సోమవారం పాశమైలారంలో ఆల్‌ప్లా పరిశ్రమలో మౌల్డింగ్ కేంద్రం, డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ప్రారంభించి.. పరిశీలిస్తున్న కేటీఆర్
పటాన్‌చెరు: దిగుమతులకు చరమగీతం పాడేలా తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పది వేల ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఆల్‌ప్లా పరిశ్రమలో మౌల్డింగ్ కేంద్రం,డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
పెట్టుబడిదార్లకు భరోసా: గతంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేశారని, ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదార్లకు భరోసాను కల్పిస్తూ మంచి వాతావరణాన్ని కల్పించామన్నారు. గ్రీన్ (సాగు), వైట్ (క్షీర), బ్లూ (నీలి – మత్య్స), పింక్ (మాంసాహార), ఎల్లో (ఆయిల్ – వంటనూనె) విప్లవం కొనసాగుతుందని చెప్పారు.
వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, 25 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు (మొత్తం సాగు విస్తీర్ణంలో 15 శాతం) లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఆల్‌ప్లా పరిశ్రమ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆల్‌ప్లా గ్లోబల్ సీఈఓ ఫిలిప్ లెహనర్, సంస్థ ఇండియా ఎండీ వాగీశ్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment