జన్యు మార్పిడితోనే భవిష్యత్తు | genetic mutation is necessary in future | Sakshi
Sakshi News home page

జన్యు మార్పిడితోనే భవిష్యత్తు

Published Tue, Jul 22 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

జన్యు మార్పిడితోనే భవిష్యత్తు

జన్యు మార్పిడితోనే భవిష్యత్తు

బహుళ జాతి కంపెనీలు మన దేశంపై సురక్షితం కాని జీఎం పంటలను బలవంతంగా రుద్దుతున్నాయని దుష్ర్పచారం జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఏర్పడనున్న తీవ్ర ఆహార కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆ అత్యధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవడం తప్పనిసరి.
 
జన్యు మార్పిడి (జీఎం) పంటలపై దేశంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొన్ని స్వార్థపర శక్తులు స్వచ్ఛంద సంస్థల ముసుగులో వ్యతిరేకిస్తున్నాయి. దేశ అత్యున్నత నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సైతం అవి దురుద్దేశాలను ఆపాదిస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి బదులు తాత్సార ధోరణిని అవలంబిస్తుండటం కూడా ఈ ఆందోళనకర పరిస్థితికి దోహదపడుతోంది. ఈ స్వచ్ఛంద సంస్థలు జన్యుమార్పిడి పంటలకు మద్దతు పలికే వారందరిపైనా బహుళజాతి కంపెనీల వత్తాసుదార్ల ముద్ర వేసి, దేశంలోని బయోటెక్ కంపెనీలు, విత్తన కంపెనీల సేవలను తక్కువ చేసి చూపుతున్నాయి. ఈ పరిస్థితులలో ఒకరి ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా వాస్తవాల ప్రాతిపదికన జన్యు మార్పిడి సాంకేతికత మంచి చెడ్డలను బేరీజు వేయడం సముచితం.

మన దేశంలో జన్యుమార్పిడి పంటలను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను ప్రధాని శాస్త్ర సలహా మండలితోపాటు ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ’, ‘జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ’ (జీఈఏసీ)లు ఎప్పుడో గుర్తించాయి. అయితే జీఎం సాంకేతికత వ్యతిరేకుల వితండవాదం వలన ప్రజల్లో ఏర్పడ్డ అపోహల కారణంగా వాటి అమలు నిలిచిపోయింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఈ స్వార్థపర శక్తులకు వంత పాడుతున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయంతోపాటు ఇతర అన్ని రంగాల్లోనూ జన్యుమార్పిడి సాంకేతిక పరిజ్ఞానానికి అనుమతులను మంజూరు చేయాల్సిన జీఈఏసీ అంచనాలకుపరిమితమైంది.  ఒక్కసారి మొక్కుబడి సమావేశాలు నిర్వహించి చేతులు దులిపేసుకుంటోంది. ఫలితం.. జీఎం పంటల విషయంలో అంతు తెలియని అసందిగ్ధత, అస్పష్టత! మరోవైపు ఇతర దేశాలు ఈ రంగంలో శరవేగంగా ముందుకెళుతున్నాయి. ఏడాదిలోపు అమెరికా, సహారా ఎడారి ప్రాంత రైతులకు కరువు కాటకాలను తట్టుకునే మెరుగైన మొక్కజొన్న వంగడాన్ని అందుబాటులోకి తేనుంది. చైనా, బ్రెజిల్‌లు బయోటెక్నాలజీల సాయంతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి.  

జీఎం సాంకేతికత ప్రమాదకరమా?

జీఎం సాంకేతికత సురక్షితం కాదని, తగిన నియంత్రణ వ్యవస్థ లేని మన దేశంపై బహుళజాతి కంపెనీలు వీటిని బలవంతంగా రుద్దుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ప్రధానంగా మూడు అంశాలను గమనించాల్సి ఉంది. జీఎమ్ సాంకేతిక ప్రయోజనాలు, భద్రతకు సంబంధించినది మొదటి అంశం కాగా...  బహుళజాతి కంపెనీల పాత్ర ఏమిటి? భారత నియంత్రణ వ్యవస్థ శక్తి సామర్థ్యాలు ఎలాంటివి? అనేవి మిగిలిన రెండు అంశాలు. చీడపీడలను తట్టుకునే విషయంలో జీఎం ఉత్పత్తుల శక్తిసామర్థ్యాలు మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా ఇప్పటికే విస్పష్టంగా నిరూపణైంది. రెండు జన్యుమార్పిడి ఉత్పత్తుల ద్వారా దాదాపు కోటీ 44 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లాభపడినట్లు  ‘బ్రూక్స్ అండ్ బార్‌ఫుట్ ’ సంస్థ (బ్రిటన్) అధ్యయనం తెలిపింది.  కీటక నాశనుల వాడకం 9 శాతం వరకూ తగ్గడంతోపాటు ఆర్థికంగా లాభసాటి అని తేల్చింది. బీటీ పత్తి మన రైతులకు ఎన్ని విధాలుగా మేలు చేకూర్చిందో కళ్ల ముందే కనిపిస్తోంది. 2002లో బీటీ వంగడాన్ని ప్రవేశపెట్టినప్పుడు దేశంలో పత్తి సాగు విస్తీర్ణం 90 లక్షల హెక్టార్లు మాత్రమే. ప్రస్తుతమిది కోటీ 20 లక్షల హెక్టార్లకు చేరుకుంది. దిగుబడి కోటీ 30 లక్షల బేళ్ల నుంచి మూడు కోట్ల 40 లక్షల బేళ్లకు చేరుకుంది. అంటే దాదాపు 165 శాతం వృద్ధి! 2000లో హెక్టారుకు 200 కిలోలుగా ఉన్న పత్తి దిగుబడి... బీటీ పుణ్యమా అని 2005-06 నాటికి 362 కిలోలకు, 2010-11 నాటికి 510 కిలోలకు చేరుకుంది. ఒకప్పుడు దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పత్తి ఎగుమతిదారుగా మారింది.

బహుళజాతి కంపెనీల బూచి...

దేశీయ విత్తన మార్కెట్‌ను కబ్జా చేసేందుకు బహుళజాతి కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయన్న వాదన సామాన్య ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేందుకు పనికొస్తుందేగానీ... తర్కానికి నిలిచేది కాదు. విత్తనాలు, బయోటెక్నాలజీ రంగంలో ఎవరైనా ప్రవేశించవచ్చు. ఆ విషయంలో బహుళజాతి కంపెనీల ఆధిపత్యమేమీ లేదని అందరూ గుర్తించాలి. బహుళజాతి కంపెనీలు తాము ఆవిష్కరించిన జన్యువులను దేశీయ విత్తన కంపెనీకి ఒకే ఒకసారి డోనర్ విత్తనం ద్వారా అందిస్తుంది. బీటీ విషయాన్నే తీసుకుంటే ఇప్పటివరకూ అయిదు వేర్వేరు రకాలు (మోన్‌శాంటో, రెండో భారతీయ కంపెనీలు, సీఐసీఆర్‌లవి) అందుబాటులోకి వచ్చాయి. ఏ విత్తనానికి ఎంత ఆదరణ లభిస్తుందన్నది రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అటు హైబ్రిడ్‌లతోపాటు ఇటు ఓపీ రకాల్లోనూ బీటీ అందుబాటులో ఉందన్నది గమనార్హం. జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చురుకుగా పాల్గొంటున్నాయి. ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉన్న తొమ్మిది పంటలు సహా మరో 50 రకాల్లో సగం వాటివే. చైనాలో మాదిరిగా ప్రభుత్వ రంగంలో జన్యుమార్పిడి పంటల అభివృద్ధిని సాధించాలంటే జీఎం ఉత్పత్తులపై ఉన్న నియంత్రణలను తొలగించాలి. రాయల్టీల ద్వారా నష్టం వాటిల్లుతోందనుకుంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. తగు విధానాల రూపకల్పనతో కొత్త పంటల విషయంలో గుత్తాధిపత్య ధోరణులను సైతం అరికట్టవచ్చు.

పటిష్టమైన ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ   

జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షలు, రక్షణ ఏర్పాట్లు అన్నీ శాస్త్రబద్ధంగా చేసినవేనని, అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనివని కేంద్రం ఇటీవలే సుప్రీం కోర్టుకు తెలిపింది. పైగా ఎప్పటికప్పుడు నియంత్రణ వ్యవస్థలను  మరింత పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘అరుణా రోడ్రిగ్స్ కేసు’లో అది స్పష్టం చేసింది.   

జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రస్తుతం అనేక సాంకేతిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కరువు కాటకాలను తట్టుకోడానికి, భూములు చవుడు బారడం సమస్యను అధిగమించడానికి ఇవి ఎంతగానో దోహదం చేయవచ్చు. అదే సమయంలో పెరిగిపోతున్న ఎరువుల సబ్సిడీల భారానికి కళ్లెం వేసి, వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచేందుకు సాయపడతాయి. ఒకవైపు పెరుగుతున్న జనాభాతో పాటు ఆహార అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు వ్యవసాయ కూలీల కొరత కూడా ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆహార కొరత, ప్రత్యేకించి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ఆ ముప్పును నివారించాలన్నా, వ్యవసాయంలో మానవ శ్రమ వాడకాన్ని తగ్గించాలన్నా అత్యధునాతన సాంకేతికతల వాడకం తప్పనిసరి. వరి సాగులో నీటి వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరమూ ఉంది. కలుపు నివారణ కోసం  వరి పొలాల్లో నీటిని నిల్వ ఉంచడం కంటే మెరుగైన సాంకేతిక పద్ధతులను, కలుపు నాశినులను వాడటమే మేలు.

దేశంలో పంటల తీరుతెన్నులపై విస్తృత చర్చకు ఇదే సరైన సమయం. వ్యవసాయ అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు మెరుగైన సాంకేతికతలను ఉపయోగించుకోవాల్సిన తరుణమిది. జన్యుమార్పిడి వంగడాలు వేటిని ఉపయోగించాలి? ఏ ఏ జన్యు లక్షణాలు మన అవసరాలను మెరుగైన రీతిలో తీర్చగలవు? ఏ పంటల్లో మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించాలి? అనుమతించరాదు? తదితర అంశాలపై నిర్మాణాత్మకంగా అన్ని వర్గాల వారు కలసి చర్చిస్తే దేశ వ్యవసాయ రంగం భవిష్యత్తుకు ఒక దశ, దిశ లభిస్తుందన్నది నా నమ్మిక. దేశానికి ఇంత అన్నం పెడుతున్న రైతుల అభివృద్ధితో పాటు దేశ ఆర్థికాభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా ముందడుగు వేయాల్సిన తరుణమిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశోధన సంస్థలు పరస్పర సహకారంతో రైతన్నలకు మంచి భవిష్యత్తును అందించడానికి నడుం బిగించాల్సిన సమయమిది.

(రచయిత అసోసియేషన్ ఫర్ బయోటెక్ లెడ్ ఎంటర్‌ప్రైజెస్ అగ్రికల్చర్ గ్రూప్  చైర్మన్)  రామ్ కౌండిన్య
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement