బీఆర్‌ఎస్ పొత్తులు, విలీనాలు అంటూ దుష్ప్రచారం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పడినా లేచినా తెలంగాణ కోసమే తమ పోరాటం కొనసాగుతుందని.. ఎన్నటికీ, ఎవరికీ తలవంచేది లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ విలీనం, పొత్తులు అంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌పై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు పోస్టులు చేశారు.
‘‘24 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను మా పార్టీ ఎదుర్కొంది. ఇవన్నీ దాటుకొని నిబద్ధత, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణను సాధించింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టాం. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాం. ఎప్పటిలాగానే బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ పారీ్టపై అడ్డగోలు అసత్యాలు, దుష్ప్రచారాలు మానుకోవాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
దగాపడ్డ చేనేత రంగాన్ని బాగుచేశాం
దశాబ్దాల పాటు దగాపడిన చేనేత రంగాన్ని బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో స్వర్ణయుగాన్ని తలపించేలా తీర్చిదిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆరేళ్లలో చేనేత రంగానికి రూ.600 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే.. బీఆర్‌ఎస్ హయాంలో ఏడాదికి రూ.1,200 కోట్లు వెచ్చించామని తెలిపారు. కేసీఆర్ పాలనలోనే నేత కార్మీకులకు గుర్తింపు, గౌరవం దక్కిందన్నారు.
‘‘చేనేత మిత్ర, నేతన్నకు బీమా, 36 వేల నేత కుటుంబాలకు సాయం, 10,150 మంది నేత కార్మికులకు రూ.29 కోట్ల రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. బతుకమ్మ చీరలతో సంక్షోభంలో ఉన్న నేత రంగాన్ని గట్టెక్కించాం. సిరిసిల్లలో అపెరల్ పార్క్, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేశాం..’’ అని కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలనలో నేత కార్మీకుల జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆరోపించారు.
నేత వ్రస్తాలపై జీఎస్టీ విధింపుతో పాటు ఆలిండియా హ్యాండ్లూమ్, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్సŠ, ఆలిండియా పవర్ లూమ్ బోర్డులు, చేనేత కార్మీకుల త్రిఫ్ట్ పథకం, హౌస్ కం వర్క్ షెడ్ పథకాలు, మహాత్మాగాంధీ బనకర్ బీమా పథకాలను కేంద్రం రద్దు చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment