మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌లో అద్భుతాలు ఏమీ లేవనే చెప్పాలి. అయితే ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎమ్‌ఎస్‌ఎమ్ ఈలు); అలాగే మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల; ఉద్యోగాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యం; సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన రంగం, మౌలిక వసతుల కల్పనలో మెరుగుదల, ఆవిష్కరణలు– పరిశోధనల అభివృద్ధికి ప్రోత్సాహకాలు, భవిష్యత్ సంస్కరణలు లాంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి చేరుకునే రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. 48 లక్షల 20 వేల 512 కోట్ల రూపాయల బడ్జెట్‌లో... కేటాయింపులు, నిర్దేశిత లక్ష్యాలు గత బడ్జెట్‌కి కొన సాగింపుగానే కనిపిస్తున్నాయి.
బడ్జెట్‌కు ఒకరోజు ముందుగా ప్రకటించిన ఆర్థిక సర్వేలో చెప్పినట్లుగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 2030 నాటికి ప్రతి ఏటా 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనకూ, ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకూ, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపి స్తోంది. విద్య, నైపుణ్యాల అభివృద్ధికే 1.48 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. రాబోయే ఐదు సంవ త్సరాలలో ఐదు ఉద్యోగ పథకాల ద్వారా 4.1 కోట్ల యువతకి ఉద్యోగాల కల్పన కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నైపుణ్య అభివృద్ధిలో భాగంగా 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వటం ద్వారా, ఐదేళ్లలో కోటి మంది యువతకి ప్రయోజనం చేకూర్చే ఇంట ర్నషిప్ పథకాన్ని ప్రకటించారు.
మూడు ఉద్యోగ అను సంధాన ప్రోత్సాహకాల ద్వారా లక్ష మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల విద్యా రుణాలు ఇవ్వటం ద్వారా, క్రెడిట్ గ్యారంటీ పథకంతో ఎంఎస్‌ఎమ్‌ఈలకు 100 కోట్ల రుణాలను ఇవ్వడం ద్వారా, 11 లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడం ద్వారా, ముద్ర యోజన రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచటం ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచి నిరుద్యోగ సమస్యకి కళ్ళెం వేయవచ్చని ప్రభుత్వం భావించినట్లు ఉంది. అయితే కొంత కాలంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నప్పటికీ నిరుద్యోగాన్ని అదుపు చేయడంలో సఫలం కాకపోవడం గమనార్హం.
25 వేల గ్రామాలకు కొత్తగా రోడ్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పట్టణాలలో కోటి ఇళ్ళ నిర్మాణం, రాబోయే ఐదు సంవత్సరాలలో గృహ నిర్మాణంపై 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనే నిర్ణయం, ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఇవ్వటం కొంతమేరకు ఆహ్వానించదగిన పరిణామమే. కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించిన 1.52 లక్షల కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధికి కేటాయించిన 2.66 లక్షల కోట్ల రూపాయలు ఆ యా రంగాలను బలోపేతం చేయ డానికి సరిపోవు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు అదుపు లోనే ఉన్నాయని ఆర్థిక మంత్రి చెబుతున్నా నమ్మ శక్యంగా లేదు.
ఈ బడ్జెట్‌లో కొన్ని కేటాయింపులు ఘనంగా కనిపించినా అవి మొత్తం ఖర్చు చేస్తారా అనేది అను మానమే. ఎందుకంటే... గత బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇంధనం లాంటి ఏడు కీలక రంగా లకు కేటాయించిన కేటాయింపులలో దాదాపు 1.21 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయలేక పోయి నారనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక సర్వేలో చెప్పినట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టకుండా, విద్య – ఉపాధి రంగాల మధ్య అంతరాన్ని పూడకుండా, వ్యవసాయ వృద్ధిని చోదకంగా మార్చకుండా... అంచనా వేస్తున్న ఏడు శాతం వృద్ధిరేటుతో భవిష్యత్తు లక్ష్యాలను అందుకోలేమనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.
– డా. తిరునహరి శేషు, వ్యాసకర్త అర్థశాస్త్ర ఉపన్యాసకులు, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877
Comments
Please login to add a commentAdd a comment