డెల్టా ఎయిర్‌లైన్స్ వైస్ ప్రెసిడెంట్ నారాయణన్ కృష్ణకుమార్‌తో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు
మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
హైదరాబాద్ నుంచి అట్లాంటాకు విమానం నడపాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కోకోకోలా గ్రూప్ డైరెక్టర్‌తో మంత్రుల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఆసక్తితో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం అట్లాంటాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ కార్యాలయంలో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌తో తెలంగాణ మంత్రుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పస్తుందని శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు డెల్టా టీమ్ తెలిపిందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇలావుండగా శ్రీధర్‌బాబుతో పాటు పర్యటనలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్‌ను కోరారు.
నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వలన అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కృష్ణకుమార్.. డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
‘కోకో కోలా’ సానుకూల స్పందన
అట్లాంటాలోని కోకో కోలా హెడ్ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథాన్ రీఫ్‌తో కూడా మంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహా్వనించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు పెరిగాయని వివరించారు. సానుకూలంగా స్పందించిన జోనాథాన్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మంత్రులతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment