మొత్తం రూ.36 వేల కోట్ల పెట్టుబడులు | CM Revanth Reddy Ended tour of America and South Korea | Sakshi
Sakshi News home page

మొత్తం రూ.36 వేల కోట్ల పెట్టుబడులు

Published Thu, Aug 15 2024 6:15 AM | Last Updated on Thu, Aug 15 2024 8:33 AM

CM Revanth Reddy Ended tour of America and South Korea

హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌ బృందం

ముగిసిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన

సాక్షి, హైదరాబాద్‌: సుమారు పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రపంచ స్థాయి కంపెనీలు ముందుకు వచ్చినట్లు ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అమెరికా కంపెనీలు రూ.31,502 కోట్ల పెట్టుబడులు, దక్షిణ కొరియా కంపెనీలు రూ.4,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాయి. మొత్తంగా 25 కంపెనీల నుంచి రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. దీంతో ఆయా రంగాల్లో కొత్త సంస్థలు, కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. 

సరికొత్త రికార్డు: ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సులోనూ సీఎం పాల్గొన్నారు. ఆ సందర్భంగా జరిగిన ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. ఈ విధంగా 8 నెలల్లోనే మొత్తం రూ.76,232 కోట్ల పెట్టుబడుల సాధన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసిందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ!
రెండురోజుల దక్షిణ కొరియా పర్య టనలో సీఎం రేవంత్‌ బృందం ప్రధానంగా ఆటోమోటివ్, ఎలక్ట్రాని క్స్, సెమీ కండక్టర్, ఇంధన స్టోరేజీ, టెక్స్‌టైల్‌ రంగాలపై దృష్టి సారించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తుందని భరోసా ఇవ్వడంతో అమెరికన్‌ కంపెనీల తరహాలోనే కొరియన్‌ కంపెనీల నుంచి భారీ స్పందన లభించినట్లు వివరించాయి. కాగా కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం అదే తరహాలో రాష్ట్రంలోనూ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.



శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
శంషాబాద్‌: బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్‌ బృందానికి ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. వీఐపీ లాంజ్‌లో పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం అందరికీ అభివాదం చేస్తూ పుష్పగుచ్ఛాలు స్వీకరించారు. కాగా తమ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్ర వారం ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చిన సందర్భంగా పార్టీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారని గాంధీభవన్‌ వర్గాల ద్వారా తెలిసింది. అయితే వీలునుబట్టి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతో ఆయన భేటీ అవుతారని, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ను కలుస్తారని తెలుస్తోంది.  



పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై వీరితో చర్చలు జరిపే అవకాశముందని సమాచారం. పీసీసీకి కొత్త అధ్య క్షుడిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ ఎటూ తేలని నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీని యర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కూడా ఢిల్లీకి పిలవనున్నట్లు సమాచారం. 

బీసీ లేదా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించే అవకాశాలున్నాయనే చర్చ జరు గుతుండగా, తాజాగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇలావుండగా 17–20 నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఈ సందర్భంగా లైన్‌ క్లియర్‌ అయ్యే అవకాశం ఉందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. రైతు, విద్య, మానవ హక్కులు, బీసీ కమిషన్ల పేర్లు కూడా ఫైనల్‌ అవుతాయని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement