మీడియా చేతిలో ఉంటే చాలు తిమ్మిని బొమ్మి చేయవచ్చు. బొమ్మిని తిమ్మి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢీ కొట్టగలిగినవారే దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. అమరావతి రాజదాని నిర్మాణానికి కేంద్రం పదిహేనువేల కోట్ల రూపాయల సాయం చేయడానికి ముందుకువచ్చింది కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం ప్రకటించినప్పుడు ఆంద్రులంతా సంతోషించారు. చంద్రబాబు నాయుడు అమలు చేయతలపెట్టిన స్కీములకు ఈ మేరకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నారు. కానీ..
అసలు విషయం తెలిశాక..ఇందులోనూ ఇంత మతలబు ఉందనే అభిప్రాయం కలుగుతుంది. అమరావతికి కేంద్రం గ్రాంట్ గా ఇవ్వడం లేదని, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణ సాయం ఇప్పిస్తుందని, ఇందులో మాచింగ్ గ్రాంట్ విషయం కేంద్ర,రాష్ట్రాలు చర్చించి నిర్ణయించుకుంటాయని ఆమె చెప్పారు. అంటే ఇందులోను గ్యారంటీ లేదన్న మాట. అవసరమైతే రాష్ట్రం కూడా భరించవలసి ఉంటుందన్నమాట. ఇక పోలవరం ప్రాజెక్టు పేరు కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించినందుకే టీడీపీ, జనసేనలు మురిసిపోయాయి. అలాగే పారిశ్రామికవాడలకు ఇచ్చే రాయితీలు గురించి మాట వరసకు చెప్పారు తప్ప ఎంత మేర ఆర్దిక సాయం చేసేది నిర్దిష్టంగా తెలపకపోయినా తెలుగుదేశం మీడియా ఆహో,ఓహో అంటూ ఊదరగొట్టాయి. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించాయి.
బీహారు రాష్ట్రానికి మాత్రం కేంద్రం నేరుగా 58,900 కోట్ల రూపాయల ఆర్దిక సాయాన్ని వివిధ ప్రాజెక్టుల రూపేణా ఇవ్వదలచింది. అంటే అదంతా గ్రాంట్ అన్నమాట. రూపాయి అప్పుగా ఉండదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు సంబంధించిన ఎంపీల మద్దతు లేనిదే మోదీ ప్రభుత్వం నిలబడడం కష్టం. అయినా నితీష్ ధైర్యంగా ప్రత్యేక హోదా అడిగారు. చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, అంతకు మించిన సాయాన్ని మోదీ ప్రభుత్వం ఇస్తోంది. ఏపీకి మాత్రం అప్పుకు సాయం చేస్తామని అన్నారు. ఎక్కడ ఉంది బలహీనత. కొంతమంది విమర్శిస్తున్నట్లు చంద్రబాబుపై గతంలో కేంద్రం ఇచ్చిన నోటీసుల కత్తి వేలాడుతోందా?లేక చంద్రబాబే కేంద్రంతో గొడవ పెట్టుకుని గతంలో మాదిరి దెబ్బతింటానని భయపడుతున్నారా?.
2014-19 టరమ్ లో తొలుత ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని ఆనాటి ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించారు. దానిని చంద్రబాబు స్వాగతించారు. ఆ తర్వాత కాలంలోమళ్లీ ప్రత్యేక హోదానే కావాలన్నారు. అది వేరే సంగతి.ప్యాకేజీ కూడా అప్పట్లో రుణసాయం కిందే ఇవ్వచూపారు. దానికే చంద్రబాబు అప్పట్లో అంగీకరించడం విమర్శలకు దారి తీసింది. సరిగ్గా అదేరీతిలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి రుణం తీసుకోవడానికి ఒప్పుకున్నారు. స్వయంగా చంద్రబాబే అది అప్పే అని తేల్చి చెప్పారు. జనం అంతా ఏపీకి పప్పన్నం లాంటి సాయం వచ్చిందని అనుకుంటే అది కాస్త అప్పన్నం అని తేలిపోయింది. ఈ మాత్రం దానికే ఈనాడు పత్రిక ఏమని హెడింగ్ పెట్టిందో చూడండి. ‘‘రాజధానికి రాజసం’’ అని పెట్టి తమ రాజభక్తిని ప్రదర్శించుకున్నారు. మరో టీడీపీ పత్రిక ఆంధ్రజ్యోతి ‘‘హ్యాపీ ఏపీ’’ అని ఆనంద తాండవం చేసింది. వారికి ఇష్టం అయితే ఇలా..అదే జగన్ ప్రభుత్వం చేస్తే అప్పుల చిప్ప అని హెడింగ్ పెట్టేవారు. అయితే ఇక్కడ చంద్రబాబు సమర్ధించుకున్న తీరు కూడా ఆసక్తికరమైనదే.
పదిహేనువేల కోట్ల మేర కేంద్రం ఇచ్చేది అప్పే అయినా ,ముప్పై ఏళ్లతర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు. అంటే అప్పటివరకు ఏపీ ప్రజల నెత్తిన ఈ రుణభారం ఉంటుందని అంగీకరించడమే కదా!. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే ఈ అప్పులకు కేంద్రం పూచికత్తు ఇస్తుందని అన్నారు. నిజానికి ఏ విదేశీరుణానికి అయినా కేంద్రం గ్యారంటీలు ఇస్తుందన్నది తెలిసిందే.గతంలో ప్రపంచ బ్యాంక్ ఇదే ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి నో చెప్పింది.దానికి కారణం అది పర్యావరణ నియమాలకువ్యతిరేకంగా ఉండడం,కొందరు రైతులు నిరసనలు తెలుపుతుండడం. నిధులు ఏ రూపేణా వచ్చినా అది రాష్ట్రానికి ఉపయోగమేనని చంద్రబాబు ఉవాచ. మరి జగన్ ప్రభుత్వంపై తెగ ఆడిపోసుకున్నారు కదా? అని ఎవరైనా అడిగితే అధికారం కోసం ఎన్ని అయినా అంటాం అని సమాధానం ఇస్తారేమో తెలియదు.
పోలవరం ప్రాజెక్టు కునిధులు ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్ లో పెట్టకపోయినా, పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందట.అంటే అది ఎప్పటికి పూర్తి చేస్తారో, ఎంత మొత్తం ఇస్తారో, నిర్వాసితుల సమస్య ఎప్పటికి తీర్చుతారో తెల్చకుండా పోలవరం అంటేనే పులకరించిపోతే ఏమి చేయాలి!. పోనీ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తున్నట్లు ఏమైనా చెప్పారా?అదేమీ లేదు. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ బుందేల్ ఖండ్ తరహాలో ఉంటుందని సమాచారం ఉందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ నిర్మలా సీతారామన్ అనడం లేదు. పారిశ్రామిక రాయితీలు ఈ ప్యాకేజీలో భాగమేనని ఆయన అంటు్నారు.చంద్రబాబు వీటన్నిటిపైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు కూడా తెలిపేశారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం,పారిశ్రామికరంగంతో పాటు వెనుకబడిన అభివృద్దికి దృష్టి సారించినందుకు మోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఏమి సాధించారని చంద్రబాబు ఇంతగా కేంద్రాన్ని పొగిడారో తెలియదు.
.. దీనిని బట్టే చంద్రబాబు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉంది అర్దం అవుతుంది.ధైర్యం చేసి నితీష్ మాదిరి గట్టిగా అడగలేకపోయారు.వారు ఇచ్చిందే మహా గొప్ప విషయం అన్నట్లు చంద్రబాబు సరిపెట్టుకున్నారు. కాకపోతే ఏపీ ప్రజలను తనకు ఉన్న మీడియా బలంతో మభ్యపెట్టడానికి మాత్రం యత్నించారు. అబద్దపు వాగ్దానాలనువిని ఓట్లు వేసిన ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మకుండా ఉంటారా? అన్నది వారి విశ్వాసం కావచ్చు.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment