Genetic exchange
-
వేరియంట్లు కావవి..స్కేరియంట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట ‘వేరియంట్’. శాస్త్రీయంగా దీని గురించి ప్రజలకు తెలియకపోయినా.. వారిని తీవ్రంగా భయపెడుతోంది. అందుకే దీన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు ‘స్కేరియంట్స్’ (భయపెట్టేవి)గా కొట్టిపారేస్తున్నారు. భారతీయ వైద్య నిపుణులు సైతం వేరియంట్స్ గురించి అతిగా ఆలోచించొద్దని సూచిస్తున్నారు. ప్రధాన వైరస్ రూపాంతరం వల్ల మారే వివిధ ఆకృతులన్నీ విభిన్న ప్రభావాలు చూపిస్తాయనే ఆందోళనకు శాస్త్రీయత లేదని చెబుతున్నారు. ఉదాహరణకు కర్నూలు కేంద్రంగా పుట్టిందని ప్రచారం చేస్తున్న ‘ఎన్–440కే’ వేరియంట్ ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. దీనిపై పరిశోధనలు చేసేలోపే ఆ వేరియంట్ మాయమైంది. చాలా వేరియంట్స్ ఇలాగే ఉంటాయని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ వైద్య కళాశాల క్లినికల్ వైరాలజీ ప్రొఫెసర్ టి.జాకబ్‌జాన్ తెలిపారు. ఒకే వైరస్.. రూపాలే వేరు ఏ వైరస్ అయినా విస్తరించే కొద్దీ రకరకాలుగా ఉత్పరివర్తనం చెందుతుంది. ప్రతి పరిణామాన్ని గుర్తించి.. దానికి ఓ కోడ్ ఇవ్వడం జన్యు శాస్త్ర పరిశీలనలో భాగమంటున్నారు నిపుణులు. నిజానికి కరోనాకు సంబంధించి ఇంతవరకూ విస్తృతంగా ల్యాబొరేటరీ పరిశోధనలు పూర్తి చేసుకున్నవి మూడే. యూకేలో 2020 సెప్టెంబర్‌లో బ్రెజిల్ వేరియంట్ పి–1 గుర్తించారు. అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా, డిసెంబర్లో బ్రెజిల్ వేరియంట్స్‌పై శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. వీటినుంచి పుట్టుకొచ్చిన వేరియంట్స్‌కు అనేక రకాలుగా కోడింగ్ ఇచ్చారు. వేరియంట్స్ ఎన్నయినా మూలం ఒకటే. యూకే వేరియంట్స్ శాఖోపశాఖలే వేరియంట్స్‌గా భారత్‌ను వణికిస్తోందని వైద్యులంటున్నారు. మూలం ఒకటే కాబట్టి, వేరియంట్ ఏదైనా వ్యాక్సిన్ అన్నింటినీ అడ్డుకుంటుందని భారత వైద్యమండలి స్పష్టం చేస్తోంది. ఏ వేషం వేసినా డీఎన్ఏ ద్వారా వ్యక్తిని గుర్తించి మందు ఇచ్చినట్టే కరోనాకు చెక్ పెట్టేందుకు వైద్య పరిశోధనలు సరిపోతాయని తెలిపారు. ఈ దిశగానే ఇప్పటికే అనేక మందులు అందుబాటులోకి వస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టం చేస్తోంది. ఆందోళన అనవసరం జన్యు మార్పిడి వల్ల పుట్టుకొచ్చే రూపాంతరాల గురించి ప్రజలు అతిగా ఆలోచించకపోవడమే మంచిది. ప్రధాన వైరస్‌ను గుర్తించి వైద్యం చేస్తున్నప్పుడు, కట్టడికి వ్యాక్సిన్‌పై విస్తృత పరిశోధనలతో ముందుకెళ్తున్నప్పుడు ఏ శాస్త్రీయతా లేని వేరియంట్స్ గురించి ఆందోళన అనవసరం. – ముఖర్జీ, హృద్రోగ నిపుణులు అనవసర భయమే వేరియంట్స్ అంటే అసలు వైరస్ బిడ్డలే. కాకపోతే వీటి వేషం మారుతుందంతే. వైరస్ మ్యుటేషన్ చెంది, స్పైక్స్ బయటకు కన్పిస్తాయి. ఈ స్పైక్స్ ప్రొటీన్సే. అమినో ఆమ్లాన్నే ప్రొటీన్ అంటారు. ఏది ఉండకూడదు.. ఏది ఉండాలనేది జెనెటిక్ కోడ్ నిర్దేశిస్తుంది. కోడ్ మారితే అమినో ఆమ్లం మారుతుంది. ఫలితంగా ప్రోటీన్ ఆకృతి మారుతుంది. వైరస్ రకరకాల ఆకృతి తీసుకుంటుంది. ఇది ఏ రూపంలో ఉన్నా గుర్తించే ల్యా»ొరేటరీలు అభివృద్ధి చెబుతున్నాయి. కాబట్టి ఇదంతా అనవసర భయమే. – ప్రవీణ్‌కుమార్, మైక్రో బయాలజిస్ట్, విజయవాడ -
జన్యు మార్పిడితోనే ఆహార భద్రత
సైన్స్ కాంగ్రెస్‌లో శాస్త్రవేత్తల స్పష్టీకరణ ముంబై: పెరుగుతున్న జనాభా అవసరాలకు జన్యుమార్పిడి(జీఎం) పంటలే శరణ్యమని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. జన్యు మార్పిడి పంటల పరిజ్ఞానాన్ని మరింత విస్తరించేందుకు విధాన పరమైన అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముంబై వర్సిటీలో జరుగుతున్న 102వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో సోమవారం ‘జన్యు మార్పిడి పంటలు-వ్యవసాయంలో ఆధునిక బయోటెక్నాలజీ వినియోగం’ అంశంపై చర్చ జరిగింది. దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డెరైక్టర్ రాజేంద్ర సింగ్ పరోడా అధ్యక్షత వహించారు. ఏటేటా పెరిగిపోతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే జన్యుమార్పిడి పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు ప్రయోజనాల కోసం శాస్త్రీయ పునాదులపై జీఎం పంటలపై అవగాహన కల్పించాలన్నారు. బీటీ వంకాయ సురక్షితమని పరిశోధనల్లో తేలినా దాన్ని వినియోగించడం లేదన్నారు. జీఎం పంటలు విదర్భతోపాటు దేశంలో మరికొన్ని చోట్ల విఫలమైనందున రైతులు మళ్లీ సంప్రదాయ విధానాల వైపు మళ్లారని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఢిల్లీ వర్సిటీలో జెనెటిక్స్ విభాగాధిపతి దీపక్ పెంటల్ మాట్లాడుతూ... జీఎం పంటలను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నా భారత్ ఇప్పటికీ రూ.60 వేల కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటోందన్నారు. అణు పరిజ్ఞానం పంచుకోవాలి.. అణు పరిశోధనల ఫలితాలను ప్రపంచ దేశాలు పరస్పరం పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ‘అణుశక్తి-వర్తమానం-భవిష్యత్తు’ అంశంపై చర్చ జరిగింది. వైద్య రంగంలో అణు శక్తి వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల అనారోగ్య సమస్యలు పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ అభయ్ బంగ్ ‘గిరిజనుల ఆరోగ్యం-ఐటీ’ చర్చలో పేర్కొన్నారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని భోపాల్ ఎయిమ్స్ డెరెక్టర్ సందీప్ కుమార్ పేర్కొన్నారు. -
‘జీఎం’ ఎండమావుల వెంట...
సుప్రీం కోర్టు సాంకేతిక కమిటీ పదేళ్ల పాటూ నిషేధం విధింపును సూచించినా కేంద్రం ఇటీవల జన్యు మార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరిశోధనలకు అనుమతినిచ్చింది. జీఎం పంటల వల్ల సుసంపన్నమైన మన జీవ వైవిధ్యానికి శాశ్వతమైన నష్టం వాటిల్లుతుంది. రైతాంగం బహుళజాతి కంపెనీల కోరల్లో చిక్కుకుంటుంది. రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల తీవ్ర వ్యతిరే కతను బేఖాతరు చేసి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఇటీవలే జన్యు మార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరిశోధనలకు అనుమతిని మంజూరు చేసింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు నియమించిన సాంకేతిక కమిటీ... జన్యు మార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరిశోధనలను పదేళ్ల పాటూ నిషేధించాలని సూచించింది. అలాగే గత లోక్‌సభ నియమించిన పార్లమెంటరీ కమిటీ చేసిన సూచనలు సైతం అనుమతులను నిరాకరించాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యా వరణవేత్తలు, రైతులు, ప్రజా సంఘాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత కారణంగా జీఎం సాంకేతికత అత్యంత వివాదాస్పదమైనదిగా మారింది. మన దేశంలో హరిత విప్లవ కాలం తదుపరి పంటల దిగుబడుల పెరుగుదల, ఉత్పత్తుల వృద్ధి స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసా య ఉత్పత్తులలో గణనీయమైన వృద్ధిని సాధించడానికి ఉన్న ఏకైక మార్గం బయో టెక్నాలజీ, జన్యుమార్పిడి మాత్రమేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సాంకేతికత అతి వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యవసాయ బయోటెక్ రంగాన్ని శాసిస్తున్న మోన్సాంటో, అపెంటిస్ సింజెంటా, డ్యుపాంట్, బేయర్ అనే ఐదు కంపెనీలే వ్యవసాయ బయోటెక్ రంగాన్ని శాసిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్ర సంస్థల పేరిట అవి జన్యు మార్పిడి సాంకేతిక పరి జ్ఞానాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాయి. చీడపీడలు సోకని వంగడా లను గాక, క్రిమి సంహారక, కలుపు మందులను తట్టుకునే వంగడాలను ప్రవేశపెడుతున్నాయి. ఇంతవరకు ఏ వంగడమూ అధిక దిగుబడి కోసం రూపొందించినది కాకపోవడం విశేషం. ఫలితంగా రైతు రసాయనిక ఎరు వులు, క్రిమి నాశనుల వ్యయాల పెను భారాన్ని మోయాల్సివస్తోంది. అంత కుమించి పర్యావరణ శాస్త్రవేత్తలంతా నిషేధించాలని కోరుతున్నారు రసాయ నిక ఎరువులు, క్రిమి నాశనుల వాడకం పెరుగుతోంది. ఆ రెండు రంగాలను శాసిస్తున్న బహుళ జాతి కంపెనీలే బయో టెక్నాలజీ, జీఎం సాంకేతికతపై గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. జీఎం వంగడాల పేటెంట్ హక్కుల పేరిట విత్తనంపై రైతుకు ఉన్న సహజ హక్కులను హరిస్తున్నాయి. ఇదంతా అధిక దిగుబడుల పేరిట జరుగుతున్న దగా. ఆ ఆశతోనే మన రైతాంగం బీటీ పత్తిని విస్తృతంగా పండిస్తోంది. కానీ బీటీ పత్తి విస్తరించే కొద్దీ దిగుబడులు క్షీణిస్తున్నాయనే కఠోర వాస్తవాన్ని మోన్సాంటో, జీఎం వత్తాసుదార్లు దాట వేస్తున్నారు. కేంద్ర జౌళి శాఖ విడుదల చేసిన ఈ గణాంకాలే సాక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా ఇలాగే రైతులు జీఎం విత్తనాలు, క్రిమిసంహారక మందులు బహుళజాతి కంపెనీల కోరల్లో చిక్కుకుంటున్నారు. ఆ వినాశకర దుష్ఫలితాలను మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఏటా వేలాదిగా జరుగు తున్న రైతుల ఆత్మహత్యల్లో అత్యధికం బీటీ పత్తి రైతులవే కావడం యాదృచ్ఛికం కాదు. మోన్సాంటోను (బీటీ పత్తి) ఆహ్వానించి చేజేతులారా మనం కొని తెచ్చుకున్న ఉపద్రవం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విడుదల చేసిన సమాచారాన్ని చూస్తే (పక్కన ఉన్న పట్టికలో) పత్తి దిగుబడి పెరుగుదల క్షీణత బీటీ చలవేనని స్పష్టమౌతుంది. బీటీ పత్తి విస్తరణతో పాటే పత్తి దిగుబడుల పెరుగుదల క్షీణించడం కనిపిస్తుంది. హరిత విప్లవం పర్యావరణానికి హాని కలగజేయగా, బయోటెక్ బహు ళజాతి కంపెనీలు జీవావరణాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కసారి జన్యు మార్పిడి చేసిన జీవిని నియంత్రించడం అసాధ్యమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ బయోటెక్ పరిశోధనల వ్యయంలో 70 శాతాన్ని చేస్తున్న పైన పేర్కొన్న ఐదు బహుళజాతి సంస్థలు ఈ హెచ్చరికలను పెడ చెవినిపెట్టి జీఎం పంటల విస్తరణతో ప్రపంచ విత్తనాల మార్కెట్తోపాటూ వ్యవసాయ మార్కెట్లను మొత్తంగా గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తు న్నాయి. ఇప్పటికే జీఎం సాంకేతికతను ప్రపంచ వాణి జ్యసంస్థ (డబ్ల్యూటీఓ) ఎజెండాకు ఎక్కించిన ఆ సంస్థలు జీఎం పంటల ప్రపంచీకరణ దిశగా సాగు తున్నాయి. మోన్సాంటో, డ్యుపాంట్, సింజెంటా అనే మూడు కంపెనీలు ప్రపంచ విత్తన మార్కెట్‌ను శాసిస్తున్నాయి (55 శాతం). పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు వంటి పంటలు పూర్తిగా ఆ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. అధిక పెట్టుబడుల ఆధునిక వ్యవసాయంతో ఇప్పటికే మన రైతాంగం దివా లా తీసింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మన రైతాంగం బహుళ జాతి కంపెనీల ప్రపంచ విత్తన మార్కెట్ బలి పశువువుగా మారుతుంది. మోన్సాంటోకు ఏటా రూ. 1,800 కోట్లు రాయల్టీలుగా చెల్లిస్తోంది. జీఎం మిగతా పంటలకు కూడా విస్తరిస్తే పరిస్థితిని ఊహించుకోవచ్చు. బీటీ కంపెనీలు తమ పరిశోధనలను అతి రహస్యంగా ఉంచుతున్నాయి. ఉదాహరణకు బీటీ పత్తి ‘బాసిల్లస్ తురంజనిసిస్’ అనే విషపూరిత జన్యు వును ప్రవేశపెట్టి సృష్టించినది. అందుకే బీటీ పత్తి చేలల్లో మేసిన పశువులు, మేకలు గణనీయమైన సంఖ్యలో మరణిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే ‘బాసిల్లస్ తురంజనిసిస్’తో బీటీ వంగ విత్తనాలను తయారు చేశారు! భారత ఆహార భద్రత దృష్ట్యా మన దేశంలో జీఎం వరిపై జరుగుతున్న క్షేత్ర స్థాయి పరీక్షల ఫలితాలను వెల్లడించాలంటూ ‘గ్రీన్ పీస్’ కోర్టును ఆశ్రయించింది. జీఎం పంటల విస్తరణతో పాటే కొత్త కొత్త ఆరోగ్యసమస్యలు పుట్టుకొస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తగ్గి కొత్త ఎలర్జీలు పుట్టుకొస్తున్నట్టు పలు అధ్యయనాలు రుజువు చేశాయి. కీటకాలను నాశనం చేసే విషపూరిత జన్యువులున్న ఆహారం వల్ల ఇప్పటికి ఉన్న యాంటీ బయోటిక్ మందులన్నీ నిర్వీర్యమై, సరికొత్త యాంటీ బయోటిక్స్‌ను కనిపెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ దుష్ఫలితాల వల్లనే రష్యా, స్విట్జర్లాండ్ సహా 25 దేశాలు జీఎం పంటలను, పరిశోధనను, ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించాయి. అమెరికా, కెనడా, అర్జెంటీనా వంటి ఆహార ఎగుమతుల దేశాల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌ను కోల్పోతున్నాయి. ఒకవంక ప్రపంచ వ్యాప్తంగా జీఎం పంటలకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతుంటే... మరోవంక జీఎం పంటల ఆహార భద్రతను పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలపై దాడులు జరుగుతుండటం విశేషం. భారత్ వంటి వాతావరణ, జీవ వైవిధ్యం గల దేశంలో జీఎం సాంకేతికత వల్ల అనాదిగా మన రైతాంగం సేకరించి, అభివృద్ధి చెందిన స్థానిక వంగడాలు సహజత్వాన్ని కోల్పోతాయి, జన్యుపరంగా కలుషిత మవుతాయి. మన జీవ వైవిధ్యానికి శాశ్వతంగా నష్టం వాటిల్లుతుంది. బీటీ పత్తి వచ్చిన కొద్ది రోజులకే స్థానిక పత్తి రకాలన్నీ అదృశ్యమయ్యాయి ! ఇప్పుడిక బీటీ పత్తి తప్ప రైతుకు గత్యంతరం లేదు. అదే దుస్థితి మిగతా పంటలకు రాకముందే మేలుకోవడం అవసరం. ఇప్పటికైనా మన పాలకులు కళ్లు తెరచి స్వజాతి విత్తన సంపద పరిరక్షణకు నడుం బిగించి, జన్యుమార్పిడి పంటలను, పరిశోధనలను నిషేధించాలి. (వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ నిపుణులు) డాక్టర్ కె.క్రాంతికుమార్ రెడ్డి -
జన్యు మార్పిడితోనే భవిష్యత్తు
బహుళ జాతి కంపెనీలు మన దేశంపై సురక్షితం కాని జీఎం పంటలను బలవంతంగా రుద్దుతున్నాయని దుష్ర్పచారం జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఏర్పడనున్న తీవ్ర ఆహార కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆ అత్యధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవడం తప్పనిసరి. జన్యు మార్పిడి (జీఎం) పంటలపై దేశంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొన్ని స్వార్థపర శక్తులు స్వచ్ఛంద సంస్థల ముసుగులో వ్యతిరేకిస్తున్నాయి. దేశ అత్యున్నత నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సైతం అవి దురుద్దేశాలను ఆపాదిస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి బదులు తాత్సార ధోరణిని అవలంబిస్తుండటం కూడా ఈ ఆందోళనకర పరిస్థితికి దోహదపడుతోంది. ఈ స్వచ్ఛంద సంస్థలు జన్యుమార్పిడి పంటలకు మద్దతు పలికే వారందరిపైనా బహుళజాతి కంపెనీల వత్తాసుదార్ల ముద్ర వేసి, దేశంలోని బయోటెక్ కంపెనీలు, విత్తన కంపెనీల సేవలను తక్కువ చేసి చూపుతున్నాయి. ఈ పరిస్థితులలో ఒకరి ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా వాస్తవాల ప్రాతిపదికన జన్యు మార్పిడి సాంకేతికత మంచి చెడ్డలను బేరీజు వేయడం సముచితం. మన దేశంలో జన్యుమార్పిడి పంటలను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను ప్రధాని శాస్త్ర సలహా మండలితోపాటు ‘డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ’, ‘జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ’ (జీఈఏసీ)లు ఎప్పుడో గుర్తించాయి. అయితే జీఎం సాంకేతికత వ్యతిరేకుల వితండవాదం వలన ప్రజల్లో ఏర్పడ్డ అపోహల కారణంగా వాటి అమలు నిలిచిపోయింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఈ స్వార్థపర శక్తులకు వంత పాడుతున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయంతోపాటు ఇతర అన్ని రంగాల్లోనూ జన్యుమార్పిడి సాంకేతిక పరిజ్ఞానానికి అనుమతులను మంజూరు చేయాల్సిన జీఈఏసీ అంచనాలకుపరిమితమైంది. ఒక్కసారి మొక్కుబడి సమావేశాలు నిర్వహించి చేతులు దులిపేసుకుంటోంది. ఫలితం.. జీఎం పంటల విషయంలో అంతు తెలియని అసందిగ్ధత, అస్పష్టత! మరోవైపు ఇతర దేశాలు ఈ రంగంలో శరవేగంగా ముందుకెళుతున్నాయి. ఏడాదిలోపు అమెరికా, సహారా ఎడారి ప్రాంత రైతులకు కరువు కాటకాలను తట్టుకునే మెరుగైన మొక్కజొన్న వంగడాన్ని అందుబాటులోకి తేనుంది. చైనా, బ్రెజిల్‌లు బయోటెక్నాలజీల సాయంతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. జీఎం సాంకేతికత ప్రమాదకరమా? జీఎం సాంకేతికత సురక్షితం కాదని, తగిన నియంత్రణ వ్యవస్థ లేని మన దేశంపై బహుళజాతి కంపెనీలు వీటిని బలవంతంగా రుద్దుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ప్రధానంగా మూడు అంశాలను గమనించాల్సి ఉంది. జీఎమ్ సాంకేతిక ప్రయోజనాలు, భద్రతకు సంబంధించినది మొదటి అంశం కాగా... బహుళజాతి కంపెనీల పాత్ర ఏమిటి? భారత నియంత్రణ వ్యవస్థ శక్తి సామర్థ్యాలు ఎలాంటివి? అనేవి మిగిలిన రెండు అంశాలు. చీడపీడలను తట్టుకునే విషయంలో జీఎం ఉత్పత్తుల శక్తిసామర్థ్యాలు మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా ఇప్పటికే విస్పష్టంగా నిరూపణైంది. రెండు జన్యుమార్పిడి ఉత్పత్తుల ద్వారా దాదాపు కోటీ 44 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లాభపడినట్లు ‘బ్రూక్స్ అండ్ బార్ఫుట్ ’ సంస్థ (బ్రిటన్) అధ్యయనం తెలిపింది. కీటక నాశనుల వాడకం 9 శాతం వరకూ తగ్గడంతోపాటు ఆర్థికంగా లాభసాటి అని తేల్చింది. బీటీ పత్తి మన రైతులకు ఎన్ని విధాలుగా మేలు చేకూర్చిందో కళ్ల ముందే కనిపిస్తోంది. 2002లో బీటీ వంగడాన్ని ప్రవేశపెట్టినప్పుడు దేశంలో పత్తి సాగు విస్తీర్ణం 90 లక్షల హెక్టార్లు మాత్రమే. ప్రస్తుతమిది కోటీ 20 లక్షల హెక్టార్లకు చేరుకుంది. దిగుబడి కోటీ 30 లక్షల బేళ్ల నుంచి మూడు కోట్ల 40 లక్షల బేళ్లకు చేరుకుంది. అంటే దాదాపు 165 శాతం వృద్ధి! 2000లో హెక్టారుకు 200 కిలోలుగా ఉన్న పత్తి దిగుబడి... బీటీ పుణ్యమా అని 2005-06 నాటికి 362 కిలోలకు, 2010-11 నాటికి 510 కిలోలకు చేరుకుంది. ఒకప్పుడు దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పత్తి ఎగుమతిదారుగా మారింది. బహుళజాతి కంపెనీల బూచి... దేశీయ విత్తన మార్కెట్‌ను కబ్జా చేసేందుకు బహుళజాతి కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయన్న వాదన సామాన్య ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేందుకు పనికొస్తుందేగానీ... తర్కానికి నిలిచేది కాదు. విత్తనాలు, బయోటెక్నాలజీ రంగంలో ఎవరైనా ప్రవేశించవచ్చు. ఆ విషయంలో బహుళజాతి కంపెనీల ఆధిపత్యమేమీ లేదని అందరూ గుర్తించాలి. బహుళజాతి కంపెనీలు తాము ఆవిష్కరించిన జన్యువులను దేశీయ విత్తన కంపెనీకి ఒకే ఒకసారి డోనర్ విత్తనం ద్వారా అందిస్తుంది. బీటీ విషయాన్నే తీసుకుంటే ఇప్పటివరకూ అయిదు వేర్వేరు రకాలు (మోన్శాంటో, రెండో భారతీయ కంపెనీలు, సీఐసీఆర్లవి) అందుబాటులోకి వచ్చాయి. ఏ విత్తనానికి ఎంత ఆదరణ లభిస్తుందన్నది రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అటు హైబ్రిడ్లతోపాటు ఇటు ఓపీ రకాల్లోనూ బీటీ అందుబాటులో ఉందన్నది గమనార్హం. జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చురుకుగా పాల్గొంటున్నాయి. ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉన్న తొమ్మిది పంటలు సహా మరో 50 రకాల్లో సగం వాటివే. చైనాలో మాదిరిగా ప్రభుత్వ రంగంలో జన్యుమార్పిడి పంటల అభివృద్ధిని సాధించాలంటే జీఎం ఉత్పత్తులపై ఉన్న నియంత్రణలను తొలగించాలి. రాయల్టీల ద్వారా నష్టం వాటిల్లుతోందనుకుంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. తగు విధానాల రూపకల్పనతో కొత్త పంటల విషయంలో గుత్తాధిపత్య ధోరణులను సైతం అరికట్టవచ్చు. పటిష్టమైన ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షలు, రక్షణ ఏర్పాట్లు అన్నీ శాస్త్రబద్ధంగా చేసినవేనని, అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనివని కేంద్రం ఇటీవలే సుప్రీం కోర్టుకు తెలిపింది. పైగా ఎప్పటికప్పుడు నియంత్రణ వ్యవస్థలను మరింత పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘అరుణా రోడ్రిగ్స్ కేసు’లో అది స్పష్టం చేసింది. జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రస్తుతం అనేక సాంకేతిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కరువు కాటకాలను తట్టుకోడానికి, భూములు చవుడు బారడం సమస్యను అధిగమించడానికి ఇవి ఎంతగానో దోహదం చేయవచ్చు. అదే సమయంలో పెరిగిపోతున్న ఎరువుల సబ్సిడీల భారానికి కళ్లెం వేసి, వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచేందుకు సాయపడతాయి. ఒకవైపు పెరుగుతున్న జనాభాతో పాటు ఆహార అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు వ్యవసాయ కూలీల కొరత కూడా ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆహార కొరత, ప్రత్యేకించి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ఆ ముప్పును నివారించాలన్నా, వ్యవసాయంలో మానవ శ్రమ వాడకాన్ని తగ్గించాలన్నా అత్యధునాతన సాంకేతికతల వాడకం తప్పనిసరి. వరి సాగులో నీటి వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరమూ ఉంది. కలుపు నివారణ కోసం వరి పొలాల్లో నీటిని నిల్వ ఉంచడం కంటే మెరుగైన సాంకేతిక పద్ధతులను, కలుపు నాశినులను వాడటమే మేలు. దేశంలో పంటల తీరుతెన్నులపై విస్తృత చర్చకు ఇదే సరైన సమయం. వ్యవసాయ అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు మెరుగైన సాంకేతికతలను ఉపయోగించుకోవాల్సిన తరుణమిది. జన్యుమార్పిడి వంగడాలు వేటిని ఉపయోగించాలి? ఏ ఏ జన్యు లక్షణాలు మన అవసరాలను మెరుగైన రీతిలో తీర్చగలవు? ఏ పంటల్లో మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించాలి? అనుమతించరాదు? తదితర అంశాలపై నిర్మాణాత్మకంగా అన్ని వర్గాల వారు కలసి చర్చిస్తే దేశ వ్యవసాయ రంగం భవిష్యత్తుకు ఒక దశ, దిశ లభిస్తుందన్నది నా నమ్మిక. దేశానికి ఇంత అన్నం పెడుతున్న రైతుల అభివృద్ధితో పాటు దేశ ఆర్థికాభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా ముందడుగు వేయాల్సిన తరుణమిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశోధన సంస్థలు పరస్పర సహకారంతో రైతన్నలకు మంచి భవిష్యత్తును అందించడానికి నడుం బిగించాల్సిన సమయమిది. (రచయిత అసోసియేషన్ ఫర్ బయోటెక్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అగ్రికల్చర్ గ్రూప్ చైర్మన్) రామ్ కౌండిన్య