గురువారం ప్రగతిభవన్‌లో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న సీఎం కేసీఆర్, ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లూ. చిత్రంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తైవాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ (హోన్ హై టెక్నాలజీ గ్రూప్) రాష్ట్రంలో భారీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మొబైల్‌ఫోన్లు, ట్యాబ్‌ల అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించనుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని కొంగరకలాన్ లేదా బాచుపల్లి సమీపంలోని దుండిగల్‌లో 250 ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ ద్వారా రానున్న పదేళ్లలో లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమై ఆయన సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి వచ్చిన అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌రంగ పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనదని సమావేశం అనంతరం సీఎం కార్యాలయం ప్రకటించింది. గురువారం యంగ్ ల్యూ పుట్టినరోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారుచేసిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ ఆయనకు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో యంగ్‌ల్యూ ప్రతినిధి బృందానికి మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యమిచ్చారు. ఒప్పంద కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ప్రత్యేక సీఎస్‌లు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.
అన్ని రకాల సాయం అందిస్తాం: సీఎం కేసీఆర్
అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిరంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘ఫాక్స్‌కాన్’తన కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంపిక చేసుకోవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు.
ఫాక్స్‌కాన్‌తో లక్షకుపైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయన్నారు. సాధ్యమైనంత వరకు స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ సమావేశ సమయంలోనే టీఎస్‌ఐఐసీ అధికారులు కొంగరకలాన్, దుండిగల్ ప్రాంతాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
తైవాన్ మా సహజ భాగస్వామి..
‘రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను అమలుచేస్తోంది. బంగారు తెలంగాణ సాధనకు అనేక గొప్ప ప్రాజెక్టులను చేపట్టింది. ఫాక్స్‌కాన్ రాక రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. తైవాన్‌ను తెలంగాణ సహజ భాగస్వామిగా భావిస్తున్నాం. ఫాక్స్‌కాన్ పురోగమనంలో రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉంది’అని సీఎం కేసీఆర్ అన్నారు.
పదేళ్లలో లక్ష ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్
ఫాక్స్‌కాన్ పరిశ్రమ స్థాపనతో వచ్చే పదేళ్లలో లక్ష మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు.
విస్తృత అధ్యయనం చేశాకే వచ్చాం: ఫాక్స్‌కాన్ చైర్మన్
తెలంగాణ గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ ల్యూ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఆశావహ దృక్పథంతో ఉన్నామన్నారు.
ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తుల తయారీ..
ప్రపంచవ్యాప్తంగా విక్రయించే 40 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఫాక్స్‌కాన్ తయారుచేస్తోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, నోకియా, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను రూపొందిస్తోంది. ఫాక్స్‌కాన్ పరిశ్రమల్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్, అమెజాన్‌కు చెందిన కిండిల్, బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు, ఇతర పరికరాలు, గేమింగ్ సిస్టమ్స్, నోకియా, సోనీ పరికరాలు (ప్లే స్టేషన్ 3, ప్లే స్టేషన్ 4 గేమింగ్ కంన్సోల్స్) గూగుల్ పిక్సల్, షావోమీ పరికరాలు, సీపీయూ సాకెట్ల తయారీ జరుగుతోంది. ఈ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో కార్యకలాపాలు సాగిస్తోంది.
సెమీకండక్టర్ చిప్‌ల తయారీ కోసం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: యాపిల్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కి అతిపెద్ద కస్టమర్. ఐఫోన్లు, ఐపాడ్‌లు, మాక్‌బుక్స్ ద్వారానే ఫాక్స్‌కాన్ 50 శాతం ఆదాయం ఆర్జిస్తోంది. కరోనా తర్వాత దేశంలోనే ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వం ముందుకురావడంతో మైనింగ్ దిగ్గజం వేదాంతతో కలిసి 20 బిలియన్ డాలర్లతో దేశంలో మొదటి సెమీకండక్టర్ చిప్ తయారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఫాక్స్‌కాన్ సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment