అమరావతికి రూ.15 వేల కోట్లపై సీఎం చంద్రబాబు.. 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు
కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు
మా ప్రతిపాదనల్లో చాలా వరకు ఆమోదం.. నిధుల ప్రస్తావన లేనప్పటికీ పోలవరం పూర్తి చేస్తామన్నారు.. అది చాలు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రకటించిన రూ.15 వేల కోట్లు అప్పేనని, అయినా అది లాభదాయకమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆయన కేంద్ర బడ్జెట్‌పై కొందరు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే నిధులు కొన్ని అప్పు రూపేణా వస్తాయని చెప్పారు. అవి దాదాపు 30 ఏళ్ల తర్వాతే తీర్చేవి కాబట్టి అప్పటికి అంత భారమేమీ ఉండదన్నారు. ఈ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుందని చెప్పారు. వచ్చే నిధుల్లో కొంత కేంద్ర గ్రాంట్ కూడా క్యాపిటల్ అసిస్టెన్స్ రూపేణా కలుస్తుందని, అది లాభమేనన్నారు.
కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని చెప్పారు. తమ ప్రతిపాదనలు చాలా వరకు ఆమోదించారని, రాజధాని నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయని తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుందని వివరించారు. నిధులు ఏ రూపేణా వచి్చనా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయి ఉందని, అందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాజధాని నిర్మాణం బండి వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపకరిస్తాయన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు అని పెట్టకపోయినా, పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందని, తమకు అది చాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో ఉంటుందనే సమాచారం ఉందని, అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. పారిశ్రామిక రాయితీలు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా వచ్చే అవకాశం ఉందని, ఇందులో నియమ నిబంధనలు పరిశీలించాక వాటిని అనుకూలంగా మలుచుకుంటామని తెలిపారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశంను కూడా చేర్చటం ఆ జిల్లాకు ఎంతో ఉపయోగమన్నారు.
ప్రధాని, ఆర్థిక మంత్రికి అభినందనలు
అంతకుముందు ఎక్స్ వేదికగా కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలతోపాటు ఏపీలోని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం అందించిన ఈ తోడ్పాటు ఏపీ భవిష్యత్తు పునరి్నర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. ప్రగతిశీల, విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమరి్పంచినందుకు తాను వారిని అభినందిస్తున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment