5 లక్షల కొత్త కొలువులు! | CM Revanth Reddy says 5 lakh new jobs in Telangana at Bio Asia 2025 conference | Sakshi
Sakshi News home page

5 లక్షల కొత్త కొలువులు!

Published Wed, Feb 26 2025 3:38 AM | Last Updated on Wed, Feb 26 2025 5:36 AM

CM Revanth Reddy says 5 lakh new jobs in Telangana at Bio Asia 2025 conference

బయోఆసియా సదస్సులో సింగపూర్‌కు చెందిన ప్రముఖ కేన్సర్‌ పరిశోధకుడు డాక్టర్‌ ప్యాట్రిక్‌ టాన్‌కు జీనోమ్‌ వ్యాలీ ఎక్సలెన్స్‌ అవార్డు–2025ను అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, క్వీన్స్‌లాండ్‌ గవర్నర్‌ డాక్టర్‌ జీనెట్‌

బయో ఆసియా 2025 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా, లైఫ్‌ సైన్స్, బయోటెక్‌ కంపెనీలు  

రెండురోజుల సదస్సు ప్రారంభించిన సీఎం

రాష్ట్రంలో కొత్తగా లైఫ్‌ సైన్సెస్‌ వర్సిటీ: మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడుల సాధన ద్వారా రాష్ట్రంలో 5 లక్షలకు పైగా కొత్త ఉగ్యోగాలను సృష్టించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగు రోడ్డుతో పాటు కొత్తగా నిర్మితమయ్యే రీజినల్‌ రింగు రోడ్డు నడుమ ఫార్మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 

ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని వెల్లడించారు. తద్వారా విభిన్న రంగాల్లో సుమారు 50 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో గత ఏడాది 150కి పైగా ప్రాజెక్టుల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం ప్రారంభమైన రెండురోజుల ‘బయో ఆసియా 2025’ సదస్సును సీఎం ప్రారంభించి మాట్లాడారు. 

లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ 
‘ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్‌ ఫార్మాసిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే దిగ్గజ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జర్మన్‌ కంపెనీ మిల్టెనీ బయోటెక్‌ జీనోమ్‌ వ్యాలీలో సెల్, జీన్‌ థెరపీని ప్రారంభించింది. కొత్తగా 4 బహుళ జాతి లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు కూడా తెలంగాణలో అడుగు పెడుతున్నాయి. గడిచిన 25 ఏళ్లలో ఫార్మా, తయారీ, ఐటీ, డిజిటల్‌ హెల్త్‌ రంగాల్లో వపర్‌హౌస్‌గా హైదరాబాద్‌ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో పేరొందిన అనేక ఫార్మా, హెల్త్‌కేర్, లైఫ్‌ సైన్స్, బయోటెక్‌ కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నాయి. 

పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై కృషి చేసే సంస్థలను ప్రోత్సహిస్తూ శాస్త్ర, సాంకేతిక నిపుణులను తయారు చేయడంతో పాటు జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ఏటా జరిగే బయో ఆసియా సదస్సులు హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్‌ రాజధానిగా నిలబెట్టాయి. ఆరోగ్య రక్షణ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటుం ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా ‘బయో ఆసియా’ దేశ విదేశాలను ఆకర్షిస్తోంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఫ్యూచర్, ఏఐ సిటీల్లో భారీ ప్రాజెక్టులు 
‘రాబోయే పదేళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం. హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ ఏరియాలో సేవల రంగాన్ని ప్రోత్సహిస్తూ ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీలో అనేక భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. దేశంలోనే ఎక్కువ ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకంతో హైదరాబాద్‌ ఈవీ రాజధానిగా అవతరించింది. ఆర్టీసీలో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశ పెడుతున్నాం. 

ఔటర్, ట్రిపుల్‌ ఆర్‌ను రేడియల్‌ రోడ్లతో అనుసంధానం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ‘చైనా ప్లస్‌ వన్‌’ అవసరాలు తీర్చే కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం. తెలంగాణలో మెగా డ్రైపోర్టును అభివృద్ధి చేసి ఏపీలోని ‘సీ పోర్టు’తో రైలు, రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానిస్తాం. తెలంగాణను బయో సైన్సెస్, బయోటెక్, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా అభివృద్ధి చేస్తాం..’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

హార్ట్‌ ఆఫ్‌ ది లైఫ్‌ సైన్సెస్‌గా జీనోమ్‌ వ్యాలీ: మంత్రి శ్రీధర్‌బాబు 
రాష్ట్రంలో కొత్తగా లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సంబంధిత పరిశ్రమల భాగస్వామ్యంతో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేలా స్కిల్స్‌ యూనివర్సిటీ ద్వారా కోర్సులకు రూపకల్పన చేస్తామని చెప్పారు. ‘లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో రెండు దశాబ్దాల క్రితం మొదలైన తెలంగాణ ప్రస్థానాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం. 

రాబోయే రోజుల్లో జీనోమ్‌ వ్యాలీని ‘‘హార్ట్‌ ఆఫ్‌ ది లైఫ్‌ సైన్సెస్‌’’గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం ద్వారా 51 వేల మంది ప్రత్యక్షంగా, 1.5 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే జనరిక్‌ మందుల్లో 20 శాతం, వాక్సీన్ల ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణ కలిగి ఉంది. 200కు పైగా దేశాలకు ఏటా 5 బిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. 

ఏఐ, క్వాంటం, రోబోటిక్స్‌ తదితర నూతన టెక్నాలజీల సాయంతో రోగుల అవసరాలకు అనుగుణంగా, వారికి త్వరగా స్వాంతన చేకూరేలా ఔషధాల సామర్థ్యాన్ని పెంచే పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి వ్యయంతో మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దుతాం. 

అసోసియేషన్‌ ఆఫ్‌ కాంట్రాక్టు రీసెర్చ్, డెవలప్మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆర్గనైజేషన్స్‌ (సీఆర్డీఎంవో) తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుంది..’ అని మంత్రి చెప్పారు. ఆ్రస్టేలియాలోని క్వీన్స్‌లాండ్‌ గవర్నర్‌ జానెట్‌ యంగ్, వివిధ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ సంస్థల ప్రతినిధులు రాజీవ్‌శెట్టి, డాక్టర్‌ సాధన జోగ్లేకర్, జీవీ ప్రసాద్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు ప్రసంగించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement