ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి! | Everyone is afraid to go to radiation | Sakshi
Sakshi News home page

ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!

Published Fri, Feb 1 2019 11:58 PM | Last Updated on Sat, Feb 2 2019 12:17 AM

Everyone is afraid to go to radiation - Sakshi

రేడియేషన్‌ సమీపానికి వెళ్లాలంటే అందరికీ భయం. కానీ రేడియేషన్‌తో ఇప్పటి వరకు ఉన్న లాభాలే కాకుండా, కనీవినీ ఎరుగని రీతిలో మరొక అత్యంత కీలకమైన ప్రయోజనాన్నీ కనుగొన్నారు ముంబై యూనివర్సిటీ ఫిజిక్స్‌ విభాగం భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వైశాలి బంబోలి. ముంబై యూనివర్సిటీ క్యాంపస్‌లోని బయో నానో ఫిజిక్స్‌ లాబ్‌లో గత ఐదేళ్లుగా పరిశోధనలు జరిపి ఆమె ఈ విషయాన్ని కనుగొన్నారు! ఉదయం వండిన వంటకాలు రాత్రి తినాలంటే ముఖం చిట్లించుకుంటాం. అయితే వాటిని రేడియేషన్‌ ద్వారా ఏకంగా వెయ్యి రోజులు.. అంటే సుమారు మూడు సంవత్సరాల పాటు తాజాగా ఉంచవచ్చని ప్రొఫెసర్‌ వైశాలి కనుగొన్నారు! ఇది భవిష్యత్తులో మానవాళికి ఉపయుక్తమైన పరిణామాలకు నాంది అవుతుందని ఆమె భావిస్తున్నారు.

‘‘ముఖ్యంగా నేటి సమాజంలో ఆహారం కొరతను తగ్గించడంతోపాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారాన్ని దీర్ఘకాలం తాజాగా ఉంచి, అన్నార్తులకు అందించేందుకు వీలవుతుంది. అదే విధంగా మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలున్న సరిహద్దులో ఉండే సైనికులకు కూడా తాజాగా ఆహారాన్ని అందించవచ్చు. మరో సంతోషకరమైన సంగతి.. అమెరికాతోపాటు దేశ విదేశాలలో ఉండే మనవారికి మన ఊరిలో మన ఇంట్లో తినే వంటలను తిన్పించేందుకు అవకాశం కలుగుతుంది’’ అన్నారు ప్రొఫెసర్‌ వైశాలి. 

ఏమిటా ప్రయోగం?!
‘రెడీ టు ఈట్‌’ ప్రాజెక్టులో భాగంగా.. వండిన పదార్థాలపై వైశాలి బృందం ఈ ప్రయోగం చేశారు. ఇడ్లీ, ఉప్మాతోపాటు తెల్లని డోక్లా (గుజరాతీ వంటకం) ను మూడేళ్లపాటు తాజాగా ఉంచవచ్చని తెలుసుకున్నారు. ప్రయోగ ఫలితాన్ని నిర్థారించుకున్న తర్వాతే ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. ‘‘ప్రత్యేకంగా రూపొందించిన మల్టీ లేయర్డ్‌ కవర్‌లలో (సంచులలో) ఆహార పదార్థాలను ఉంచి ప్యాక్‌ చేసి రేడియేషన్‌ ఇచ్చాం.

ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ బీమ్‌ రేడియేషన్‌ టెక్నాలజీ వినియోగించాం. ముఖ్యంగా ఎంత రేడియేషన్‌ ఇవ్వాలనేది కనుగొన్నాం. మేము అనేక తినుబండారాలపై చేసిన పరిశోధనలలో.. ముఖ్యంగా ఇడ్లీ, ఉప్మా, తెల్లని డోక్లాలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు మూడేళ్ల అనంతరం కూడా వాటి రుచితోపాటు వాటి నాణ్యత, వాటిలోని ప్రొటీన్స్, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్, మైక్రో సెన్సరీ వాల్యూస్‌ అన్నీ మూడేళ్ల కింద ఉన్నట్టే ఉన్నాయి’’ అని ప్రొఫెసర్‌ ౖవైశాలి చెప్పారు.

అయిదేళ్ల నాటి ఆలోచన
‘‘రేడియేషన్‌ సాధారణంగా వండిన వంటకాలపై కాకుండా కూరగాయలు, పండ్ల నిల్వ విధానానికి ఉపయోగిస్తారు. అయితే మనం వండిన వంటలపై వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అయిదేళ్ల కిందట వచ్చింది. అయితే గామా రేడియేషన్‌కు కొన్ని సమస్యలున్న సంగతి అందరికీ తెలిసిందే. కాని ఎలక్ట్రానిక్‌ బీమ్‌ రేడియేషన్‌ ద్వారా ప్రయత్నిస్తే ఫలితం దక్కవచ్చని భావించాను. బోర్డ్‌ ఆఫ్‌ రేడియేషన్, ఐసోటోప్‌ టెక్నాలజీ (బిఆర్‌ఐటి) సంస్థలోని రేడియేషన్‌ యంత్రాన్ని నా పరిశోధన కోసం వినియోగించుకునేందుకు అనుమతి కోరాను.  అనంతరం ముంబై యూనివర్సిటీలోని కలీనా క్యాంపస్‌లో బయో నానో ఫిజిక్స్‌ లాబ్‌ ఏర్పాటు చేసుకున్నాం.

ముందుగా రేడియేషన్‌ డోస్‌ ఎంత ఇవ్వాలనే దానిపై పరిశోధన చేశాం. అనంతరం వంటకాలను ఎలాంటి ప్యాకేజీలలో ఉంచి రేడియేషన్‌ ఇస్తే బాగుంటుందని ప్రయోగాలు చేశాం. మొదట పరిశీలనలో భాగంగా ముప్పై రోజుల అనంతరం రేడియేషన్‌ ద్వారా ప్రత్యేక ప్యాకెట్‌లో ఉంచిన ఇడ్లీ, ఉప్మా, డోక్లాను అన్ని రకాలుగా పరీక్షలు చేశాం. ప్యాకింగ్‌ చేసిన రోజు ఎలా ఉన్నాయో నెల తర్వాత కూడా ఆ వంటకాలు అలానే తాజాగా ఉండడం గమనించాం. అనంతరం వెయ్యి రోజుల పరీక్షలు నిర్వహించాం. అప్పటికి కూడా ఆ వంటకాలలో ఎలాంటి మార్పులేదు’’ అని వివరించారు వైశాలి. 

త్వరలో యంత్రాల అభివృద్ధి
టేబుల్‌ టాప్‌ ఎలక్ట్రానిక్‌ రేడియేషన్‌ యంత్రం సహాయంతో రాబోయే రోజుల్లో ఇతర వంటకాలను కూడా తాజాగా ఉంచే పరిశోధనల్ని వైశాలి బృందం చేయబోతోంది. ‘‘అయితే ఇందుకోసం కావలసిన రేడియేషన్‌ యంత్రాలు కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి.  చైనాలో టేబుల్‌టాప్‌ ఎలక్ట్రానిక్‌ బీమ్‌ రేడియేషన్‌ యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ధరలు భారీగా ఉన్నాయి. దీంతో మేమే అత్యంత తక్కువ ధరలో ఆ యంత్రాలను అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రొఫెసర్‌ వైశాలి తెలిపారు. 
– గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement