
ముంబై: విజయవంతంగా డిగ్రీ పూర్తిచేసి, తమ విద్యార్హత పట్టాలను అందుకున్న ఆ విద్యార్థులు తమ సర్టిఫికేట్లను చూసుకుని కంగుతిన్నారు. గతంలో విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు తప్పుగా ముద్రితం కావడం పొరపాటుగా జరుగుతుండేది. అయితే ఇప్పుడు కనిపించిన ఆ తప్పుడు ముద్రణ విద్యార్థులకు మింగుడుపడటం లేదు. దీంతో ఆ విద్యార్థులంతా తమ సర్టిఫికేట్లను తిరిగి యూనివర్శిటీకి సమర్పించారు.
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ముంబై విశ్వవిద్యాలయం(Mumbai University) (ఎంయు) అందించే సర్టిఫికేట్లలో విద్యార్థుల పేర్లలో స్పెల్లింగ్ తప్పులు రావడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అయితే ఈసారి విశ్వవిద్యాలయం పేరే మారిపోయింది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ‘ముంబై యూనివర్శిటీ’(ఎంయూ) అని ఉండాల్సిన స్థానంలో ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’(University of Mumbai)(యూఎం) అని ఉంది. డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికేట్లను యూనివర్శిటీ అధికారులు ఆయా కళాశాలలకు పంపారు. వీటిని చూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూనివర్శిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక కళాశాల ప్రిన్సిపాల్ ఈ ఉదంతంపై స్పందిస్తూ ‘ముంబై యూనివర్శిటీ (ఎంయూ) ఇలా వర్శిటీ పేరునే తప్పగా రాయడం సిగ్గుచేటు. లోగోలోనే తప్పులు ఉన్నందున ఇవి నకిలీ సర్టిఫికేట్లుగా ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులు ఈ సర్టిఫికేట్లను(Certificates) ఉద్యోగాల కోసం లేదా తదుపరి చదువుల కోసం ఉపయోగిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఇటీవల ముంబై విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరిగింది. 2023-24లో 1.64 లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారు. వీరికి సర్టిఫికేట్లను కూడా అందజేశారు.
సర్టిఫికెట్ల ముద్రణను ముంబై యూనివర్శిటీ.. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక కంపెనీకి అప్పగించింది. ఇప్పుడు యూనివర్శిటీ ఈ తప్పును సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా విద్యార్థులకు కొత్త సర్టిఫికేట్లను అందించేందుకు సిద్ధమయ్యింది. ఈ ఉందంతంపై ఒక కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సర్టిఫికేట్ల ముద్రణలో తప్పులు వస్తున్నాయని, అయితే ఈ సారి జరిగింది పెద్ద తప్పేనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సర్టిఫికేట్లను ముద్రించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు వీలైనంత త్వరగా సరైన సర్టిఫికేట్లను అందించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Bangladesh: షేక్ హసీనా మాయం.. భారత్ సహకారం తుడిచివేత
Comments
Please login to add a commentAdd a comment