- సైన్స్ కాంగ్రెస్‌లో శాస్త్రవేత్తల స్పష్టీకరణ
ముంబై: పెరుగుతున్న జనాభా అవసరాలకు జన్యుమార్పిడి(జీఎం) పంటలే శరణ్యమని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. జన్యు మార్పిడి పంటల పరిజ్ఞానాన్ని మరింత విస్తరించేందుకు విధాన పరమైన అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముంబై వర్సిటీలో జరుగుతున్న 102వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో సోమవారం ‘జన్యు మార్పిడి పంటలు-వ్యవసాయంలో ఆధునిక బయోటెక్నాలజీ వినియోగం’ అంశంపై చర్చ జరిగింది. దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డెరైక్టర్ రాజేంద్ర సింగ్ పరోడా అధ్యక్షత వహించారు.
ఏటేటా పెరిగిపోతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే జన్యుమార్పిడి పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు ప్రయోజనాల కోసం శాస్త్రీయ పునాదులపై జీఎం పంటలపై అవగాహన కల్పించాలన్నారు. బీటీ వంకాయ సురక్షితమని పరిశోధనల్లో తేలినా దాన్ని వినియోగించడం లేదన్నారు. జీఎం పంటలు విదర్భతోపాటు దేశంలో మరికొన్ని చోట్ల విఫలమైనందున రైతులు మళ్లీ సంప్రదాయ విధానాల వైపు మళ్లారని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఢిల్లీ వర్సిటీలో జెనెటిక్స్ విభాగాధిపతి దీపక్ పెంటల్ మాట్లాడుతూ... జీఎం పంటలను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నా భారత్ ఇప్పటికీ రూ.60 వేల కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటోందన్నారు.
అణు పరిజ్ఞానం పంచుకోవాలి..
అణు పరిశోధనల ఫలితాలను ప్రపంచ దేశాలు పరస్పరం పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ‘అణుశక్తి-వర్తమానం-భవిష్యత్తు’ అంశంపై చర్చ జరిగింది. వైద్య రంగంలో అణు శక్తి వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల అనారోగ్య సమస్యలు పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ అభయ్ బంగ్ ‘గిరిజనుల ఆరోగ్యం-ఐటీ’ చర్చలో పేర్కొన్నారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని భోపాల్ ఎయిమ్స్ డెరెక్టర్ సందీప్ కుమార్ పేర్కొన్నారు.