగాన్ని చదవడం అనేది న్యాయవాదులు, రాజనీతి శాస్త్రం అధ్యాపకులకు సంబంధించిన పనిగా ప్రజలు భావిస్తుంటారు. కానీ ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు. ప్రతి భారతీ యుడూ పాఠశాల విద్యా దశలోనూ, తదనంతర జీవితంలోనూ రాజ్యాంగాన్ని తప్పకుండా పఠించవలసిన అవసరం ఉంది. మత గ్రంథాలను ఆ మతానికి చెందిన ప్రజలు మాత్రమే చదువుతారు. కాని ఏ మతానికి, భాషకు చెందిన వారైనా సరే.. ప్రతి ఒక్క భారతీయుడూ చదవాల్సిన గ్రంథమే భారత రాజ్యాంగం. రాజ్యాంగ గ్రంథాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని భాషల ప్రజానీకానికి రాజ్యాంగ ప్రతిని తప్పనిసరిగా అందించాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి విధించిన 1975–77 మధ్య కాలంలో రాజ్యాంగంపై కాస్త చర్చ చోటు చేసుకుంది కానీ ఆ సమయంలో విద్యావంతులైన ప్రజల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు మనకు ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నాటి భారతదేశంలో ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.విద్యావంతులు స్వార్థ దృక్పథంతో వ్యవహరించినప్పుడు, వారు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నపరిచే కార్యకలాపాలలో మునిగితేలుతారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ సూత్రం సారాం శానికి విద్య మాత్రమే హామీ ఇవ్వలేదు. విద్యావంతులే భారత్‌లో కులాన్ని, అస్పృశ్యతను సృష్టించిపెట్టారు. వారు ఇతరులను కూడా మన ఈ వారసత్వాన్ని ఆచరించాలని కోరుతూ వచ్చారు. కానీ మన రాజ్యాంగం ఆ పరంపరను వ్యతిరేకిస్తోంది. భారతీయులందరూ సమానులే అని అది ప్రకటిస్తోంది. సమానత్వానికి సంబంధించిన సరికొత్త పరంపరను అది ప్రారంభిం చింది. కానీ ఈ రాజ్యాంగ సూత్రాన్ని ఇప్పుడు అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి దుష్ట శక్తులను మనం వ్యతిరేకించి తీరాలి. ప్రస్తుతం విద్యావంతులు సంపన్నులకు, శక్తిమంతులకు మాత్రమే సర్వస్వం అనే భావనకు బదులుగా అందరికీ మంచి, అందరికీ సమానత్వం, అందరికీ సంక్షేమం అనే భావనలను గురించి ఆలోచించాలి. ప్రజలందరి మేలుకోసం ప్రజలు జీవించడమే రాజ్యాంగానికి అసలైన అర్థం. భారతీయ పిల్లలు ప్రతిరోజూ రాజ్యాంగ పీఠికను పఠించడం, ప్రతి యువతీయువకుడూ మన రాజ్యాంగాన్ని పఠించడం అనేది మాత్రమే భారతదేశాన్ని అనేక ప్రమాదాల నుంచి కాపాడగలదు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ KANCHE -
జేఎన్‌యూ విద్యార్థిగా ‘కంచ ఐలయ్య’
సాక్షి, న్యూఢిల్లీ : ఈ మనిషి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి వెళుతుండగా పోలీసులు ఆపి ‘లోపల గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పేరెంట్స్, సంరక్షకులు లోపలికి పోరాదు’ అని చెప్పారు. ‘కానీ నేను జేఎన్‌యూ విద్యార్థిని’ అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు. ఆయనకు 47 ఏళ్లు. కేరళకు చెందిన ఆయన పేరు మొహినుద్దీన్. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా 1989 నుంచి జేఎన్‌యూలో చదువుతున్నారు. అనే పోస్ట్ ఫేస్బుక్లో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. జేఎన్‌యూలో హాస్టల్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్ష, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుండగా, ఫీజుల పెంపును బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు సమర్థిస్తున్న విషయం తెల్సిందే. హాస్టల్ ఫీజులు అతి తక్కువగా ఉండడం వల్లనే 47 ఏళ్లు వచ్చిన వారు కూడా ఇప్పటికీ విద్యార్థులుగా హాస్టల్లో ఉంటున్నారన్న ఉద్దేశంతో జేఎన్‌యూ విద్యార్థుల పేరిట ‘శాస్త్రీ కౌశాల్కిషోర్డ్’ పేరిట ఓ అమ్మాయి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, వాసుదేవ్ జీ రామ్నాని, సుశీల్ మిశ్రా, హరిదాస్ మీనన్ తదితరులు రీపోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను ఎంతవరకు నమ్మారో తెలియదు. కేరళకు చెందిన మొహినుద్దీన్ అంటూ పెట్టిన ఫొటోను చూసిన వారు మాత్రం ఎవరూ నమ్మడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ జిల్లా వాసి ‘కంచ ఐలయ్య’ ఫొటో అది. తెలుగు వారందరికి అతను సుపరికితులే. ‘కంచ ఐలయ్య గొర్రెలకాపరి’ అని గర్వంగా చెప్పుకునే ఆయన ప్రముఖ దళితుల హక్కుల కార్యకర్త. రాజకీయ తత్వవేత్త, రచయిత. ‘వైశ్యాస్: సోషల్ స్మగ్లర్స్’ అంటూ ఆయన రాసిన పుస్తకం వివాదాస్పదమైంది. ఉస్మానియా యూనివర్శిటీలో ‘బుద్దిజం’లో పీహెచ్డీ చేసిన ఆయన హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (ఎంఏఎన్‌యూయూ)లో ‘సెంటర్ ఫర్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ’ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జెఎన్యూలో పీహెచ్డీ చేస్తున్న స్కాలర్లలో కూడా 47 ఏళ్ల మొహినుద్దీన్యే కాకుండా అసలు 40 ఏళ్లు దాటిన వారే లేరని వామపక్ష విద్యార్థి సంఘాలు తెలిపాయి. చదవండి: ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్ జేఎన్‌యూ హింస: ముసుగు ధరించింది ఆమె! ఎందుకు అరెస్టు చేయలేదు? ‘అర్బన్ నక్సల్స్తోనే జేఎన్యూకు అపకీర్తి’ -
‘మతమార్పిడులకు ఆరెస్సెస్ ఎందుకు అనుమతించాలి?’
సర్వేజనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ!.. సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్ దుఃఖ మాప్నియా!! లోకః సమస్తా సుఖినో భవంతు... అంటే సర్వజనులు ఎలాంటి బాధలు లేకుండా సుఖశాంతులతో జీవించాలని హిందుత్వం అభిలాషిస్తుంది. అంటే భారతీయులో, హిందువులో మాత్రమే సుఖ శాంతులతో జీవించాలని హిందుత్వం కోరుకోవడం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలనే విశాల దృక్పథాన్ని ప్రబోధించేది హిందుత్వం. కాబట్టే 1983లో చికాగో (అమెరికా)లో జరిగిన సర్వమత సమ్మే ళనంలో స్వామి వివేకానంద హిందుత్వం గొప్పతనాన్ని చాటి చెప్పిన తర్వాత ఎంతోమంది క్రైస్తవ మత ప్రబో ధకులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రొ. కంచ ఐలయ్య రాసిన ‘మరి మతం మారితే అభ్యంతరమేల?’ అనే వ్యాసం (అక్టోబర్ 10, 2019) చదివిన తర్వాత ఆయన వైఖరి సమాజంలో భేద భావాలు పెంచే విధంగా ఉండటంతో నేను కొన్ని వాస్త వాలు తెలియజేయాలని ఈ వ్యాసం రాస్తున్నాను. విదేశీయులెందరో ముఖ్యంగా పాశ్చాత్యులు హిందు త్వంలోకి మారి హిందూ ఆరాధనా పద్ధతులు ఆచరిం చడం, హిందూ దేవుళ్లను పూజించడం సాధారణమైంది. అందుకే ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్, ఇస్కాన్ లాంటి సంస్థలెన్నో విదేశాల్లో ప్రాచుర్యం, ప్రజాదరణ పొందుతు న్నాయి. ఎంతోమంది విదేశీయులు భారతీయ విధానంలో వివాహాలు చేసుకోవడం కూడా మనందరికీ తెలిసిందే. ఇలా ఆచరిస్తున్న వారెవ్వరినీ ఇంకెవరో ప్రలోభపెట్టో, మోసం చేసో, మరే విధంగానైనా ఒత్తిడి చేసో హిందుత్వ విధానాలు ఆచరింప జేయట్లేదనేది అక్షర సత్యం. ఇక కంచ ఐలయ్య పేర్కొన్న ఆరెస్సెస్ పుస్తకం విష యానికి వస్తే అందులో అలాంటి విషయాలెన్నో ఉన్నా కేవలం క్రైస్తవ మహిళల అక్షరాస్యత అంశాన్ని మాత్రమే తీసుకొని తన భావాలకు అనుగుణంగా వక్రీకరించి రాయ డం ఆయన హ్రస్వ దృష్టిని సూచిస్తోంది. హిందుత్వం ఎక్కడ మంచి ఉన్నా తనలో ఇనుమడింపజేసుకుంటుంది. అలాగే ఆరెస్సెస్ కూడా. అందుకే 1925లో విజయదశమి రోజు కేవలం 10–18 మంది చిన్నపిల్లలతో కలిసి డా. హెడ్గేవార్ నాటిన విత్తు క్రమపద్ధతిలో పెరిగి మొక్క అయి, వృక్షమై, ప్రస్తుతం వట వృక్షమై విశ్వవ్యాప్తమైంది. అలాంటి ఆరెస్సెస్ గతంలో కూడా ఎన్నో మంచి విషయాలను లోకానికి తెలియజేసింది. వాటిని కూడా ఆయన పేర్కొంటే బాగుండేది. క్రిస్టియానిటీ స్త్రీ–పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను దాటుకుంటూ వచ్చింది అని రాశారు. అందులో నూటికి నూరుపాళ్లు నిజం ఉంది. తప్పులేదు. కానీ హిందుత్వంలో స్త్రీ పురుష అసమానత్వం అనే ఆలో చనే లేదు. కాబట్టే ‘యత్ర నార్యన్తు పూజ్యతే రమంతే తత్రదేవతా’ అంటే ఎక్కడ నారీమణులు పూజింపబడ తారో అక్కడే దేవతలు విహరిస్తారు అని హిందుత్వం స్పష్టంగా ప్రబోధిస్తుంది. త్రిమూర్తులే కాదు. భారతీయు లంతా భూమిని భూదేవిగా, భారతమాతగా, గంగానదిని గంగామాతగా, ప్రకృతిని ప్రకృతి మాతగా పిలుస్తారు. అంటే స్త్రీని తల్లిగా భావించి గౌరవించడం, పూజించడం ఒక్క హిందుత్వంలోనే ఉంది. అంటే పురుషుడికంటే ఉన్న తమైన స్థానంలో అనాదిగా మహిళలు గౌరవింపబడుతు న్నది భారతదేశంలోనే. అంతేకాదు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఒక సంద ర్భంలో భారత దేశంలో మహిళల పరిస్థితిని గురించి వివ రిస్తూ, పురుషుల కంటే ఉన్నత స్థానంలో ఉన్నారని, కాబట్టి స్త్రీ పురుష అసమానత్వం అనేది భారతదేశంలోని మహి ళలకు వర్తించదనడం భారత్‌లో మహిళలకు ఉన్న గౌరవ ప్రతిష్టలను తెలియజేస్తుంది. బ్రిటిష్ పరిపాలనకు పూర్వం భారత్‌లో అక్షరాస్యత అధికంగా ఉండేది. ప్రతి ఒక్కరికి గురుకులాలు అందుబాటులో ఉండేవి. బ్రిటిష్‌వారు