Taiwan company
-
భారత్‌లో ఎంఎస్ఐ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: ల్యాప్టాప్స్ రంగంలో ఉన్న తైవాన్ కంపెనీ ఎంఎస్ఐ తాజాగా భారత్‌లో తయారీ కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. చెన్నైలో కంపెనీకి ప్లాంటు ఉంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఎంఎస్ఐ స్థానికంగా తయారైన రెండు ల్యాప్‌టాప్ మోడల్స్‌ను పరిచయం చేస్తోంది. వీటిలో మోడర్న్ 14, థిన్ 15 ఉన్నాయి. థిన్ 15 ధర రూ.73,990, మోడర్న్ 14 రూ.52,990 నుంచి ప్రారంభం. ‘సంస్థకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటిగా మారింది. బ్రాండ్ స్థిరంగా దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తరిస్తోంది. అధిక పనితీరు గల ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్థానికంగా తయారైన పరికరాలను అందించడం ద్వారా.. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు సహకరించడానికి కంపెనీ ఉత్సాహంగా ఉంది. భారత్‌లో ఉత్పత్తుల లభ్యతను మెరుగుపరచడానికి మరిన్ని ల్యాప్‌టాప్ బ్రాండ్ స్టోర్లు, క్రోమా, రిలయన్స్ రిటైల్ సహా టచ్‌పాయింట్స్ సంఖ్యను పెంచుతున్నాం’ అని ఎంఎస్ఐ వివరించింది. -
టాటా ఎల్రక్టానిక్స్ కొత్త ఒప్పందం.. తొలి చిప్ ఫ్యాక్టరీ
న్యూఢిల్లీ: ధొలేరా చిప్ తయారీ ప్లాంటు కోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో (పీఎస్ఎంసీ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా ఎల్రక్టానిక్స్ తెలిపింది. దీని ప్రకారం ఈ ప్లాంటుకు సంబంధించి డిజైన్, నిర్మాణ, సాంకేతికాంశాల్లో పీఎస్ఎంసీ సహాయ, సహకారాలు అందిస్తుంది.పీఎస్ఎంసీ సాంకేతికత, నైపుణ్యాలు భారత్‌లో సెమీకండక్టర్ల తయారీని వేగవంతం చేయగలవని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. గుజరాత్‌లోని ధొలేరాలో టాటా గ్రూప్ రూ. 91,000 కోట్లతో చిప్‌ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. నెలకు 50,000 వేఫర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. దీనితో 1,00,000 పైచిలుకు నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
పదేళ్లలో లక్ష మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తైవాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ (హోన్ హై టెక్నాలజీ గ్రూప్) రాష్ట్రంలో భారీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మొబైల్ఫోన్లు, ట్యాబ్‌ల అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించనుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని కొంగరకలాన్ లేదా బాచుపల్లి సమీపంలోని దుండిగల్‌లో 250 ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ ద్వారా రానున్న పదేళ్లలో లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమై ఆయన సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి వచ్చిన అతిపెద్ద ఎలక్ట్రానిక్స్రంగ పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనదని సమావేశం అనంతరం సీఎం కార్యాలయం ప్రకటించింది. గురువారం యంగ్ ల్యూ పుట్టినరోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారుచేసిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ ఆయనకు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో యంగ్ల్యూ ప్రతినిధి బృందానికి మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యమిచ్చారు. ఒప్పంద కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ప్రత్యేక సీఎస్‌లు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సాయం అందిస్తాం: సీఎం కేసీఆర్ అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిరంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘ఫాక్స్‌కాన్’తన కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంపిక చేసుకోవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు. ఫాక్స్‌కాన్‌తో లక్షకుపైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయన్నారు. సాధ్యమైనంత వరకు స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ సమావేశ సమయంలోనే టీఎస్ఐఐసీ అధికారులు కొంగరకలాన్, దుండిగల్ ప్రాంతాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తైవాన్ మా సహజ భాగస్వామి.. ‘రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను అమలుచేస్తోంది. బంగారు తెలంగాణ సాధనకు అనేక గొప్ప ప్రాజెక్టులను చేపట్టింది. ఫాక్స్‌కాన్ రాక రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. తైవాన్ను తెలంగాణ సహజ భాగస్వామిగా భావిస్తున్నాం. ఫాక్స్‌కాన్ పురోగమనంలో రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉంది’అని సీఎం కేసీఆర్ అన్నారు. పదేళ్లలో లక్ష ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్ ఫాక్స్‌కాన్ పరిశ్రమ స్థాపనతో వచ్చే పదేళ్లలో లక్ష మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. విస్తృత అధ్యయనం చేశాకే వచ్చాం: ఫాక్స్‌కాన్ చైర్మన్ తెలంగాణ గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ ల్యూ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఆశావహ దృక్పథంతో ఉన్నామన్నారు. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తుల తయారీ.. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే 40 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఫాక్స్‌కాన్ తయారుచేస్తోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, నోకియా, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను రూపొందిస్తోంది. ఫాక్స్‌కాన్ పరిశ్రమల్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్, అమెజాన్‌కు చెందిన కిండిల్, బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌కు చెందిన స్మార్ట్ఫోన్లు, ఇతర పరికరాలు, గేమింగ్ సిస్టమ్స్, నోకియా, సోనీ పరికరాలు (ప్లే స్టేషన్ 3, ప్లే స్టేషన్ 4 గేమింగ్ కంన్సోల్స్) గూగుల్ పిక్సల్, షావోమీ పరికరాలు, సీపీయూ సాకెట్ల తయారీ జరుగుతోంది. ఈ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో కార్యకలాపాలు సాగిస్తోంది. సెమీకండక్టర్ చిప్‌ల తయారీ కోసం.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: యాపిల్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కి అతిపెద్ద కస్టమర్. ఐఫోన్లు, ఐపాడ్లు, మాక్‌బుక్స్ ద్వారానే ఫాక్స్‌కాన్ 50 శాతం ఆదాయం ఆర్జిస్తోంది. కరోనా తర్వాత దేశంలోనే ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వం ముందుకురావడంతో మైనింగ్ దిగ్గజం వేదాంతతో కలిసి 20 బిలియన్ డాలర్లతో దేశంలో మొదటి సెమీకండక్టర్ చిప్ తయారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఫాక్స్‌కాన్ సన్నాహాలు చేస్తోంది. -
నాలుగేళ్ల జీతం బోనస్ బొనాంజా: ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ?
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన కంపెనీ తన ఉద్యోగులకు కళ్లు చెదిరే బోనస్ ప్రకటించింది. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా నాలుగేళ్ల జీతాన్ని బోనస్ ప్రకటించింది తన సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2021లో చెల్లించిన 40 నెలల బోనస్‌తో పోలిస్తే తాజాగా తన రికార్డ్‌ను తనే అధిగమించింది. గతంలో అత్యధిక సంవత్సరాంత బోనస్ అందించిన సంస్థగా ఇది రికార్డు సృష్టించింది. తైపీకి చెందిన షిప్పింగ్ కంపెనీ సంవత్సరాంతపు బోనస్‌లను 50 నెలల జీతం,సగటున నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ జీతం అందించిందట. ఎవర్గ్రీన్ మెరైన్ కార్పోరేషన్ తన సిబ్బందిలో కొంతమందికి అద్భుతమైన న్యూ ఇయర్ కానుక అందించింది. సంవత్సరాంతపు బోనస్‌లు ఎప్పుడూ కంపెనీ పనితీరు, ఉద్యోగుల వ్యక్తిగత పనితీరుపై ఆధారపడి ఉంటాయని ప్రకటించిన ఎవర్గ్రీన్ మెరైన్ ఇతర వివరాలను అందించడానికి నిరాకరించింది. అయితే కంపెనీకి చెందిన చాలామంది ఉద్యోగులను ఈ అదృష్టం వరించలేదు. దీంతో షాంఘైకి చెందిన ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ నెలవారీ జీతాల కంటే ఐదు-ఎనిమిది రెట్లు మాత్రమే బోనస్ ప్రకటించడం అన్యాయమని వారు ఆరోపించారని స్థానిక మీడియా నివేదించింది. కాగా గత రెండేళ్లలో ఈ కంపెనీ వ్యాపారం బాగా పెరిగింది. కరోనా మహమ్మారి లాక్డౌన్ల తర్వాత గ్లోబల్ కంటైనర్ షిప్పింగ్ లైన్లు పుంజుకోవడం, అలాగే షిప్పింగ్ ధరలు పెరగడంతో 2022లో పోలిస్తే, మూడు రెట్లు ఎక్కువగా సంస్థ ఆదాయం 20.7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. -
పారిశ్రామిక పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని, తైవాన్ కంపెనీల కోసం తెలంగాణలో ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు అన్నారు. తైపీ ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ బౌ షాన్ జెర్ నేతృత్వంలోని తైవాన్ వాణిజ్య ప్రతినిధుల బృందం శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పరస్పర సంస్కృతి కార్య క్రమాల మార్పిడి సహా అనేక అంశాల గురించి ఈ భేటీలో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను కేటీఆర్ తైవాన్ ప్రతినిధుల బృందానికి తెలిపారు. లైఫ్‌సైన్సెస్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆటో మొబైల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలతోపాటు పలురంగాల్లో రాష్ట్రం పురోగమిస్తున్న తీరునుతెఇయజేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా ఎనిమిదేళ్లుగా సాధించిన పెట్టుబడులు, ఉపాధి కల్పన తదితరాలను తైవాన్ బృందానికి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు తైవాన్ బృందం రాష్ట్రానికి వచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా కేటీఆర్‌ను కలిసిన ప్రతినిధుల బృందంలో తైవాన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ రిచర్డ్ లీతో పాటు తైవాన్‌కు చెందిన పలువురు వాణిజ్యవేత్తలున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు. -
ఏసర్ యూజర్లకు భారీ షాక్..!
ప్రముఖ తైవాన్ టెక్ దిగ్గజం ఏసర్ భారతదేశంలోని తమ సర్వర్లను హ్యాక్ చేసినట్లు దృవీకరించింది. 60జీబీ వినియోగదారుల డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ డేటాను దొంగలించడం ఇది రెండవ సారి. యూజర్ల వ్యక్తిగత సమాచారం, కార్పొరేట్ కస్టమర్ డేటా, సున్నితమైన ఖాతాల సమాచారం, ఆర్థిక డేటాను యాక్సెస్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. భారతదేశంలోని 10,000 మంది కస్టమర్ల రికార్డులను కలిగి ఉన్న ఫైళ్లు, డేటాబేస్ కూడిన వీడియోను హ్యాకర్ గ్రూపు పోస్ట్ చేశారు. (చదవండి: ఇక మీ పని అయిపోయినట్లే.. మేము వచ్చేస్తున్నాం!) భారతదేశం అంతటా ఏసర్ రిటైలర్లు, పంపిణీదారుల 3,000 సెట్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్ తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని హ్యాకర్ బృందం పేర్కొంది. భారతదేశంలో తన స్థానిక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సిస్టమ్ పై దాడి చేసినట్లు ఏసర్ పేర్కొంది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు ఏసర్ ధృవీకరించినట్లు నివేదిక తెలిపింది. ఈ విషయం గురుంచి దేశంలోని ఖాతాదారులందరిని అలర్ట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ దాడి గురుంచి స్థానిక అధికారులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఇఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు ఏసర్ పేర్కొంది. ఏడు నెలల్లో ఏసర్ పై జరిగిన రెండో సైబర్ సెక్యూరిటీ దాడి ఇది. మార్చిలో ఆర్ ఈవిల్ చేసిన రాన్సమ్ వేర్ దాడితో కంపెనీ వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకులయి. దొంగిలించిన డేటాను తిరిగి పొందడం కోసం 50 మిలియన్ డాలర్లు చెల్లించాలని అప్పట్లో ఏసర్ ను హ్యాకర్లు కోరారు. ఆ సమయంలో హ్యాకర్లు డిమాండ్ చేసిన అతిపెద్ద డిమాండ్ అది. -
437 కోట్లు కాదు.. రూ.52 కోట్లు నష్టం!
బెంగళూరు: బెంగళూరు సమీపంలోని నరసపుర ఐఫోన్ ప్లాంట్ కర్మాగారంలో శనివారం జరిగిన ఘర్షణల్లో విస్ట్రాన్ కంపెనీ యొక్క వాస్తవానికి నష్టం 52 కోట్లు మాత్రమే అని తెలుస్తుంది. తైవాన్ కంపెనీ ఆపిల్ ఐఫోన్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. తైవాన్ కంపెనీ ఐఫోన్ ప్లాంట్ కర్మాగారంలో జరిగిన హింస కారణంగా ప్రధాన ఉత్పాదక పరికరాలు, గిడ్డంగులోని వస్తువులు ఎక్కువ నష్టం వాటిల్ల లేదని తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 100 మిలియన్ల నుండి 200 మిలియన్ల న్యూ తైవాన్ డాలర్(స్థానిక కరెన్సీ) నష్టం కలిగి ఉండవచ్చని అంచనా. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 52 కోట్ల రూపాయలుగా ఉండవచ్చు. (చదవండి: ఆపిల్ ఫ్యాక్టరీలో విధ్వంసం: రాజకీయ ప్రకంపనలు) కానీ, కోలార్ పోలీస్ స్టేషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం నష్టం 437కోట్ల రూపాయలని తెలిపింది. సంస్థ మొదట్లో నష్టాన్ని ఎక్కువగా అంచనా వేసిందా లేదా పోలీసులు తన నివేదికలో పొరపాటు చేశారా లేదా ఎక్కడైనా తప్పు జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ హింసాత్మక ఘటనలో మెటీరియల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. దాదాపు రూ.52 కోట్ల నష్టం మాత్రమే వాటిల్లినట్లు తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు విస్ట్రన్ సమాచారం ఇచ్చింది. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి శివ్రామ్ హెబ్బర్ కంపెనీ ఫిర్యాదులో మాత్రం 437 కోట్ల రూపాయలను ఎందుకు పేర్కొంది అన్నారు. నష్టం ఎంతనేది పక్కనబెడితే.. ఇలాంటి ఘటనలను సమర్థించేది లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి 5 వేల మంది కాంట్రాక్టు వర్కర్లు సహా ఏడు వేల మందిపై కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. -
రాష్ట్రంలో పీఎస్ఏ వాల్సిన్ రూ. 700 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తైవాన్‌కు చెందిన పీఎస్ఏ వాల్సిన్ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా ఈఎంసీ–2 లేదా వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్ ఈఎంసీలో ఎల్రక్టానిక్ కాంపోనెంట్ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చెన్నైలోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ నాయకత్వంలో తైవాన్ కంపెనీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఐదు కీలక రంగాల్లో కలిసి పనిచేయడానికి తైవాన్ బృందం అంగీకరించినట్లు తెలిపారు. ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌లో అపార అనుభవం ఉన్న తైవాన్ విశాఖలో హైఎండ్ స్కిల్, అడ్వాన్స్డ్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. ► రాష్ట్రంలో పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా సెమి కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులు, వైఎస్సార్ ఈఎంసీని ప్రమోట్ చేయడం, తైవాన్‌కు చెందిన హైటెక్ ఈ బైక్ తయారీ పార్కు, తైవాన్ కంపెనీ ప్రతినిధులకు వర్చువల్ వర్క్‌షాపులు నిర్వహణ.. తదితర కార్యక్రమాల్లో కలిసి పని చేస్తాం. ► కంపెనీలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్‌ను పుష్కలంగా, పారదర్శకంగా అందిస్తాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతి మంత్రివర్గ సమావేశంలో పెట్టుబడుల ప్రతిపాదనలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. ► నిన్నటి (గురువారం) మంత్రి మండలి సమావేశం రూ.16,384 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. మరో రూ.20,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఎస్ఐపీబీ ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా బెన్ వాంగ్ మాట్లాడుతూ పలు రంగాల్లో తైవాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నాయన్నారు. సమావేశంలో తైవాన్‌కు చెందిన అపాచి ఫుట్‌వేర్, ఇంటెలిజెంట్ సెజ్, ఫాక్స్‌కాన్, ఫాక్స్‌లింక్, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్, పీఎస్ఏ వాల్సిన్ ప్రతినిధులతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. తైవాన్ పెట్టుబడులకు పూర్తి సహకారం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో తైవాన్ పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం తైవాన్ బృందం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమైంది. గ్రీనెటెక్ ఇండస్ట్రీస్ ఎండీ మాథ్యూ చిన్, ఇండియా ఫాక్స్‌లింక్ డైరెక్టర్ ఎరిక్ ని, అపాచి ఫుట్‌వేర్ ప్రతినిధి గావిన్ చాంగ్, పీఎస్ఏ వాల్సిన్ ప్రాజెక్ట్ మేనేజర్ నిరంజన్ ప్రకాష్‌లు తమ పెట్టుబడి ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. తైవాన్ పెట్టుబడుల కోసం వైఎస్సార్ ఏపీ వన్‌లో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు త్వరితగతిన పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించడానికి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తామని మేకపాటి హామీ ఇచ్చారు. తైవాన్ పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బెన్ వాంగ్ ఆహా్వనించారు. -
ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీల ఆసక్తి
సాక్షి, అమరావతి: కాలుష్య రహిత, ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీల ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏపీఐఐసీ కార్యాలయంలో తైవాన్ డైరెక్టర్ జనరల్‌తో కలిసి మంత్రి గౌతమ్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీఎస్ఏ వాల్సిస్ 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే పెట్టుబడులు, పరిశ్రమలపై ప్రకటన వెలువడుతుంది. ఏపీలో 'ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్' సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు తైవాన్ ఆసక్తి చూపుతోంది. రూ.15వేల కోట్లతో విశాఖలో అదానీ డేటా సెంటర్ పెట్టుబడులు పెట్టనుంది. రాబోయే ఎస్ఐపీబీ సమావేశంలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. సెమీ కండక్టర్‌కు పెద్దపీట వేసే తైవాన్ కంపెనీలతో చర్చలు తొలిదశలో ఉన్నాయి. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాకే పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుంది. (ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్) కాగా.. రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే పరిశ్రమలను తీసుకొస్తున్నాం. తాజాగా 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు తీసుకొచ్చాం. అదాని డేటా సెంటర్, అపాచి కంపెనీల ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. 40 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. తైవాన్‌తో ఈ బై సైకిల్ ఎగుమతులపై సంప్రదింపులు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకోస్తాం. అదాని సంస్థను మేము పంపేస్తున్నామని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ ఇప్పుడేం చెప్తుంది. వాళ్ళ కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అదాని డేటా సెంటర్ ద్వారా 24 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి' అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు -
నగరంలో ఒప్పో రీసెర్చ్ కేంద్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఒప్పో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసే అంశంపై కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును క్యాంపు కార్యాలయంలో కలిసి చర్చలు జరిపింది. అత్యుత్తమ టాలెంట్ పూల్ (మానవ వనరులు) లభ్యత, ప్రభుత్వ పారదర్శక విధానాలతో ఆకర్షితులై నగరంలో తమ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒప్పో సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాధిపతి తస్లీమ్ ఆరిఫ్ పేర్కొన్నారు. ఆర్అండ్డీ కేంద్రం ఏర్పాటుతో 200 మంది ఇంజనీర్లతోపాటు పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నామన్నారు. ఒప్పో లాంటి ప్రముఖ మొబైల్ సంస్థ హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం స్థాపించడానికి ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్, అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వివరించారు. దేశానికి అన్ని వైపులా రవాణా సౌకర్యాలు ఉన్న సరైన కేంద్రం హైదరాబాద్ అని, ఇక్కడ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తే కంపెనీకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఒప్పో మొబైల్ ఫోన్ల తయారీ ప్లాంట్‌ను నగరంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తస్లీమ్ ఆరీఫ్ చెప్పారు. తైవాన్ పరిశ్రమలకు ప్రత్యేక క్లస్టర్ తైవాన్ కంపెనీల కోసం ప్రత్యేకంగా ఒక క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తైవాన్ విదేశీ వాణిజ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ జేమ్స్ హువంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమై తైవాన్, తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించారు. హైదరాబాద్ చుట్టూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యుత్తమ ప్రభుత్వ పాలసీలు, ప్రోత్సాహకాలు తైవాన్ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కూడా తైవాన్‌లో విస్తృతంగా పర్యటించి అక్కడి కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించింద న్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఇక్కడ అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నామని తైవాన్ వాణిజ్య బృందం తెలిపింది. తైవాన్ కంపెనీలకు ప్రత్యేకంగా రెండు వందల ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేస్తే, అక్కడికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చింది. హైదరాబాద్‌లో తైవాన్ విదేశీ వాణిజ్య అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న మంత్రి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించింది. -
లాభసాటిగా ఆముదం పంట
తైవాన్ కంపెనీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రయోగం ఆ దేశ ప్రతినిధులతో వ్యవసాయ మంత్రి భేటీ సాక్షి, హైదరాబాద్: ఆముదం పండించే రైతులకు అధిక ఆదాయం సమకూర్చే విధానాలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ‘లెన్నిన్’ కంపెనీకి చెందిన పదిమంది ప్రతినిధుల బృందం ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రియదర్శిని, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తైవాన్ కంపెనీ ప్రతినిధులకు, వ్యవసాయ మంత్రికి మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఆముదం పండించే రైతులకు అధిక ఆదాయం సమకూర్చే విధంగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ పంటను పండించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రెండు వారాల్లో ప్రతిపాదనలను ఇస్తామని తైవాన్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉన్నట్లయితే ఆ కంపెనీకి కొంత భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాలుగా ప్రయోజనాలుంటే కంపెనీ ఫ్యాక్టరీని, పరిశోధనా సంస్థను రాష్ట్రంలో నెలకొల్పుతారు. ప్రపంచంలో ఆముదానికి డిమాండ్ కాస్మొటిక్స్, లూబ్రికెంట్లు, సబ్బులు, పెయింట్స్, పెస్టిసైడ్స్ తదితర వాటిలో ఆముదంను ఉపయోగిస్తారు. అంతేకాదు భూసారాన్ని పెంచడంలో ఆముదం పిండి ఉపయోగపడుతుంది. అలాగే ఆముదం ఆకుతో వచ్చే పట్టుతో గుడ్లు తయారవుతాయి. వాటితో పట్టు కూడా వస్తుంది. ఈ రకంగా ఆముదానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఉత్పత్తి తక్కువ.. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తైవాన్ కంపెనీ దక్షిణాఫ్రికాలో వేలాది ఎకరాల్లో ఆముదం పంటను సాగు చేస్తోంది. -
స్మార్ట్ఫోన్తోపాటు హైబ్రిడ్ టాబ్లెట్...
తైవాన్ కంపెనీ ఆసుస్ తన పాడ్‌ఫోన్ శ్రేణిలో భాగంగా భారత మార్కెట్లో ఓ వినూత్నమైన ఫోన్, టాబ్లెట్ హైబ్రిడ్‌ను విడుదల చేసింది. ఈ పాడ్‌ఫోన్ మినీ అటు అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌గా, ఇటు ఏడు అంగుళాల టాబ్లెట్‌గానూ పనిచేస్తుంది. అవసరమైనప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను టాబ్లెట్ వెనుకభాగంలో అమర్చుకోవడమే మనం చేయాల్సిన పని. స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే ఒక మోస్తరుగా ఉంటే.. టాబ్లెట్ మాత్రం హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ నాలుగు అంగుళాల స్క్రీన్‌సైజు కలిగి ఉంది. రెండు గాడ్జెట్లను సమర్థంగా నడిపించేందుకు 1.6 గిగాహెర్ట్జ్‌క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే ఇంటెల్ ఆటమ్ డ్యుయెల్ కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ర్యామ్ 1 గిగాబైట్ కాగా, కిట్‌క్యాట్ అప్‌గ్రేడ్ అవకాశం కల్పిస్తూ... జెల్లీబీన్ 4.3 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ప్రధాన మెమరీ దాదాపు 8 గిగాబైట్లు. కెమెరాలు 8 ఎంపీ, రెండు ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో 1170 ఎంఏహెచ్ బ్యాటరీ, టాబ్లెట్‌లో 2100 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. మొత్తమ్మీద 3270 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం అందుబాటులో ఉంటుందన్నమాట. జీపీఆర్ఎస్, వైఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ తదితర కనెక్టివిటీ ఆప్షన్లున్న ఆసుస్ పాడ్‌ఫోన్ మినీ ధర దాదాపు రూ. 15,999.