రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి | IT Minister Sridhar Babu meets Saudi businessmen: Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

Published Mon, Jan 22 2024 6:22 AM | Last Updated on Mon, Jan 22 2024 3:48 PM

IT Minister Sridhar Babu meets Saudi businessmen: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడుల సాధనలో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం జెడ్డాలోని పలు సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయ జనరల్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ రాయెస్‌తో జరిగిన భేటీలో శ్రీధర్‌ బాబు తెలంగాణ విధానాలు, ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం తదితర అంశాలను వివరించారు.

సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రసాయనాలు, ఇంధన రంగాలకు సంబంధించి అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థగా పేరుపొందిన ఆరాంకో సంస్థ ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా మద్దతిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆల్‌ షరీఫ్‌ గ్రూప్‌ హోల్డింగ్స్‌ సంస్థ సీఈవో ఆల్‌ షరీఫ్‌ నవాబ్‌ బిన్‌ ఫైజ్‌ బిన్‌ అబ్దుల్‌ హకీమ్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ప్రాజెక్ట్స్‌ ఇంజనీర్‌ సులైమన్‌ కేతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. ఈ సంస్థ విద్యుత్, ఆతిథ్య, రియల్‌ ఎస్టేట్, టెక్నాలజీ, ఆవిష్కరణ రంగంలో అగ్రగామిగా ఉంది. 

సెడ్కో కేపిటల్స్‌ ప్రతినిధులతో సహా పలువురితో భేటీ 
ప్రముఖ ఇన్వెస్ట్‌ మెంట్‌ కంపెనీ సెడ్కో కేపిటల్స్‌ ప్రతినిధులతో, జెడ్డా చాంబర్స్‌తో, ఆహార ఉత్ప త్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్‌ సీఈవో వలీద్‌ ఫతానాతో, సౌదీ బ్రదర్స్‌ కమర్షియల్‌ కంపెనీ సీఈవో, బోర్డ్‌ సభ్యులతో పెట్రోమిన్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో, బెట్టర్జీ హోల్డింగ్‌ కంపెనీ చైర్మన్‌ మాజెన్‌ బెట్టర్జీతోనూ మంత్రి శ్రీధర్‌ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులను వివరించారు.

పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో నిరంతర విద్యుత్‌ సరఫరా, పుష్కలమైన నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, మంచి మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని మంత్రి వారికి వివరించారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనబర్చినట్టు మంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యటనలో మంత్రి శ్రీధర్‌ బాబు వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement