Mumbai University
-
భారతీయ మేధా శిఖరం!
యాభై ఐదు సంవత్సరాల నాటి మాట. 1969 మేలో పూనా–బొంబాయి మధ్యగల లోనావాలా అనే హిల్ స్టేషన్లో లెస్లీ సాక్నీ ప్రజాస్వామ్య శిక్షణ శిబిరంలో ఓ పది, పధ్నాలుగు రోజులున్నాను. ఎమ్.ఆర్. మసానీ ఆ శిబిరానికి ప్రారంభోపన్యాసం చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ఆచార్యులు ఎస్.పి. అయ్యర్ ప్రిన్సి పాల్గా తరగతులు నిర్వహించారు. నానీ పాల్కీవాలా ఆ సంస్థ అధ్యక్షులు. సోలీ సొరాబ్జీ, రజనీ పటేల్, వి.బి. కార్నిక్, వి.వి. జీన్, అరవింద్ దేశ్‌పాండే, రాము పండిట్, ఫెడీ మెహతా, ఎస్.వి. రాజు వంటి వారు వివిధ అంశాలపై శిక్షణ గరిపారు.వారిలో ఎ.జి. నూరానీ కూడా ఉన్నారు. ఆయన అప్పటికే ఒక దశాబ్ద కాలంగా వివిధ అంశాలపై పూంఖానుపుంఖాలుగా వివిధ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ఇండి యన్ ఎక్స్‌ప్రెస్, హిందూ, స్టేట్స్‌మన్ వంటి స్వదేశీ పత్రికలకే గాక, పాకి స్తాన్‌లోని ‘డాన్’ పత్రికలో కూడా వారి రచనలు ప్రచురితమవుతుండేవి. ఆ తదుపరి ఫ్రంట్‌లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి వాటికి కూడా రాసేవారు. జాకీర్ హుస్సేన్, బొంబాయి హైకోర్టులో మొట్టమొదటి భార తీయ వకీలు బద్రుద్దీన్ త్యాబ్జీ జీవిత చరిత్రలను ప్రచురించారు. కశ్మీర్ సమస్య, బాబ్రీ మసీదు, ఆర్టి కల్–370, లద్దాఖ్, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ పాత్ర, పౌరహక్కులు, భగత్ సింగ్‌పై విచారణ, సావర్కర్, హైదరాబాదు డిమాలిషన్ వంటి భిన్న విభిన్న అంశాలపై రచనలు చేశారు.తదాదిగా బొంబాయిలోగానీ, ఢిల్లీలోగానీ నూరానీని కలుసుకొనే అవకాశం దొరికేది. దక్షిణ బొంబాయిలో వీలు దొరికినప్పుడల్లా ఆయననను కలిసేవాడిని. ఎం.ఆర్. మసానీ అక్కడే బీచ్కాండీలో ఉండేవారు. నూరానీ నేపియన్ సీ అపార్టుమెంట్స్‌లో ఉండేవారు. అవి రెండూ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండేవి. దానితో మసానీ దగ్గరకెళ్లినప్పుడు విధిగా నూరానీని కూడా కలిసేవాడిని. నూరానీ బల్ల కుర్చీమీద కాకుండా, మంచంమీద కూర్చుని రాసేవారు. చుట్టూ అప్పడాలు ఆరబోసినట్లు లెక్కకు మించిన పుస్తకాలు తెరిచి, తిరగేసి ఉండేవి. ఏదైనా అంశంపై చర్చిస్తుండగా, ఎదురుగా ఉన్న పుస్తకాల్లో ఫలానా పుస్తకం తీసి ఫలానా చాప్టర్ చదవమనేవాడు.తాను చెప్పిన దానిని, వివరంగా అర్థం చేసుకోవడానికి ఉదయం చదివిన పత్రికలలో అవసరమయిన అంశాలను కత్తిరించి, అంశాల వారీగా ఫైల్ చేసేవారు. కొన్ని వందలు, వేల ఫైళ్ళు అలా ఉన్నాయి. ఏ అంశంమీద రాసినా, లోతైన పరిశోధన చేసేవారు. వాజ్‌పేయి–ముషారఫ్‌ల మధ్య ఆగ్రాలో జరిగిన చర్చలపై రాసే దానికి, పూర్తి సమాచారం రాబట్టడానికై, పనిగట్టుకొని ఇస్లామాబాద్ వెళ్లి పరిశోధన గావించారు. క్రీ.