కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. వచ్చేనెలలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం తరఫున ఆయన పలు విజ్ఞప్తులు చేశారు.
రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
బడ్జెట్‌లో నిధులు కేటాయించండి..
ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో పోలవరం, అమరావతి నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై చంద్రబాబు చర్చించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆయన నివాసంలో చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు వెంటకేంద్ర ఉక్కు, పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఉన్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండోనేషియా ఆరోగ్య శాఖమంత్రి బుది జి సాదికిన్‌తో భేటీ అయినట్లు చంద్రబాబు ‘ఎక్స్’లో తెలిపారు.
పరిటాల రవి 20 వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించినట్లు కూడా పేర్కొన్నారు. అలాగే.. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ఆడపిల్లల భద్రత, భవిష్యత్తు తమ ప్రధాన ప్రాధాన్యతలని పోస్ట్ చేశారు.
త్వరలో దిగ్గజ సంస్థల సీఈవోలు వస్తారు
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పెట్టుబడులపై జరిగిన చర్చలకు కొనసాగింపుగా పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ సంస్థల సీఈవోలు, ప్రతినిధులు త్వరలో రాష్ట్రానికి వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు.
దావోస్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సీఎస్ విజయానంద్, సీఎంవో అధికారులతో తన నివాసంలోనే సమావేశమై దావోస్ పర్యటనపై చర్చించారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వచ్చే నాటికి తగిన ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment