ఎ.జి. నూరానీ
యాభై ఐదు సంవత్సరాల నాటి మాట. 1969 మేలో పూనా–బొంబాయి మధ్యగల లోనావాలా అనే హిల్ స్టేషన్‌లో లెస్లీ సాక్నీ ప్రజాస్వామ్య శిక్షణ శిబిరంలో ఓ పది, పధ్నాలుగు రోజులున్నాను. ఎమ్.ఆర్. మసానీ ఆ శిబిరానికి ప్రారంభోపన్యాసం చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ఆచార్యులు ఎస్.పి. అయ్యర్ ప్రిన్సి పాల్‌గా తరగతులు నిర్వహించారు. నానీ పాల్కీవాలా ఆ సంస్థ అధ్యక్షులు. సోలీ సొరాబ్జీ, రజనీ పటేల్, వి.బి. కార్నిక్, వి.వి. జీన్, అరవింద్ దేశ్‌పాండే, రాము పండిట్, ఫెడీ మెహతా, ఎస్.వి. రాజు వంటి వారు వివిధ అంశాలపై శిక్షణ గరిపారు.
వారిలో ఎ.జి. నూరానీ కూడా ఉన్నారు. ఆయన అప్పటికే ఒక దశాబ్ద కాలంగా వివిధ అంశాలపై పూంఖానుపుంఖాలుగా వివిధ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ఇండి యన్ ఎక్స్‌ప్రెస్, హిందూ, స్టేట్స్‌మన్ వంటి స్వదేశీ పత్రికలకే గాక, పాకి స్తాన్‌లోని ‘డాన్’ పత్రికలో కూడా వారి రచనలు ప్రచురితమవుతుండేవి. ఆ తదుపరి ఫ్రంట్‌లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి వాటికి కూడా రాసేవారు. జాకీర్ హుస్సేన్, బొంబాయి హైకోర్టులో మొట్టమొదటి భార తీయ వకీలు బద్రుద్దీన్ త్యాబ్జీ జీవిత చరిత్రలను ప్రచురించారు. కశ్మీర్ సమస్య, బాబ్రీ మసీదు, ఆర్టి కల్–370, లద్దాఖ్, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ పాత్ర, పౌరహక్కులు, భగత్ సింగ్‌పై విచారణ, సావర్కర్, హైదరాబాదు డిమాలిషన్ వంటి భిన్న విభిన్న అంశాలపై రచనలు చేశారు.
తదాదిగా బొంబాయిలోగానీ, ఢిల్లీలోగానీ నూరానీని కలుసుకొనే అవకాశం దొరికేది. దక్షిణ బొంబాయిలో వీలు దొరికినప్పుడల్లా ఆయననను కలిసేవాడిని. ఎం.ఆర్. మసానీ అక్కడే బీచ్‌కాండీలో ఉండేవారు. నూరానీ నేపియన్ సీ అపార్టుమెంట్స్‌లో ఉండేవారు. అవి రెండూ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండేవి. దానితో మసానీ దగ్గరకెళ్లినప్పుడు విధిగా నూరానీని కూడా కలిసేవాడిని. నూరానీ బల్ల కుర్చీమీద కాకుండా, మంచంమీద కూర్చుని రాసేవారు. చుట్టూ అప్పడాలు ఆరబోసినట్లు లెక్కకు మించిన పుస్తకాలు తెరిచి, తిరగేసి ఉండేవి. ఏదైనా అంశంపై చర్చిస్తుండగా, ఎదురుగా ఉన్న పుస్తకాల్లో ఫలానా పుస్తకం తీసి ఫలానా చాప్టర్ చదవమనేవాడు.
తాను చెప్పిన దానిని, వివరంగా అర్థం చేసుకోవడానికి ఉదయం చదివిన పత్రికలలో అవసరమయిన అంశాలను కత్తిరించి, అంశాల వారీగా ఫైల్ చేసేవారు. కొన్ని వందలు, వేల ఫైళ్ళు అలా ఉన్నాయి. ఏ అంశంమీద రాసినా, లోతైన పరిశోధన చేసేవారు. వాజ్‌పేయి–ముషారఫ్‌ల మధ్య ఆగ్రాలో జరిగిన చర్చలపై రాసే దానికి, పూర్తి సమాచారం రాబట్టడానికై, పనిగట్టుకొని ఇస్లామాబాద్ వెళ్లి పరిశోధన గావించారు. క్రీ.శ. 1775–1947ల మధ్య జరిగిన రాజకీయ ప్రేరిత విచారణలపై సమగ్ర పరిశోధన చేసి గ్రంథస్థం గావించారు. ‘జిన్నా–తిలక్ – కామ్రేడ్స్ ఆఫ్ ఫ్రీడం స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. అయితే ఏది ఎలా ఉన్నా ఎవరిమీదా వ్యక్తిగతంగా విమర్శ చేసేవారు కాదు. ‘రాజాజీ – అంకి తమైన, నిబద్ధతగల హిందువు, మహో న్నతమైన భారతీయుడు, అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు అలు పెరుగని రక్షకుడు’ అని కొనియాడారు. షేక్ అబ్దుల్లా, కరుణానిధిల తరఫున సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టులలో వకీలుగా తన వాదనలను వినిపించారు.
నూరానీకి కొన్ని నిర్దిష్టమయిన, చిత్ర–విచిత్రమయిన అభిరుచులు ఉండేవి. ఢిల్లీ వస్తే ఇండియా ఇంటర్నేష నల్ సెంటర్‌లో 38వ నంబరు గదిలోనే మకాం. ఓల్డ్ ఢిల్లీ, నిజాముద్దీన్, కరోల్ బాగ్, జామా మసీదు వంటి చోటసందులు – గొందులలోని హోటళ్లలో కబాబ్–కుర్మా ఎక్కడ దొరుకు తుందోనని శోధించి, ఆస్వాదించేవారు. గత నెలాఖరులో తన 94వ ఏట కన్నుమూసిన అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ సేకరించిన వేలాది పుస్తకాలు, పేపర్ క్లిప్పింగ్‌లు ఏమవుతాయో? ఏదైనా జాతీయ స్థాయిలో నున్న గ్రంథాలయం గానీ, పరిశోధనా సంస్థలు, లేక జాతీయ పత్రికలు భద్రపరిచి, సద్వినియోగం గావించడం అవసరం. అవి భావి తరాలకు ప్రజాసేవా రంగాలలో, పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టే యువతరానికి ఉపయుక్తం కాగలవు. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు, 98663 76735
Comments
Please login to add a commentAdd a comment