శ. 1775–1947ల మధ్య జరిగిన రాజకీయ ప్రేరిత విచారణలపై సమగ్ర పరిశోధన చేసి గ్రంథస్థం గావించారు. ‘జిన్నా–తిలక్ – కామ్రేడ్స్ ఆఫ్ ఫ్రీడం స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. అయితే ఏది ఎలా ఉన్నా ఎవరిమీదా వ్యక్తిగతంగా విమర్శ చేసేవారు కాదు. ‘రాజాజీ – అంకి తమైన, నిబద్ధతగల హిందువు, మహో న్నతమైన భారతీయుడు, అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు అలు పెరుగని రక్షకుడు’ అని కొనియాడారు. షేక్ అబ్దుల్లా, కరుణానిధిల తరఫున సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టులలో వకీలుగా తన వాదనలను వినిపించారు.నూరానీకి కొన్ని నిర్దిష్టమయిన, చిత్ర–విచిత్రమయిన అభిరుచులు ఉండేవి. ఢిల్లీ వస్తే ఇండియా ఇంటర్నేష నల్ సెంటర్లో 38వ నంబరు గదిలోనే మకాం. ఓల్డ్ ఢిల్లీ, నిజాముద్దీన్, కరోల్ బాగ్, జామా మసీదు వంటి చోటసందులు – గొందులలోని హోటళ్లలో కబాబ్–కుర్మా ఎక్కడ దొరుకు తుందోనని శోధించి, ఆస్వాదించేవారు. గత నెలాఖరులో తన 94వ ఏట కన్నుమూసిన అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ సేకరించిన వేలాది పుస్తకాలు, పేపర్ క్లిప్పింగ్‌లు ఏమవుతాయో? ఏదైనా జాతీయ స్థాయిలో నున్న గ్రంథాలయం గానీ, పరిశోధనా సంస్థలు, లేక జాతీయ పత్రికలు భద్రపరిచి, సద్వినియోగం గావించడం అవసరం. అవి భావి తరాలకు ప్రజాసేవా రంగాలలో, పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టే యువతరానికి ఉపయుక్తం కాగలవు. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు, 98663 76735 -
రిజల్ట్స్ విడుదల చేస్తారా.. లేదంటే బాంబు వేయమంటారా?
ముంబై: మహారాష్ట్రలోని ముంబై విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఫలితాలు విడుదల చేయకపోతే విశ్వవిద్యాలయాన్ని బాంబులు వేసి పేల్చేస్తామని ఈమెయిల్స్‌లో హెచ్చరికలు వచ్చాయి. డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయకపోతే తాము చెప్పిన పని చేస్తామని స్పష్టం చేశారు. ఆ పని విద్యార్థులే చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. బ్యాచిల్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్) సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ, మూల్యంకన విభాగం డైరెక్టర్ మెయిల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అధికారులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముంబై విశ్వవిద్యాలయం ఇటీవల చివరి సంవత్సర విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలు ఆలస్యంగా విడుదల చేసింది. మిగిలిన వారి ఫలితాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థులు విశ్వవిద్యాలయానికి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. -
‘తల్లిదండ్రులు అవమానంగా భావించారు’
ముంబై: పట్టణానికి చెందిన శ్రీదేవి మూడేళ్ల క్రితం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై యూనివర్సిటీలో చేరిన శ్రీదేవి తనను తాను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్న తొలి విద్యార్థిగా నిలిచారు. 2017లో యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరినప్పుడు శ్రీదేవి తనను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్నారు. కష్టపడి చదివి యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఒపెన్ లర్నింగ్(ఐడీఓఎల్) నుంచి సోషియాలజీ, సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రాడ్యూయేషన్ పూర్తి చేయడమే ఓ యుద్ధం అనుకుంటే.. దాని తర్వాత ఉద్యోగం సంపాదించడం మరి కష్టమైంది అన్నారు. ‘చదువు పూర్తవ్వడంతో ఓ యుద్ధాన్ని జయించినట్లు భావించాను. ఇలాంటి యుద్ధాలు ముందు ముందు మరెన్నో చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైంది ఉద్యోగం. చదవు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడం మరింత కష్టమయ్యింది. ట్రాన్స్‌ఉమెన్‌కు జాబ్ ఇవ్వడానికి ఎవ్వరు ఆసక్తి చూపలేదు. ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొన్న తర్వాత ఓ ఉద్యోగం లభించింది. ప్రసుత్తం నేను ఓ ఎలాక్ట్రానిక్ కంపెనీలో సీఏడీ డిజైనర్‌గా పని చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా నేను ఎదర్కొన్న అనుభవాల మేరకు భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందనిపించింది. అయితే వ్యాపారం గురించి నాకు ఏం తెలియదు. కాకపోతే ఉద్యోగం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే వ్యాపారం చేయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం ఉద్యోగంతో పాటు ఓ ఎన్జీవో అధ్వర్యంలో పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. ఇంటిరీయర్ డిజైనింగ్‌కు సంబంధించి షార్ట్‌టర్మ్ కోర్సు కూడా చేస్తున్నాను’ అని తెలిపారు శ్రీదేవి. ఇక తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. ‘నన్ను తమతో పాటు ఉంచుకోవడం అవమానంగా భావించేవారు నా తల్లిదండ్రులు. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే.. వారికి కనిపించకుండా నన్ను గదిలో బంధించేవారు. తల్లిదండ్రుల ప్రవర్తన నన్ను ఎంతో బాధపెట్టిది. నేను మనిషిని.. నాకు ఓ మనసుంది.. నాకు జీవించే హక్కుంది. నేనేం తప్పు చేయలేదు. అలాంటప్పుడు నేనేందుకు దాక్కొవాలి అని నా మనసు తిరగబడేది. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులతో ఎన్నో సార్లు గొడవ పడ్డాను. కానీ వారిలో మార్పు లేదు. దాంతో రెండేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆనాటి నుంచి మరిక వెనుతిరిగి చూడలేదు’ అంటున్నారు శ్రీదేవి. ఐటీఓఎల్ ప్రతినిధి వినోద్ మలాలే మాట్లాడుతూ.. మా యూనివర్సిటీలో ఎంతోమంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. కానీ వారు ఎవరు తమను తాము ట్రాన్స్‌జెండర్స్‌గా ప్రకటించుకోలేదు. అలా చేసిన మొదటి విద్యార్థి శ్రీదేవి అని తెలిపారు. -
ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!
రేడియేషన్ సమీపానికి వెళ్లాలంటే అందరికీ భయం. కానీ రేడియేషన్‌తో ఇప్పటి వరకు ఉన్న లాభాలే కాకుండా, కనీవినీ ఎరుగని రీతిలో మరొక అత్యంత కీలకమైన ప్రయోజనాన్నీ కనుగొన్నారు ముంబై యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ వైశాలి బంబోలి. ముంబై యూనివర్సిటీ క్యాంపస్‌లోని బయో నానో ఫిజిక్స్ లాబ్‌లో గత ఐదేళ్లుగా పరిశోధనలు జరిపి ఆమె ఈ విషయాన్ని కనుగొన్నారు! ఉదయం వండిన వంటకాలు రాత్రి తినాలంటే ముఖం చిట్లించుకుంటాం. అయితే వాటిని రేడియేషన్ ద్వారా ఏకంగా వెయ్యి రోజులు.. అంటే సుమారు మూడు సంవత్సరాల పాటు తాజాగా ఉంచవచ్చని ప్రొఫెసర్ వైశాలి కనుగొన్నారు! ఇది భవిష్యత్తులో మానవాళికి ఉపయుక్తమైన పరిణామాలకు నాంది అవుతుందని ఆమె భావిస్తున్నారు. ‘‘ముఖ్యంగా నేటి సమాజంలో ఆహారం కొరతను తగ్గించడంతోపాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారాన్ని దీర్ఘకాలం తాజాగా ఉంచి, అన్నార్తులకు అందించేందుకు వీలవుతుంది. అదే విధంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలున్న సరిహద్దులో ఉండే సైనికులకు కూడా తాజాగా ఆహారాన్ని అందించవచ్చు. మరో సంతోషకరమైన సంగతి.. అమెరికాతోపాటు దేశ విదేశాలలో ఉండే మనవారికి మన ఊరిలో మన ఇంట్లో తినే వంటలను తిన్పించేందుకు అవకాశం కలుగుతుంది’’ అన్నారు ప్రొఫెసర్ వైశాలి. ఏమిటా ప్రయోగం?! ‘రెడీ టు ఈట్’ ప్రాజెక్టులో భాగంగా.. వండిన పదార్థాలపై వైశాలి బృందం ఈ ప్రయోగం చేశారు. ఇడ్లీ, ఉప్మాతోపాటు తెల్లని డోక్లా (గుజరాతీ వంటకం) ను మూడేళ్లపాటు తాజాగా ఉంచవచ్చని తెలుసుకున్నారు. ప్రయోగ ఫలితాన్ని నిర్థారించుకున్న తర్వాతే ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. ‘‘ప్రత్యేకంగా రూపొందించిన మల్టీ లేయర్డ్ కవర్లలో (సంచులలో) ఆహార పదార్థాలను ఉంచి ప్యాక్ చేసి రేడియేషన్ ఇచ్చాం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ టెక్నాలజీ వినియోగించాం. ముఖ్యంగా ఎంత రేడియేషన్ ఇవ్వాలనేది కనుగొన్నాం. మేము అనేక తినుబండారాలపై చేసిన పరిశోధనలలో.. ముఖ్యంగా ఇడ్లీ, ఉప్మా, తెల్లని డోక్లాలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు మూడేళ్ల అనంతరం కూడా వాటి రుచితోపాటు వాటి నాణ్యత, వాటిలోని ప్రొటీన్స్, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్, మైక్రో సెన్సరీ వాల్యూస్ అన్నీ మూడేళ్ల కింద ఉన్నట్టే ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ ౖవైశాలి చెప్పారు. అయిదేళ్ల నాటి ఆలోచన ‘‘రేడియేషన్ సాధారణంగా వండిన వంటకాలపై కాకుండా కూరగాయలు, పండ్ల నిల్వ విధానానికి ఉపయోగిస్తారు. అయితే మనం వండిన వంటలపై వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అయిదేళ్ల కిందట వచ్చింది. అయితే గామా రేడియేషన్‌కు కొన్ని సమస్యలున్న సంగతి అందరికీ తెలిసిందే. కాని ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ ద్వారా ప్రయత్నిస్తే ఫలితం దక్కవచ్చని భావించాను. బోర్డ్ ఆఫ్ రేడియేషన్, ఐసోటోప్ టెక్నాలజీ (బిఆర్ఐటి) సంస్థలోని రేడియేషన్ యంత్రాన్ని నా పరిశోధన కోసం వినియోగించుకునేందుకు అనుమతి కోరాను. అనంతరం ముంబై యూనివర్సిటీలోని కలీనా క్యాంపస్‌లో బయో నానో ఫిజిక్స్ లాబ్ ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా రేడియేషన్ డోస్ ఎంత ఇవ్వాలనే దానిపై పరిశోధన చేశాం. అనంతరం వంటకాలను ఎలాంటి ప్యాకేజీలలో ఉంచి రేడియేషన్ ఇస్తే బాగుంటుందని ప్రయోగాలు చేశాం. మొదట పరిశీలనలో భాగంగా ముప్పై రోజుల అనంతరం రేడియేషన్ ద్వారా ప్రత్యేక ప్యాకెట్లో ఉంచిన ఇడ్లీ, ఉప్మా, డోక్లాను అన్ని రకాలుగా పరీక్షలు చేశాం. ప్యాకింగ్ చేసిన రోజు ఎలా ఉన్నాయో నెల తర్వాత కూడా ఆ వంటకాలు అలానే తాజాగా ఉండడం గమనించాం. అనంతరం వెయ్యి రోజుల పరీక్షలు నిర్వహించాం. అప్పటికి కూడా ఆ వంటకాలలో ఎలాంటి మార్పులేదు’’ అని వివరించారు వైశాలి. త్వరలో యంత్రాల అభివృద్ధి టేబుల్ టాప్ ఎలక్ట్రానిక్ రేడియేషన్ యంత్రం సహాయంతో రాబోయే రోజుల్లో ఇతర వంటకాలను కూడా తాజాగా ఉంచే పరిశోధనల్ని వైశాలి బృందం చేయబోతోంది. ‘‘అయితే ఇందుకోసం కావలసిన రేడియేషన్ యంత్రాలు కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. చైనాలో టేబుల్‌టాప్ ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ధరలు భారీగా ఉన్నాయి. దీంతో మేమే అత్యంత తక్కువ ధరలో ఆ యంత్రాలను అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రొఫెసర్ వైశాలి తెలిపారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
మహాత్మా గాంధీ,తిలక్ లు లౌకిక వాదానికి వ్యతిరేకులు
ముంబై: ఇటీవల రాజస్థాన్ లోని పాఠ్యపుస్తకాల్లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కు సంబంధించిన వివాదం ఇంకా మరచిపోకముందే మరో వివాదం మొదలైంది. ముంబై యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లర్నింగ్ బుక్స్ లో ఉన్న అంశాలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. నెహ్రూకు సంబంధించిన విషయాలను వదిలేశారు. మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ లను లౌకిక వాదానికి వ్యతిరేకమని పాఠ్య పుస్తకాల్లో ఉంది. యూనివర్సిటీకి చెందిన సివిక్స్, పాలిటిక్స్ డిపార్ట్ మెంట్ ఈ బుక్కును సంకలనం చేసింది. ఇటీవల రాజస్థాన్ లోని ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకాల్లో జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉండంటం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాషాయీకరనలోభాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించింది. -
జన్యు మార్పిడితోనే ఆహార భద్రత
సైన్స్ కాంగ్రెస్‌లో శాస్త్రవేత్తల స్పష్టీకరణ ముంబై: పెరుగుతున్న జనాభా అవసరాలకు జన్యుమార్పిడి(జీఎం) పంటలే శరణ్యమని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. జన్యు మార్పిడి పంటల పరిజ్ఞానాన్ని మరింత విస్తరించేందుకు విధాన పరమైన అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముంబై వర్సిటీలో జరుగుతున్న 102వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో సోమవారం ‘జన్యు మార్పిడి పంటలు-వ్యవసాయంలో ఆధునిక బయోటెక్నాలజీ వినియోగం’ అంశంపై చర్చ జరిగింది. దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డెరైక్టర్ రాజేంద్ర సింగ్ పరోడా అధ్యక్షత వహించారు. ఏటేటా పెరిగిపోతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే జన్యుమార్పిడి పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు ప్రయోజనాల కోసం శాస్త్రీయ పునాదులపై జీఎం పంటలపై అవగాహన కల్పించాలన్నారు. బీటీ వంకాయ సురక్షితమని పరిశోధనల్లో తేలినా దాన్ని వినియోగించడం లేదన్నారు. జీఎం పంటలు విదర్భతోపాటు దేశంలో మరికొన్ని చోట్ల విఫలమైనందున రైతులు మళ్లీ సంప్రదాయ విధానాల వైపు మళ్లారని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఢిల్లీ వర్సిటీలో జెనెటిక్స్ విభాగాధిపతి దీపక్ పెంటల్ మాట్లాడుతూ... జీఎం పంటలను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నా భారత్ ఇప్పటికీ రూ.60 వేల కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటోందన్నారు. అణు పరిజ్ఞానం పంచుకోవాలి.. అణు పరిశోధనల ఫలితాలను ప్రపంచ దేశాలు పరస్పరం పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ‘అణుశక్తి-వర్తమానం-భవిష్యత్తు’ అంశంపై చర్చ జరిగింది. వైద్య రంగంలో అణు శక్తి వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల అనారోగ్య సమస్యలు పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ అభయ్ బంగ్ ‘గిరిజనుల ఆరోగ్యం-ఐటీ’ చర్చలో పేర్కొన్నారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని భోపాల్ ఎయిమ్స్ డెరెక్టర్ సందీప్ కుమార్ పేర్కొన్నారు. -
నీరజ్‌కు మద్దతుగా ఆప్ ఆందోళన
ముంబై: ప్రొఫెసర్ నీరజ్ హతేకర్ సస్పెన్షన్ వ్యవహరం ముంబై వర్సిటీలో మంటలు రేపుతోంది. నిజాయితీ గల నీరజ్‌ను విధులకు దూరంగా ఉంచుతూ వైస్ ఛాన్సలర్(వీసీ) రాజన్ వెలుకర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం ఆందోళనకు దిగింది. దీనికి వర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్ల నుంచి మద్దతు లభించింది. శాంతాక్రజ్‌లోని కలినా క్యాంపస్‌లో జరిగిన ఈ ఆందోళనలో ఆప్ నాయకుడు మయంక్ గాంధీ పాల్గొన్నారు. వర్సిటీ పరిపాలన వ్యవహరాల్లో జరుగుతున్న వివిధ సమస్యలపై నిలదీసినందుకే నీరజ్‌ను సస్పెండ్ చేశారని, ఇది అవినీతి అంశమేనని ఆయన ఆరోపించారు. ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా వీసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. పత్రికలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటాన్ని వర్సిటీ నిర్వహణ మండలి సీరియస్‌గా తీసుకోవడాన్ని గాంధీ తప్పుబట్టారు. మంగళవారం నుంచి నీరజ్‌కు మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే సంతకాల సేకరణ చేసిన ఆర్థిక విభాగానికి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు వాటిని అధికారులకు సమర్పించారు. తమకు మెరుగైన వసతులు కల్పించేందుకు పోరాడుతున్న నీరజ్‌పై చర్యలు తీసుకోవడాన్ని విద్యార్థులు ఖండించారు. అయితే నీరజ్‌ను సస్పెండ్ చేసే అధికారం తనకు ఉందని, ఇప్పటికే ఈ విషయంలో శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించానని వీసీ రాజన్ అంటున్నారు. అయితే తనను కావాలనే సస్పెండ్ చేశారని నీరాజ్ అంటున్నారు. గతేడాది డిసెంబర్ 12న మీడియా సమావేశం నిర్వహించిన నీరజ్, వీసీ తీరు బాగో లేదంటూ ఆరోపణలు చేశారు. విధుల్లో చేర్చుకోవాలి: ఆప్ ఇదిలావుండగా సస్పెండ్ చేసిన హతకరేను వెంటనే తిరిగి విధుల్లో చేర్చుకోవాలని రాష్ట్ర ఆప్ విభాగం ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. అవసరమైతే విద్యార్థులు చేసే ఆందోళనల్లో తాము కూడా భాగస్వామ్యులం అవుతామని, అన్యాయం ఎక్కడా జరిగినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇదంతా చేసేది ప్రజల్లో క్రేజీ కోసం కాదని, అందరికీ న్యాయం కోసమేనని స్పష్టం చేసింది. తమ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు హతేకర్ ప్రయత్నించారని, అందుకే ఆయన్ని సస్పెండ్ చేశారని చెప్పింది. వీసీని సస్పెండ్ చేసి, నీరజ్ చేసిన ఆరోపణలపై ఓ కమిటీని నియమించి విచారించాలని డిమాండ్ చేసింది. హైకోర్టును ఆశ్రయించిన నీరాజ్ హతేకర్ ముంబై వర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని మీడియాను తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై సస్పెండ్‌కు గురైన ప్రొఫెసర్ నీరజ్ హతేకర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై చట్టవిరుద్ధంగా చర్యలు తీసుకున్నారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తనను సస్పెండ్ చేసే అధికారం వైస్ ఛాన్సలర్‌కు లేదని, వర్సిటీ నిర్వాహక మండలికి ఉంటుందని అందులో వివరించారు. అలాగే తనపై చర్యలు తీసుకోవడానికి గల కారణమేంటనేది కూడా స్పష్టంగా పేర్కొనలేదన్నారు. సస్పెన్షన్ లేఖ విషయంలోనూ నిబంధనల ప్రకారం నడుచుకోలేదని తెలిపారు. మీడియా సమావేశం నిర్వహించే 48 గంటల ముందు ప్రెస్‌నోట్ అందరి సభ్యులకు పంచానని అన్నారు. అయితే అందులో ఏమైనా తప్పిదం ఉంటే తనకు చెప్పి ఉంటే బాగుండేదని తెలిపారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తన సస్పెన్షన్ కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కళాశాలల నుంచి విద్యార్థుల వార్షిక ఫీజులు రాబట్టడం, కొందరికి అర్హత లేకున్నా ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, లెక్చరర్ హాల్లు పనికిరాకుండా ఉన్నాయని, పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతుందని, పీహెచ్డీ అడ్మిషన్లు కూడా నిబంధనల ప్రకారం నడవడం లేదని ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో నీరజ్ వర్సిటీ పాలన యంత్రాంగ లోపాలను ఎత్తిచూపిన సంగతి తెలిసిందే. -
క్లాక్ టవర్‌కు కొత్త హంగులు
సాక్షి, ముంబై: నగరంలోని పురాతన కట్టడాల్లో ఒకటైన ‘రాజాబాయి క్లాక్ టవర్’ త్వరలో కొత్త హంగులతో దర్శనమివ్వనుంది. ఏకంగా 135 సంవత్సరాల తరువాత ఈ టవర్‌కు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ముంబై యూనివర్సిటీ ఆవరణలో ఉన్న రాజాబాయి టవర్‌ను ప్రపంచంలోనే ప్రముఖ ఆర్కిటె క్చర్‌గా పేరుగాంచిన సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ రూపకల్పన చేశారు. దీన్ని 1878లో నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీనికి పెద్దగా మరమ్మతులు జరగలేద ంటే నమ్మశక్యం కాదు. అయితే ఇది అక్షరాలా నిజం. దూరం నుంచి చూస్తే చెక్కు చెదరలేదని అనిపించినా దగ్గరగా చూస్తే పగుళ్లిచ్చిన రాళ్లు కనిపిస్తాయి. కొన్ని ఊడి కిందపడిపోయే దశలో ఉన్నాయి. దీంతో మరమ్మతులు చేపట్టి, రాళ్లకు పాలిష్ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇది హెరిటేజ్ కట్టడం కావడంతో నిపుణుల మార్గదర్శనంతో పనులు చేపడుతున్నారు. -
మల్టీపర్పస్ వర్చువల్ క్లాస్రూమ్ ప్రారంభం
ముంబై: యూనివర్సిటీ విద్య ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో లక్షలాది మంది విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ముంబై యూనివర్సిటీలో శనివారం బహుళార్ధసార్థక వాస్తవిక తరగతి గది (ఎంవీసీ)ని గవర్నర్ శంకర్ నారాయణన్ ప్రారంభించారు. హార్వర్డ్ యూనివర్సిటీ తరహాలో పని చేసే ఈ ఎంవీసీ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం నిపుణులైన బోధకుల నుంచి ప్రత్యేక ప్రసంగాలు వినవచ్చు. వర్క్‌షాప్‌లు, సదస్సులను తిలకించవచ్చు. ఈ సందర్భంగా గవర్నర్ కె.శంకర్ నారాయణన్ మాట్లాడుతూ ప్రపంచస్థాయి వర్సిటీల సరసన ముంబై యూనివర్సిటీ ఉండేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీనికోసం కాలపరిమితిని నిర్దేశించుకొని తగిన రోడ్‌మ్యాప్ ద్వారా లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని వైస్ చాన్సలర్ రాజన్ వెలుకర్‌కు సూచించారు. ప్రపంచంలోని టాప్ 200 వర్సిటీల్లో భారత్‌లోని ఒక్క వర్సిటీ కూడా లేకపోవడం విచారంగా ఉందన్నారు. అయితే ఈ అంశంలో ముంబై వర్సిటీ సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ‘మన విద్యార్థులు అమెరికా, జర్మనీలోని యూనివర్సిటీలకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. అక్కడి స్థాయి విద్యను మనం ఎందుకు అందించలేకపోతున్నామ’ని ఆయన ప్రశ్నించారు. దీన్ని అధిగమించేందుకు క్యాంపస్ అభివృద్ధితో పాటు తాజా కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరిచయం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ అధ్యాపక బృందం లేకపోవడంతోనే ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత వర్సిటీలకు స్థానం లభించడం లేదన్నారు. ఆధునిక సాంకేతిక నిపుణులైన అధ్యాపకులు రానంతవరకు మన వర్సిటీలు ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌ను దక్కించుకోలేవని తెలిపారు. ఎంవీసీ లాంటివి అమలుచేసేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందుతుందన్నారు. ఈ వర్చువల్ క్లాస్రూమ్ ఉపాధ్యాయుల శిక్షణకు, నైపుణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు, పనిచేసే వారికి సాయంత్రం వేళలో విద్యను అందించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ తరహాలో... రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల చెంతకు అన్లైన్ చదువు పాఠాలు చేరేలా ముంబై యూనివర్సిటీ సరికొత్త పంథాను ఎంచుకుంది. హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయిలో కొత్త మల్టీపర్పస్ వర్చువల్ క్లాస్రూమ్ (ఎంవీసీ)ను పరిచయం చేసింది. నిపుణుల ప్రత్యేక బోధనలు, చర్చాగోష్టి, సదస్సులను ఎంవీసీ సహాయంతో ముఖాముఖి నిర్వహించే వెసులుబాటును కల్పించింది. దీనివల్ల లెక్చరర్ల కొరత సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది. పరిమిత వనరులతో ఆయా అంశాలపై విద్యార్థులు పట్టు సాధించుకునే అవకాశం ఉంది. ఎంవీసీలో భవిష్యత్‌లో అన్లైన్ కోర్సులను కూడా చేర్పించే అవకాశముంది. ఇప్పటికే ఈ వర్సిటీకి చెందిన 700 అనుబంధ కళాశాలల్లో 420 కళాశాలలు ఈ డిజిటల్ వ్యవస్థ కోసం పేరును నమోదుచేసుకున్నాయి. అయితే ఏ-వ్యూ వర్చువల్ లెర్నింగ్ టూల్‌ను అమృతా యూనివర్సిటీ డిజైన్ చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య శాఖ మంత్రి డీపీ సావంత్, ముంబై వర్సిటీ వైస్ చాన్సలర్ నరేశ్ చంద్ర, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.