నేడు అమెరికాకు సీఎం రేవంత్‌రెడ్డి | Telangana CM Revanth to Tour US on August 03 | Sakshi
Sakshi News home page

నేడు అమెరికాకు సీఎం రేవంత్‌రెడ్డి

Published Sat, Aug 3 2024 4:53 AM | Last Updated on Sat, Aug 3 2024 4:54 AM

Telangana CM Revanth to Tour US on August 03

న్యూయార్క్, వాషింగ్టన్‌ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో, డల్లాస్, దక్షిణకొరియాలో పర్యటన

సీఎంతో పాటు పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పయనం

రాష్ట్రానికి పెట్టుబడులపై ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి డి.శ్రీధర్‌బాబు కూడా ఆయనతో వెళ్తున్నారు. శనివారం ఉదయం 4.35 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు న్యూయార్క్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈనెల 4న న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీయులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.

5, 6 తేదీల్లో న్యూయార్క్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. 6న పెప్సికో, హెచ్‌సీఏ కంప్యూటర్స్‌ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్‌ డీసీకి చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 7న డల్లాస్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడ గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు.

8న శాన్‌ఫ్రాన్సిస్కోలో యాపిల్‌ ఉత్పాదక బృందం, ట్రైనెట్‌ సీఈఓ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి చర్చించనున్నారు. 9న గూగుల్, అమెజాన్‌ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో సాయంత్రం జరిగే ప్రవాస తెలంగాణీయుల భేటీలో పాల్గొంటారు. 10న శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంటారు. 12, 13 తేదీల్లో ఎల్‌జీ, శామ్‌సంగ్‌తో పాటు ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. 13న రాత్రి 11.50 గంటలకు సియోల్‌ నుంచి బయల్దేరి 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 

సీఎం రేవంత్‌తో ఆనంద్‌ మహీంద్రా భేటీ 
రాష్ట్రంలో కొత్తగా స్థాపించనున్న యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో ఆటోమోటివ్‌ విభాగాన్ని ప్రారంభించేందుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ముందుకొచ్చారు. ఈమేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆనంద్‌ మహీంద్రా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. త్వరలోనే యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిశీలనకు తమ కంపెనీ బృందాన్ని పంపిస్తామని సీఎంకు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో క్లబ్‌ మహీంద్రా హాలీడే రిసార్ట్‌ విస్తరణకు ముందుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement