కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల తరువాత ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. కాబట్టి భవిష్యత్తులో భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నా యని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధిరేటుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతోనే 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకో గలుగుతుంది.
ఒక్క సంపద సృష్టితోనే ఏ ఆర్థిక వ్యవస్థా బలంగా ఎదగలేదు. సంపద వృద్ధితో పాటు మానవ వనరుల ప్రమాణాలను పెంచే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన తోనే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఎదుగుతుంది. కానీ ఆరు దశాబ్దాల ప్రణాళికా యుగంలో భారత దేశంలో వృద్ధిరేటు ఉపాధి రహితంగా మందకొడిగా కొనసాగింది. ఫలితంగా ఉద్యోగ అవకాశాల సృష్టిలో వెనకబడటం వలన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 1991 నుండి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక వృద్ధిరేటు పెరిగినా అది కూడా ఉపాధి రహితంగానే కొనసాగిందనే చెప్పాలి.
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ... భారత దేశంలోని ఉద్యోగ ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనలో భారతదేశం జీ–20 దేశాల కంటే వెనకబడి ఉంది. అలాగే 2010– 20ల మధ్యకాలంలో దేశంలో సగటు వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటే ఉపాధి కల్పన రేటు మాత్రం కేవలం రెండు శాతం గానే ఉంది. అంటే ఇప్పటికీ భారతదేశంలో ఉపాధి రహిత వృద్ధి కొనసాగు తోందని గీతా గోపీనాథ్ కూడా భావిస్తున్నారని చెప్పాలి. సులభతర వ్యాపారం ద్వారా దిగుమతి సుంకాలను తగ్గించి మరింత ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించటం ద్వారా ఉద్యోగాల సృష్టి జరగటానికి అవకాశం ఉంటుందని గీతా గోపీనాథ్ సూచిస్తున్నారు.
2024– 25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుండి 7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే భావిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వార్షిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్‌ఐఈ) రిపోర్ట్ ప్రకారంగా 2014లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు 2024 మొదటి త్రైమాసికానికి 9.2 శాతానికి పెరగటం, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా 15 ఏళ్లు పైబడిన వయసుగల వారిలో నిరుద్యోగిత రేటు 17 శాతంగా ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం.
ఆర్థిక మందగమనం వలన ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ విధానాల వలన ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో జాప్యం వలన నిరుద్యోగ సమస్య తీవ్రత దేశంలో పెరుగుతుందని చెప్పాలి. 3,942 అమెరికన్ డాలర్ల జీడీపీగా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... గీతా గోపీనాథ్ చెప్తున్నట్లు 2027 నాటికి జర్మనీ, జపాన్‌లను కూడా అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. కానీ ఆ ఎదుగుదల ఉపాధి ఉద్యోగాలను సృష్టించేదిగా ఉంటే యువ భారత్‌కి ఉపయోగకరంగా ఉంటుంది. – డాక్టర్ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877
Comments
Please login to add a commentAdd a comment