చదరంగం ఎవరు కనుగొన్నారు..? యూరప్‌లో పుట్టినట్టుంది..! కానీ అచ్చంగా అది మన భారతీయ సంప్రదాయ క్రీడ అని.. దాన్ని సృష్టించింది మన పూర్వీకులే అన్న నిజం ఎంతమందికి తెలుసు? ఈ చదరంగం ఆట వాయువ్య భారతంలో పుట్టింది. నేపాల్ దేశం జాతీయ క్రీడతో సమానంగా భావించే పులిజూదం కూడా మన సొంతమే! ఇలా చెబుతూ పోతే పచ్చీసు, అష్టాచెమ్మా, పాము–నిచ్చెన.. ఇలాంటి సంప్రదాయ ‘బోర్డ్ గేమ్స్’ అన్నీ మన సృష్టే. ఇవన్నీ మెదడకు మేత పెట్టేవే. ఆలోచనలకు పదును పెట్టేవే. ఇవన్నీ దాదాపు అన్నిదేశాల్లో ఆడుతున్నవే. మరి మనలో ఎంతమంది వీటిని ఆడుతున్నారు? ఇప్పుడు కేంద్రానికి కూడా ఇదే సందేహమొచ్చింది. వెంటనే చిన్న అధ్యయనం చేయగా.. చదరంగం మినహా మిగతావన్నీ దాదాపు అంతరించేస్థితిలో ఉన్నాయి. కేంద్రం అధీనంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు సంయుక్తంగా భారీ కార్యాచరణకు నడుం బిగించాయి.
– సాక్షి, హైదరాబాద్
హ్యూమన్ కంప్యూటర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రచయిత్రి శకుంతలాదేవి. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ కంప్యూటర్ విభాగం ఇచ్చిన గణిత పజిల్‌ను ఆమె కేవలం 28 క్షణాల్లో పరిష్కరించి ఆ బిరుదు సంపాదించారు. అది అప్పట్లో గిన్నిస్ బుక్ పుటల్లో నమోదైంది. 7686369774870ను 2465099745779 గుణిస్తే వచ్చే మొత్తాన్ని ఆమె అరనిమిషం సమయం కూడా తీసుకోకుండా ఠక్కున చెప్పేశారు. మరి ఇప్పటి పిల్లలు కాలిక్యులేటర్ లేకుండా లెక్కలు చేయగలుగుతున్నారా.. ఠపీఠపీమంటూ ఎక్కాలు వల్లించగలుగుతున్నారా? చిన్నచిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్ చూడనిదే చేయ లేని పరిస్థితికి వచ్చారు ఇప్పటి పిల్లలు. ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటి తరం క్రమంగా తీసికట్టుగా మారుతోందన్న సంగతి వెక్కిరిస్తోంది.
కారణమేంటి..?
సంప్రదాయ బోర్డ్ గేమ్స్ అంతరించటం.. పిల్లల్లో ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగించటం... ఈ రెండింటికి లింక్ ఉందనేది నిపుణుల మాట. అందుకే అలనాటి బోర్డు గేమ్స్ పునరుద్ధరించి మళ్లీ విస్తరించేలా చేస్తే పిల్లల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని, దీంతో జ్ఞాపకశక్తి, మేధోసంపత్తి చురుగ్గా మారుతుందని భావిస్తున్నారు. అందుకే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు సంయుక్తంగా ఓ బృహత్తర కార్యాచరణ ప్రారంభించాయి. ఈ సంప్రదాయ బోర్డ్ గేమ్స్ అన్నీ సరదాగా ఆడినట్టే అనిపించినా వాటన్నింటిలో నిగూఢంగా ఆలోచనా శక్తిని పురిగొల్పే మహత్తు ఉంది. ఎత్తు వేసే ముందు ఎంతో ఆలోచించాలి.
ఎదుటి వారిని చిత్తు చేయా లంటే గొప్ప ఎత్తుగడ అవసరం. అందుకు తీక్షణంగా ఆలోచించాలి. అది ఆ ఆటలో గెలుపే కాదు, జీవితంలో విజయం సాధించేందుకూ ఉపయోగపడుతుందని ఈ గేమ్స్‌పై అధ్యయనం చేసిన నిపుణులు తేల్చారు. వీటిని పునరుద్ధరిం చేందుకు వీటిపై విద్యార్థుల్లో తొలుత ఆసక్తి కలిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ మూడు సంస్థలు ఇటీవల ముంబైలో నిపుణులతో రెండు రోజులపాటు సదస్సు నిర్వహించాయి. ఇందులో ఈ బోర్డ్ గేమ్స్‌పై అవగాహన, అధ్యయనం చేసిన నిపుణులను ఆహ్వానించారు. అలా 40 మంది పాల్గొనగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజారెడ్డి కూడా ఉన్నారు.
ఏం చేస్తారు..?
భారతీయ సంప్రదాయ బోర్డ్ గేమ్స్ ఏంటో గుర్తించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే చదరంగం పుట్టింది ఇండియాలోనే అన్నదానికి గట్టి ఆధారాలను సహేతుకంగా గుర్తించారు. చాలా దేశాల్లో ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ఈ గేమ్స్‌కు పుట్టినిల్లు మన దేశమే అన్న విషయం తెలిస్తే... వీటిపై విద్యార్థుల్లో ఆసక్తి రగులుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సదస్సులో పేపర్స్ ప్రజెంట్ చేసినవారు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇందుకోసం చారిత్రక ఆధారాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ వైద్యులు డాక్టర్ రాజారెడ్డి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పురాతన చారిత్రక దేవాలయాలు, కోటలలో ఈ ఆటలకు సంబంధించి ఆధారాలను సచిత్రంగా సదస్సు ముందుంచారు. హైదరాబాద్ శివారులోని రాచకొండ కోటలో 12 శతాబ్దిలో ఈ ఆటలు అడినట్టు అక్కడి రాళ్లపై చిత్రించి ఉన్న చదరంగం, పులిజూదం, దడి తదితర చిత్రాలను సేకరించారు.
తిరుపతికి చేరువలో ఉన్న ఈ ఆలయం క్రీ.పూ.2 వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అంటే 2021 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ ఆటలు ప్రాచుర్యంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నిపుణులు సమర్పించిన పేపర్లతో ఓ పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. దీన్ని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, పాఠశాలలలకు పంపాలనేది ప్రణాళిక. ఈ ఆటలు ఎలా ఆడాలి, ఆడటం వల్ల కలిగే లాభాలు, ఈ ఆటలకు దూరం కావటం వల్ల మనకు జరిగిన నష్టం...తదితర వివరాలను సహేతుకంగా సిద్ధం చేసి విద్యార్థులకు చేరేలా చేయాలనేది ఆలోచన. ఈ ఆటల్లో ఆసక్తి రగిలే కార్యక్రమాలు నిర్వహించి మళ్లీ నేటి తరం ఆ సంప్రదాయ ఆటలవైపు చూసేలా చేయాలని నిర్ణయించారు.
ఇండియా టు పర్షియా..
చదరంగం మన దేశంలో తొలుత ఆడారు. నలుగురు ఆడేలా దాన్ని రూపకల్పన చేశారు. ఆ తర్వాత అది పర్షియాకు చేరింది. అక్కడ రాజు/రాణి పావు అదనంగా చేర్చి, ఇద్దరు ఆడేలా మార్చారు. ఆ తర్వాత యూరప్, అక్కడి నుంచి చైనాకు ఆ ఆట చేరిందని నిపుణులు తేల్చిన వివరాలను ఈ సదస్సులో సమర్పించారు. పులిజూదం, పచ్చీసు, పాము–నిచ్చెన, అష్టాచెమ్మలు కూడా మన దేశం నుంచి ఇతర ఖండాలకు పాకినవేనని పేర్కొన్నారు.
నా మనవరాలు సందేహంతో..
‘అమెరికాలోని నాసాలో అధ్యయనం చేస్తున్న నా మనవరాలు సమీక్ష మా ఇంటికి వచ్చినప్పుడు చదరంగం ఎక్కడ పుట్టిందన్న ప్రశ్న వేసింది. చిన్న ఆధ్యయనంతో అది మన దేశంలోనే పుట్టిందన్న మాట చెప్పినప్పుడు అబ్బురపడి చారిత్రక ఆధారాలు సేకరించి పుస్తకం రాయాలని కోరింది. అలా మేం ఇద్దరం కలసి ఆధారాలతో ఓ పుస్తకాన్ని రూపొందించాం. ఇప్పుడు ఇదే ఆలోచనతో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు ఆ పుస్తకం గురించి తెలుసుకుని సదస్సుకు ఆహ్వానించాయి. అక్కడ నేను మా అధ్యయనంలోని వివరాలు అందించా. 40 మంది నిపుణులు అద్భుతమైన వివరాలు సమర్పించారు. త్వరలో అవన్నీ దేశవ్యాప్తంగా విద్యార్థులకు చేరతాయి. మన సంప్రదాయ బోర్డు గేమ్స్‌కు పాత రోజులొస్తే కచ్చితంగా విద్యార్థులకు మేలు కలుగుతుంది’
– డాక్టర్ రాజారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment