మీరు ఎంతకాలం పాలించారు అనేది ప్రజలకు ముఖ్యం కాదు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా పాలించారన్నది ముఖ్యం. ఆ పదవీ కాలంలో చేసిన కృషి వల్ల తర్వాతి తరాల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందన్నదాన్ని బట్టి వారి స్థానాన్ని చరిత్ర నిర్ధారిస్తుంది. అతి తక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్నప్పటికీ, అనితరసాధ్యమైన మండల్ రిజర్వేషన్ల అమలుకు పూనుకొని దేశంలోని శూద్ర వర్గాలకు ఎనలేని సేవ చేశారు క్షత్రియుడైన వీపీ సింగ్. ఆయన అలా చేసి ఉండకపోతే, భారతదేశ చరిత్రలో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగేది కాదు. అందుకే స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా ఆయన పాత్రను తిరిగి అంచనా వేయవలసి ఉంది.
జూన్ 25న న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో దివంగత ప్రధాని వీపీ సింగ్ (విశ్వనాథ్ ప్రతాప్ సింగ్: 25 జూన్ 1931 – 27 నవంబర్ 2008) 92వ జయంతి వేడుకల సమావేశాన్ని నిర్వహించేందుకు అనేక సామాజిక న్యాయ అనుకూల సంస్థలు ప్లాన్ చేశాయి. దాదాపుగా మర్చిపోయిన మండల్ మహాపురుషుడు అయిన వీపీ సింగ్ గురించి ఇటువంటి వేడుకలు జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఉత్తరప్రదేశ్‌లోని క్షత్రియ రాజ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకోవడానికి పలువురు రాజకీయ నాయ కులు, కార్యకర్తలు, రచయితలు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు.
తనను తాను ఓబీసీ అని చెప్పుకొన్న నరేంద్ర మోదీ నుంచి అనేక ఇతర ప్రధానమంత్రులను దేశం చూసి ఉన్నందున, స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా వీపీ సింగ్ పాత్రను తిరిగి అంచనా వేయవలసి ఉంది. అదే రాష్ట్రంలోని భూస్వామ్య పాలక నేపథ్యం ఉన్న యోగీ ఆదిత్యనాథ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి క్షత్రియ పాలకులతో పోలిస్తే ప్రధానమంత్రిగా వీపీ సింగ్ పాత్రను కూడా మనం పునరావలోకనం చేయాల్సి ఉంది.
మండల్ సిఫారసుల అమలు
ఓబీసీలకు జాతీయ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేసిన మండల్ కమిషన్ అమలును సమర్థించడం కోసం ఆనాడు వీపీ సింగ్ చేసిన పోరాటాన్ని చూసిన వ్యక్తిగా... ఆ సమయంలో మోదీ ప్రధానిగా ఉండి ఉంటే వీపీ సింగ్‌లాగా మండల్ కమిషన్ సిఫార్సు లను అమలు చేసి ఉంటారా అని అడగాలనుకుంటున్నాను. అలాగే మండల్ రిజర్వేషన్లతో లబ్ధిదారుడై ప్రధాని అయిన శూద్రుడు దేవే గౌడ అయినా అలా చేసి ఉంటారా అని నేను అడుగుతున్నాను.
నల్లజాతీయుల హక్కుల కోసం నిలబడి, హత్యకు గురవడానికి కూడా అబ్రహాం లింకన్ సిద్ధపడిన విధంగా... సామాజిక న్యాయ పరిరక్షణం కోసం ఆనాడు వీపీ సింగ్ తీసుకున్న సైద్ధాంతిక, నైతిక వైఖరిని మరెవరూ తీసుకుని ఉండరు. అబ్రహాం లింకన్ అమెరికాలో తన జీవితాన్ని త్యాగం చేయగా, వీపీ సింగ్ మండల్ వ్యతిరేక పాలక శక్తులలో తన స్థానంతోపాటు, ప్రతిష్ఠను కూడా త్యాగం చేశారు. ఆ సమయంలో ఆయనకు బద్ధశత్రువుగా ఉన్న కాంగ్రెస్, అన్ని విధాలా ఆయన పని ముగించడానికి సిద్ధపడింది. వీపీ సింగ్ అధికారాన్ని బీజేపీ కూలదోసిన వెంటనే కాంగ్రెస్ అదే ఉత్తరప్రదేశ్ నుంచి మరో క్షత్రియుడైన చంద్రశేఖర్‌ను ప్రధానిగా తీసుకొచ్చింది. ఆయన తన జీవితమంతా సోషలిస్టుగా నటించారు కానీ బలమైన సామాజిక న్యాయ వ్యతిరేక శక్తిగా మిగిలిపోయారు.
1991లో మరొక కాంగ్రెస్ వ్యక్తి పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. వీపీ సింగ్ తన పదవిని పణంగా పెట్టి ఆ రిస్క్ తీసుకోకపోయి ఉంటే, మండల్ రిజర్వేషన్లను పీవీ అమలు చేసి ఉండేవారని ఎవరూ అనుకోలేరు. ఆ సమయంలో అనేక ఇతర రాజకీయ శక్తులు మండల్ రిజర్వేషన్ల అమలు కోసం డిమాండ్ చేసిన మాట నిజం. అయితే వీపీ సింగ్ అలా చేసి ఉండకపోతే, భారతదేశ చరిత్రలో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగేది కాదు. ఎందుకంటే ఆనాటి శూద్ర ఓబీసీలు ఆ సమయంలో సామాజిక న్యాయానికి సంబంధించిన సైద్ధాంతిక, తాత్విక సమస్యను నిర్వహించడంలో పూర్తిగా అసమర్థులుగా ఉండేవారు.
మండల్ రిజర్వేషన్ అమలు కోసం డిమాండ్ చేసి దాన్ని అమలు చేయడానికి ఉత్తర భారతదేశంలో కొంతమంది రాజకీయ నాయకులు ఉండి ఉన్నప్పటికీ, శత్రుత్వంతో కూడిన అధికార నిర్మాణాలు, మీడియా నుంచి పూర్తిగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మండల్ రిజర్వేషన్‌ని రక్షించడానికి తగిన మేధో శక్తులు ఆనాటి శూద్ర ఓబీసీలలో లేవు. మీడియాలోని అరుణ్ శౌరీ తరహా సామాజిక న్యాయ వ్యతిరేక శక్తులు, అన్ని పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా (దూరదర్శన్‌తో సహా) మండల్ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీరంతా ఓబీసీ నాయకులను చాలా తేలికగా కట్టిపడేసేవారు. వారు ద్విజ యువ కులను ఆత్మాహుతి చేసుకునేలా పురికొల్పడమే కాకుండా, మండల్ అనుకూల శక్తులను దూషించడం, దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. కమ్యూనిస్ట్ ద్విజులు కూడా మండల్ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉండేవారు.
దొరకని జాగా
నేను, నాతోపాటు గెయిల్ ఓంవెద్ వంటి చాలా కొద్దిమంది మండల్ అనుకూల రచయితలు వీపీ సింగ్ విధానానికి మద్దతుగా ఆంగ్లంలో ఒక చిన్న కథనాన్ని కూడా ప్రచురించడానికి స్థలం కోసం కష్టపడాల్సి వచ్చేది. ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ వంటి పత్రికలు మాత్రమే కనీసంగా చోటిచ్చాయి. అప్పట్లో సోషల్ మీడియా అంటూ ఏమీ లేదు. మేము నిస్సహాయంగా ఒంటరిగా ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయాం. కానీ ఏకైక బలం ఏమిటంటే, ఆగస్ట్ 15న ఎర్రకోట నుండి చేసిన అత్యంత ధైర్యంతో కూడుకున్న ప్రసంగంతో సహా సాధ్యమైన ప్రతి ప్రజా వేదిక నుండి మండల్ రిజర్వేషన్ అమలును వీపీ సింగ్ పట్టువిడవకుండా సమర్థించడమే.
ఆయన రాజీనామా లేఖ, తాను రాజీనామా చేయడానికి ముందు దేశాన్ని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం... ఆయనకు ముందు, ఆ తర్వాత ఉండిన ఇతర ప్రధాన
మంత్రులందరినీ అవమానం, అపరాధంతో కూడిన చీకటి మేఘాలలో ఉంచింది. స్వయం ప్రకటిత ఓబీసీగా చెప్పుకొని, ఆ విధంగా మరిన్ని ఓట్లు తెచ్చుకున్న ప్రధాని మోదీ, క్షత్రియ నేపథ్యం ఉన్న వీపీ సింగ్ ఆనాడు సామాజిక న్యాయంపై చేసిన ఆ తాత్విక పరిరక్షణ ఉపన్యాసాలను చదివితే, నిజంగానే తల వంచుకోవాల్సి వస్తుంది. ధైర్యంగా, దృఢనిశ్చయంతో మండల్ రిజర్వేశషన్‌ని అమలు చేసిన భారతదేశ అసాధారణమైన ప్రధాన మంత్రిగా ఆ వ్యక్తి పేరును మోదీ ఎన్నడూ తలవరు. ఆయన పుట్టిన రోజున ఎప్పుడూ ప్రకటన ఇవ్వరు.
నిశ్శబ్ద విప్లవం
వీపీ సింగ్ ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఆ కొంతకాలం (2 డిసెంబర్ 1989 – 10 నవంబర్ 1990), గ్రామాల్లో చెప్పుకొనే ఒక సామెతను గుర్తు చేస్తుంది. ‘మీరు ఎంతకాలం పాలించారు అనేది ప్రజలకు ముఖ్యం కాదు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా పాలించారన్నది ముఖ్యం’. వీపీ సింగ్ ఏడాది కంటే తక్కువ పాలనతో పోలిస్తే... నెహ్రూ పదిహేడేళ్ల పాలన, ఇందిరాగాంధీ పద్నాలుగేళ్ల కష్టతరమైన పాలన, ఇఫ్పుడు మోదీ పదేళ్ల పాలన మసకబారి పోతుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలోనే, ఐదు వేల సంవత్సరాల దేశ చరిత్రను ఆయన మార్చేశారు.
తీన్ మూర్తి హౌస్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైమ్ మినిస్టర్ల సంగ్రహాలయంలో వీపీ సింగ్‌కు ఎంత స్థలం కేటాయించారో నాకు తెలియదు. కానీ నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీతో సహా మిగతా ప్రధానులందరికీ లభించినంత స్థలానికి ఆయన పూర్తిగా అర్హులు.
ప్రస్తుత, గత పాలక పార్టీలు ఆయనను మరచిపోవాలని కోరు కున్నప్పుడు ప్రజలు ఆయనను వారి జ్ఞాపకాలలోకి తప్పక తీసుకు రావాలి. అంతేకాకుండా ఆయన పుట్టిన రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ముఖ్యం. సామాజిక న్యాయ రాష్ట్రంగా ఉంటున్న తమిళనాడు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వీపీ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రయత్నాలు తప్పక జరగాలి.
-కంచె ఐలయ్య, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment