అదే సర్వేను జగన్ చేస్తే విష ప్రచారం చేసి నిలిపివేసిన చంద్రబాబు
భూ సంస్కరణలు తప్పనిసరని కేంద్రం చెప్పిన రోజే అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ ఉపసంహరణ బిల్లు
రీసర్వే చేసిన రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలిస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదన
సాక్షి, అమరావతి: రాష్ట్రాల్లో భూ సంస్కరణలు, భూముల రీ సర్వే, భూ రికార్డుల డిజిటలీకరణ అత్యావశ్యకమని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన రోజే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టింది. భూముల సంస్కరణలు అమలుచేసిన రాష్ట్రాలకే 50 ఏళ్లపాటు సున్నా వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలకు తిలోదకాలిచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం ఈ బిల్లు పెట్టడం విశేషం.
రాజకీయ స్వార్థంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఒక భూతంగా, భూముల రీ సర్వేను దారుణమైనదిగా ప్రచారం చేసి చంద్రబాబు కూటమి ఎన్నికల్లో లబ్ధిపొందింది. భూములు పోతాయని, లాగేసుకుంటారని భయపెట్టి ప్రజలకు ఎంతగానో మేలుచేసే కార్యక్రమంపై విషం కక్కారు. ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుచేస్తుండడమే కాకుండా నాలుగున్నరేళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా, దేశంలో ఎక్కడాలేని విధంగా జరిగిన భూముల రీ సర్వేను నిలిపివేశారు. కానీ, ఇప్పుడు అవే కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో జరగాలని కేంద్రం కుండబద్దలు కొట్టింది.
వీటిని ఐదేళ్లలో చేసిన జగన్ ప్రభుత్వం
కేంద్ర ఆర్థికమంత్రి తప్పనిసరిగా చేయాలని చెప్పిన ప్రతిపాదనలన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలోనే అమలుచేసింది. భూముల రీ సర్వే విజయవంతంగా జరగడంతోపాటు 6 వేల గ్రామాల్లో కేంద్రం చెప్పినట్లే కొత్త డిజిటల్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత ఆధునిక సర్వే టెక్నాలజీతో సర్వే నిర్వహించారు. ప్రతి భూమికీ జియో కోఆర్డినేట్స్ హద్దులు ఏర్పరచడం, ఐడీ నంబర్, క్యూఆర్ కోడ్ జారీ ద్వారా దేశంలో కొత్త భూ వ్యవస్థను పరిచయం చేశారు. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూహక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ అందించారు. రీసర్వే పూర్తయిన తర్వాత కొత్త డిజిటల్ రికార్డులు రూపొందించే క్రమంలో 10 లక్షల పట్టాలకు సబ్ డివిజన్లు చేశారు.
బడ్జెట్ ప్రసంగంలో సబ్ డివిజన్లు జరగాలని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. రీసర్వే చేసి 20 లక్షల మందికిపైగా రైతులకు భూ హక్కు పత్రాలు జారీచేశారు. గ్రామ కంఠాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వేచేసి ఇళ్ల యజమానులకు యాజమాన్య సర్టిఫికెట్లు జారీచేశారు. భూముల హద్దులను నిర్ధారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతారు. రీ సర్వే కోసం ప్రత్యేకంగా 10,185 మంది గ్రామ సర్వేయర్లను నియమించారు. ఇందుకోసం మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగా గత ప్రభుత్వం ఖర్చుచేసింది. ఏపీలో జరిగిన రీ సర్వే దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. అలాంటి కార్యక్రమాన్ని కేవలం రాజకీయ స్వార్థం కోసం విజనరీగా చెప్పుకునే చంద్రబాబు రద్దుచేయడం రాష్ట్రానికి శాపమే.
నిజానికి.. రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని అమలుచేసే ఉద్దేశం ఉంటే అనేక ప్రత్యామ్నాయాలు చూడొచ్చు. కానీ, జగన్ అమలుచేశారనే అక్కసుతో భూముల వ్యవస్థ స్వరూపాన్నే సమూలంగా మార్చివేసే రీసర్వేను నిలిపివేశారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దుచేస్తున్నారు. అయితే, ఇవన్నీ దేశమంతా జరగాలని కోరుకుంటూ కేంద్రం అందుకు తగ్గట్లుగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం విశేషం.
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి చెప్పిందిదే..
» పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ సంబంధిత సంస్కరణలు అమలుచేసిన రాష్ట్రాలకు 50 ఏళ్ల వడ్డీలేని రుణాలను ప్రతిపాదించారు.
» భూ పరిపాలన, ప్రణాళిక, నిర్వహణకు సంబంధించి కచ్చితమైన చర్యలుండాలని స్పష్టంచేశారు.
» గ్రామీణ ప్రాంతాల్లో యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్–యూఎల్ పిన్ ఉండాలని, అన్ని భూములకు భూ ఆధార్ ఉండాలని, సర్వే సబ్ డివిజన్లు జరగాలని, భూ యాజమాన్యాన్ని కచ్చితంగా నిర్ధారించేలా సర్వే జరగాలని, ల్యాండ్ రిజిస్టర్లు రూపొందించాలని, వాటిని రైతుల రిజిస్టర్లతో లింకుచేయాలని చెప్పారు.
» అర్బన్ ల్యాండ్ రికార్డులను జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా డిజిటలైజేషన్ చేయాలని చెప్పారు.
» ఇవన్నీ చేసిన రాష్ట్రాలకే వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment