
తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించండి
గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల అధికార ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. శనివారం హైదరాబాద్‌లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం (జీఐబీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియా – లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల వాణిజ్య సదస్సు’ రెండో ఎడిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాలను వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించటం ఒక రకంగా భారత్‌కు మేలు చేస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబ డులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు.
ఈ పరిణామాన్ని మనకు అనుకూలంగా మార్చుకుని.. ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 6 అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని వెల్లడించారు.
రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆగ్రో ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించి అన్నదాతలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీఐబీఎఫ్ ప్రతినిధులు జోషి, చక్రవర్తి, డా. సీతారాం తదితరులు పాల్గొన్నారు.