తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్‌కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్. పక్కన.. మంత్రి గౌతంరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తైవాన్‌కు చెందిన పీఎస్‌ఏ వాల్సిన్ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా ఈఎంసీ–2 లేదా వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్ ఈఎంసీలో ఎల్రక్టానిక్ కాంపోనెంట్ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చెన్నైలోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ నాయకత్వంలో తైవాన్ కంపెనీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఐదు కీలక రంగాల్లో కలిసి పనిచేయడానికి తైవాన్ బృందం అంగీకరించినట్లు తెలిపారు. ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌లో అపార అనుభవం ఉన్న తైవాన్ విశాఖలో హైఎండ్ స్కిల్, అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే..
► రాష్ట్రంలో పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా సెమి కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులు, వైఎస్సార్ ఈఎంసీని ప్రమోట్ చేయడం, తైవాన్‌కు చెందిన హైటెక్ ఈ బైక్ తయారీ పార్కు, తైవాన్ కంపెనీ ప్రతినిధులకు వర్చువల్ వర్క్‌షాపులు నిర్వహణ.. తదితర కార్యక్రమాల్లో కలిసి పని చేస్తాం.
► కంపెనీలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్‌ను పుష్కలంగా, పారదర్శకంగా అందిస్తాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతి మంత్రివర్గ సమావేశంలో పెట్టుబడుల ప్రతిపాదనలు ఉండేలా చర్యలు తీసుకుంటాం.
► నిన్నటి (గురువారం) మంత్రి మండలి సమావేశం రూ.16,384 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. మరో రూ.20,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఎస్‌ఐపీబీ ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా బెన్ వాంగ్ మాట్లాడుతూ పలు రంగాల్లో తైవాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నాయన్నారు. సమావేశంలో తైవాన్‌కు చెందిన అపాచి ఫుట్‌వేర్, ఇంటెలిజెంట్ సెజ్, ఫాక్స్‌కాన్, ఫాక్స్‌లింక్, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్, పీఎస్‌ఏ వాల్సిన్ ప్రతినిధులతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
తైవాన్ పెట్టుబడులకు పూర్తి సహకారం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్
రాష్ట్రంలో తైవాన్ పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం తైవాన్ బృందం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమైంది. గ్రీనెటెక్ ఇండస్ట్రీస్ ఎండీ మాథ్యూ చిన్, ఇండియా ఫాక్స్‌లింక్ డైరెక్టర్ ఎరిక్ ని, అపాచి ఫుట్‌వేర్ ప్రతినిధి గావిన్ చాంగ్, పీఎస్‌ఏ వాల్సిన్ ప్రాజెక్ట్ మేనేజర్ నిరంజన్ ప్రకాష్‌లు తమ పెట్టుబడి ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. తైవాన్ పెట్టుబడుల కోసం వైఎస్సార్ ఏపీ వన్‌లో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు త్వరితగతిన పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించడానికి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తామని మేకపాటి హామీ ఇచ్చారు. తైవాన్ పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బెన్ వాంగ్ ఆహా్వనించారు.
Comments
Please login to add a commentAdd a comment