ఇక్కడి విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. వేద విజ్ఞానాన్ని నాశనం చేశారు. గణితంలో కీలకమైన ‘0’ (సున్నా)ని కను గొన్నది భారతీయుడే. ప్రపంచంలో తొలిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేసింది శుశ్రూతుడు కాగా, ఆర్యభట్ట పేరు గడించిన ఖగోళ శాస్త్ర వేత్త అనే విషయం మనకు తెలిసిందే. బ్రిటిష్ వారి కాలం నుంచి క్రిస్టియన్ మిషనరీలు భారతదేశంలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మత మార్పి డులకు పాల్పడ్డారు. వారి పాపకార్యం ఇప్పటికీ కొనసాగు తోంది. నిరక్షరాస్యులైన, అమాయకులైన దళితులను, గిరి జనులను, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి కష్టాల్లో ఉన్న వారిని వివిధ రకాలుగా ప్రలోభపెట్టి, మోస పూరిత విధానాలతో వారిని క్రైస్తవులుగా మారుస్తున్నది నిజం కాదా? భారత రాజ్యాంగంలో ప్రతిపౌరుడూ తనకి ష్టమైన మతాన్ని, పూజా విధానాన్ని ఆచరించే అవకాశం ప్రాథమిక హక్కుల్లో స్పష్టంగా పేర్కొంది. క్రైస్తవుల్లో అక్షరాస్యత ఎక్కువుంటే అందరూ క్రైస్తవులుగా మారితే తప్పేంటి? ఆరెస్సెస్ ఇందుకు అంగీకరించాలి. దేశంలో ఉన్న మత మార్పిడుల నిషేధ చట్టాలన్నీ తొలగించాలంటున్నారు. మతమార్పిడులకు ఆరెస్సెస్ ఎందుకు అనుమతించాలి. ఆరెస్సెస్ ప్రారంభం నాటి నుంచి నేటి వరకు స్పష్టమైన, భారతదేశానికి అవసరమైన విధానాలనే ఆచరిస్తుంది, తెలి యజేస్తుంది. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ సంపదను దోచుకుతింటూ విదేశాలకు జైకొట్టే, విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన దేశ వ్యతిరేకులెవరైనా, వారు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా చివరికి హిందువు లైనా ఆరెస్సెస్సే కాదు దేశభక్తులెవరూ సహించరు. ప్రతి వ్యక్తిలో, ప్రతి మతంలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి విషయంలో మంచి చెడులుండటం సహజం. అలాగే క్రైస్తవంలో ఉన్న ఒకే ఒక మంచి విషయాన్ని పట్టుకొని మిగిలిన మతాలవారు క్రైస్తవంలోకి రావాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. చరిత్రలో ఎన్నో ఆటుపోట్లకు లోనై కూడా ఇప్పటికీ అజరామరంగా విరాజిల్లుతున్న, అత్యున్నతమైన జీవన విధానాన్ని అందిస్తున్న హిందుత్వం లోకే క్రైస్తవులు (గతంలో వీరంతా హిందువులే) తిరిగి వస్తే తప్పేంటి? కంచ ఐలయ్య లాంటి వారు మతం మారినంత మాత్రాన హిందువులుగా మరణించిన వారి పూర్వీకుల ఆత్మలు ఘోషించవా? ఇప్పటికైనా మతం మారాలనుకునే ప్రతి ఒక్కరూ వారి పూర్వీకుల మతం పరిస్థితి ఏంటి? అనే విషయం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (ప్రొఫెసర్ కంచ ఐలయ్య 10–10–2019(గురువారం) సాక్షి సంచికలో రాసిన వ్యాసానికి స్పందన) వ్యాసకర్త: శ్యాంసుందర్ వరయోగి, సీనియర్ జర్నలిస్ట్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ రాఘవ్స్ ఫౌండేషన్, హైదరాబాద్ చదవండి: మరి మతం మారితే అభ్యంతరమేల?