ఫ్యూచర్ సిటీని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఇందులో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూనే భవిష్యత్తును సృష్టిస్తాం
నాస్కామ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ ఫ్రేమ్‌వర్క్ అమలు
తెలంగాణ గ్లోబల్ ఏఐ సదస్సును ప్రారంభించిన సీఎం
పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌తో సరిపోలే నగరమేదీ దేశంలో లేదనివెల్లడి
ఫ్యూచర్ సిటీలోని 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు: శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణగా చెప్తున్న ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు – ఏఐ) టెక్నాలజీకి హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌తో సరిపోలే నగరమేదీ దేశంలో లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఏఐని ప్రోత్సహించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూనే భవిష్యత్తును సృష్టిస్తామన్నారు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని భారత్ సరిగా అనుసరించలేక పోయిందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో రెండురోజుల పాటు జరిగే ‘తెలంగాణ గ్లోబల్ ఏఐ సదస్సు’ను గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
నిపుణులు భాగస్వాములు కావాలి..
కొత్తగా నిర్మితమయ్యే ఫ్యూచర్ సిటీని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అందులో నిపుణులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ‘తెలంగాణ ఏఐ మిషన్’, నాస్కామ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తామన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు లేకుండా సమాజంలో ఏ మార్పూ సాధ్యం కాదని చెప్పారు. రైలు ఇంజిన్, విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపం మారిపోగా.. కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ వంటి ఆవిష్కరణలు ప్రపంచ గతిని మార్చడంలో కీలకపాత్ర పోషించాయని అన్నారు.
టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు చూడటం మన తరం చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ వచ్చిన సమయంలో.. ఓ వైపు జీవితం మెరుగు పడుతుందనే ఆశ ఉండగా, మరోవైపు ఉద్యోగ భద్రత ఉండదనే భయం కూడా సహజంగానే ఉత్పన్నమవుతోందన్నారు. కానీ ఏఐ టెక్నాలజీని ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.
200 ఎకరాల్లో ఏఐ సిటీ: శ్రీధర్‌బాబు
తెలంగాణ రాష్ట్రం ఏటా 11.3 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని 176 బిలియన్ డాలర్లకు చేర్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. త్వరలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏఐ సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లుగా నిలుస్తుందని, స్కూల్ ఆఫ్ ఏఐ ఎక్సలెన్స్‌ను కూడా ప్రారంభిస్తామని అన్నారు. ఏఐ ఆధారిత కంపెనీల కోసం తాత్కాలికంగా శంషాబాద్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలో రెండు లక్షల చదరపు అడుగుల్లో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు.
26 అవగాహన ఒప్పందాలు
‘ఏఐ ఆధారిత తెలంగాణ’లక్ష్యాల సాధన దిశగా ప్రైవేటురంగ సంస్థలు, విద్యా సంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్ష లేని సంస్థలతో 26 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ ఒప్పందాల్లో కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్‌లెన్స్ కేంద్రం, స్కిల్లింగ్, ఇంపాక్ట్ అసెస్‌మెంట్, స్టార్టప్ ఇన్నొవేషన్, జనరేటివ్ ఏఐ, పరిశోధన సహకారం, డేటా అన్నోటేషన్ రంగాలకు సంబంధించినివి ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. ఏఐ ద్వారా తెలంగాణను ప్రపంచ మేధోశక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికలు పటిష్టంగా రూపొందిస్తున్నామని చెప్పారు.
ఏఐలో ఆవిష్కరణలు కీలకం: బీవీఆర్ మోహన్‌రెడ్డి
ఏఐ రంగంలో కొత్తగా ఆవిష్కరణలు, కొత్త యాప్‌లు అత్యంత కీలకమని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఏఐపై పాఠాలు, పరిశోధనలకు వాణిజ్య రూపం ఇవ్వడం, ఏఐలో కొత్త మార్కెట్‌ను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఐటీ రంగ ప్రముఖులు రాబిన్, వరప్రసాద్‌రెడ్డి, అశోక్ స్వామినాథన్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంకా, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment