ఇవీ మన కొత్త చట్టాలు–7
కొత్త న్యాయ చట్టాలను తీసుకు వచ్చామని ఆర్భాటంగా ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి: ఆ చట్టాలను ప్రభుత్వం కొత్తగా రూపొందించిందా లేక పాత చట్టాల నుంచి వివిధ అంశాలను స్వీకరించిందా? ఎందుకంటే పేరుకు కొత్త చట్టాలే కాని వీటిలో అధిక భాగాలు పాత చట్టాల నుంచి కాపీ కొట్టినవేనని న్యాయశాస్త్ర కోవిదులు చాలా మంది ప్రకటిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ తరుణబ్ ఖైతాన్ ఈ చట్టాలను ‘టర్ట్ ఇట్ ఇన్’ అనే టెక్నాలజీని ఉపయోగించి పరిశీలించినప్పుడు బయటపడిన అంశాలు ఈ సందర్భంగా గమనార్హం.
1. భారతీయ న్యాయ సంహిత –2023లోని 83 శాతం అంశాలు ఇండియన్ పీనల్ కోడ్ 1860 (పాత బ్రిటిష్ చట్టం) నుంచి కాపీ, పేస్ట్ చేసిందే.
2. భారతీయ నాగరిక సురక్ష సంహిత– 2023ను అంతకు ముందున్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్–1973 నుండి 82 శాతం తీసుకున్నదే.
3. భారతీయ సాక్ష్య చట్టం–2023 అంతకుముందు అమ లులో ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ చట్టం–1872 నుంచి 82 శాతం మక్కీకి మక్కీ కాపీ కొట్టినదే.
ఈ సందర్భంగా కాపీ కొట్టడం గురించి కొంత వివరణ చూద్దాం. నల్సార్ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్న ప్పుడు వేపా పార్థసారథి (వీపీ సారథి) అనే అద్భుతమైన ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన సాక్ష్య చట్టంలో ప్రముఖ నిపుణుడు. మొత్తం చట్టం ఒక్కో అక్షరం, పదం, కామా, ఫుల్‌స్టాప్ వంటి అర్థాలను చక్కగా వివరించేవారు.
ఓసారి జడ్జీలకు క్లాస్ చెబుతున్నారు. ‘సాక్ష్య చట్టంలో ఇలా ఉంది సార్’ అని ఓ వ్యాఖ్యానం ప్రతిపాదించారు ఓ జడ్జిగారు. వారు చాలా బాగా అధ్యయనం చేసిన జడ్జి గారు. అప్పుడు సారథిగారు ‘మీరు ఈ కామా గురించి చూడాలి. అందువల్ల దాని అర్థం మారిపోతుంది’ అని వివరించడంతో జడ్జి అవాక్కయ్యారు. అంత సునిశితంగా పరిశీలించే సారథిగారు మన పాత నేర చట్టాలపై తన అభిప్రాయాన్ని ‘పాతదే అయినా మన సాక్ష్య చట్టాన్ని 90 శాతం సవరించాల్సిన అవసరం లేదు, కొన్ని మంచి సంస్క రణల అవసరం ఉంది’ అని కుండబద్దలు కొట్టారు. ప్రతి పాఠాన్నీ సున్నితమైన హాస్యంతో కలిపి అద్భుతంగా క్రిమినల్ లా సూత్రాలను చెప్పేవారాయన.
ఆయన కాపీ కొట్టే విషయంలో ఒక జోక్ చెప్పేవారు. ఓ విద్యార్థికి ఓ అంశం మీద 5 పేజీల వ్యాసం రాయాలని పరీక్ష పెట్టారు. ఆ విద్యార్థి ఎవరిదో పరిశోధనాపత్రంలోని విషయాలను చక్కగా దించేశాడు. కానీ పరిశోధనా పత్రం రాసిన స్కాలర్ పేరును మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. అయితే ఆ పరీక్ష పేపర్ దిద్దుతున్న ప్రొఫెసర్ అది తన వ్యాసాన్ని కాపీ కొట్టి రాసిన జవాబుగా గుర్తించారు. ప్రశ్నకు 10 మార్కులకు గాను 8 మార్కులు ఇచ్చారు. విద్యార్థి ‘సార్ నేను ఫెయిల్ అవుతాననుకున్నాను. మీరు 8 మార్కులు ఇచ్చారే ఆశ్చర్యం’ అన్నాడా విద్యార్థి క్లాసులో. అందుకు ‘నిజమే, అప్పట్లో మా ప్రొఫెసర్ నే రాసిన ఈ జవాబుకు చాలా తక్కువగా 4 మార్కులే ఇచ్చారు. ఇప్పటికీ నేనే కరెక్టు రాశానని నా నమ్మకం. అదే రాసిన నీకు నేను 8 మార్కులు ఇచ్చాను’ అన్నారట ప్రొఫెసర్. దీంతో విద్యార్థి నోరెళ్ల బెట్టా డట. అటువంటి పార్థసారథిగారు ఇప్పుడు జీవించి లేరు. కానీ, ఆయన అభిప్రాయాలు మాత్రం నిలిచే ఉన్నాయి.
ఇండియన్ ఎవిడెన్స్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేనే లేదనీ, ఒకవేళ ఎవరైనా మార్చితే దాన్ని ప్రభుత్వాలు దుర్మార్గం చేయడానికే వాడతాయనీ ఆయన అనేవారు. ఎవిడెన్స్ చట్టాన్ని నేను కూడా బోధించే వాడిని. అందుకే నేను కొన్ని మార్పులు, సూచనలు చేశాను. సారథిగారు ఒక రోజంతా చదివి ఆలోచించి, మరునాడు నల్సార్‌లో నా గదికి వచ్చి, ‘మీరన్నది కరెక్టే, కొన్ని మార్పులు చేయడం అవసరమే’ అని ఒప్పుకోవడమే కాకుండా, తరువాత వచ్చే ఎడిషన్‌లో ‘ప్రొఫెసర్ శ్రీధర్ సలహా ఇచ్చారు’ అనిముందుమాటలో నా పేరు రాశారు. ఎంత గొప్పవ్యక్తి ఆయన! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒకరి అభిప్రాయమో, లేక పుస్తకం, వ్యాసాల్లో ఉన్న విషయాలనో మనం ఉపయోగించి ఏమైనా రాసేటప్పుడు తప్పనిసరిగా సోర్స్‌ను ఉటంకించడం కనీస ధర్మం. ప్రొఫెసర్ పార్థసారథి చేసింది అదే. ఇంగితం ఉన్న ఎవరైనా చేయాల్సిందీ అదే!
పాత బ్రిటిష్ కాలపు క్రిమినల్ చట్టాలను పూర్తిగా సంస్కరించుకునే బంగారంలాంటి అవకాశాన్ని ప్రభుత్వం, పార్లమెంట్, ఎంపీలు పూర్తిగా వదిలేసుకున్నారని మా నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థి... ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ప్రొ‘‘ అనూప్ సురేంద్రనాథ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఏమర్థమవు తోంది? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ కొత్త నేర చట్టాలు?
– మాడభూషి శ్రీధర్. వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్
ఇవి చదవండి: Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు!
Comments
Please login to add a commentAdd a comment