Investments in Telangana
-
అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి మరో వైపు మంత్రి శ్రీధర్ బాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కంపెనీల సీనియర్ లీడర్షిప్ టీమ్‌తో చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు హాజరు అయ్యారు.కాగా, ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ ఆపిల్ పార్క్‌ను సీఎం రేవంత్ బృందం సందర్శించనున్నారు. ఆపిల్ మ్యానిఫాక్చర్ టీమ్‌తో సీఎంతో పాటు, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి భేటీ కానున్నారు.ట్రినేట్ కంపెనీ సీఈఓతో కూడా చర్చించనున్న సీఎం.. ఆరమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో భేటీ అయి హైదారాబాద్‌లో ఆ కంపెనీ డేటా సెంటర్ల విస్తరణ కోసం చర్చలు జరపనున్నారు. పలువురు టెక్ కంపెనీల ప్రతినిధులతో లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంగెన్ సంస్థ సీనియర్ లీడర్‌షిప్‌తో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ రెనేశాస్, మ్యానిఫాక్చర్ సంస్థ అమాట్‌తో పెట్టబడులపై చర్చించనున్న సీఎం.. పలు బిజినెస్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు. -
పదేళ్లలో లక్ష మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తైవాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ (హోన్ హై టెక్నాలజీ గ్రూప్) రాష్ట్రంలో భారీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మొబైల్ఫోన్లు, ట్యాబ్‌ల అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించనుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని కొంగరకలాన్ లేదా బాచుపల్లి సమీపంలోని దుండిగల్‌లో 250 ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ ద్వారా రానున్న పదేళ్లలో లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమై ఆయన సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి వచ్చిన అతిపెద్ద ఎలక్ట్రానిక్స్రంగ పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనదని సమావేశం అనంతరం సీఎం కార్యాలయం ప్రకటించింది. గురువారం యంగ్ ల్యూ పుట్టినరోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారుచేసిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ ఆయనకు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో యంగ్ల్యూ ప్రతినిధి బృందానికి మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యమిచ్చారు. ఒప్పంద కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ప్రత్యేక సీఎస్‌లు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సాయం అందిస్తాం: సీఎం కేసీఆర్ అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిరంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘ఫాక్స్‌కాన్’తన కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంపిక చేసుకోవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు. ఫాక్స్‌కాన్‌తో లక్షకుపైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయన్నారు. సాధ్యమైనంత వరకు స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ సమావేశ సమయంలోనే టీఎస్ఐఐసీ అధికారులు కొంగరకలాన్, దుండిగల్ ప్రాంతాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తైవాన్ మా సహజ భాగస్వామి.. ‘రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను అమలుచేస్తోంది. బంగారు తెలంగాణ సాధనకు అనేక గొప్ప ప్రాజెక్టులను చేపట్టింది. ఫాక్స్‌కాన్ రాక రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. తైవాన్ను తెలంగాణ సహజ భాగస్వామిగా భావిస్తున్నాం. ఫాక్స్‌కాన్ పురోగమనంలో రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉంది’అని సీఎం కేసీఆర్ అన్నారు. పదేళ్లలో లక్ష ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్ ఫాక్స్‌కాన్ పరిశ్రమ స్థాపనతో వచ్చే పదేళ్లలో లక్ష మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. విస్తృత అధ్యయనం చేశాకే వచ్చాం: ఫాక్స్‌కాన్ చైర్మన్ తెలంగాణ గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ ల్యూ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఆశావహ దృక్పథంతో ఉన్నామన్నారు. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తుల తయారీ.. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే 40 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఫాక్స్‌కాన్ తయారుచేస్తోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, నోకియా, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను రూపొందిస్తోంది. ఫాక్స్‌కాన్ పరిశ్రమల్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్, అమెజాన్‌కు చెందిన కిండిల్, బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌కు చెందిన స్మార్ట్ఫోన్లు, ఇతర పరికరాలు, గేమింగ్ సిస్టమ్స్, నోకియా, సోనీ పరికరాలు (ప్లే స్టేషన్ 3, ప్లే స్టేషన్ 4 గేమింగ్ కంన్సోల్స్) గూగుల్ పిక్సల్, షావోమీ పరికరాలు, సీపీయూ సాకెట్ల తయారీ జరుగుతోంది. ఈ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో కార్యకలాపాలు సాగిస్తోంది. సెమీకండక్టర్ చిప్‌ల తయారీ కోసం.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: యాపిల్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కి అతిపెద్ద కస్టమర్. ఐఫోన్లు, ఐపాడ్లు, మాక్‌బుక్స్ ద్వారానే ఫాక్స్‌కాన్ 50 శాతం ఆదాయం ఆర్జిస్తోంది. కరోనా తర్వాత దేశంలోనే ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వం ముందుకురావడంతో మైనింగ్ దిగ్గజం వేదాంతతో కలిసి 20 బిలియన్ డాలర్లతో దేశంలో మొదటి సెమీకండక్టర్ చిప్ తయారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఫాక్స్‌కాన్ సన్నాహాలు చేస్తోంది. -
ఫండ్స్ విలీనంతో ఇన్వెస్టర్లపై భారం పడుతుందా?
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లోగడ రెండు పథకాలను విలీనం చేసింది, కొత్త పథకం యూనిట్లను ఇన్వెస్టర్లకు కేటాయించింది. మూలధన లాభాల కోణంలో దీన్ని ఎలా చూడాలి? – బ్రిజ్ మోహన్‌లాల్ గత ఆర్థిక సంవత్సరంలో పలు మ్యూచువల్ ఫండ్స్ పథకాల విలీనాన్ని చూశాం. చాలా వరకు ఒక ఏఎంసీని మరో ఏఎంసీ కొనుగోలు చేయడం వల్లే ఇలా జరిగింది. ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్‌ను 2021 డిసెంబర్లో సుందరం మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. బీఎన్పీ పారిబాస్‌లో బరోడా ఏఎంసీ విలీనం అయింది. అలాగే, ఒక మ్యూచువల్ ఫండ్‌కు చెందిన పలు పథకాల విలీనాన్ని కూడా గతంలో చూశాం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలో తెలియక అయోమయం చెందుతుంటారు. 2021-22 ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేయాల్సిన వారు ఆందోళన చెందడం సహజం. మ్యూచువల్ ఫండ్స్ విలీనం వల్ల ఇన్వెస్టర్లు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. వారు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విలీనం తర్వాత కొత్త పథకంలో పెట్టుబడులు కొనసాగించాలని అనుకుంటే అవి ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి. కనుక అటువంటి సందర్భంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఉదాహరణకు ఫండ్ ఏ, ఫండ్ బీని తీసుకుందాం. ఫండ్ ఏను తీసుకెళ్లి ఫండ్ బీలో విలీనం చేశారు. ఫండ్ ఏలో ఆరు నెలల క్రితం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, విలీనం నాటికి అది రూ.2 లక్షలు అయింది. ఫండ్ బీ ఎన్ఏవీ రూ.160గా ఉంది. అప్పుడు రూ.2 లక్షలను 160తో భాగిస్తే 1,250 యూనిట్లు వస్తాయి. ఈ యూనిట్లను మరో ఆరు నెలల తర్వాత విక్రయించారు. అప్పుడు మొత్తం హోల్డింగ్ పీరియడ్ ఏడాది అవుతుంది. ముందు పథకంలో ఆరు నెలలు, విలీనం పథకంలో ఆరు నెలలు. ఏడాదికి మించిన కాలానికి ఈక్విటీ లాభాలు దీర్ఘకాల మూలధన లాభాల కిందకు వస్తాయి. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి. పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి? – వెంకట్రావ్ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
దావోస్‌కు బై బై...తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించి, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చేపట్టిన పర్యటన ముగిసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిపిన చర్చలు, సంప్రదింపులతో కేటీఆర్ బృందం రాష్ట్రానికి సుమారు రూ.4,200 కోట్ల మేర పెట్టుబడులు రాబట్టగలిగింది. కేటీఆర్ శుక్రవారం తన బృందంతో కలిసి తిరుగు పయనమయ్యారు. శనివారం ఉదయం రాష్ట్రానికి చేరుకోనున్నారు. తొలుత యూకేలో.. ఈనెల 18న హైదరాబాద్ నుంచి యూకేకు చేరుకున్న కేటీఆర్.. నాలుగు రోజుల పాటు యూకే బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ నెల 22న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్న కేటీఆర్ 26వ తేదీ వరకు 45 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాలు, మరో నాలుగు చర్చా గోష్టుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేకతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను కేటీఆర్ వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌కు బహుళజాతి కంపెనీల ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కడంతోపాటు.. పలు అవగాహన ఒప్పందాలు, పెట్టుబడి ప్రకటనలు, చర్చలకు ఈ పెవిలియన్ వేదికగా నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సీఐఐ పెవిలియన్‌లో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులతో జరిగిన గోష్టుల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. జెడ్ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో భేటీ దావోస్‌లో చివరిరోజున స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్లో జెడ్ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని జెడ్ఎఫ్ ప్రతినిధులు చెప్పారు. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్న క్యాంపస్ 3 వేల మంది సిబ్బందితో తమ అతిపెద్ద కార్యాలయంగా ఉండబోతుందన్నారు. జూన్ 1న నానక్‌రామ్‌గూడలో జెడ్ఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. జెడ్ఎఫ్ కంపెనీ విస్తరణతో తెలంగాణలో మొబిలిటీ రంగానికి అదనపు బలం చేకూరుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మళ్లీ వచ్చే ఏడాది దాకా! సాక్షి, హైదరాబాద్: వారం రోజుల పాటు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చివరి రోజు స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌లో సరదాగా గడిపారు. ఓ వీధి పక్కన రెస్టారెంట్లో సేదతీరుతున్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘దావోస్‌కు బై బై.. వచ్చే ఏడాది దాకా’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
విభేదాలు వీడి దేశాన్ని బాగు చేసుకుందాం..‘మీట్ అండ్ గ్రీట్’లో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘విభేదాలను పక్కనబెట్టి అందరూ ఏకతాటిపైకి రావాలి. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధి కోసం పనిచేసేందుకు మాతో కలిసి రావాలి’అని ప్రవాస భారతీయులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని, పెట్టుబడులతో తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. సొంత రాష్ట్రంలో కంపెనీల ఏర్పాటు ద్వారా సంపద సృష్టించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం లండన్‌లో ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’లో కేటీఆర్ ప్రసంగించారు. యూకే పర్యటనలో భాగంగా పలువురు విదేశీ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశాల ఫలితాలు త్వరలో కనిపిస్తాయని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు రప్పించడం, రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయడమే తన ప్రథమ కర్తవ్యమని, యూకేతో భవిష్యత్తులో రాష్ట్ర సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ పెట్టుబడులతో ముందుకు రావాలని, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లో ఐటీ టవర్లు ప్రారంభించామని చెప్పారు. త్వరలో మరిన్ని పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వంతోనే పురోగతి సాధ్యమవుతుందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద రాష్ట్రం భారత ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. స్టార్టప్ రాష్ట్రంగా ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్రం.. తలసరి ఆదాయం, జీడీపీ వంటి అంశాల్లో కొత్త రికార్డును సృష్టించిందని, భారత ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా నిలిచిందన్నారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ప్రస్థానాన్ని ప్రవాస తెలంగాణ వాసులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. లండన్ కేంద్రంగా టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న పార్టీ ఎన్ఆర్ఐ లండన్ శాఖ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఇంటికి కేటీఆర్ వెళ్లారు. బతుకమ్మ గురించి క్వీన్ ఎలిజబెత్‌కు వివరాలు తెలుపుతూ అనిల్ కూతురు నిత్య రాసిన లేఖకు క్వీన్ నుంచి వచ్చిన ప్రశంసను తెలుసుకున్న మంత్రి అభినందించారు. ప్రాంతం, దేశమేదైనా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ కుటుంబీకులేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర అవతరణ తర్వాత కూడా రాష్ట్రం సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో తెలంగాణ ప్రవాసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. విద్యా సంస్థల్లో ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్య నియంత్రణలో భాగంగా విద్యా సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించడాన్ని త్వరలో ప్రోత్సహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యేకించి వాణిజ్యపరంగా బస్సులు, వ్యాన్ల తయారీలో పేరొందిన ‘ఎరైవల్ యూకే’కార్యాలయాన్ని హైదరాబాద్‌కు చెందిన అల్లాక్స్ రిసోర్సెస్ సంస్థ ప్రతినిధులతో కలిసి కేటీఆర్ శనివారం సందర్శించారు. భారత్‌లో ప్రత్యేకించి తెలంగాణలో బస్సులు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి ఎరైవల్ యూకేతో అల్లాక్స్ రిసోర్సెస్ చేతులు కలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణాలో భారత్‌లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలున్న రాష్ట్రంగా మారేందుకు ఎరైవల్ యూకే బస్సులు ఉపయోగపడుతాయన్నారు. కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. -
తెలంగాణలో ‘థామస్ లాయిడ్’ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు రెండోరోజు గురువారం ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారితో చర్చలు జరిపారు. కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణలో థామస్ లాయిడ్ గ్రూప్ కార్యకలాపాల విస్తరణపై.. ఆ సంస్థ ఎండీ నందిత సెహగల్ నేతృత్వంలోని ప్రతినిధులతో చర్చించారు. పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా.. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో కలిసి పనిచేసేందుకు ఆ కంపెనీ ఆసక్తి చూపడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో కలిసి రావాలని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ హాల్ఫార్డ్, ప్రొ వైస్ చాన్స్‌లర్ పొలార్డ్‌లతో జరిగిన భేటీలో కోరారు. హైదరాబాద్‌లో తమ కంపెనీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు త్వరలో స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్ఎస్బీసీ ప్రతినిధులు పాల్ మెక్ పియర్సన్, బ్రాడ్‌హిల్ బర్న్‌లు తెలిపారు. గ్లాక్సో స్మిత్‌క్లైన్ విస్తరణ ఫార్మా రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్.. తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తుందని సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం అధిపతి హెడ్ ఫ్రాంక్ రాయిట్ వెల్లడించారు. గ్లాక్సో స్మిత్‌క్లైన్ నుంచి ‘హాలియన్’ పేరిట వేరుపడిన హెల్త్‌కేర్ విభాగం స్వతంత్రంగా పనిచేస్తోందని, ఇప్పటికే హైదరాబాద్‌లో రూ.710 కోట్లకుపైగా పెట్టుబడితో 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గ్లాక్సో స్మిత్ క్లైన్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఫార్మా వర్సిటీపై కింగ్స్ కాలేజీతో.. హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధిం చిన పరిశోధన, అకడమిక్ వ్యవహారాల్లో కలిసి పనిచేసేందుకు లండన్ కింగ్స్ కాలేజీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి కేటీఆర్ సమ క్షంలో.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కింగ్స్ కాలేజీ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్ కమ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షిట్జి కపూర్ తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఫార్మాసిటీ విజన్‌లో భాగమని.. హైదరాబాద్ ఫార్మా సిటీ అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారబోతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరుసగా భేటీలు.. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం గురువారం లండన్‌లో వివిధ కంపెనీల అధిపతులతో వరుసగా భేటీలు నిర్వహించింది. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్, సొసైటీ ఆఫ్ మోటార్ మ్యాన్యుఫాక్చరర్స్, ట్రేడర్స్ సంయుక్త సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈవీ పాలసీకి ఆకర్షితులై దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. తర్వాత కేటీఆర్ బృందానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ అధ్యక్షుడు లార్డ్ కరన్ బిల్మోరియా యూకే పార్లమెంటులో ఆతిథ్యమిచ్చారు. అనంతరం పలువురు ఎంపీలతోపాటు సీఐఐ, ఇండో బ్రిటిష్ ఏపీపీజీ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఎయిరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. తర్వాత బిల్మోరియాతో కలిసి బ్రిటన్ పార్లమెంటును సందర్శించారు. -
రండి.. పెట్టుబడులు పెట్టండి..తెలంగాణకు తొలి ప్రాధాన్యమివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తొలి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, విధానాలు, ప్రోత్సాహకాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వినూత్న పారిశ్రామిక విధానాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీళ్లు, విద్యుత్‌తో పాటు నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం కోసం యూకేలో పర్యటిస్తున్న మంత్రి.. తొలిరోజు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను.. రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా వచ్చే ప్రయోజనాలను వివరించారు. టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా–లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడుల కోసం తెచ్చిన పాలసీలను వివరించారు. భారత్‌లో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్ ఉందని, ఈ మేరకు అనేకసార్లు అవార్డులను అందుకున్న విషయాన్ని ప్రస్తావించారు. దేశంలో ఇతర నగరాల్లో లేని కాస్మోపాలిటిన్ కల్చర్ హైదరాబాద్‌లో ఉందని వివరించారు. ఐటీతో పాటు లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హబ్‌గా మారిందని తెలిపారు. అనేక మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా ఆవల తమ కార్యాలయాలను ఇండియాలో హైదరాబాద్‌లోనే ఏర్పాటుచే శాయని గుర్తుచేశారు. డెలాయిట్, హెచ్ఎస్బీసీ, జేసీబీ, రోల్స్ రాయిస్ వంటి కంపెనీలు సమావేశాల్లో పాల్గొన్నాయి. బయో ఆసియా సదస్సుకు రండి.. బ్రిటన్ మంత్రికి కేటీఆర్ ఆహ్వానం రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఆసియా సదస్సులో పాల్గొనాల్సిందిగా బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి రనిల్ జయవర్ధనకు కేటీఆర్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీఎస్–ఐపాస్ విధానం గురించి వివరించగా ఈ విధానాన్ని బ్రిటన్ మంత్రి ప్రశంసించారు. రాష్ట్రానికి రావాలన్న మంత్రి ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారు. -
విమానాల గ్యారేజ్! ఇక్కడ విమానాలు రిపేర్ చేయబడును
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైమానిక, అంతరిక్ష, రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ రంగాల్లో కొత్తగా వస్తున్న నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ (ఎంఆర్వో) రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. ఎంఆర్వో రంగంలో అంతర్జాతీయంగా అవకాశాలు పెరుగుతుండటంతో కొత్త అవకాశాలతో భారత్‌తో పాటు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల అవసరాలు తీర్చొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జీఎంఆర్ ఏరోటెక్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఆర్వో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో ఎంఆర్వో హబ్ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సుముఖత చూపుతుండటంతో నిర్వహణ, మరమ్మ తులు, ఓవర్ హాలింగ్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలని భావిస్తోంది. భారత్‌లో ఎంఆర్వో రంగం ఏటా 15% వృద్ధి రేటుతో ప్రస్తుతం రూ.10వేల కోట్ల పరిశ్రమగా ఎదుగుతుండటంతో మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాయి. తెలంగాణ కూడా వీటి బాటలోనే నడవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఓఈఎం కంపెనీల పెట్టుబడులు వైమానిక, రక్షణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ (ఓఈఎం) కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చాయి. దీంతో ఐదేళ్లుగా రాష్ట్రం ఏరోస్పేస్ హబ్‌గా మారుతోంది. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు టాటా, అదానీ, కల్యాణి వంటి దేశీయ కంపెనీలు కూడా హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. టాటా గ్రూప్ తమ ఏరోస్పేస్ ఉత్పత్తుల్లో 90 శాతం హైదరాబాద్ నుంచే తయారు చేస్తోంది. జీఈ, సాఫ్రాన్ హైదరాబాద్‌లో ఏరో ఇంజిన్ తయారీ కర్మాగారాలను ఏర్పాటు స్థాపించగా, బోయింగ్ సంస్థ అపాచీ, చినోక్స్ హెలీకాప్టర్లు, యుద్ధ విమానాల విడిభాగాలు, లాక్‌హీడ్ హెలికాప్టర్ క్యాబిన్లు, ఎఫ్–16 రెక్కలను తయారుచేస్తోంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు సీఎఫ్ఎం, ఫ్రాట్ అండ్ విట్నీ రాష్ట్రంలో ఇంజిన్ ట్రైనింగ్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నాయి. మౌలిక వసతులు, శిక్షణపై దృష్టి వైమానిక, రక్షణ రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు నైపుణ్య శిక్షణపై దృష్టి సారించడం ద్వారా ఎంఆర్వో రంగం కూడా వృద్ధి చెందుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు డజను వరకు డీఆర్డీఓ పరిశోధనశాలలు, ప్రభుత్వరంగ సంస్థలు ఉండగా, ఏరోస్పేస్ రంగంలో 25కు పైగా పెద్ద కంపెనీలు, సుమారు 1,200 వరకు అనుబంధ పరిశ్రమలు పని చేస్తున్నాయి. ఏరోస్పేస్ రంగం కోసం ఆదిబట్ల, ఎలిమినేడు ఏరోస్పేస్ పార్కులతో పాటు కొత్తగా మరో 3 కొత్త పార్కులను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంఆర్వో రంగంలో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో కొత్తగా శిక్షణ సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. పౌర విమానయాన రంగంలో ఐఎస్బీ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఏరోనాటికల్ సొసైటీ ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (భూమిని కేటాయించారు) ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అంతర్జాతీయ సంస్థలతో కలసి రాష్ట్ర ప్రభుత్వం ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిచేందుకు ‘టి హబ్’ఇప్పటికే అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు బోయింగ్, ప్రాట్ అండ్ విట్నీ, కాలీన్స్ ఏరోస్పేస్ తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. చదవండి: అభివృద్ధిలో ప్రజా కోణం ఏది? -
తెలంగాణలో థాయ్‌లాండ్ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్ : థాయ్‌లాండ్‌కు భారత్‌కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మదాపూర్‌లో శనివారం ఇండియా-థాయ్‌లాండ్ మ్యాచింగ్ అండ్ నెట్వర్కింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి థాయ్‌లాండ్ నుంచి ఉప ప్రధాని జరీన్ లక్సనావిసిత్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. రబ్బర్ వుడ్ పరిశ్రమలో థాయ్ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణతో థాయ్ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుని, పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ష్రం దేశ వృద్ధి రేటును మించి అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు గేట్వేగా తెలంగాణతో అనుసంధానం చేయాలని తెలిపారు. తెలంగాణలో వాణిజ్య రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, థాయ్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఫర్నిచర్ పర్క్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ థాయ్‌లాండ్ ఉప ప్రధానిని కోరారు. థాయ్‌లాండ్ ఉప ప్రధాని భారత్ పర్యటన పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా ఉందన్నారు. తెలంగాణలో ఫుడ్ ప్రసెసింగ్‌కు సరిపడా నీటి వనరులు ఉన్నాయన్నారు. ఫర్నీచర్ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడుతున్న థాయ్‌లాండ్.. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు పరిచయం చేయాలని సూచించారు. రబ్బర్ వుడ్, టింబర్ వుడ్ ఉత్పత్తుల రవాణా కోసం 400 కి. మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉందని, రవాణా సబ్సిడీలు కూడా అందిస్తామని తెలిపారు. బ్యాంకాక్-హైదరాబాద్ విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రొత్సహించాలని అన్నారు. అనంతరం కేటీఆర్ జరీన్ లక్సనావిత్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. -
రాష్ట్రంలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: కెనడాలోని ఆల్బెర్టా ప్రావిన్సు పారిశ్రామిక వర్గాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆల్బెర్టా ప్రావిన్సు మౌలిక వసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీలో ఇరు ప్రాంతాల నడుమ వ్యాపార, వాణిజ్య అవకాశాలపై పండా చర్చించారు. తెలంగాణలో ఐటీ రంగం పురోగమిస్తున్న తీరుపై సానుకూల స్పందన కనిపిస్తోందని, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విధానం, ఇతర అనుకూలతలు వివరించేందుకు తమ ప్రావిన్సులో పర్యటించాల్సిందిగా కేటీఆర్‌ను పండా ఆహ్వానించారు. టీఎస్ఐపాస్ ద్వారా పేరొందిన కంపెనీలను తెలంగాణకు రప్పించిన తీరుపై పండాకు కేటీఆర్ వివరించారు. ఈ భేటీలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు రాయితీలు
సిరిసిల్ల: పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనువైందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన మలేషియా వెళ్లారు. కౌలాలంపూర్‌లో మలేసియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఏర్పాటు చేసిన సదస్సులో బుధవారం మంత్రి మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఐటీ పార్కు., మల్టీ పర్పస్ పార్కులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రవాసులు స్వరాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే.. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది వివిధ కంపెనీల సీఈవోలు, డైరెక్టర్లు, మేనేజర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో ‘మైట’అధ్యక్షుడు సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య, ఉపాధ్యక్షుడు బూరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, మహిళా విభాగం అధ్యక్షురాలు కిరణ్మయి, ఉపాధ్యక్షురాలు అశ్విత, ముఖ్య కార్యవర్గ సభ్యులు కిరణ్‌గౌడ్, ప్రతీక్, సత్య, సందీప్, సంతోష్, మలేసియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు కాంతారావు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
గ్లోబల్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులతో పారి శ్రామిక, ఐటీ రంగాలకు చిరునామాగా మారిన తెలంగాణకు మరిన్ని ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపుతున్న అగ్రశ్రేణి కంపెనీలు ఇప్పటికే ప్రభు త్వానికి ప్రతిపాదనలు అందించినట్లు తెలిపారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్.. శుక్రవారం ఐటీ, పరిశ్రమలు, అనుబంధ శాఖల విభాగాధిపతులతో ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. కాగా, ఐటీ, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పెట్టుబడులపై మరికొన్ని కంపెనీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ మరియు ఐటీ రంగాల్లో రాబోయే కొద్ది నెలల్లోనే భారీ పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వివిధ సంస్థలు సమర్పించిన పెట్టుబడుల ప్రతిపాదనలపై సమీక్షించారు. కాగా, వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు పొందిన పరిశ్రమలకు అక్టోబర్‌లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలకు పూర్తి సహకారం అందించాలని, పెట్టుబడుల ద్వారానే ఉద్యోగావకాశాల కల్పన మెరుగవుతుందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్ఐఐసీ.. ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, సిరిసిల్ల అప్పారెల్ పార్కులతో పాటు.. వివిధ పారిశ్రామిక, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల పురోగతిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిన పారిశ్రామిక పార్కుల్లో మరిన్ని కంపెనీల ఏర్పాటుతో పాటు, త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించిన కేటీఆర్.. ఐటీ రంగంలో ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ఈ రంగంలో హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. రాబోయే నాలుగేళ్ల కాలానికి విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలతో కూడిన నివేదికను అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే అంశాన్ని సవాలుగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తేవడం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ నదీం అహ్మద్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, టెక్స్టైల్స్ కమిషనర్ శైలజా రామయ్యర్, పరిశ్రమలు, ఐటీ శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రూ. 250 కోట్ల పెట్టుబడితో గుండె సంబంధిత స్టెంట్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుచేసేందుకు ఎస్ఎంటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులో ఈ మేరకు ప్లాంటును ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధులు మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 2200మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అందుబాటులో అత్యుత్తమ మౌలిక వసతులు ఉండటం వల్లే హైదరాబాద్‌ను ఎంచుకున్నామని వారు చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. -
తెలంగాణాకు రండి
ఐటీ పెట్టుబడిదారులను ఆహ్వానించిన ఆ రాష్ర్ట మంత్రి కేటీఆర్ ‘రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్’ తమ ప్రభుత్వ విధానమని ప్రకటన బెంగళూరు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ప్రతి పారిశ్రామిక వేత్తకు అవసరమైన అన్ని విధాల అనుమతులు పొందే హక్కును తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) పేర్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ తరహాలో రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్ తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా బెంగళూరులోని ఐటీ సంస్థలను ఆహ్వానించేందుకు బుధవారమిక్కడ నిర్వహించిన ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ఐటీ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులకు సంబంధించి దేశంలోనే రెండో స్థానంలో హైదరాబాద్ ఉందని అన్నారు. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్‌లో ఐటీని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అందులో భాగంగానే తమ వ్యాపారాలను విస్తరించాలని భావిస్తున్న ఐటీ సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేతప్ప బెంగళూరులో ఉన్న సంస్థలను తరలించుకుపోవడం తన పర్యటన ఉద్దేశం కాదని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలతోనూ తాము ఆరోగ్యకరమైన పోటీనే కోరుకుంటున్నామని తెలిపారు. భారత్‌లో తక్కువ ఖర్చులో మంచి నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు లభించే నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుందని అందుకే హైదరాబాద్‌లో విరివిగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలను కోరుతున్నామని అన్నారు. ఇక గత కొంతకాలం వరకు తెలంగాణ ప్రాంతంలో కొరవడిన రాజకీయ సుస్థిరత, పటిష్టమైన నాయకత్వాలను ప్రస్తుతం తమ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. అంతేకాక యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు గాను ‘టి-హబ్’ పేరిట ప్రత్యేక కారిడార్‌ను సైతం ఏర్పాటు చేశామని, ఇందులో తెలంగాణ ప్రాంతం వారే కాక ఎవరైనా సరే తమ వినూత్న వ్యాపార ఆలోచనలను పంచుకోవచ్చని, తమ కలలను సాకారం చేసుకోవచ్చని అన్నారు. ఇక రాష్ట్రంలో కరెంటు సమస్య సైతం లేకుండా చేసేందుకు సైతం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించినట్లు వెల్లడించారు.