సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీని సన్మానిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు
సన్ పెట్రో కెమికల్స్ సంసిద్ధత.. దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం
రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు 3 చోట్ల భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న సంస్థ
నిర్మాణ దశలోనే సుమారు 7 వేల ఉద్యోగాలకు అవకాశం
సుస్థిర ఇంధన వృద్ధి లక్ష్య సాధనలో ఓ మైలురాయి: సీఎం రేవంత్
రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ‘కంట్రోల్ ఎస్’తో మరో ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో తెలంగాణ రూ.45,500 కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో ఈ మేరకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. బుధవారం సన్ పెట్రో ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చర్చల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ముఖ్యమంత్రి సమక్షంలో ఈ పెట్టుబడికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు మూడుచోట్ల భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పుతుంది. నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలో ఏర్పాటయ్యే ఈ మూడు ప్రాజెక్టుల ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే సుమారు 7 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
హరిత ఇంధన ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తాం: సీఎం
హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయతి్నస్తున్నామని, సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించాలనే లక్ష్య సాధనలో ఈ ఒప్పందం ఓ మైలు రాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు.
సన్ పెట్రో కెమికల్స్ చేపట్టబోయే ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రభావశీలంగా ఉంటుందని దిలీప్ సాంఘ్వీ చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టినీ తెలంగాణ ఆకర్షిస్తుందన్నారు. పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఇన్వెస్టిమెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు.
‘కంట్రోల్ ఎస్’ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్
డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ‘ఏఐ డేటా సెంటర్ క్లస్టర్’ ఏర్పాటుకు ‘కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్’ ముందుకు వచ్చింది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల ఉద్యోగాలు లభిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి ప్రకటించారు. రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలు రాయిగా నిలుస్తుందని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు.
రూ.800 కోట్లతో ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్
రాష్ట్రంలో అధునాతన మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను రూ.800 కోట్లతో ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ ‘జేఎస్‌డబ్ల్యూ యూఏవీ’తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment