tirunahari SESHU
-
ఉపాధి రహిత వృద్ధి వృథాయే!
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల తరువాత ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. కాబట్టి భవిష్యత్తులో భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నా యని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధిరేటుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతోనే 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకో గలుగుతుంది.ఒక్క సంపద సృష్టితోనే ఏ ఆర్థిక వ్యవస్థా బలంగా ఎదగలేదు. సంపద వృద్ధితో పాటు మానవ వనరుల ప్రమాణాలను పెంచే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన తోనే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఎదుగుతుంది. కానీ ఆరు దశాబ్దాల ప్రణాళికా యుగంలో భారత దేశంలో వృద్ధిరేటు ఉపాధి రహితంగా మందకొడిగా కొనసాగింది. ఫలితంగా ఉద్యోగ అవకాశాల సృష్టిలో వెనకబడటం వలన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 1991 నుండి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక వృద్ధిరేటు పెరిగినా అది కూడా ఉపాధి రహితంగానే కొనసాగిందనే చెప్పాలి.ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ... భారత దేశంలోని ఉద్యోగ ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనలో భారతదేశం జీ–20 దేశాల కంటే వెనకబడి ఉంది. అలాగే 2010– 20ల మధ్యకాలంలో దేశంలో సగటు వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటే ఉపాధి కల్పన రేటు మాత్రం కేవలం రెండు శాతం గానే ఉంది. అంటే ఇప్పటికీ భారతదేశంలో ఉపాధి రహిత వృద్ధి కొనసాగు తోందని గీతా గోపీనాథ్ కూడా భావిస్తున్నారని చెప్పాలి. సులభతర వ్యాపారం ద్వారా దిగుమతి సుంకాలను తగ్గించి మరింత ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించటం ద్వారా ఉద్యోగాల సృష్టి జరగటానికి అవకాశం ఉంటుందని గీతా గోపీనాథ్ సూచిస్తున్నారు.2024– 25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుండి 7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే భావిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వార్షిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) రిపోర్ట్ ప్రకారంగా 2014లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు 2024 మొదటి త్రైమాసికానికి 9.2 శాతానికి పెరగటం, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా 15 ఏళ్లు పైబడిన వయసుగల వారిలో నిరుద్యోగిత రేటు 17 శాతంగా ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం.ఆర్థిక మందగమనం వలన ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ విధానాల వలన ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో జాప్యం వలన నిరుద్యోగ సమస్య తీవ్రత దేశంలో పెరుగుతుందని చెప్పాలి. 3,942 అమెరికన్ డాలర్ల జీడీపీగా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... గీతా గోపీనాథ్ చెప్తున్నట్లు 2027 నాటికి జర్మనీ, జపాన్‌లను కూడా అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. కానీ ఆ ఎదుగుదల ఉపాధి ఉద్యోగాలను సృష్టించేదిగా ఉంటే యువ భారత్‌కి ఉపయోగకరంగా ఉంటుంది. – డాక్టర్ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
వికసిత భారత్ లక్ష్యం నెరవేరేనా?
మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్లో అద్భుతాలు ఏమీ లేవనే చెప్పాలి. అయితే ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎమ్ఎస్ఎమ్ ఈలు); అలాగే మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల; ఉద్యోగాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యం; సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన రంగం, మౌలిక వసతుల కల్పనలో మెరుగుదల, ఆవిష్కరణలు– పరిశోధనల అభివృద్ధికి ప్రోత్సాహకాలు, భవిష్యత్ సంస్కరణలు లాంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి చేరుకునే రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. 48 లక్షల 20 వేల 512 కోట్ల రూపాయల బడ్జెట్లో... కేటాయింపులు, నిర్దేశిత లక్ష్యాలు గత బడ్జెట్‌కి కొన సాగింపుగానే కనిపిస్తున్నాయి.బడ్జెట్‌కు ఒకరోజు ముందుగా ప్రకటించిన ఆర్థిక సర్వేలో చెప్పినట్లుగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 2030 నాటికి ప్రతి ఏటా 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి బడ్జెట్లో ఉద్యోగాల కల్పనకూ, ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకూ, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపి స్తోంది. విద్య, నైపుణ్యాల అభివృద్ధికే 1.48 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. రాబోయే ఐదు సంవ త్సరాలలో ఐదు ఉద్యోగ పథకాల ద్వారా 4.1 కోట్ల యువతకి ఉద్యోగాల కల్పన కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నైపుణ్య అభివృద్ధిలో భాగంగా 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వటం ద్వారా, ఐదేళ్లలో కోటి మంది యువతకి ప్రయోజనం చేకూర్చే ఇంట ర్నషిప్ పథకాన్ని ప్రకటించారు.మూడు ఉద్యోగ అను సంధాన ప్రోత్సాహకాల ద్వారా లక్ష మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల విద్యా రుణాలు ఇవ్వటం ద్వారా, క్రెడిట్ గ్యారంటీ పథకంతో ఎంఎస్ఎమ్ఈలకు 100 కోట్ల రుణాలను ఇవ్వడం ద్వారా, 11 లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడం ద్వారా, ముద్ర యోజన రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచటం ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచి నిరుద్యోగ సమస్యకి కళ్ళెం వేయవచ్చని ప్రభుత్వం భావించినట్లు ఉంది. అయితే కొంత కాలంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నప్పటికీ నిరుద్యోగాన్ని అదుపు చేయడంలో సఫలం కాకపోవడం గమనార్హం.25 వేల గ్రామాలకు కొత్తగా రోడ్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పట్టణాలలో కోటి ఇళ్ళ నిర్మాణం, రాబోయే ఐదు సంవత్సరాలలో గృహ నిర్మాణంపై 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనే నిర్ణయం, ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఇవ్వటం కొంతమేరకు ఆహ్వానించదగిన పరిణామమే. కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించిన 1.52 లక్షల కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధికి కేటాయించిన 2.66 లక్షల కోట్ల రూపాయలు ఆ యా రంగాలను బలోపేతం చేయ డానికి సరిపోవు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు అదుపు లోనే ఉన్నాయని ఆర్థిక మంత్రి చెబుతున్నా నమ్మ శక్యంగా లేదు.ఈ బడ్జెట్లో కొన్ని కేటాయింపులు ఘనంగా కనిపించినా అవి మొత్తం ఖర్చు చేస్తారా అనేది అను మానమే. ఎందుకంటే... గత బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇంధనం లాంటి ఏడు కీలక రంగా లకు కేటాయించిన కేటాయింపులలో దాదాపు 1.21 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయలేక పోయి నారనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక సర్వేలో చెప్పినట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టకుండా, విద్య – ఉపాధి రంగాల మధ్య అంతరాన్ని పూడకుండా, వ్యవసాయ వృద్ధిని చోదకంగా మార్చకుండా... అంచనా వేస్తున్న ఏడు శాతం వృద్ధిరేటుతో భవిష్యత్తు లక్ష్యాలను అందుకోలేమనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.– డా. తిరునహరి శేషు, వ్యాసకర్త అర్థశాస్త్ర ఉపన్యాసకులు, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
టీజేఎస్‌కు తిరుణహరి శేషు రాజీనామా
సాక్షి, కాజీపేట అర్బన్: తెలంగాణ జన సమితిలో రాష్ట్ర యువజన విభాగం కోఆర్డినేటర్‌గా సేవలందించిన డాక్టర్ తిరుణహరి శేషు ఆ పార్టీకి రాజీనామా చేశారు. హన్మకొండ అలంకార్ జంక్షన్‌లోని టీజేఎస్ కార్యాలయంలో ఆదివారం శేషు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌లో టీజేఎస్ బలోపేతానికి యువత, విద్యార్థులు, విద్యావంతులను ఏకం చేసిన తనకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రాధాన్యత ఇవ్వక అవమానించాడని పేర్కొన్నారు. అందుకే మనస్థాపం చెందిన తాను పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర యువజన విభాగం కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తూ సంబంధించిన లేఖను ఈనెల 5న కోదండరామ్‌కు పంపించినా నేటి వరకు స్పందించలేదన్నారు. త్వరలో రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కల్లూరి పవన్,రమాకాంత్, అడ్డూరి గౌతమ్, బయ్యా వేణు, దడబోయిన శ్రీనివాస్, బొజ్జ సందీప్, కిరణ్, ప్రశాంత్, ఇమ్రాన్, గణేష్, అజయ్, దామెదర్, అయోధ్య, తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాంను విమర్శించే అర్హత లేదు
హన్మకొండ: తెలంగాణ అభివృద్ధి, నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే అర్హత ప్రజాసంఘాలకు లేదని తెలంగాణ విద్యార్థి సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు తిరునహరి శేషు అన్నా రు. ఈమేరకు శనివారం హన్మకొండ నక్కలగుట్టలో తెలంగాణ విద్యార్థి సేనా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన లక్ష్యం కోసం కోదండరాం పోరాటం చేస్తుంటే కలిసి రావాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నా రు. సమావేశంలో నాయకులు ఎర్రబొజ్జ రమేశ్, పాలడుగుల సురేందర్, కల్లూరి పవన్, తంగెళ్లపల్లి పూర్ణేందర్, కి రణ్, క్రాంతి, రాకేష్, విజయ్ పాల్గొన్నారు.