పారిశ్రామికవేత్తలకు ట్రంప్ సూచన
దావోస్: అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగానే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరి కన్లనేకాదు ప్రపంచదేశాలనూ విస్మయపరిచిన వివాదాస్పద నేత డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల ఖడ్గాన్ని ఈసారి పారిశ్రామికవేత్తలపై ఝలిపించారు. ఏకంగా ప్రపంచ వాణిజ్య సదస్సు వార్షిక సమావేశం సాక్షిగా అంతర్జాతీయ వాణిజ్యవేత్తలకు తనదైన శైలిలో ‘సూచనలు’ చేశారు. అమెరికాలో వస్తూత్పత్తిని పెంచాలని, ఈ మేరకు తమ కర్మాగారాలను అమెరికాకు తరలించాలని పిలుపునిచ్చారు.
అమెరికాలో తయారు చేయకపోతే దిగుమతిచేసుకునే వస్తువులపై మరింత టారిఫ్ భారం మోపుతామని పరోక్షంగా హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో గురువారం ట్రంప్ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘ ప్రపంచంలోనే ప్రతి వస్తూత్పత్తి సంస్థకు నేను చాలా సులభమైన సలహా ఇస్తున్నా. అమెరికాకు వచ్చి ఇక్కడే ఉత్పత్తి మొదలెట్టండి.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత అత్యల్ప పన్నులను విధిస్తాం. అయితే తమ ఉత్పత్తులను ఏ దేశంలో తయారు చేయాలనే పూర్తి స్వేచ్ఛ ఆయా కంపెనీలకు ఉంది. అయితే అమెరికా ఆవల తయారయ్యే ఉత్పత్తుల విషయంలో, వాటి ఆర్థికఅంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయి అనేది అమెరికానే నిర్ణయిస్తుంది. నేను ఇంతచెప్పినా మీరు అమెరికాలో తయారుచేయబోమని భీష్మించుకుని కూర్చుంటే, మీరు అధిక టారిఫ్ చెల్లించక తప్పదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
సౌదీ.. రేట్లు తగ్గించుకో..
‘‘చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాలి. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినట్లు 600 బిలియన్ డాలర్లుకాకుండా సౌదీ మా దేశంలో ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. హాస్యాస్పదమైన, ఏకపక్షంగా ఉన్న పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించా. అమెరికాలో మొత్తం వాహనాల్లో నిష్పత్తిలో కొంతమేరకు అత్యంత ఖరీదైన విద్యుత్ వాహనాలనే తప్పకుండా వాడాలనే నిబంధనను రద్దుచేశా. అధిక చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాల్సిందే. చమురు ధరలు తగ్గితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక ముగింపునకు వస్తుంది’’ అని ట్రంప్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment