రాజధానికి వివిధ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతు
ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏజెన్సీల ద్వారా రూ.15 వేలకోట్లు ఏర్పాటు
ఈ రూ.15 వేలకోట్లతో పాటు భవిష్యత్‌లో ఇప్పించేదీ అప్పుగానే
బడ్జెట్‌లో రాజధాని పేరుతో పైసా కేటాయించలేదు
వెనుకబడిన జిల్లాలకు సాయం మాట మాత్రమే.. కేటాయింపుల్లేవు
గిరిజన, సెంట్రల్ వర్సిటీలకు శూన్యం.. పెట్రోలియం వర్సిటీకి రూ.168 కోట్లు
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు
సాక్షి, అమరావతి: కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేయించడంలో విఫలమయ్యారు. బిహార్‌కు మాత్రం కేంద్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేయగా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం అప్పులు ఇప్పిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బిహార్‌కు ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్‌కు మరో న్యాయం అనే రీతిలో కేంద్ర బడ్జెట్ ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి వివిధ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతుగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.15 వేలకోట్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
అయితే బడ్జెట్ డాక్యుమెంట్లలో ఎక్కడా రాజధాని కోసం కేటాయింపులు చేయలేదు. అంటే వివిధ ఏజెన్సీల ద్వారా ఇప్పించే రూ.15 వేలకోట్లు అప్పుగానే అని తేలిపోయింది. భవిష్యత్‌లో కూడా రాజధానికి అవసరమైన అప్పులు ఇప్పిస్తామని సీతారామన్ చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మద్దతు అని పేర్కొన్నారు తప్ప ఎక్కడా గ్రాంటు, ఆర్థికసాయం అని చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి అప్పులు ఇప్పించడానికి మాత్రమే కేంద్రం ముందుకు వచ్చిందని, ఇదే విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించి చేతులు దులుపుకొన్నారని, దీనివల్ల రాష్ట్రానికి అప్పులు తప్ప పెద్దగా ప్రయోజనం లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
బిహార్ రాష్ట్రానికి మాత్రం జాతీయ రహదారులకు ఏకంగా రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి మాత్రం ఏజెన్సీల ద్వారా రూ.15 వేలకోట్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని పేర్కొనడం అంటే ఏపీ పట్ల చిన్నచూపు చూడటమేనని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ముక్తాయింపు ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా కేటాయింపులేమీ చేయలేదు. మంత్రి ప్రసంగం నోటిమాటతో సంతృప్తి చెందాలనే చందంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి సాయం కొనసాగుతుందని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు తప్ప ఎక్కడా కేటాయింపులు చేయలేదు. ఇక గిరిజన యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి బడ్జెట్‌లో ఏమీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న పెట్రోలియం యూనివర్సిటీకి మాత్రం రూ.168 కోట్లు కేటాయించారు. పునర్విభజన చట్టంలోని పలు వైద్య, విద్యాసంస్ధలకు బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు.
చంద్రబాబు ప్రధానమంత్రి, కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా సాయం చేయాలని కోరారు. అయినా కేంద్ర ఆర్థికమంత్రి ఏపీకి ప్రత్యేకంగా అప్పులు ఇప్పిస్తామని ప్రకటించడం గమనార్హం. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనలకు లోబడే ఈ అప్పును ఇప్పిస్తారా లేదా ఆ నిబంధనల మినహాయింపులతో ఇప్పిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment