అప్పు పుట్టక.. సర్కారు సాయం కోసం రైతన్న ఎదురు చూపులు
ఏటా రూ.20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో కూటమి హామీ.. రైతు భరోసాను అన్నదాత సుఖీభవగా మార్చడం మినహా సాయం ఏదీ?
అన్నదాతకు తొలి విడత సాయం ఎప్పుడిస్తారో చెప్పలేని దుస్థితి.. సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతన్నల ప్రదక్షిణలు
నాడు హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయం అందించిన జగన్.. ఏటా సగటున 51.50 లక్షల మందికి రూ.13,500 చొప్పున సాయం జమ
భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ, కౌలు రైతులకూ సాయం
సాక్షి, అమరావతి: జోరందుకున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనుల కోసం రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు చాలా కీలకం. సకాలంలో సాయం చేతికందితే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదే దృక్పథంతో గత ఐదేళ్లూ మే/జూన్‌లో తొలి విడత పెట్టుబడి సాయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. తాము అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందచేస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచి్చన సీఎం చంద్రబాబు ఆ ఊసే పట్టన్నట్లు వ్యవహరించడంపై అన్నదాతల్లో ఆందోళన రేగుతోంది.
కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన వెంటనే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చడం మినహా డబ్బులు విడుదల చేయలేదు. ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో పెట్టుబడి సాయం పెంపు ఉంటుందని ఆశించిన రైతన్నలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కేబినెట్ భేటీలో అయినా చర్చిస్తారనుకున్నారు. చివరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం జరిపిన తొలి సమీక్షలో మాట వరసకైనా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో ఏటా సీజన్‌కు ముందుగానే చేతికి అందే తొలి విడత పెట్టుబడి సాయం డబ్బులు ఎప్పుడిస్తారో అంతుబట్టక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హామీ కంటే మిన్నగా..
ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి z ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలిచింది. ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్‌తో కలిపి ఏటా మే/ జూన్‌లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు.
ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి తోడుగా నిలిచారు. పీఎం కిసాన్ పరిధిలోకి రాని నాన్ వెబ్‌ల్యాండ్ భూ యజమానులతో పాటు వారసత్వంగా భూములు పొందినవారు, ఎక్వైర్డ్ ల్యాండ్ సాగుదారులతో సహా అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఈ ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం జమ చేసింది.
మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ..
ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి నేతలు సూపర్‌సిక్స్‌లో హామీ ఇచ్చారు. పీఎం కిసాన్‌తో కలిసి రైతు భరోసా సాయాన్ని అందించినప్పుడు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తామిచ్చిన హామీ మేరకు రూ.20 వేలు సొంతంగా ఇస్తారా? లేక పీఎం కిసాన్‌తో కలిపి ఇస్తారా? అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులవుతోంది.
గతంలో సీజన్‌కు ముందుగానే తొలివిడత సాయం రైతులకు చేతికొచ్చేది. ఈ సొమ్ములు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోలు, దుక్కులు, నారుమడులు, నాట్లు వేసుకునేందుకు ఉపయోగపడేవి. ఈసారి మాత్రం తొలి విడత పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి వస్తుంది? ఎంత వస్తుంది? అనే సంగతి తేలకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదునులో పెట్టుబడి సాయం చేతికి రాకపోవడంతో రైతులు మళ్లీ అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారీల చుట్టూ ప్రదక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మోదీ తొలి సంతకం పీఎం కిసాన్‌పైనే..
కేంద్రంలో మూడోసారి పగ్గాలు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పీఎం కిసాన్ సాయంపై తొలి సంతకం చేసి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. 2018–19 నుంచి ఏటా మూడు విడతల్లో కేంద్రం ఈ సాయం అందిస్తోంది. ఇప్పటివరకు 16 విడతల్లో రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రూ.14,717 కోట్లు జమ చేసింది. ఈ నెల 18న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ బటన్ నొక్కి పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని జమ చేశారు. 2024–25 సీజన్‌లో రాష్ట్రంలో తొలి విడత సాయం కోసం 40.91 లక్షల మంది అర్హత పొందగా వీరికి రూ.824.61 కోట్లు పెట్టుబడి సాయం జమ చేశారు.
అన్నదాతా అంటూ నాడు మోసం
తాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు హడావుడిగా ఓ పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఆగమేఘాల మీద జీవో 28 జారీ చేశారు.
ఆ జీవో ప్రకారం 2 హెక్టార్లలోపు సన్న, చిన్నకారు రైతులకు ఏటా రూ.15 వేలు, రెండు హెక్టార్లకు పైబడిన వారికి రూ.10 వేలు, కౌలురైతులు, అటవీ, దేవదాయ భూసాగుదారులకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన రూ.9,225 కోట్లు జమ చేయాల్సి ఉండగా.. రెండు విడతల్లో 43.26 లక్షల మందికి రూ.4 వేల చొప్పున రూ.2,440.29 కోట్లు మాత్రమే జమ చేశారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్ కింద కేంద్రం అందించింది రూ.675 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1,765.29 కోట్లు జమ చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
అప్పులు చేయక తప్పదు
గత ఐదేళ్లుగా ఖరీఫ్ సీజన్‌కు ముందే మే నెలలోనే పెట్టుబడి సాయం అందేది. దీంతో అప్పుల కోసం వ్యాపారులపై ఆధారపడాల్సిన అగత్యం ఉండేది కాదు. ఈ సొమ్ములు దుక్కి దున్నుకోవడం, నారు మళ్లు పోసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడేవి. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చంది. రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఎప్పుడు జమ చేస్తారో ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈసారి పెట్టుబడుల కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. –కె.ధనుంజయరావు, సింగుపాలెం, బాపట్ల జిల్లా
వెంటనే జమ చేయాలి
ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. అదును దాటి పోకుండా జమ చేస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో ఐదేళ్లు సీజన్‌కు ముందుగానే సాయం అందించారు. కూటమి ప్రభుత్వం కూడా అదే రీతిలో వెంటనే పెట్టుబడి సాయం జమ చేయాలి. –కె.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
పెట్టుబడి కోసం ఇబ్బందులు
పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 6 ఎకరాల్లో చీని, 4 ఎకరాల్లో టమోటా, 3 ఎకరాల్లో ఆముదం, కంది, 5 ఎకరాల్లో అరటి, 6 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే పెట్టుబడి సాయం అందింది. ఈసారి ప్రభుత్వం పెట్టుబడి సాయం సకాలంలో ఇవ్వకపోవడంతో పంట సాగుకు ఇబ్బందిపడుతున్నా. –హనుమంతరాయుడు, కదిరిదేవరపల్లి, అనంతపురం జిల్లా
ప్రతి కౌలు రైతుకూ ఇవ్వాలి
సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల పెట్టుబడి సాయం అందించాలి. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి కౌలు రైతుకూ సాయం జమ చేయాలి. భూ యజమానులకు రుణాలిస్తారు. కౌలు రైతులకు రుణాలు దక్కడం లేదు. వారికి ఎలాంటి సంక్షేమ ఫలాలు అందడం లేదు. కనీసం పెట్టుబడి సాయమైనా జమ చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. –పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం
Comments
Please login to add a commentAdd a comment