ఐటీ పెట్టుబడిదారులను ఆహ్వానించిన ఆ రాష్ర్ట మంత్రి కేటీఆర్
‘రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్’ తమ ప్రభుత్వ విధానమని ప్రకటన
బెంగళూరు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ప్రతి పారిశ్రామిక వేత్తకు అవసరమైన అన్ని విధాల అనుమతులు పొందే హక్కును తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) పేర్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ తరహాలో రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్ తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా బెంగళూరులోని ఐటీ సంస్థలను ఆహ్వానించేందుకు బుధవారమిక్కడ నిర్వహించిన ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ఐటీ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులకు సంబంధించి దేశంలోనే రెండో స్థానంలో హైదరాబాద్ ఉందని అన్నారు. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్‌లో ఐటీని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అందులో భాగంగానే తమ వ్యాపారాలను విస్తరించాలని భావిస్తున్న ఐటీ సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేతప్ప బెంగళూరులో ఉన్న సంస్థలను తరలించుకుపోవడం తన పర్యటన ఉద్దేశం కాదని అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలతోనూ తాము ఆరోగ్యకరమైన పోటీనే కోరుకుంటున్నామని తెలిపారు. భారత్‌లో తక్కువ ఖర్చులో మంచి నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు లభించే నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుందని అందుకే హైదరాబాద్‌లో విరివిగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలను కోరుతున్నామని అన్నారు. ఇక గత కొంతకాలం వరకు తెలంగాణ ప్రాంతంలో కొరవడిన రాజకీయ సుస్థిరత, పటిష్టమైన నాయకత్వాలను ప్రస్తుతం తమ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. అంతేకాక యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు గాను ‘టి-హబ్’ పేరిట ప్రత్యేక కారిడార్‌ను సైతం ఏర్పాటు చేశామని, ఇందులో తెలంగాణ ప్రాంతం వారే కాక ఎవరైనా సరే తమ వినూత్న వ్యాపార ఆలోచనలను పంచుకోవచ్చని, తమ కలలను సాకారం చేసుకోవచ్చని అన్నారు. ఇక రాష్ట్రంలో కరెంటు సమస్య సైతం లేకుండా చేసేందుకు సైతం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించినట్లు వెల్లడించారు.
తెలంగాణాకు రండి
Published Thu, Feb 26 2015 1:15 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement